పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -22
దినవహి సత్యవతి
21 వ సర్గ
వసిష్ఠ మహర్షి దశరథునికి నచ్చజెప్పుట...
330.
రాముని, మహర్షితో, పంపనని దశరథుడనెను,
విశ్వామిత్రుడందుకు మిగుల కృద్ధుడయ్యెను,
కోరినదిత్తునని ప్రతిజ్ఞ చేసియున్నాడవనెను,
ఇపుడా ప్రతిజ్ఞను విడువ చూచుచున్నావనెను,
రఘువంశరాజులట్లు చేయుటతగదనె, మహర్షి, సత్య!
331.
మహారాజుకి యుక్తమని తోచినదే చేయుమనె,
తాను వచ్చినట్లే మరలగలనని కౌశికుడనె,
దశరథుడు కకుత్థ్స వంశంలో పుట్టినవాడనె,
అట్టి దశరథుడు ప్రతిజ్ఞ నిలుపుకోకుండెననె,
సుఖముగాయుండుమని రాజుతోయనె కౌశికుడు, సత్య!
332.
ధీమంతుడైన విశ్వామిత్రుడు క్రోధావిష్ఠుడయ్యెను,
ముని కోపానికి భూమియంతయు కంపించెను,
దేవగణం, జగత్తంతయూ మిక్కిలి భయపడెను,
ఉత్తమవ్రతుడు, ధీరుడౌ వసిష్ఠుడది గ్రహించెను,
కలత వలదని దశరథుతోననె, వసిష్ఠుడు, సత్య!
333.
దశరథుడు ఇక్ష్వాకు వంశీయుడని కౌశికుడనె,
సాక్షాత్తూ అపర ధర్మదేవతవంటివాడతడనె,
ధైర్యవంతుడు, ఉత్తమవ్రతము కలవాడతడనె,
శ్రీమంతుడైన అతడట్లు ధర్మము వీడ తగదనె,
ధర్మాత్ముడని ప్రసిద్ధి పొందియుంటివనె, వసిష్ఠుడు, సత్య!
334.
స్వధర్మమాచరించి, రాజుని అధర్మం వీడుమనెను,
ఏదైనా చేతునని పల్కి చేయక యుండరాదనెను,
ఇష్టాపూర్తములచే వచ్చు పుణ్యము నశించుననెను,
కావున మహర్షికిచ్చిన మాటపై నిలువుమనెను,
రాముని, విశ్వామిత్రునితో పంపుమనె వసిష్ఠుడు, సత్య!
335.
రాముడస్త్రాలు నేర్వలేదను చింత వలదనెను,
విశ్వామిత్రుని చెంత రాముడు సురక్షితుడనెను,
రాక్షసులపుడు రాముడినేమీ చేయజాలరనెను,
విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మముయనెను,
పరాక్రమవంతులలో శ్రేష్ఠుడనిబల్కె, వసిష్ఠుడు, సత్య!
336.
విశ్వామిత్రుడు, తపస్సుకు గొప్ప నిధియనెను,
అనేక విధాలైన అస్త్రాలు తెలిసినవాడనెను,
ముని యెరిగిన అస్త్రాలెవ్వరూ యెరుగరనెను,
ముల్లోకాలలోనూ మరెవ్వరికీ తెలియవనెను,
భవిష్యత్తులోనెవ్వరూ తెలియలేరనె వసిష్ఠుడు, సత్య!
337.
దేవతలకుగాని, రాక్షసులకుగాని,
అసురులకుగాని, గంధర్వులకుగాని,
యక్షులకుగాని, మహోరగులకుగాని,
కిన్నెరలకుగాని, అన్యులెవ్వరికీగాని,
మహర్షికి తెలిసినన్ని అస్త్రాలు తెలియవనె, సత్య!
338.
జయ, సుప్రభలు దక్షప్రజాపతి పుత్రికలనె,
వారిరువురికీ భృశాశ్వునితో వివాహమైనదనె,
వారసుర వధకై నూర్గురు పుత్రులను కన్నారనె,
వారంతా అప్రమేయ పరాక్రమము కలవారనె,
శ్రేష్ఠులూ, స్వేచ్ఛారూప ధారణ సమర్థులనె, సత్య!
339.
జయకు పుట్టిన పుత్రులను విజయులందురనె,
సుప్రభయొక్క పుత్రులను సంహారకులందురనె,
వారంతా అతిశక్తిమంతమైన శస్త్రాస్త్రాలైనారనె,
ఆ అస్త్రములన్నియూ కౌశికునికి తెలియుననె,
అతడు ధర్మవేత్త, యశస్వి, ప్రభావశాలియనె, సత్య!
340.
విశ్వామిత్రుడు పూర్వం రాజ్యమేలియుండెననె,
భృశాశ్వపుత్రులగు అస్త్రాలన్నీ మహర్షి పొందెననె,
ఆ అస్త్రాలన్నీ కాంతిగలవి, జయం కూర్చునవనె,
ఆ అస్త్రాలు అనేక రూపపరాక్రమాలు గలవనె,
ముని, క్రొత్త అస్త్రాలు సృజింపగలడనె, వసిష్ఠుడు, సత్య!
341.
కౌశికుడే రాక్షసుల నిగ్రహింప యోగ్యుడనెను,
అయినా రామునికి మేలు చేయవచ్చినాడనెను,
రామునతనితో నిస్సందేహంగా పంపించుమనెను,
వసిష్ఠుని పల్కులు దశరథుని శాంతింపజేసెను,
రాముని, సంతోషంగా, మహర్షితో పంపదలిచెను, సత్య!
*****




No comments:
Post a Comment