పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -20
దినవహి సత్యవతి
19 వ సర్గ
రాముడిని తనతో పంపుమని విశ్వామిత్రుడు అడుగుట…
307.
దశరథుడు, కౌశికు రాకకు కారణమడిగెను,
మహర్షి తానొక యజ్ఞము తలపెట్టితిననెను,
వ్రత సమాప్తియందు విఘ్నం కలుగుతున్నదనెను,
మారీచ, సుబాహు రాక్షసులందుకు కారకులనెను,
వారు వీర్యవంతులు, సుశిక్షుతులైన రాక్షసులనె, సత్య!
308.
రాక్షసులా యజ్ఞం జరుగకుండా అడ్డుచున్నారనె,
యజ్ఞవేదికపై రక్తమాంసాలు జల్లుచున్నారనె,
కావుననే వ్రతసంకల్పం నెరవేరుటలేదనె,
యజ్ఞముకై పడిన శ్రమంతా వ్యర్థమౌతున్నదనె,
ఉత్సాహముడిగి తానా ప్రదేశం వీడి వచ్చితిననె, సత్య!
309.
తత్సమయాన కోపం చూపబుద్ధి కలుగలేదనెను,
యజ్ఞదీక్షాపరుడౌ తాను శాపమివ్వరాదనెను,
యజ్ఞ రక్షణకై రాముని తనతో పంపించుమనెను,
అట్లు తావచ్చిన కారణం దశరథునికి చెప్పెను,
అది నెరవేర్చి, ప్రతిజ్ఞ నిల్పుకోమనె, కౌశికుడు, సత్య!
310.
రాముడు సహజ దివ్యతేజస్వి, పరాక్రముడనెను,
విఘ్నకారులగు రాక్షసుల జంప సమర్థుడనెను,
రామునికన్ని విధాల శ్రేయస్సు కలిగింతుననెను,
రాముని తానన్ని విధముల రక్షించెదననెను,
శూరుడౌ రాముడు త్రిలోక కీర్తి పొందుననె, మహర్షి, సత్య!
311.
మారీచసుబాహులు పరాక్రమంచే గర్విష్ఠులైరనె,
యుద్ధాన వారు రామునెదుట నిలువజాలరనె,
రాముడు తప్ప మరెవ్వరూ వారిని చంపజాలరనె,
వారిక సంహరింపబడిరనే నిశ్చయించుకొమ్మనె,
తానటుల ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాననె మహర్షి, సత్య!
312.
రామునియందున్న స్నేహంతో వెనుదీయకుమనె,
సత్యపరాక్రముడైన రాముని తానెరుగుదుననె,
రాజగురువు వసిష్ఠమహర్షి కూడా యెరుగుననె,
సభలో ఆసీనులైన మహర్షులకూ తెలుసుననె,
రాముని యథార్థ స్వరూపం మౌనులకే యెరుకౌననె, సత్య!
313.
సుతుడగు రాముని సామాన్యునిగ తలంచవద్దనె,
ధర్మమే కావలెనన్న, రాముని తనతో పంపుమనె,
మంత్రులూ వసిష్ఠాదుల యనుజ్ఞనూ గొనుమనె,
రాముడొకడే యాగరక్షణ గావింపగలడనె,
దశరథుని కీర్తి స్థిరమై నిలుచుననె, మహర్షి, సత్య!
314.
తన యాగము పది దినములు జరుగుననెను,
ఆలస్యం చేయకుమనెను, దుఃఖింపకుమనెను,
యాగ సమయము మించకుండ చూడుమనెను,
అందువల్ల దశరథునికి క్షేమము కల్గుననెను,
అట్లు మహర్షి ధర్మార్థసహితంగా పల్కి ఊరకుండె, సత్య!
315.
కౌశికుని పలుకులు దశరథుడు ఆలకించెను,
పలుకుల భావమర్థమై దశరథుడు భీతిల్లెను,
తీవ్రమైన శోకముతో దశరథుడు కృంగిపోయెను,
కౌశికుని పల్కులతని యెడదను చీల్చివేసెను,
మిక్కిలి వ్యథతో ఆసనంనుండి లేచె దశరథుడు, సత్య!
*****




No comments:
Post a Comment