సంగీత సామ్రాజ్ఞి - ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 

- అక్కిరాజు ప్రసాద్ 


ఆవిడ పేరు తలచుకోగానే తాదాత్మ్యతతో కూడిన భక్తి భావం మదిలో కదలాడుతుంది.
ఆవిడ రూపం చూడగానే సనాతన ధర్మం మూర్తీభవించిన భావన కలుగుతుంది.
ఆవిడ ఆలపించిన కీర్తన వినగానే అమృతవర్షం కురిసిన భావన మిగులుతుంది.
ఆవిడ పఠించిన సుప్రభాతం వింటుంటే స్వామి సన్నిధిన ఉన్న భావన కలుగుతుంది.
భక్తి, భారతీయత, శాస్త్రీయతతో కూడిన మాధుర్యం, దేవతానుగ్రహం - ఇవన్నీ కూడితే ఆమె సేవామార్గం.
వినమ్రత, ప్రశాంతత, చెదరని చిరునవ్వు, ఆత్మ విశ్వాసం - ఇవన్నీ కూడితే ఆమె వ్యక్తిత్వ పరిమళం
పాపపుణ్యాల భారములు, సిరిసంపదల ఆలోచనలు, శిష్యవర్గపు బంధనాలు - ఇవన్నీ లేనిది ఆమె ఆత్మ ప్రస్థానం
బాహ్యంతరములు, ఇంటా బయటా, విదేశ స్వదేశములు - వీటన్నిటా స్థిరమైన భావనలు ఆమె జీవన విధానానికి దర్పణం
కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో ఆమె ఎప్పటికీ మహారాణిగానే ఉంటుంది.సూర్యోదయానికి ముందే కౌసల్యా సుప్రజా రామా మొదలు నిదురించే ముందు జో అచ్యుతానంద జో జో ముకుందా వరకు ఆమె గాత్రమాధుర్యంలో జాలువారినవే. పంచాయతనములలోని దేవతమూర్తుల స్తోత్రములతో పాటు, శంకరచార్యులు, భగవద్రామానుజులు మొదలైన అవతారపురుషుల రచనలు ఆమె గళంలో పలికినవే. మీరా, సూరదాసు మొదలైన ఉత్తరాది మహనీయులు రచించిన భజనలు ఆమె గాత్రంలో ప్రకాశించినవే.
అవునండీ, భారతరత్న, సంగీత కళానిధి శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గురించి చెప్పుకునే భాగ్యం ఆ పరమేశ్వరుడు కలిగించాడు. మహనీయులు స్పూర్తిదాతలే కాదు మార్గదర్శకులు, నిఘంటువులు కూడా. వారి ప్రతి అడుగు మనకు ఒక మంచి ఉదాహరణ. మానవజన్మను పరిపూర్ణంగా సార్థకం చేసుకున్న మహామనీషి సుబ్బులక్ష్మి గారు. ఆవిడ పుణ్యాత్మ ఈ భువిపై దేహధారణ చేసి 99 వసంతాలు దాటి శతంలోకి అడుగిడుతున్న వేళలో ఆవిడ జీవిత విశేషాలను, సేవాపథాన్ని, తత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
​మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి 1916వ సంవత్సరం సెప్టెంబరు 16న మద్రాసు రాష్ట్రంలోని మదురై పట్టణంలో షణ్ముఖవడివు అమ్మాళ్, సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించింది. తల్లి షణ్ముఖవడివు మంచి వీణావాద్య కళాకారిణి. చిన్నపటినుండే తల్లి వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకుంది బాల సుబ్బులక్ష్మి. 1926లో మదురై సేతుపతి ఉన్నత పాఠశాలలో తల్లి కోరికపై ఒక మరాఠీ గీతాన్ని ఆలపించారు. 1926లోనే ఆవిడ తొలి డిస్క్ 'మరకత వడివుం' విడుదలయ్యింది. ఈ ఆల్బంలో తల్లి వీణ వాయించగా సుబ్బులక్ష్మి గానం చేశారు. 1927లో తొలిసారిగా తిరుచిరాపల్లిలోని రాక్ఫోర్ట్ దేవాలయంలోని నూరు స్థంభాల గుడిలో మొదటి కచేరీని ఇచ్చారు. ఆమెకు వయోలిన్ పై ప్రఖ్యాత విద్వాంసుడు మైసూర్ చౌడయ్య గారు సహకారం అందించారు. అటు తరువాత 1929లో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో సుబ్బులక్ష్మి భజనలు ఆలపించి శ్రోతలను ముగ్ధులను చేశారు. అతి త్వరలోనే సుబ్బులక్ష్మి ఒక ప్రఖ్యాత కళాకారిణిగా పేరొందారు. 1933లో సుబ్బులక్ష్మి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో పూర్థి స్థాయి కర్ణాటక సంగీత కచేరీ చేశారు. 1936లో సుబ్బులక్ష్మి కుటుంబం చెన్నైకి తరలి వచ్చింది. అదే సమయంలో ప్రఖ్యాత పాత్రికేయులు, స్వాతంత్ర్య సమరయోధులు, సినీ నిర్మాత త్యాగరాజ సదాశివంగారితో సుబ్బులక్ష్మికి పరిచయం అయ్యింది. వారి అభిప్రాయాలలో సారూప్యతతో అభిరుచుల కలయిక జరిగింది. వారి ప్రోత్సాహంతో సుబ్బులక్ష్మి తమిళ చాలన చిత్రాలలో నటించారు. 1938వ సంవత్సరంలో సేవాసదనం అనే చిత్రంతో తన వెండితెర జీవితాన్ని ఆరంభించారు ఎమ్మెస్. 1940వ సంవత్సరంలో సదాశివంగారి భార్య అపీతకుచలాంబాళ్ మరణించిన తరువాత సుబ్బులక్ష్మి ఆయనను వివాహము చేసుకున్నారు. వారి మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమార్తెలు రాధ, విజయ. వారిని ఎమ్మె కన్నతల్లిలా చూసుకునేది. తన ప్రస్థానంలో సింహభాగం కచేరీలలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు రాధా విశ్వనాథన్ సహకారంతో గానం చేశారు.
1940లో శకుంతల, 1941 సావిత్రి చిత్రాలు తమిళంలో విడుదలయ్యాయి. వీటిలో నాయిక పాత్రలను సుబ్బులక్ష్మి పోషించారు. 1945లో మీరా చలనచిత్రం తమిళంలో విదుదలై ఘన విజయం సాధించింది. అదే చిత్రాన్ని హిందీలోకి అనువదించి 1947లో విడుదల చేశారు. అది కూడ ఘన విజయం సాధించింది. ఎమ్మెస్ సినీ జీవితంలో, అటు తరువాత శాస్త్రీయ సంగీత ప్రస్థానంలో సదాశివం పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయనకు తోడు నీడగా ఆమె, ఆమెకు స్పూర్థిగా అయన నిలిచారు. హిందీ మీరా చలనచిత్రం తరువాత ఎమ్మెస్ మహాత్మా గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి నేతల మన్ననలు పొంది వారి సమావేశాల్లో పాడటం ఒక ఆనవాయితీగా ఆరంభామయింది.
1950వ దశకం వచ్చేసరికి ఎమ్మెస్ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. 1954వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. 1956లో సంగీత నాటక అకాడెమీ అవార్డు ఆమెను వరించింది. అటుపై ఎమ్మెస్ ఖ్యాతి విదేశాలకు చాటింది. 1963లో ఎడిన్బర్గ్, 1966లో యునైటేడ్ నేషన్స్ జనరల్ అస్సెంబ్లీలో ఆవిడ కచేరీ చేసి అక్కడి ప్రజలను, పాలకులను, దేశాధినేతలను, ప్రతినిధులను మంత్రముగ్ధులు చేశారు. 1968వ సంవత్సరంలో సంగీత కళానిధి బిరుదును పొందిన తొలి మహిళగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎంతో పేరు పొందారు. 1963లో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం క్యాసెట్ విడుదలైంది. దక్షిన భారతదేశంలో ప్రతి ఇంటా ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ సుప్రభాత గానం. 1970లో చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) గారి వ్యాఖ్యానంతో భజగోవిందం, విష్ణు సహస్రనామం క్యాసెట్లు విడుదలైనాయి. వీటికి పర్యాయపదం అంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అన్నంత ప్రాచుర్యం పొందాయి.
విశ్వవిఖ్యాతమైన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శాస్త్రీయ సంగీత మాధుర్యం 1970 దశకంలో మరింత తీయదనం పొందింది. 1974 సంవత్సరంలో ఆమెకు ఆసియాలో నోబెల్ బహుమతి గా భావించబడే ప్రతిష్ఠాత్మక రామొన్ మెగసేసే అవార్డు లభించింది. 1975లో పద్మవిభూషణ్ అవార్డుతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విద్వాన్ పదవి కూడా వరించింది. 1975లో తితిదే ఎమ్మెస్ సుప్రభాతాన్ని తిరుమల ఆలయంలో ప్రసారం చేయటం ఆరంభించారు. 1977లో అమెరికా పర్యటనలో భాగంగా కార్నెగీ హాలులో కచేరీ చేశారు.
