పుణ్యవతి (నవల) - 14 - అచ్చంగా తెలుగు

పుణ్యవతి (నవల) - 14

Share This

 పుణ్యవతి (నవల) - 14

రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)




@@@#@@#@
(రవి పెళ్ళి కావలసిన కుర్రాడని తెలిసి మాట్లాడటానికి వెళ్ళిన జగన్నాధం తిరిగి వచ్చి "అతను ఎవరో అమ్మాయిని ప్రేమించినట్లు, ఆ విషయం తనే తేల్చుకుంటానని చెప్పినట్లు సృజన వద్ద చెబుతాడు. ఆమె మగ పాదాలపై అడ చేతులు పువ్వులను పోస్తున్నట్లు బొమ్మ వేసి రవిని దానికి పేరు పెట్టమంటుంది. ఆ సందర్భంలోనే తాను ఊరు వెళ్ళి తమ పెళ్ళి విషయం తన తల్లితో మాట్లాడి వస్తానని రవి ఆమెకు చెబుతాడు. తరువాత....)
#####

ఆశ్రమాన సీతలా ఆ రాముని కోసరం
ప్రతి కన్నె ఎదురుచూచు వలపు వాకిట -
ఈ ఆరామంలోనే ఆ రాముడు. . .నా రాముడు ఉన్నాడనుకోవచ్చునా? అదే నిజమైతే, ఆ రామునికి ఈ ఆరామం. . .అదే ఈ తోటలోని పూలతో ఈ కరాలు అర్పించే జీవితాంజలి - సృజన."

అది చదివిన రవి హుషారుగా ఈలవేసాడు. వెంటనే పేజీని తిప్పి, 'పెళ్ళిచూపులపై' సుధ ఇచ్చిన వివరణను చదవసాగాడు.

"ఒకనాడు హిందూ సామాజిక వ్యవస్థలో రాజకుటుంబాల్లో ఉన్న స్వయంవరాలే కాలగతిలో పెళ్ళిచూపులుగా ప్రజలందరి జీవితాల్లోకి పాకాయి. ఈ ప్రక్రియలో మెచ్చుకోదగ్గ అంశం మగవాళ్ళు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి పిల్లను చూడటం. రాచరికం చెలామణీ అయ్యే రోజుల్లో, రాజులు యుక్తవయస్కురాలైన తమ కుమార్తె పెళ్ళి కోసం ముందుగా పొరుగురాజ్యాల యువరాజుల చిత్రపటాలు తెప్పించి, వారి శౌర్యప్రతాపాలు వాకబు చేసేవారు. తరువాత యోగ్యులైన రాకుమారులకు స్వయంవరానికి రమ్మని వర్తమానం పంపేవారు. అలా స్వయంవరానికి వచ్చిన వారిలో తనకు నచ్చిన వాణ్ణి రాకుమారి వరమాల వేసి పరిణయమాడేది. ఇతర కుటుంబాల్లో ఆస్తులు కలిసొస్తాయనో, అమ్మాయిని కళ్ళముందే ఉంచుకోవాలన్న స్వార్థంతోనో తమ బంధువుల పిల్లలకే మేనరికాల పేరుతో ఇచ్చి చేసేవారు. కానీ కాలక్రమేణా రాజకుటుంబాల్లో జరిగే పెళ్ళిచూపుల తతంగం ఇతర కుటుంబాలకు కూడా పాకింది. దానితో పాటే మగవారి సంకుచితత్వం కూడా పెరిగిపోయింది. పెళ్ళిచూపుల్లో ఆడపిల్లను ఒక రోగిని పరీక్షించినట్లు చూసి, ఆమె మనసు గాయపడే వ్యాఖ్యలు చేస్తుంటారు. సంప్రదాయం ముసుగులో జరిగే ఈ మాటల దాడి కాలేజీలో రాగింగ్ కన్నా దారుణంగా తయారవుతోంది. తొలిసారి పెళ్ళిచూపులకు కూర్చున్న ఆడపిల్ల తనను చూడటానికి వచ్చినవాళ్ళు సంస్కారవంతులనీ, వారిలో తను కలిసి పోవాలని ఆశపడుతుంది. వచ్చిన పిల్లవాడు ఇంద్రుడు, చంద్రుడని పొగడుతూ ఆమె బంధుగణం, పక్కింటి పొరుగువాళ్ళు ఆమెలో ఆశల్ని రెచ్చగొడతారు. దానితో వారి నుంచి కబురు వచ్చేవరకూ ఆ వ్యక్తితో తన వైవాహిక జీవితంపై ఆమె తీయని కలలు కంటుంది. ఇంతలో పిల్ల జాతకం బాగులేదనో, రూపలావణ్యాలను విమర్శిస్తూనో పిల్ల నచ్చలేదని కబురొస్తుంది. వెంటనే ఆ పిల్ల మనసు వికలమైపోతుంది. కొన్నాళ్ళ తరువాత తిరిగి చెదరిపోయిన ఆశలని కూడదీసుకొని, మరో మగాడి ముందు తలొంచి కూర్చుంటుంది. అలా ఎంతమంది ముందు కూర్చోవాలో, ఎన్ని విమర్శలను ఎదుర్కోవాలో ఆమె అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. వచ్చిన వ్యక్తి పొరపాటున తనకు నచ్చకపోయినా, తన తండ్రి పరువుప్రతిష్టల కొరకు ఆమె ఒప్పుకోక తప్పదు. ఆ నచ్చటమన్నది ముఖ్యంగా ఆమె తండ్రి ఆర్థికస్థోమతపై ఆధారపడి ఉంటుంది. ఒక పేద అమ్మాయి ఎంత ఆశపడినా ధనికుడి ఇంటికోడలు కాలేదు. ధనికుడెవరైనా తనను కావాలంటే అతని వయసు గురించి ఆమె చూడకూడదు. తిరగబడే ఆడపిల్లను తిరుగుబోతుగా ముద్రవేసే లోకంలో, మనసుని ప్రక్కనబెట్టి మనువాడక తప్పదు. ఈ తతంగంలో ఆడపిల్లను కుంగదీసే మరొక అంశం 'కుజదోషం.' మానవ మేధస్సు గ్రహాల్ని గుప్పెట్లో పెట్టుకొనే స్థాయికి చేరినా, ఆడపిల్ల వివాహానికి ఈ 'కుజదోషం' అడ్డంకి కావటం దురదృష్టం.

