పుష్యమిత్ర - 14
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో హిమాలయాలపైన బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనునితో తలపడి అతన్ని ఓడించగా, సింహకేతనుడు ఆ నగరం వదలివెళ్తాడు. బృహద్ధ్రధుని అనుజ్ఞమేరకు ఆంధ్ర దేశానికి స్వయంవరానికి వెళ్ళిన పుష్యమిత్రుడు వసంతసేనను ఆలయంలో చూసి ప్రేమలో పడతాడు. అనుకోకుండా వారిద్దరికీ వివాహం అవుతుంది. వసంతసేన ను తీసుకుని కళింగరాజ్యం పొలిమేరలు దాటుతూ ఉండగా ఏవరో ముసుగు దొంగలు వెంటాడతారు. వారిని సంహరించే సమయంలో శ్వేతాశ్వుని సంహరించడం జరుగుతుంది. వసంత సేనను ఒక మందిరంలో ఉంచి కాపాడుతూ ఉండగా, కార్తీక పున్నమిరోజున సైనిక కవాతు సమయంలో సింహకేతనుడు బృహద్ధ్రధుని సహాయంతో పుష్యమిత్రుని వధించడానికి ముందుకొస్తాడు. ( ఇక చదవండి).

సింహకేతనుడు బల్లెం తిప్పుతూ.. పెద్దగా నవ్వుతూ.. “రా! పుష్యమిత్రా! రా! ఈ రోజుతో నీ చరిత్ర పరిసమాప్తి” అన్నాడు. అష్టసేనానులు "పుష్యమిత్రా బృహద్ధ్రధుని కదలకుండా మేము బంధించి కాపలా ఉంటాము. మొదట సింహకేతనుని వధించు" అనగానే...పక్కనే ఉన్న బల్లెం-డాలు తీసుకుని నిలబడ్డాడు పుష్యమిత్రుడు. "నీవు నివాత కవచులకంటే గొప్ప యుద్ధవీరుడవా! వారి వద్ద నేర్చుకున్న విద్యలతో నిన్ను ఒకే ఒక నిముషంలో మట్టుపెడతాను రా! పుష్యమిత్రా! ఇది వరకు సింహకేతనుడిని గాను" అన్నాడు. సింహకేతనుడు మొదటగా బల్లెం తిప్పుతూ పుష్యమిత్రుని మీదకు రాగా పుష్యమిత్రుడు తప్పుకుని మూడు నాలుగు నిముషాలు భయంకరయుద్ధం చేసిన మీదట, ఓటమి తప్పదని తెలుసుకున్న సింహకేతనుడు, పుష్యమిత్రుడిని బల్లెంతో తలమీద మోది, నేలపై పడగొట్టి పొట్టపై కూర్చుని, మర్మకళ ఉపయోగించి గొంతు మీద రెండు వేళ్ళతో ప్రయోగం చేయబోతుండగా మార్తాండవర్మ చెప్పిన “ప్రాణాపాయ, విపత్కర పరిస్తితులలో మర్మ కళను వాడవచ్చు” అనే మాట గుర్తుకు వచ్చిoది. సర్వశక్తులనూ కూడతీసుకుని, ఎడం చేత్తో ఆ రెండూ వేళ్ళను విరిచి కుడిచేతి పిడికిలి బిగించి బొటనవేలు గ్రుచ్చుకునే విధంగా వక్షభాగంపై గుద్దిన గుద్దు ప్రక్కటెముకలు విరిగిన సవ్వడితో గుండెలను తాకింది. ఆ నగర శివార్లు దద్దరిల్లే విధంగా హా! అని పెను కేకవేసి కుప్పకూలి రక్తం కక్కుకుని అక్కడికక్కడే మరణించాడు సింహకేతనుడు. వెంటనే అష్టసేనానులను తప్పుకోమని ఖడ్గంతో బృహద్ధ్రధుని వద్ద నిలబడి “మహారాజా! మీరు ఎన్ని తప్పులు చేసినా ఒప్పుకున్నాను. నేను వివాహమాడిన వసంతసేనను బంధిస్తే వూరుకోలేను. మీ దుష్టపాలన అంతమొందించమని ఎందరు కోరినా నేను రాజభక్తితోనే నిరాకరించాను. కానీ ఈరోజు తప్పడం లేదు.” అంటూ నన్ను క్షమించండి అని బృహద్ధ్రదుడు నిరుత్తరుడై చూస్తూ ఉండగానే ఒక్క క్షణంలో శిరస్సు ఒక్కవేటుతో ఖండించి వేసాడు. సైనికులకూ..ప్రజాసమూహానికీ నమస్కరించి " మహాజనులారా! నేను చేసినది తప్పు కావచ్చు! కానీ ఈ రోజునుండి దేశంలో శాంతి భద్రతలు కాపాడి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను" . అని సింహాసనంపై కూర్చునగానే ప్రజలు పుష్పహారాలతో ముంచెత్తారు. "వసంతసేనను సగౌరవంగా తీసుకు రమ్మన్ని చెప్పి "ఈ రోజునుండి ఈమె మహారాణి" అని ప్రకటించి ఇంకో సింహాసనం ఇచ్చి ఆశీనురాలిని చేసాడు. వసంతసేన లేచి "ఈ రోజుతో మౌర్య వంశజుల దుష్ట పాలన అంతమయింది. శుంగవంశ సామ్రాట్ పుష్యమిత్రుని పాలన ప్రారంభమయింది. ఆడబిడ్డలు, రైతులు మిగతవృత్తుల వారు నిశ్చింతగా స్వేచ్చా వూపిరులు పీల్చుకోవచ్చు" అనగానే ప్రజలు "పుష్యమిత్రమహారాజు కూ జై.. మహారాణి వసంతసేనకూ జై అని జయ జయ ధ్వానాలు చేసారు.