1980లో తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా సుబ్బులక్ష్మి గారు అన్నమాచార్యుల వారి సంకీర్తనలను నేదునూరి కృష్ణమూర్తిగారి వద్ద నేర్చుకొని ఆలపించారు. ఈ ఆల్బం ఎంతో పేరుపొందింది. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన విదుషీమణిగా నియమించబడ్డారు. ఆ దశకంలో శాంతినికేతన్ నుండి దేశికోత్తమ బిరుదు లభించింది. అంతర్జాతీయ సంగీత మండలిలో గౌరవ సభ్యురాలిగా నియమించబడ్డారు.1982లో లండన్ భారతీయోత్సవాలలో కచేరీలు చేశరు.1988లో ఆవిడకు ప్రఖ్యాత కాళిదాస్ సమ్మాన్ అవార్డును మధ్యప్రదేశ్ ప్రభుత్వం బహుకరించింది. 1990లో ఇందిరా గాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ తో భారత ప్రభుత్వం సత్కరించింది.
80ఏళ్లు దాటిన పిమ్మట సుబ్బులక్ష్మి 1997లో తన ఆఖరి కచేరీ చేశారు. 1997లో స్వరాలయ పురస్కారం లభించిన కొద్ది రోజులకే భర్త సదాశివం మరణించారు. అటు తరువాత ఎమ్మెస్ మళ్లీ వేదిక ఎక్కి పాడలేదు. 1998లో భారత ప్రభుత్వం తన అత్యున్నత పురస్కారమైన భారత రత్న బిరుదుతో ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని గౌరవించింది. సుదీర్ఘమైన సంగీత జీవితం తరువాత 2004లో ఎమ్మెస్ తన తుదిశ్వాస విడిచారు. మరణించేంతవరకూ సంగీత సాధన విడువలేదు. తాను సంపాదించినదంతా సేవా సంస్థలకు విరాళాలుగా ఇచ్చి దివ్యమైన వ్యక్తిత్వంతో, ఆత్మ సౌందర్యంతో, భగవంతుని సేవా భాగ్య ఫలంతో సుబ్బులక్ష్మి ఆత్మ ఈ లోకాన్ని విడచి వెళ్లింది.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి వైశిష్ట్యం ఆవిడలో ఉన్న రససిద్ధి - ఆ సంగీత రసాన్ని పూర్తిగా అనుభూతి చెంది దానిలో రమించటం. ఇదీ కళాకారుడి సాధనకు పతాక స్థాయి. రససిద్ధి పొందిన కళాకారుడికి తరువాత వేరే ఏదీ రుచించదు. అమృతత్వమంటే ఇదే. ఒక గాయకుడికి ఇది భావములో జీవించటం, దానిలో లయించి స్వరాలు పలికించటం. అధరం మధురం అని సుబ్బులక్ష్మి గారు ఆ శ్రీకృష్ణుని నుతిస్తూ మధురాష్టకం పాడితే ఎదురుగా ఆ పరమాత్మ దివ్యమంగళ స్వరూపం ముందు నిలిచిందా అనిపిస్తుంది. భావయామి గోపాల బాలం అని పాడితే ఆ చిన్ని కృష్ణుడు ముద్దుగా ఎదుట నిలిచినట్లే. ఇలా ఎన్నో. కారణం ఆమెకు ఆ సంకీర్తనలోని భావం మనసులో నిలిచి ఆ దేవతా స్వరూపం కళ్లముందున్నంత విశ్వాసం. తాదాత్య్మత కలిగిన కళాకారిణి ఆమె.
ఒకపరికొకపరి వయ్యారమై అని ఆవిడ అన్నమాచార్యుల వారి కీర్తన ఆలపిస్తే అలమేలుమంగ, శ్రీనివాసుల వైభవం మన కళ్ల ఎదుట నిలుస్తుంది. అదీ ఆ కళాకారిణి యొక్క గొప్పతనం. నిత్యానందకరీ వరాభయకరీ అని అన్నపూర్ణాష్టకం ఆలపిస్తే ఆ శంకరులు అన్నపూర్ణను నుతించిన సన్నివేశం కళ్లముందు నిలుస్తుంది. అన్నపూర్ణ యొక్క కరుణావృష్టితో మనకు ప్రశాంతత కలుగుతుంది. రఘువంశ సుధాంబుధి చంద్ర అని రాముని నుతించి అందులో అందమైన స్వరాలను పలికించిన రీతి ఆ రాగ లక్షణాలను, దేవతామూర్తి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. అదీ ఆవిడ గాత్రంలోని పరిశుద్ధత. పాలించు కామాక్షీ పావనీ అని శరణాగతితో వేడుకుంటే ఆ కామాక్షీ పరదేవత శ్యామశాస్త్రుల వారిని కటాక్షిన ఘట్టం మనకు అనుభూతికి రావలసిందే. జగదోద్ధారణ అని యశోద తనయుని, చేరి యశోదకు శిశువితడు అని అదే బాలుని వేర్వేరు భావనలతో, రాగములలో ఆవిడ ఆలపించిన పద్ధతి వాగ్గేయకారుల భావనలను పరిపూర్ణంగా మనముందుంచుతాయి. మాతే మలయధ్వజ పాండ్యసజాతే అని ఆమె ఖమాస్ రాగంలో వర్ణం స్వరములతో ఆలపిస్తే ఎంతో క్లిష్టమైన స్వరస్థానాలు ఆవిడ గళంలో ఎంత సులువుగా పలుకుతాయో అర్థమవుతుంది. బ్రోచేవారెవరురా అని పాడితే మైసూర్ వాసుదేవాచార్యుల వారి శరణాగతితో కూడిన ఆర్ద్రతను ఆవిష్కరించింది. నిను వినా నామదెందు అని ఉచ్ఛ స్థాయిలో మూడవకాలంలో ఆవిడ స్వరములను, సాహిత్యాన్ని పలికితే త్యాగరాజ స్వామికి అనుభవైకవేద్యమైన రామవైభవం మనకు అవగతమవుతుంది. ఇలా ఎన్నో, ఎన్నెన్నో..కర్ణాటక సంగీతంలో సుబ్బులక్ష్మి గారు కనబరచిన శుద్ధత నభూతో న భవిష్యతి.
ఆవిడ గళంలో ఎంతో ప్రాచుర్యం పొందినవి హనుమాన్ చాలీసా, నామరామయాణం, మధురాష్టకం, కనకధారా స్తోత్రం, అన్నపూర్ణాష్టకం, శ్రీరంగ గద్యం, మీనాక్షీ సుప్రభాతం, కామాక్షీ సుప్రభాతం, మీనాక్షీ పంచరత్నం, రామనాథ సుప్రభాతం...అనంతం ఆమె సంగీత సేవలోని సుమాలు. అజరామరం ఆ సంగీత రసప్రవాహం.
ఎదిగిన కొద్దీ ఒదగమని అన్న నానుడికి ఎమ్మెస్ అత్యుత్తమ ఉదాహరణ. ఆవిడ వ్యక్తిత్వం తెల్లని కాగితం వంటిది. అంతటి పేరు ప్రఖ్యాతులు పొందినా ఆవిడ అజాత శత్రువు. జీవితమంతా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సామాన్యంగానే గడిపిన కీర్తిశేషులు ఆవిడ. క్రమశిక్షణతో కూడిన దినచర్య, నిరంతర సాధన, తన ధర్మాన్ని తుచ తప్పకుండా నిర్వర్తించటం ఆవిడ జీవన విధానం. ఎన్నో సామాజిక కార్యక్రమాలకు విరాళాలు సమకూర్చటానికి కచేరీలు చేశారు. అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని పొందారు. కంచికామకోటి పరమాచార్యుల వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన ఏకైక కళాకారిణి సుబ్బులక్ష్మి గారు. ఆయన రచించిన గీతాలను ఆలపించి ఆయన పట్ల తనకున్న కృతజ్ఞతను తెలుపుకుంది ఆ తల్లి. ఎంతో పేరుపొందిన తోటి కళాకారులు ఎమ్మెల్ వసంతకుమారి, డీకే పట్టమ్మాళ్, సెమ్మన్గూడి  శ్రీనివాస అయ్యర్ మొదలైన వారితో ఎంతో సత్సంబంధాలు కలిగి వారి ప్రేమానురాగాలకు పాత్రురాలైంది ఆ అమ్మ.
భారత జాతి గర్వించదగ్గ బహుకొద్ది మంది పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల పౌరులలో ఆవిడ అగ్రస్థానంలో ఉంటుంది. భారతీయతను పుణికిపుచ్చుకొని, దానికోసం శ్రమించి, జీవించి, భారతీయతను అణువణువునా తనలో నిలుపుకున్న త్యాగశీలి, దైవస్వరూపిణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు. ఆమె జీవించిన శకంలో జన్మించినందుకు మనమందరం ధన్యులం. ఆమె నడచినబాట మనకు ఆదర్శప్రాయం కావాలి. ఆమె జీవితం మనకొక స్ఫూర్తి కావాలి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top