ఆశ్రమాన సీతలా ఆ రాముని కోసరం
ప్రతి కన్నె ఎదురుచూచు బ్రతుకు ముంగిట
ప్రేమనేలు మారాజే పెనిమిటిగా వస్తాడని
ఆశలతో అల్లుకొనే వలపు వాకిట!

అడుగు వేసి గుమ్మంలో కొచ్చినవాడు
గుండెలోన దాస్తాడని మెచ్చుకు తనను
శిరసును వంచుకు - ఎద స్పదించగా
మది కలచే ప్రశ్నకైనా బదులునిస్తది!
కన్నుగలుపు కూరిమితో కలలు గంటది!

చిరునవ్వులు మునిపంటను దాచుకొంటది-
చీరకొంగు పరవశాన ముడుల నేస్తది!
కలలోపలి మారాజు కాలదన్ని పోగానే-
చెమరించిన చెంపలను తుడుచుకొంటది!
కొత్త ఆశ మదిలోకి చేదుకొంటది!

వచ్చిపోవు మారాజుల వంశమేదియైనా
తలవంచక తప్పదులే తాళిబొట్టు కోసరం!
కుజదోషం అభిశాపం ఆడపిల్ల బ్రతుకున
రుజాగ్రస్త జాతకమని పేరు పడతది!
సమాధయిన భావితో అడలిపోతది!"

సుధ డైరీని మూసి రవి కళ్ళు మూసుకున్నాడు. చిన్నవయసులోనే ఇంత భావసంచలనం నింపుకొన్న కూతురు మరణిస్తే, రంగనాధంగారు వికలమైపోవటంలో ఆశ్చర్యం లేదు. ఈరోజుల్లో మాతృగర్భం నుంచి మరణశయ్య వరకూ సాగే ఆడపిల్ల జీవన ప్రస్థానంలో ఎన్నెన్నో సమస్యల వలయాలు! ఆ సమస్యలు సమసేదెప్పుడో? అతని కవిహృదయం ఒక్కసారిగా నినదించింది. "ఆడపిల్లను బ్రతకనివ్వండి.
ఆమె మీకు బ్రతుకునిస్తుంది, మీ వంశాన్ని బ్రతకనిస్తుంది."
@@@@@@@@@

