పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -24
దినవహి సత్యవతి
23 వ సర్గ
రామలక్ష్మణులు, కౌశికునితో, కామాశ్రమమున నివసించుట…
353.
తెల్లవారుచుండగనే విశ్వామిత్రుడు మేల్కొనెను,
పర్ణశయనంపై శయనించిన సోదరుల చూచెను,
ప్రాతఃకాలసంధ్య వచ్చెనని వారల మేల్కొలిపెను,
సంధ్యావందనాది నిత్యకర్మలు చేయవలెననెను,
కౌసల్యాసత్పుత్ర రాముడు నరోత్తముడని బొగిడె, సత్య!
354.
కౌశికుని తేనెపల్కులకు సోదరులు మేల్కొనిరి,
స్నానమాచరించి సూర్యునకు అర్ఘ్యమునిచ్చిరి,
అత్యుత్తమమౌ గాయత్రీ మంత్రమును జపించిరి,
సంధ్యావందనాది నిత్యకర్మలు పూర్తిచేసుకొనిరి,
కౌశికునికి మ్రొక్కి తేకువగా ప్రయాణోన్ముఖులైరి, సత్య!
355.
కౌశికసహిత సోదరులు పయనము సాగించిరి,
సరయూ సంగమస్థానమందు గంగానది గాంచిరి,
అచట తపోధనులైన ఋష్యాశ్రమమును చూసిరి,
రామలక్ష్మణులదిగాంచి సంతుష్టాంతరంగులైరి,
ఆశ్రమమెవ్వరిదో తెల్పుమని కౌశికునడిగిరి, సత్య!
356.
కౌశికుడు వారికి ఆశ్రమము గూర్చి చెప్పసాగెను,
మన్మథునికి కాముడనియు పేరుండెననెను,
మూర్తిమంతుడై సశరీరుడై యుండెననెను,
దుష్టబుద్ధి కాముడచ్చోటనే నివసించెననెను,
అచ్చోటే శివుడు సమాచిత్తుడై తపస్సు చేసెననె, సత్య!
357.
అచ్చోటే శివుడు పెండ్లియూ చేసుకొనెననెను,
పిదప సురసమేతుడై బయలుదేరెననెను,
దుష్టబుద్ధితో కాముడు శివునెదిరించెననెను,
శివుడపుడు హుంకరించి క్రోధితుడై చూసెననెను,
శివుని నేత్రముచే కాముడు కాల్చివేయబడెననె, సత్య!
358.
నాటినుండి కాముడు దేహరహితుడయ్యెననె,
అటులతడు అనంగుడని ప్రసిద్ధుడైనాడనె,
అతడు అంగం వీడిన దేశం అంగదేశమైనదనె,
అదియే శివుడు తపస్సు చేసిన పుణ్యాశ్రమమనె,
ధర్మాత్ములౌ మునులు శివుని శిష్యులనె మహర్షి, సత్య!
359.
కౌశికుడు, సోదరులకు ఆశ్రమం గూర్చి తెలిపెను,
రాత్రి, గంగా- సరయూ తీరం మధ్యనే బసయనెను,
మరుసటి దినము గంగానదిని దాటుదమనెను,
స్నానజపహోమాదులు గావించుకొందుమనెను,
పరిశుద్ధులమై ఆశ్రమం ప్రవేశింతుమనె, మహర్షి, సత్య!
360.
ఆశ్రమవాసులౌ మునులు దివ్యదృష్టి కల్గియుండిరి,
కావున ముందుగనే మువ్వురి రాక తెలుసుకొనిరి,
అందుచే అమితసంతసాన ఆనందమును పొందిరి,
ముందు కౌశికునికి అర్ఘ్యపాదాలిచ్చి సత్కరించిరి,
పిదప రాకుమారులకు అతిథిసత్కారం చేసిరి, సత్య!
361.
కౌశికుడూ, సోదరులూ మునుల సత్కారమందిరి,
పిదప ఋషులేకాగ్రతతో సంధ్యోపాసన చేసిరి,
మువ్వురినీ ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళిరి,
ఆశ్రమాన మువ్వురూ సుఖముగా నివసించిరి,
సోదరులకు కథలు చెప్పి ముదంగూర్చె కౌశికుడు, సత్య!
*****




No comments:
Post a Comment