మార్పు
-కొడాలి సీతారామా రావు
‘సార్, ఎమ్మెల్లే గారు ఇవాళ గానీ,రేపు గానీ చెకింగ్ వస్తారట.ఏ టైంలో వీలౌతుందో అడగమన్నారు.’
డాక్టర్ నవనీత్ చిన్నగా నవ్వుకుంటూ ‘వారికి ఈరోజు అప్పాయింట్ మెంటు ఇదివరకే వుందని చెప్పి రమ్మను’ అన్నాడు.
సాధారణంగా రాజకీయ నాయకులు అందునా పదవిలో వున్నవారు హడావిడిగా మందీ మార్బలంతో వస్తారు గుడికైనా,బడికైనా,హాస్పిటల్ కైనా.అలా కాక ఎమ్మెల్లే అమరనాధం ఇలా ముందస్తుగా అడిగాడంటే ఏదో కథ వుండాలిగా-వుంది.
***
డా.నవనీత్ ఎం ఎల్ ఏ అమరనాథంని కలవటానికి ఆయన ఇంటికి వెళ్ళాడు. మూడంతస్తుల ఆ విల్లా ముందు చాలా మంది కూచుని వున్నారు రోడ్డు పక్కనే.
ఇంటి ముందు పెద్ద గేటు.గేటు నించి ఇంటి దాకా మూడు కార్లు పట్టేంత స్థలం.పెద్ద గోడలు.చుట్టూ చాలా పెద్ద ఆవరణ. గేటు నించీ ఇంటి దాకా వెడల్పుగా రాళ్ళు పరిచి వున్నాయి.దానికి రెండు వేపులా పూల మొక్కలు.
గేటు దగ్గరకి వెళ్ళగానే అక్కడి సెక్యూరిటీ వారు ఆపేసారు.అప్పాయింట్మెంటు అడిగారు.లేదంటూ ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడాలి అన్నాడు.వాళ్ళు ఇంటి వరండాలో వున్నతని వంక - సెక్రటరీయేమో చూసారు.అతను పంపమనగానే లోపలికి పంపారు.
వరండాలో చాలా మంది వున్నారు.వారు కాస్త వున్నవారిలా వున్నారు.నవనీత్ ని తన పక్కన కూచోమన్నాడు.
ఎం ఎల్ ఏ గారు వస్తూనే కుడి పక్క వున్నవారిని పలకరించి,వారి కాయితాలు తీసుకుని సెక్రటరీకి ఇచ్చాడు.నవనీత్ లేచి నుంచుని తన సమస్య చెప్పాడు ‘ నేను కార్డియాలజిస్టిని. బంజారా హిల్స్ లో 152 ఎ లో 6 నెంబరు ప్లాటు మా పూర్వీకుల నించీ వుంది.అక్కడ మేము హాస్పిటల్ కడదామనుకుంటున్నాము.కొందరు గూండా లు మీ పేరు చెప్పి ఆక్రమించుకున్నారు.మీకు చెప్దామని వచ్చా.’
‘అరే భాయ్.నాకేం సంబంధం.నాకేం అవసరం కబ్జా చైడానికి.నాకా అవసరం లేదు.పోలీస్ కంప్లైంట్ చేసుకో.’సరే అని తలూపి వెళ్ళిపోయాడు.
పోలీస్ స్టేషన్ కి వెళితే పాతిక లక్షలిస్తే సెటిల్ చేస్తామన్నారు.ఇవ్వలేనని వచ్చేసాడు.అతని తమ్ముడు ఎస్పీ గారి ప్రజా వేదికలో కాయితం ఇచ్చాడు.వారం వారం వెళుతున్నాడు.కానీ సెటిల్ కావటం లేదు.ఏం చేయాలో అర్ధం కావటంలేదు.