"మీరు నాన్నగారి కన్ను గప్పి వచ్చినప్పుడల్లా నాకు బాధ అనిపించేది" రవి మాటలు సృజన చెవుల్లో చాలాసేపు ప్రతిధ్వనించాయి. ఇంతకాలం పిచ్చిగా మాట్లాడే తండ్రిపై తనకు గల చులకనభావం ఆమెలో సడలిపోయింది. గుడి నుంచి వచ్చిన రంగనాధం కాళ్ళపై పడి నమస్కరించింది ఆమె. తన కూతురి ప్రవర్తనకు విస్తుపోయాడాయన. పాదాలకు నమస్కరించి తలపైకెత్తిన సృజన కళ్ళల్లో ఆయనకేదో కొత్తదనం కనిపించింది, కానీ అదేమిటో ఆయనకు అర్థం కాలేదు.
@@@

గుమ్మంలో అలికిడి వినిపించి బయటకొచ్చిన పుణ్యవతికి రంగనాధం కనిపించాడు.

"నాన్నగారూ!" ఆమె ఆత్మీయమైన పిలుపుకి అతని కళ్ళు చెమ్మగిల్లాయి.

"ఉదయం నుంచి నిన్ను చూడాలని నా మనసు కొట్టుకొందిరా!" అన్నాడు.

"రండి నాన్నా!" అంటూ లోనికి వెళ్ళి, లోపల ఉన్న పిల్లలను పంపేసింది.

"ఆ పిల్లలెవరమ్మా?" రంగనాధం అడిగాడు.

"చదువైపోయింది కద నాన్నా! ఊరికే ఉండటమెందుకని టెంత్ పిల్లలకి ట్యూషను చెబుతున్నాను."

"ఆ విషయంలో నీకు, సుధకి తేడా లేదురా! ఒక్క క్షణం ఖాళీగా ఉండరు కదా! అన్నయ్య లేడా?"

"ఆఫీసుకెళ్ళాడు. చదువులో కూడా పడ్డాడుగా! వచ్చేసరికి రాత్రి పొద్దుపోతుంది. ఏం? అన్నయ్యతో పనుందా?"

పుణ్యవతి ప్రశ్నకు బదులీయలేదతను. ఆమె వంటింట్లోకి వెళ్ళి కాఫీ కప్పుతో వచ్చింది. ఆమె ఇచ్చిన కాఫీ తాగి కప్పు కింద పెట్టాడు.

"అమ్మా! మాది ఆత్మహత్యలు చేసుకొనే కుటుంబమా?" అకస్మాత్తుగా అతను అడిగిన ప్రశ్నకు ఆ అమ్మాయి తుళ్ళిపడింది.

"ఏంటి నాన్నా మీరనేది? ఎందుకిలా మాట్లాడుతున్నారు?"

ఆమె ప్రశ్నకు రంగనాధం ఒక్కసారిగా భోరుమన్నాడు. అనుకోని పరిణామానికి పుణ్య కంగారుపడింది. కొద్ది క్షణాల తరువాత అతను సంబాళించుకొని ఆమెకు ఒక ఉత్తరమిచ్చాడు. పుణ్య ఉత్తరం విప్పి చదివింది.

"రంగనాధం గారికి,
మా వాడికి మీ పిల్ల నచ్చింది. మీ వినయం, మర్యాద మాకెంతో నచ్చాయి. మీ సంబంధం ఖాయం చేసుకోవాలనుకుంటుండగా, మాకొక విషయం తెలిసింది. మీ పెద్దమ్మాయి సుధ భర్త మా బంధువుల అబ్బాయే! మీ పెద్దమ్మాయి ఆత్మహత్య చేసుకుందిట కద! కానీ మీరు చనిపోయిన అమ్మాయి గురించి చెప్పక, ఒకే కూతురని అబద్ధమాడారు. మాది మర్యాదస్తుల కుటుంబం. సంబంధం కలుపుకొనే ముందు అటేడు తరాలు, ఇటేడు తరాలు చూడాలన్నారు. ఆత్మహత్యలు చేసుకొనే కొంపలో పిల్లను చేసుకుంటే, మున్ముందు మాకు ఇబ్బంది కలగొచ్చు. అందుకే వద్దనుకుంటున్నాం. అన్యధా భావించకండి!"

ఉత్తరం చదివిన పుణ్య అతని వైపు చూసింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages