పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -16 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -16

Share This

    పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -16

బాలకాండ

                                                                                                       దినవహి సత్యవతి 




15 వ సర్గ 

  బ్రహ్మ, రావణాసుర వధోపాయం దేవతలకు చెప్పుట...

244.

      ఋష్యశృంగుడు మేధావంతుడు, వేదనిష్ణాతుడు, 

దశరథునితో పుత్రీయేష్ఠిని చేయింతునన్నాడు,  

అధర్వ శిరస్సు అనే వేదభాగముండునన్నాడు, 

అందలి మంత్రాలచే పుత్రీయేష్ఠి చేయవలెనన్నాడు,

పిదప ఋషి మంత్రోక్తంగా అగ్నిలో హోమము చేసె, సత్య!  

245.

     దేవతలు, ఋషులు, సిద్ధులు యాగస్థలికి వచ్చిరి, 

పరమర్షులు, గంధర్వులు వచ్చి వారిని కలిసిరి, 

శాస్త్రానుసారం తమ యజ్ఞభాగాలు గైకొన వచ్చిరి,

అచట సర్వలోకస్రష్ఠ బ్రహ్మదేవుని స్తుతించిరి, 

రావణుడు తమను బాధించుచున్నాడని చెప్పిరి, సత్య! 

246.

     బ్రహ్మ వరాలతో, రావణుని దుష్టత్వం మించెననిరి,  

తన పరాక్రమంతో లోకుల హింసించుచున్నాడనిరి,

బ్రహ్మవర ప్రసాదియనే క్షమించుచుంటిమనిరి,

బ్రహ్మ కృపకు పాత్రుడని శిక్షింపకున్నామనిరి,

లోకపాలురయెడ అతడు ద్వేషం పూనెననిరి, సత్య! 

247.

     రావణుని దర్శనమే మిక్కిలి ఘోరమైనదనిరి, 

సూర్యుడాతడికి వేడి కలిగించలేకుండెననిరి, 

వాయువాప్రక్క మసులుటకే భీతిల్లుచున్నాడనిరి, 

సముద్రుడతని చూడగానే స్థంభించుచున్నాడనిరి, 

బ్రహ్మవరాలచే యాతడు విర్రవీగుచుండెననిరి, సత్య!  

248.

     ఋషి, గంధర్వాదులను అవమానిస్తున్నాడనిరి, 

రావణునెవ్వరూ జయింపజాలకున్నారనిరి,

వానిచే లోకాలకు భయము వచ్చిపడినదనిరి, 

రావణ వధోపాయం చేయుమని దేవతలు కోరిరి, 

దేవాదుల మొరవిని బ్రహ్మ వారికభయమిచ్చె, సత్య!  

249.

     రావణుడు ఘోరతపము చేసి వరాలు పొందెననె, 

విశ్వమందే జీవిచేతనూ చావులేకుండ కోరెననె, 

ఆ క్షణమునతడు మనుష్యులను మరచెననె,

అతనికి మనుష్యులనిన ఆదరమే లేదనె,  

రావణుని చంపుటకదే ఉత్తమమార్గమనె బ్రహ్మ, సత్య!  

250.

     దేవతలకు, బ్రహ్మ, రావణ వధోపాయం తెలిపెను, 

అంతలో విష్ణుమూర్తి యాగస్థలికి యరుదెంచెను,

బ్రహ్మను కలిసి విష్ణువు మౌనంగా నిలబడెను, 

దేవాదిగణం, విష్ణువుకి నమస్కరించి స్తుతించెను, 

లోకహితము చేయుమని విష్ణువుని ప్రార్థించెను, సత్య! 

251.

     దశరథుడు ఔదార్యవంతుడు, ధర్మజ్ఞుడని, 

సత్ప్రభువు, మహర్షివంటి తేజోవంతుడని,  

అతని భార్యలు హ్రీ, శ్రీ, కీర్తులవంటివారని,

విష్ణువును చతుర్విధాలుగా యేర్పడుమని,  

వారికి పుత్రులుగా ఆవిర్భవింపుమనీ కోరిరి, సత్య! 

252.

     దుష్టరావణుడు మితిమీరుచున్నాడనిరి, 

లోకాలకు కంటకమువలె యున్నాడనిరి,

దేవతలకు చంపశక్యము కాకున్నాడనిరి, 

సిద్ధ, గంధర్వాదులను బాధించుచున్నాడనిరి,

అప్సరసలనూ వేధించుచున్నాడనిరి, దేవతలు, సత్య! 

253.

     కావున సిద్ధ, గంధర్వ, యక్షుల జతగూడినాము,  

మునులతోనూ కలిసి నిన్ను వేడుచున్నాము, 

మేమందరము నిన్ను శరణు పొందుతున్నాము, 

మనుష్యుడిగా జన్మించి రావణుని సంహరింపుము, 

నీవే గతియని దేవతలు, విష్ణువుని, ప్రార్థించిరి, సత్య!  

254.

     విష్ణువు, దేవతల ప్రభువు, దేవతాశ్రేష్టుడు, 

రావణుని గురించి దేవతల ప్రార్థన వినినాడు,

భయము వీడుమని వారికభయమొసగినాడు,

దుష్ట రావణాదులను సంహరించెదనన్నాడు, 

పదకొండువేలయేండ్లు పృథ్వి పాలింతునన్నాడు, సత్య! 

255.

     విష్ణువు, మనుష్యలోకంలో అవతరించదలచెను, 

తనను నాల్గువిధములుగా చేసికొనదలచెను,

దశరథుని తండ్రిగా చేసికొనుటకిష్టపడెను, 

అటులని విష్ణువు, దేవాదులకు వరమిచ్చెను, 

విష్ణువు నిర్ణయానికి వారు హర్షం వ్యక్తం చేసిరి, సత్య! 

256.

     రావణుడు భయంకరమైన పరాక్రమంగలవాడు, 

వృద్ధి పొందిన గర్వముతో విజృంభించుచున్నాడు, 

ఇంద్రద్వేషియైనాడు, లోకాలనేడ్పించుచున్నాడు, 

మునుల బాధించి వారి భయహేతువగుచున్నాడు,

అట్టి వాడిని నిర్మూలింపుమని విష్ణువుని కోరిరి, సత్య!

257.

     రావణుని, సైన్య, బాంధవ సహితము జంపుమని, 

చాలా కాలము చింతారహితుడవైయుండుమని, 

దోషములు, పాపములు లేనిది స్వర్గలోకమని,

ఇంద్రుడు రక్షించు స్వర్గలోకానికి తిరిగి రమ్మని, 

దేవాదులు, విష్ణువుని, దివ్యస్తోత్రాలతో స్తుతించిరి, సత్య! 


 *****



No comments:

Post a Comment

Pages