పుణ్యవతి (నవల) - 4
గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)
@@@@@@@@@
(పుణ్యవతి భర్త తన తండ్రిని అవమానించి పంపాడని బాధపడ్డ రవి కూతురు శ్యామల ఆసుపత్రిలో జేరిన పుణ్యవతి ఫొటోని, తన తండ్రి వ్రాసిన పుణ్యవతి జీవిత కథ డైరీని తీసుకొని నేరుగా హారికా ఇండస్ట్రీస్ లో ఉన్న సుధాకర్ ఆఫీసుకి వెళ్తుంది. అతనికి పుణ్యవతి ఆరోగ్యస్థితిని చెప్పి, ఫొటోని, డైరీని సుధాకర్ బల్ల మీద ఉంచి వెళ్ళిపోతుంది. సుధ ఆ డైరీని టేబిల్ సొరుగులో విసరికొట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. తరువాత. . . .)
@@@@@@@@@
"వీరపుత్రుడు అయ్యాకనే బావా దుష్యంతుడు భరతుణ్ణి చేరదీసాడు. అంతకు ముందు శకుంతల పడ్డ పాట్లు? ఆ బిడ్డ భరతుడు కాక మరో శకుంతలైతే ఈ దుష్యంతుడు చేరదీసేవాడా?" శ్యామల మాటలు చెవుల్లో గింగురుమంటూంటే, సుధ మంచంపై అసహనంగా కదిలాడు. చివరికి నిద్రపట్టక, బాల్కనీలోకొచ్చి పచార్లు చేయసాగాడు. ఇంతలో ఆనందరావు గదిలోంచి మాటలు వినిపించి, కిటికీ ప్రక్కనే పొంచి వినసాగాడు.
"వాణ్ణి పంపిచేస్తారా? లేదా?" హారిక కోపంగా అడుగుతోంది.
"పంపను. నీకిష్టం లేకపోతే నువ్వెళ్ళిపోవచ్చు" కటువుగా చెప్పాడు రావు.
"పిల్లల్లేని మనం నా చెల్లెలి కొడుకును పెంచుకొందామంటే వద్దన్నారు. ఇప్పుడెవణ్ణో తెచ్చి మన బిడ్డగా చూడమంటే నా వల్ల కాదు."
"అయినా చూసి తీరాలి. నీకు పిల్లలు పుడతారని ఇన్నాళ్ళూ వాడి దగ్గరకు కూడా నేను వెళ్ళలేదు. గైనిక సమస్యతో నీకు పిల్లలు పుట్టలేదు. లోపల కంతి ఏర్పడిందని యిటీవల నీ గర్భసంచి కూడా తొలగించారు. వయసా మీద పడుతోంది. మనకు పిల్లల్లేరని అప్పుడే బంధువులంతా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాకంటూ ఒక కొడుకు ఉన్నాక, ఆస్తిని పరాయివాళ్ళకు ఇస్తానా?"
"అదేమిటి? ఆమె ప్రవర్తన మంచిది కాదని, ఎవడో కవితో. . ."హారిక మాటలకు ఆనందరావు పగలబడి నవ్వాడు.
"నవ్వుతారేంటి? ఇదంతా మీ నాన్న మా నాన్నకి చెప్పిన కథే కదా! అలా ఎవర్తెకో పుట్టిన బిడ్డ మీ బిడ్డ ఎలా అవుతాడు?"