* * *
పుష్యమిత్రుడు రాజు కాగానే దేశంలో సంస్కరణలు మొదలెట్టాడు. బృహద్ధ్రధుని అవగుణాల వల్ల తయారయిన లంచగొండులను, అసమర్ధులను పదవీచ్యుతులను చేసి సమర్ధులైన వారికి అధికారమిచ్చాడు. అశ్వమేధయాగం చేసి యావత్భారతదేశాన్ని తన అదుపులోనికి తెచ్చుకున్నాడు. ఇంతలో వసంతసేన మొగబిడ్డను ప్రసవించగా అతనికి "అగ్నిమిత్రుడు" అని పేరుబెట్టి సమస్త రాజవిద్యలూ నేర్పిస్తాడు.
ఆరోజులలో ఒకనాడు సాంచి, సారనాధ్ అమరావతీ స్తూపాల వద్ద నివసిస్తున్న బౌద్ధ బిక్షువుల ప్రతినిధులు పుష్యమిత్రుని సందర్శనార్ధమై విచ్చేస్తారు. "ప్రవేశపెట్టండి" అన్నాడు పుష్యమిత్రుడు. సభలోకి కాషాయ వస్త్రధారులైన నలుగురు వృద్ధులు ప్రవేసించారు. "మహారాజా! మీరు మా బౌద్ధమతాన్ని అంగీకరించకపోవచ్చు కానీ మాలాంటి వారిని ఆదరించవలసిన అవసరం ఉంది కదా! మీ సైన్యం మాస్తూపాలమీద, మా స్థావరాల మీద దాడులు జరుపుతున్నారు" అన్నాడు వాళ్ళలో ఒకడు. "నిజమే నా దేశ ప్రజలుగా మీరు. సురక్షితంగా స్వేచ్చగా జీవించవచ్చు. మీరు కూడా మీ మీ బోధనలే కాకుండా ఏవైనా వృత్తులను చేసుకుని జీవించండి. ఇకపై మీకు సంభారాలను ఉచితంగా పంపడం జరగదు. హిందూ మత సాఫల్యమే బౌద్ధం అని గ్రహించండి. మేము యజ్ఞయాగాదులను పునరిద్ధరించిన విషయం మీకు తెలుసు. కానీ మీరు వాటికి వ్యతిరేకంగా బోధనలు చేస్తున్నారు. మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మా దేశం వదలి ఉత్తరాన ఉన్న చీనా వంటి దేశాలకు తరలి వెళ్ళవచ్చు. వారించడానికి వచ్చిన సైనికులతో మీరు వాదోపవాదాలకు దిగడం, వారిపై ఏవో తిరుగుబాటు ధోరణులు ప్రదర్శించడం మాకు నచ్చదు. మీరూ వివిధ వృత్తులను చేపట్టండి. సోమరితనంగా గుహలలో కూర్చునే వారికి మా సహాయ సహకారాలు ఉండవు. మీరు యజ్ఞ యాగాదులను నిరసించి దూషించే పక్షంలో మా రాజ్యం వదలి పెట్టి వెళ్ళమని హెచ్చరిస్తున్నాను" అన్నాడు పుష్యమిత్రుడు.
మేము "కాలచక్ర" జరుపుకునే విషయంలో మీ అనుమతి లభించలేదు. కాలచక్ర గురించి మీకు తెలియజేయాలని వచ్చాం. కాలచక్రం అంటే, ఈ సమస్త చరాచర సృష్టికీ సాక్షీభూతంగా నిలిచిన కాలమే...! జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోతున్న సృష్టి పరిణామ చక్రమే 'కాలచక్రం' మేము దీనిని ఒక తంత్రంగా ఒక తాత్త్విక సిద్ధాంతంగా, ఒక జీవన విధానంగా ఆచరిస్తాము. అంతరిక్షంలో గ్రహాల దగ్గర నుంచి, విడవకుండా ఊపిరి పీల్చి వదిలే మానవ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వరకూ సమస్తమైన సృష్టి కదలికలన్నీ ఈ కాలచక్రం పరిధిలోకే వస్తాయి. కాలచక్రాన్ని సాధించుకోవడం అంటే, ఈ సృష్టి యొక్క స్థితిలయాల్ని సాధించుకోవడంగా అర్ధం చేసుకోవాలి. కాలచక్రాన్ని సాధించుకోవడం అంటే, ఈ సృష్టిలో స్థూలంగా కన్పించే అంశాలే కాదు, సూక్ష్మమైన శక్తుల్ని కూడా సాధించుకొని, జ్ఞానాన్ని పొందడం. ప్రపంచ నలుమూలల నుండి బౌద్ధులు విచ్చేసి జరుపుకునే పుణ్య కార్యం ఇది.అలాంటి ఉత్సవాలకు మాకు అనుమతి లేదు.. అంటూ ఉండగానే... కోపోద్రిక్తుడైన పుష్యమిత్రుడు...” చాలించండి మీ వేదాంతం. ప్రజలకు భయభక్తులు నేర్ప వలసిన అగత్యం మీకు లేదు. సనాతన శాస్త్ర జ్ఞానం శరీరానికి, మనస్సుకి, ఆత్మకి సమానహోదా ఇచ్చింది. అంతరిక్షం, ఆకాశం, భూమి పై జరిగే సంఘటనలు - మనిషి శరీరం, ప్రాణం, మనస్సులను ప్రభావితం చేస్తాయని మా మహర్షులు ఏనాడో చెప్పారు. అన్నింటిలో అంతర్లీనంగా చైతన్యం ఉందని, దానిని తెలుసుకోవడ మే పరమార్దమని ఋషి వాక్యం. జ్ఞానం అనేది రెండు రకాలు, ఒకటి అపరా విద్య, రెండోది పరా విద్య అని వేదవాక్యం. పిండాండం లొ ఏముందో బ్రహ్మాండం లో కూడా అదే ఉంటుందనే ప్రగాడ నమ్మకంతో పరిశీలించు కొన్నాo. అంతర్యానం (యోగo, ధ్యానం, అంతర్ముఖం, నివృత్తి) నిత్యానిత్య విచక్షణ అనే విధానాలు మహర్షులు కని పెట్టి, అవి ఫలించాలంటే చిత్త శుద్ది, అహంకార రాహిత్యం ఉండాలని, వీటిని పొందడానికి వివేక వైరాగ్యాలు అభ్యాసం చేయాలని, కోరికలను మితంగా ఉంచు కోవాలని, అదే సమయం లో ప్రకృతికీ, సమాజానికి ఎలాంటి హానీ తల పెట్ట రాదని,అలాగే వర్ణాశ్రమ విధులు, నిత్య నైమిత్తిక కర్మలు కర్తృత్వ భావన -కర్మఫలాపేక్ష లేకుండా చేయాలని ఉద్బోధించారు. అలాగే మానవులకు పంచ కోశాలు ఉన్నాయని, అవి పూర్తిగా ఎలాంటి కర్మావ శేషం లేకుండా శుద్దము కావాలని, దానికి ధ్యాన సాధన చేయాలని తద్వారా ఎరుకని శరీర స్థాయి నుండి క్రమంగా ప్రాణస్థాయి, మానసిక స్థాయి, కారణ శరీరస్థాయి, చివరికి ఆత్మస్థాయి కి విస్తరించు కోవచ్చని కూడా చెప్పారు. ఆసన ముద్రలు, యమ నియమాలు శరీరాన్ని, ప్రాణాయామం ప్రాణ వాయువులను, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం మనస్సుని, సమాధి స్థితి కారణ శరీరాన్ని పరిశుద్దం చేసి ఎరుక ఆత్మ స్థితి కి ఎదగడానికి శరీర వ్యవస్థలను సమాయత్తం చేస్తాయని మహర్షులు కనుగొన్నారు. ఈ సాధనకి అత్యంత ముఖ్యమైనది, పునాది వంటిది - ఆత్మ స్థితికి చేరుకోవాలనే గాడమైన కోరిక, వివేక వైరాగ్య అభ్యాసం, శ్రద్ద-ఓర్పు అంతే. ఇంతకంటే గొప్పగా బోధిస్తుందా మీ కాలచక్ర" అని హుంకరించాడు.
"పుష్యమిత్రా! మీరు వేద వేదాంగాలు అభ్యసించిన బ్రాహ్మణులు. మీ హిందూ ధర్మ శాస్త్ర పరిజ్ఞానం అపూర్వం. ఒక చక్రవర్తి ఇన్ని విషయాలు చెప్తున్నారంటే మాకే నమ్మశక్యం గాని స్థితిలో ఉన్నాం మేము. కానీ ఈ భరత ఖండాన్ని ఏలిన చక్రవర్తులు చద్రగుప్తుడు, అశోకుడు, సంప్రాతి, దేవవర్మ వంటి వారు తెలివిమాలిన వారా?" అనగానే " హు!! అశోకుడు! కళింగ యుద్ధం లో కొన్ని లక్షలమంది ప్రాణాలు పోయాక గానీ అతనికి జ్ఞానోదయం కలుగలేదు. నందుల ఏలుబడిలో సామంతులుగా ఉన్న కళింగ మౌర్యుల కాలం లో స్వతంత్రులవడం వల్లనే వారిపై కక్ష సాధించే దిశగా ఈ యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలుసు. ఆనాడు అతనికి హిందూ సనాతన ధర్మం చెప్పే చాణక్యుని లాంటి సరైన గురువు లేడు. అందువల్లనే అశోకుడు బౌద్ధమతాన్ని అవలంబించాడు. కానీ ఆయన గొప్ప చక్రవర్తి. ఆయన చేసిన కార్యాలను మేమూ అనుకరిస్తున్నాం. కానీ మధ్యలో వచ్చిన ఈ బౌద్ధానికి మేము వ్యతిరేకం. ప్రజల్లో తిరిగి బోధనలు చేయడం మానుకోండి. మీ మీ స్థావరాలలో మీరు ఉండండి. మీకు వలసిన సంభారాలను మీరే సమకూర్చుకోవాలని తెలియజేస్తున్నాను. ఇక మీరు వెళ్ళవచ్చు." అనగానే వారు నిష్క్రమించారు.
* * *
యుక్తవయసు రాగానే అగ్నిమిత్రునికి పట్టాభిషేక మహోత్సవం జరిపించాడు. అగ్నిమిత్రుడు తండ్రి సలహాలతో దేశాన్ని జనరంజకంగా పరిపాలించే రోజులలో ఒకనాడు. "నాయనా! అగ్నిమిత్రా! ఇక నీవు రాజ్యాన్ని ఎట్టి సమస్యలు లేకుండా పాలిస్తావన్న నమ్మకం నాకు కలిగింది. ఇక నేను అమ్మ వసంతసేన తో వానప్రస్తానికి వెళ్ళి జీవితం గడుపుతాము. అనగానే అగ్నిమిత్రుడు "తండ్రిగారూ! మీకు నలభై సంవత్సరాలకంటే మించ లేదు. ఇప్పుడే వానప్రస్తం అవసరమా!" అనగానే పుష్యమిత్రుడు " ఒక సద్బ్రాహ్మణ వంశంలో జన్మించి కూడా వేదాధ్యయనం మాని నేను చేసిన దుష్కృత్యాలకు పశ్చాత్తాపపడవలసిన తరుణం ఆసన్నమయింది నాయనా! అడ్డు చెప్పకు" అనగానే హిమాలయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఒక మంచి ఆశ్రమం నిర్మింపజేసి తల్లిదండ్రులను ఉంచి కట్టుదిట్టమైన కాపలా ఉంచాడు.
ఆశ్రమంలో ఎండకన్నెరుగని వసంతసేన అనారోగ్యం పాలయింది. కందమూలాలు తినడం వల్ల కడుపు నొప్పితో బాధపడుతున్నది. రాజవైద్యులు వచ్చి పరీక్షలు జరిపి ఔషధాలు ఇచ్చినా తగ్గలేదు. ఒకరోజు రాత్రి నిద్దురలోనే కన్నుమూసింది. పుష్యమిత్రుడు పూర్తి భవబంధాలు తెగినట్లుగా భావించి అగ్నిమిత్రుని పిలిచి ఆమెకు దహన సంస్కారాలు గావించి, ఒకరోజు సూర్యోదయాన కైలాస శిఖరానికేసి దారి తీసాడు.
మాసిన బట్టలు...మీసాలూ..గడ్డమూ పెరిగి ఉండడం వల్ల ఎవ్వరూ గుర్తు పట్టడం లేదు. వీలున్న చోటల్లా ధ్యానంలో మునిగితేలుతూ.. సాగుతున్న రోజులలో ఒకనాడు ఒక గుహ మొదట్లో ధ్యాన నిమజ్ఞుడై ఉండగా కొన్ని ఋగ్వేద మంత్రాలు వినపడ్డాయి. అలికిడి వినిపించింది కానీ ఎవరూ లేరు. ఎదురుగా ఓ నీడ వచ్చి తన మీద పడింది. రెండడుగుల దూరంలో ఎండమావిలా ఏదో ఆకారం నిలుచుని ఉంది. ఎవరో తెలీడంలేదు, కనపడడం లేదు. (సశేషం)
* * *

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top