చివరికి ఒకరి సలహా మేరకు మళ్ళీ ఎం ఎల్ ఏ నే కలిసారు.ఆయన చూస్తూనే అడిగాడు పనైందా అని.అవలేదు, పోలీసులు కేసు బుక్ చేయటం లేదని చెప్పారు.ఆయన వెంటనే పోలీసులకి ఫోన్ చేసి మాట్లాడమని సెక్రటరీకి చెప్పి వెళ్ళిపోయాడు.
అందరూ వెళ్ళాక సెక్రటరీ రహస్యంగా చెప్పాడు ‘పోలీసులడిగినంత కాకపోతే ఏదో ముట్ట చెప్పి సెటిల్ చేసుకోండి.ఎం ఎల్ ఏ గారు చెప్పినా అవదు.’మరింత దగ్గిరకి జరిగి మరీ రహస్యంగా చెప్పాడు ‘ఎం ఎల్ ఏ గారే చేయించారు.అదీ కథ’ అన్నాడు. ‘మా వల్ల అవదు అలా లంచాలు ఇవ్వటం.సరే మా ఇలవేలుపు ఆంజనేయ స్వామే చూసుకుంటాడు.’ అని వెనుతిరిగారు. ఆ మాట విని అమరనాథం పగలబడి నవ్వాడు.
***
సరిగా నెల రోజుల తరువాత రాత్రి పన్నెండుకి నర్స్ ఫోన్ చేసి చెప్పింది సీరియస్ కేస్ వచ్చింది.వెంటనే రావాలని.
అలా వచ్చాక పేషెంటుని చూసి ఆశ్చర్యపోయాడు.ఎం ఎల్ ఏ అమరనాథం.ఆయన చాలా బాధతో మెలికలు తిరుగుతున్నాడు.అతని భార్య,కొడుకు వున్నారు.అప్పటికే నర్స్ ఆయనకి ప్రాథమిక చెయ్యటంతో కొంత తేరుకున్నాడు.
నవనీత్ ని చూడగానే ఆయన గట్టిగా అరుస్తూ చెప్పాడు ‘నేను ఇక్కడ ట్రీట్ మెంట్ చేయించుకోను’ అని.నవనీత్ చెప్పాడు ‘మీ ఇష్టం.రిపోర్ట్స్ ప్రకారం మల్టిపుల్ బ్లాక్స్ వున్నాయి.వెంటనే బైపాస్ చేయాలి.మీకు ఇష్టమైన చోటే చేయించుకోండి.ఏ విషయం ఐదు నిమిషాలలో తేల్చుకోండి.’అని అతను తన గదికి వెళ్ళాడు.
అతని కొడుకు వెళ్ళి ఇక్కడే చేయించుకుంటామని చెప్పాడు.వెంటనే అనస్తీషియన్ కి ఫోన్ చేసారు.ఈ లోగా ఆపరేషన్ ధియేటర్ ఏర్పాటు చేసారు.లోపలికి వెళ్ళేటప్పుడు నవనీత్ చెప్పాడు ‘మీరేమీ భయపడ వలసింది లేదు.అంతా బాగా జరుగుతుంది.టెన్షన్ పడకండి.నన్ను ఒక డాక్టరుగానే చూడండి.’
***
‘అంతా బాగా జరిగింది.స్టంట్స్ వేసాను.ఎక్కువ ఆవేశపడకూడదు.ఆహారం సాత్వికంగా వుంటే మంచిది.ఈ పేపర్ లో వున్న పధ్ధతి పాటించండి.ఆయనకి డ్రింకింగ్,స్మోకింగ్ అలవాటుంటే పూర్తిగా మానేయాలి.అంతే.ఎల్లుండి ఇంటికెళ్ళి పోవచ్చు.దయచేసి అభిమానులు ఆసుపత్రి దగ్గర హడావిడి చేయద్దని చెప్పండి.పేషెంట్లకి ఇబ్బంది.’చెప్పాడు నవనీత్.
***
ఎం ఎల్ ఏ గారిని కలవాలంటే ముందుగా అనుమతి వుండాలి అన్నారని రెండోసారి కలిసినప్పుడు నవనీత్ ముందస్తు అనుమతి తీసుకున్నాడు.అందుకని ఆయన ఇప్పుడు అనుమతి అడిగాడు.
నిజానికి తన ఆపరేషన్ అయ్యాక వారం తరువాత నగరంలో ప్రఖ్యాత కార్డియాలజిస్టు హనుమంతుని కలిసాడు ఆయన. ఆయన పరీక్ష చేసి చెప్పాడు చాలా బాగుంది.సమస్యేమీ లేదని,నవనీత్ గురించి కూడా బాగా చెప్పాడు.
ఇంకా అతని గురించి చాలా చెప్పాడు.ప్రతి మూడో ఆదివారం పల్లెలికి వెళ్ళి గుండె పరీక్షలు చేసి,వారికి రెండో ఆదివారం శస్త్రచికిత్సలు చేస్తాడు ఉచితంగా.అందుకు రెండు ట్రస్టుల సహకారం తీసుకుంటున్నాడు.అతని సేవని గమనించి అనేక ట్రస్టులు ముందుకు వచ్చాయి.
ఆ విషయం తెలిసిన దగ్గరి నించీ అమరనాథంలో పశ్ఛాత్తాపం మొదలైంది.మొదటిది నవనీత్ స్థలం తనే కబ్జా చేసినట్టు అతనికి తెలిసినా తనకి చికిత్స చేసాడు.ఫీజు కూడా అందరి దగ్గరలాగే వసూలు చేసాడు.తనని అసలు అతనికి ద్రోహం చేసినట్టుగా చూడలేదు.పైగా అనేక మందికి ఉచిత వైద్యం అంటే మాటలు కాదు.పశ్ఛాత్తాపం తారస్థాయికి చేరింది.వెంటనే ఆ స్థలం ఖాళీ చేసి పోలీసులతోనే ఆ విషయం చెప్పించాడు.అప్పు డతనికి అనిపించింది ఆంజనేయుడే సహాయం చేస్తాడన్న నవనీత్ మాట నిజమైంది అని.
***
ఆ తరువాత తన కొడుకుతో కబురు చేసాడు.తనే ఆ స్థలంలో హాస్పిటల్ నిర్మిస్తానని,తన సంపాదనతో ట్రస్టు ఏర్పాటు చేసి,దాని నిర్వహణ,సభ్యుల ఎంపిక అంతా నవనీత్ దేననీ.నవనీత్ ఒప్పుకోలేదు.అవినీతి సంపాదన తను ముట్టనని,బేంకు లోనుతో తనే నిర్మించుకుంటానని.
అమరనాథమే వచ్చాడు ఈ సారి తన కుటుంబానికి వున్న వెయ్యి ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయం పూర్తిగా వైద్యానికే ఇస్తానని, తన అక్రమార్జన పేదలకి ఇళ్ళు కట్టించి ఇస్తానని ఇక అటువంటి సంపాదన జోలికి పోనని ఒట్టేసి చెప్పాడు. ఈ టెరం తరువాత తను పల్లెలో సాధారణ జీవితం గడుపుతానని.నవనీత్ తనకి పునర్జన్మ ఇచ్చాడని,అందువల్ల తన కోరిక మన్నించమని అతి సాధారణ వ్యక్తిలా ప్రాధేయ పడటంతో నవనీత్ ఒప్పుకోక తప్పలేదు.
అలా మూడేళ్ళ తరువాత తన తల్లి పేరున హనుమాయమ్మ హార్ట్ కేర్ సెంటర్ తన సొంత స్థలంలో ఐదంతస్తులలో సకల ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటైంది బేంకు లోనుతోనే. దాని ప్రారంభోత్సవం అమరనాథమే చెయ్యటం విశేషం.
***




No comments:
Post a Comment