"ఒక ఆడదాని చేతిలో మోసపోయే వాణ్ణి కాదు నేను. ఇక మా నాన్న కథంటావా? ఆస్తితో పాటు నువ్వు మా యింటికి రావాలంటే ఏదో ఒకటి చెప్పాలిగా! అందులోనూ, నేనొక అమ్మాయితో కొన్నాళ్ళు గడిపి వదిలేస్తే, నువ్వు నన్ను పెళ్ళాడవు కదా! అందుకే బిజినెస్ మాగ్నెట్ అయిన మా నాన్న కొంత కథను కల్పించి చెప్పారు. యస్! నేను పుణ్యవతిని గాఢంగా, మనస్ఫూర్తిగానే ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాను. కానీ దాని అన్న శేఖరం నాపై కేసు పెట్టి, నన్ను పోలీసు స్టేషనుకి ఈడ్చాడు. దానితో నా మనసు విరిగిపోయి, దాన్ని వదిలేయాలనుకున్నాను. మధ్యలో రవిగాణ్ణి బకరాను చేసి, మా నాన్న సాయంతో పుణ్యను రెచ్చగొట్టి, మాటపట్టింపుతో అదే నన్ను వదిలేసేలా ప్రేరేపించాను. చూడూ! సుధని పసిబిడ్డగా తెచ్చి, నిన్ను వాడికి సేవ చేయమనటం లేదు. నీకు పిల్లలు పుట్టుంటే, అసలు వాణ్ణి మన గుమ్మంలో గూర్ఖా పోస్టుకి కూడా రానిచ్చేవాణ్ణి కాదు. కానీ మనకు సంతానం లేదు. నాకా ముసలి వయసు వస్తోంది. నాన్న నాకిచ్చిన వ్యాపారాన్ని, నిజాయితీగా అభివృద్ధి చేసేది వాడొక్కడే! వాణ్ణి చేరదీసామన్న కృతజ్ఞతతో ఇదంతా చేస్తాడు. పుణ్యవతి తన జీవితమంతా పణం బెట్టి పెంచుకొన్న మొక్క వాడు. ఆ చెట్టు ఫలాన్ని తేలికగా మనం అనుభవిద్దాం."
ఆనందరావు మాటలకు చాటుగా వింటున్న సుధాకర్ నెత్తురు వేడెక్కింది.
"మీ పిచ్చి గానీ, ఇన్నాళ్ళూ పెంచిన తల్లి ఆసుపత్రి పాలైతే వెళ్ళనివాడు, రేపు మనల్ని చూసేస్తాడా? మీ బిడ్డే అంటున్నారు కదా! బుద్ధులు ఎక్కడికి పోతాయి? కొన్నాళ్ళు మీ మాట వింటున్నట్లు నటించి, ఒక శుభోదయాన, తాతగారి ఆస్తిలో వాటా కోసం కోర్టుకెళ్ళి ఆ తల్లీకొడుకులు సగం ఆస్తి పట్టుకుపోతారు. అప్పుడు మన ముప్పు గడవటం కోసం మనం తిరిగి మా బంధువులనే ఆశ్రయించాలి."
హారిక మాటలకు అతను మళ్ళీ బిగ్గరగా నవ్వాడు.
"ఎందుకు నవ్వుతారు?" హారిక చిరాగ్గా అడిగింది.
"నీ అమాయికత్వానికి.... నీ ఆలోచన నాకూ వచ్చింది. అందుకే వాడికి తల్లి పట్ల నరనరాల్లో ద్వేషం నిండేలా కథ చెప్పాను. ఆసుపత్రి పాలైన తల్లినే కాదు, ఆఖరికి దాని శవాన్ని చూడటానికి కూడా వాడెళ్ళడు. అందువల్ల మున్ముందు వాడు తల్లిని చేరదీసి ఆస్తి కోసం మనపై దావా వేస్తాడని భయపడొద్దు. అందరిలాగే వాడు మనింట్లో పనిచేసే నౌకరనుకో! వాణ్ణి ఎలా కట్టిపడేయాలో నేను చూసుకుంటాను. వాడి గురించి పదే పదే చర్చిస్తే, ఏదో ఒక రోజు వాడు మన మాటలు వింటాడు. అందుకే ఈ విషయాన్ని యిక్కడితో వదిలేయి" అంటూ ఆనందరావు హారికను బుజ్జగిస్తున్నాడు.
పొంచి వింటున్న సుధకి తల తిరిగినట్లయింది. అతను తన గదిలోకి వెళ్ళి అసహనంగా పచార్లు మొదలెట్టాడు.
"సృజీ! నా ఆశలు, కలలు అన్నీ వాడేనే! నేనెంత పవిత్రంగా బ్రతికానో నువ్వయినా చెప్పవే!" కన్నీళ్ళతో ఊగిపోతున్న తల్లి కళ్ళ ముందు మెదిలింది.
"కన్నబిడ్డ తాకితే పాలను, భర్త తాకితే కోరికను వర్షించేదే స్త్రీ హృదయమని వేమన మరొకచోట చెప్పాడు. అంతేకానీ, తనను తాకిన ప్రతివాడికి దాసోహమనేంత బలహీనురాలు కాదు ఆడదంటే!" నిప్పులు చెరిగే కళ్ళతో శ్యామల తన ముందు నిలబడినట్లు అనిపించింది.
"నీకు పిల్లలు పుట్టుంటే, అసలు వాణ్ణి మన గుమ్మంలో గూర్ఖా పోస్టుకి కూడా రానిచ్చే వాణ్ణి కాదు. . .అందరిలాగే వాడూ మనింట్లో పనిచేసే నౌకరనుకో!" వికటాట్టహాసం మధ్య ఆనందరావు మాటలు సుధ నెత్తురును మరగిస్తున్నాయి.
"వీరపుత్రుడు అయ్యాకనే భరతుణ్ణి దుష్యంతుడు చేరదీసాడు. అంతవరకూ శకుంతల పడ్డ పాటు? ఆ బిడ్డ భరతుడు కాక, మరో శకుంతలైతే ఈ దుష్యంతుడు చేరదీసేవాడా?" నిలదీస్తున్న శ్యామల రూపం నిలువెత్తున పెరిగిపోతుంటే, సుధ మంచంపై దిండుని విసరికొట్టాడు. కొద్ది క్షణాలు మంచంపై కళ్ళు మూసుకు కూర్చుని, ఉద్విగ్నమైన మనసుని సంబాళించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. పసితనంలో కన్నీళ్ళు పెట్టుకొనే తనను ఒడిలో దాచి కళ్ళు తుడిచే తల్లి సుధాకర్‌కి గుర్తుకొచ్చింది. తడిసిన చెంపలను తుడుచుకొని, బల్లపై స్కూటరు తాళాలను తీసుకొని బయటకు నడిచాడతను.
ఆఫీసులో బల్ల సొరుగులోంచి తల్లి ఫొటోను, డైరీని బయటకు తీసాడు. ఫొటోలోని తల్లి రూపాన్ని ఆప్యాయంగా చేతితో తడిమి, డైరీని తెరిచాడు.
@@@@@
చదువుల తల్లి సరస్వతిని బేగ్‌లోను, వయసులో వచ్చే తీపి కలలను హృదయంలోను దాచుకొని బస్టాండులో నిలబడి ఉందామె. బస్సు కోసం నిరీక్షించే మరో నలుగురు ప్రయాణీకులు ఒంటరిగా నిలబడ్డ ఆమెను ఏదేదో ఊహించుకుంటూ చూస్తున్నారు. ఆమె ఒకరికి అందమైన పువ్వు, మరొకరికి పసిబాల నవ్వు, వేరొకరికి ఇన్స్పిరేషన్, ఇంకొకరికి ఇన్స్టిగేషన్. వీరందరి ఊహలను భగ్నం చేస్తూ, ఆమె ముందు ఒక స్కూటరొచ్చి ఆగింది. ఆమె నిర్భయంగా వెళ్ళి స్కూటరు వెనుక కూర్చుంది. ఆమెను చూస్తున్న ఆ నలుగురి ముఖాన దుమ్ము కొడుతూ ఆ స్కూటర్ వెళ్ళిపోయింది. అంతవరకూ నిశ్శబ్దంగా నిలబడి చూసిన నలుగురూ ఏకమయ్యారు.
"రామ రామ! ఈకాలం పిల్లలకి బొత్తిగా నదురు, బెదురు లేకుండా పోయింది. కళ్యాణమంటపంలోకి అడుగుపెట్టినట్లు, కాలేజీల్లోకి అడుగుపెడుతున్నారు. ఎవరినో లైన్లో పెడుతున్నారు. పెద్దలు కాదంటే లేచిపోతున్నారు.. . .ఇది అందరి విషయాల్లో జరగదండీ! పెంపకాన్ని బట్టే పిల్లలుంటారు. ఈ అమ్మాయి పెంపకం ఇలా అఘోరించబట్టే, మన ముందే ఎలాంటి భయం లేకుండా వాడితో వెళ్ళింది."
స్కూటరుపై వెళ్ళిన ఆ కన్యకు ఈ వ్యాఖ్యలతో పనిలేదు. అసలిలాంటి వాటిని పట్టించుకొనే వయసు కాదామెది. ఆమెకు తెలిసిందల్లా. . .
"మానట మామిడి జాతి - తీగయే మాధవి రీతి
అంతరమెంచక అల్లుకుపోవుటే అవనిలో ప్రేమల నీతి!
ప్రేమకు లేదు ఎదురు - ప్రేమకు లేదు బెదురు!
కలసిన మనసుల కలలు పారే నదిలో అలలు!"
@@@@@@@
ఆ ఇంటి ముందు "టు లెట్" బోర్డు చూసి ఆగాడా యువకుడు. దూరంగా ఆ ఇంటి గుమ్మంలో కుర్చీలో కూర్చుని చదువుకుంటున్న యువతి కనిపించింది. "తానొక్కడే వెళ్ళాలా? పుణ్యను తీసుకొద్దామా?" అని ఆలోచిస్తూ, గోడకివతల రోడ్డుపై ఆ యువకుడు తచ్చాడసాగాడు. ఇంతలో ఆ ఇంటిలోనుంచి ఒక ముసలాయన బయటకొచ్చి, ఆ అమ్మాయితో మాట్లాడటం కనిపించింది.
"ఏం చేస్తున్నావమ్మా?" ముసలాయన అడగటం వినిపించింది.
"రేపటి నుంచి యూనిట్ టెస్టులు నాన్నా! చదువుకుంటున్నా!" అమ్మాయి బదులిచ్చింది.
"అలాగా! చదువుకో!" అని యింట్లోకెళ్తూ, గోడకి ఇవతల తిరుగుతున్న యువకుణ్ణి గమనించాడతను.
"ఆ కుర్రాడు ఎవడమ్మా? మన గుమ్మం ముందే తిరుగుతున్నాడు."
"ఏమోనండీ!" అని రోడ్డు వైపు చూసి, "ఏదో అడ్రస్సు వెతుకుతున్నట్లుంది" అందామె.
"అడ్రస్సా? పాడా? వయసులో ఉన్న ఆడపిల్లల ఇంటి గుమ్మాలు పట్టుకు వేలాడటం పోకిరీమూకలకు అలవాటే కదా! అలా నాలుగు సార్లు ఇంటి చుట్టూ తిరిగి ఆడపిల్లను బుట్టలో వేస్తారు. ఆ తరువాత తమ తడాఖా చూసుకోమంటారు. ఆడపిల్లలు లాక్కోలేక, పీక్కోలేక రోడ్డున పడతారు. అందుకే నిన్ను గుమ్మంలో కూర్చోవద్దంటాను. వినిపించుకోవుగా!" అని కేకలేస్తున్నాడు.
ఆ మాటలు వినిపించిన యువకుడు తనను అపార్థం చేసుకొన్నారని గ్రహించాడు. లోపలకు వెళ్ళటమే మంచిదని గేటు తలుపు తెరిచాడు.
గేటు చప్పుడు విని చూసిన ముసలాయన, "వీడెవడో గట్టి పిండమే! సరాసరి ఇంట్లోకే చొరబడుతున్నాడు. నువ్వు లోపలకెళ్ళు."
తండ్రి కేకలకు ఆ అమ్మాయి కుర్చీ తీసుకొని లోనికెళ్ళిపోయింది.
"ఏమండీ! బయట టులెట్ బోర్డు ఉంది.. ."
యువకుని మాటలు పూర్తి కాకుండానే, "బోర్డు మాదే! కానీ అద్దెకివ్వను" కసిరాడు ముసలాయన.
దానితో ఆ యువకుడు కంగారుపడ్డాడు. "బోర్డు కాదండీ! ఇల్లే అద్దెకు కావాలి."
ముసలాయన ఆ యువకుణ్ణి కింద నుంచి పైదాకా తేరిపార చూసాడు.
"పెళ్ళయిందా?"
'ఇంటి గురించి అడిగితే పెళ్ళంటారేమిటి' అని ఆ యువకుడు బిత్తరపోయాడు. "లేదండీ!"
"కాలేదా? నీకు ఇల్లివ్వను. వెళ్ళొచ్చు."
"పెళ్ళి కాని వాళ్ళకు అద్దెకు ఇళ్లివ్వకపోతే, పొరుగూరినుంచి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళం. మేమెక్కడ ఉండాలి?"
"అది తేల్చుకోవల్సింది నువ్వు, నేను కాదు" అంటూ ముసలాయన లోనికెళ్ళబోయాడు.
"మీ భయమేమిటో అర్థమైంది సార్! మీ ఆడపిల్లని అల్లరి పెడతానని భయపడుతున్నట్లుంది. మీరిల్లు అద్దెకివ్వండి. తరువాత మీ యింటి వైపు కన్నెత్తి చూడను" యువకుడు బతిమాలుతున్నట్లు చెప్పాడు.
"ఏం? అద్దె ఎగ్గొడతావా?" టక్కున అడిగాడు ముసలాయన.
"రామ రామ! నా అర్థం అది కాదండీ! ఇంటితో పాటు మీ ఫోను నెంబరు కూడా ఇస్తే. . ."
"పగలు, రాత్రి మా అమ్మాయికి ఫోను చేసి, బుర్ర పాడుచేస్తావు" టక్కున అన్నాడు ముసలాయన.
"అయ్యో! మీ అద్దె డబ్బుల్ని మీ యింటికొచ్చి ఇవ్వకుండా, ఆన్లైన్లో అక్కౌంటులో వేసేస్తాను. నన్ను నమ్మండి!"
"బ్రహ్మచారిని నమ్మి బలి చక్రవర్తి బావుకున్నదేమిటి?" ముసలాయన ప్రశ్నకు యువకుడి తల తిరిగింది. ముసలాయన పురాణాలు బాగా చదివినట్లున్నాడు. తను అద్దె కోసం యిల్లు చూపించమంటే, ఈయన వామనావతారాన్ని చూపిస్తున్నాడు. అతను బదులిచ్చే లోపునే ముసలాయన తిరిగి అందుకున్నాడు, "బలి చక్రవర్తి తెలియదా? అవున్లే! ఈకాలం కుర్రాళ్ళకు సినిమా చరిత్రలే తప్ప మన సంస్కృతి, చరిత్ర తెలిస్తే కదా! పూర్వం వామనుడనే బ్రహ్మచారి, బలి వద్దకు వచ్చి, మూడు అడుగుల నేల దానమిమ్మన్నాడు. కుర్రాడు, ఆశ్రమం కట్టుకుంటాడేమోలే అని, బలి సరేనన్నాడు. వెంటనే వామనుడు రెండు అడుగులతో భూమ్యాకాశాలు ఆక్రమించి, మూడో అడుగుతో బలిని పాతాళానికి తొక్కేసాడు. అప్పటినుంచేనయ్యా లోకానికి బ్రహ్మచారులంటే భయం పట్టుకొంది. కథ విన్నావుగా! వెళ్ళి రా!" అంటూ ముసలాయన వెనుదిరిగాడు.
"సార్! రెండు వీధులవతల పుణ్యవతి అని మా బంధువుల అమ్మాయి ఉంది. నా గురించి ఆ అమ్మాయిని అడగండి!"
"ఎవరినీ అడగక్కరలేదయ్యా! చూస్తేనే తెలుస్తోందిగా! నువ్వు చాలా బుద్ధిమంతుడివి, అమాయకుడివి. ఆ నమ్మకం నాకు ఉంది. కానీ మా అమ్మాయి మీదే నాకు నమ్మకం లేదు. వెళ్ళిరా!"
ఆ యువకుడు ఏదో చెప్పేలోపునే లోనుంచి ఆ అమ్మాయి విసురుగా బయటకొచ్చింది.
"ఇల్లివ్వనని చెబుతున్నారుగా! విసిగించక వెళ్ళండి!" కోపంతో బుసలు కొట్టే ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి, యువకుడు వెనుదిరిగాడు. అతను గేటు దాటాక, ఆ అమ్మాయి తండ్రి వైపు తిరిగింది.
"ఏంటి నాన్నా నా తప్పు? నా మీద నమ్మకం లేదంటారా?"
"తప్పలేదమ్మా! అతనెంతకూ వదలటం లేదని నీ మీద నమ్మకం లేదన్నాను. నాకున్న పెద్ద దిక్కు నువ్వేరా! నీ బ్రతుకు అక్క బ్రతుకులా కాగూడదని నా తాపత్రయం. నన్ను క్షమించరా!" అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. చిన్న వయసులోనే కన్నుమూసిన పెద్ద కూతురు సుధను తలచుకొని కన్నీళ్ళు పెట్టుకున్నాడతను. వాళ్ళ కన్నీటి మర్మం తెలియని సుధ గోడకున్న ఫొటోలోంచి అమాయకంగా నవ్వుతోంది.
@@@@@@@@@@@
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment