ఒకటైపోదామా ఊహల వాహినిలో-22
" ఇప్పుడు మీరే నన్ను రెండు ప్రశ్నలు వేశారు. మీ
నాన్నగారికి మీరు ఇచ్చిన మాట తప్పకూడదు... మీరు ఒక అమ్మాయిని ప్రేమించాలి... ఆ
అమ్మాయి బిడ్డని కనివ్వాలి.. కానీ పెళ్లి చేసుకోకూడదు.. పెళ్లి కాకుండా బిడ్డను
కని ఇవ్వడానికి ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. నిజంగానే మిమ్మల్ని నమ్మిన ఆ
అమ్మాయి మీ నియమానికి ఒప్పుకుని బిడ్డను కందీ
అనుకుందాం. ఆ తల్లీ బిడ్డల్ని మీరు మీ నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్ళి
చూపించారు అనుకుందాం.
'పెళ్లి కాకుండా నేను నీతో బిడ్డని
కన్నదాన్ని నా ఇంటి కోడలు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావ్ రా?' అని అడుగుతారు. ఆ అమ్మాయి అసలు నీతో బిడ్డను కన్నదో లేదో.. అని అడుగుతారు.
"
" అప్పుడు మా ముగ్గురికి డి. ఎన్.ఏ. టెస్ట్
చేయించి ఆ రిపోర్టు చూపిస్తాను.ఒప్పుకోడా?"
కోపంగా అన్నాడు విరాజ్.
" ఒప్పుకోరు బాబు . పెళ్లి కాకుండా బిడ్డను
కనడానికి ఒప్పుకుంది అంటే కచ్చితంగా అమ్మాయి నీ వెనుక ఉన్న డబ్బు కోసమే ఆ పని చేసినట్టు. నీ మీద
ప్రేమతో కాదు. ఆ దరిద్రాన్ని వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసి నేను చూసిన సంప్రదాయమైన సంబంధం చేసుకో.
అలా అయితేనే నేను నీ పెళ్ళికి అంగీకరిస్తాను " అని మీకు ఏ మాత్రం పరిచయం లేని
ఎవరో అమ్మాయిని మీకీచ్చి పెళ్లి చేసి తన
పరువు నిలబెట్టుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న మీ ఆశ నిరాశ
అయిపోతుంది. అప్పుడు మీ నాన్నగారు
మాటతప్పినట్టు కాదా?"
శకుంతల తర్కంగా ఆలోచించి వివరించిన విధానానికి విరాజ్
నిర్గాంతపోయాడు.
ఒప్పందం అనేటువంటిది ఇద్దరి మధ్య చర్చించుకున్న అన్ని
విషయాలను అంగీకరించినట్లు రాసుకున్న ఒప్పంద పత్రం. అలాంటి ఒప్పందాన్ని తనకు
అనుకూలంగా రాసుకొని తన తండ్రి తనని,
తాను ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా, తాను చూసిన సంబంధాన్నే చేసుకోవాలని బల్ల గుద్ది వాదించేలా ఎంత తెలివిగా ఇరికించాడో అర్థం చేసుకునే
సరికి అతని మొహంతెల్లగా పాలిపోయింది.
ఆ వెంటనే హరిత తనకు దూరం అయిపోతుందేమో అనే భయం అతని
మనసులో నిజంగా పడింది.
" సమాధానం చెప్పండి బాబు.పెళ్లి కాకుండానే మూడేళ్లుగా
ప్రేమించిన ఒక అమ్మాయి తో బిడ్డను కనే
ధైర్యం మీకుందా? అలా చేయడం నేరం, పాపం అనిపించడం లేదు మీకు?
ఎవరో ఎందుకు?
మీరు ప్రేమించిన అమ్మాయి హరితే కదా? హరితనే
మీరు పెళ్లి చేసుకున్నారు... బిడ్డను కన్నారు అనుకుందాం. మీ నాన్నగారే ఇంట్లోకి
రానిచ్చారని అనుకుందాం. హరిత మీ బిడ్డతో
మీ కళ్ళ ముందే మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే పెళ్లి కాకుండా మీరు చేసిన తప్పు పని
అనుక్షణం మీ ముందు సాక్ష్యంగా నిలబడి ప్రశ్నిస్తే మీరు ప్రశాంతంగా బతకగలరా?
ఒకవేళ మీరు సరిపెట్టుకున్నా మీ బంధువులు, స్నేహితులు
అందరూ ఏమంటారు?
' పెళ్లికి ముందే బిడ్డని కన్న
ఆడదాన్ని చేసుకుని దాని కొంగుపుచ్చుకుని
తిరుగుతున్నావా... మన వంశ ప్రతిష్ట సర్వనాశనం చేశావు కదరా...' అంటారు... ఇంట్లో వాళ్ళు అనకపోయినా బయట వాళ్ళు నూరి పోస్తారు. ఆ సూటి పోటీ
మాటలు మీరు పడగలరా? ఒకవేళ మీరు లేని సమయంలో అమ్మాయిని అలాంటి
మాటలతో చిత్రహింస చేస్తూ ఉంటే ఆ అమ్మాయి మీ ఇంట్లో సుఖపడగలదా?
పెళ్లంటే నూరేళ్లపంట బాబు. బొమ్మల పెళ్లి కాదు. ఆ
బొమ్మల్లో మగ బొమ్మ ఎలాగైనా నెగ్గుకు రాగలదు. మరి ఆడ బొమ్మ.. పెళ్లి చేసుకున్న
పాపానికి మట్టిలో కలిసి పోవాల్సిందే.
ఇప్పుడు చెప్పండి బాబు... ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం?" అని సూటిగా అడిగింది శకుంతల.
విరాజ్ ఆలోచనలో పడిపోయాడు.
శకుంతల చెప్పిన ప్రతి వాక్యాన్ని మళ్ళీ మనసులో
రివైండ్ చేసుకోసాగాడు.
తన ప్రవర్తనను అనుక్షణం తండ్రి గమనించి, అటు ఆడపిల్లల చేతిలో మోసపోకుండా
ఉండడం కోసం, ఇటు తన వ్యాపారానికి, తనను అండగా మార్చుకోవడం కోసం
తండ్రి ఆడిన ఒక ఆట ఇది.
అది తెలియక తాను మనస్ఫూర్తిగా ఇష్టపడి మూడేళ్ల పాటు ఒక అమ్మాయిని ప్రేమించాక పెళ్లి
చేసుకుంటాను అన్న తన కోరికను అద్భుతమైన తన వ్యాపారపు తెలివితేటలు ఉపయోగించి అగ్రిమెంటు పేరుతో తనని ఎంత దారుణంగా మోసం చేశాడో
అర్థమైంది.
కన్న బిడ్డ సుఖం కోరాల్సిన తండ్రే తన సుఖం కన్నా
డబ్బు, పరువు ప్రతిష్టల
ముఖ్యమనుకున్నాడంటే ఇంకా తనకి అతనికి విలువ ఇవ్వాల్సిన పనిలేదు తనకి.
ఇప్పుడు తను చాలా తెలివిగా వ్యవహరించవలసిన సమయం. తన
తండ్రి తన పథకాన్ని కన్నకొడుకే పసిగట్టాడు అన్న విషయాన్ని ఓటమిగా భరించలేడు. కర్ర విరగకుండా పాము చావకుండా ఎలాగైనా హరితని
పెళ్లి చేసుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనుకున్నది తన కల. ఆ కల ఎలాగైనా
నెరవేర్చుకోవాలి. కొంచెం నిదానంగా ఆలోచించుకోవాలి... తండ్రిలాగే తాను ఒక పథకం వేసి
ఎలాగైనా తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నాడు విరాజ్.
ఆ గదిలో ఒక పక్కగా కూర్చున్న హరిత పరిస్థితి కూడా
అలాగే ఉంది.
తల్లి విరాజ్ ని అడుగుతున్న ప్రతి వాక్యం హరిత మనసులో
రికార్డు అయింది.
అమ్మ ఎంత సుదీర్ఘంగా ఆలోచించింది. సమస్యని ఎంతగా
విశ్లేషించి విరాజ్ ముందు ఉంచింది?
అనుకున్న కొద్ది ఆమెకు
తల్లి పట్ల ప్రేమ గౌరవం మరింత పెరిగిపోసాగాయి.
అమ్మ ఆమెకోసం కన్నా అనుక్షణం తన సుఖం కోసం
ఆలోచిస్తోంది. అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోవడం తన ధర్మం కర్తవ్యం కూడా అనుకుని
లేచిన హరిత దాదాపుగా పది నిమిషాల్లోనే
పకోడీలు చేసి విరాజ్ కోసం హాల్లోకి
పట్టుకొచ్చింది.
కానీ అక్కడ విరాజ్ లేడు.
" విరాజ్ ఏడమ్మా? " అని హరిత అడిగిన ప్రశ్నకు
ఉలిక్కిపడిన దానిలా చూసింది శకుంతల.
" వాళ్ల నాన్నగారి గురించి వివరించి చెప్పాను కదా. అలా.. అలా ఆలోచిస్తూనే
ఉండిపోయాడు. నేను నా ఆలోచనల్లో ఉండిపోయాను. అతను వెళ్ళిపోవడం నాకు తెలియదురా
తల్లిగాడు." అంటూ ఆలోచిస్తూనే కూతురు చేతిలోని పళ్లెం అందుకుని పకోడీలు
నోట్లో వేసుకో సాగింది శకుంతల.
*********
మరునాడు ఉదయం
9 గంటలకు వచ్చి షాపు తాళాలు అడిగి తీసుకుని వెళ్లే కొడుకు రాకపోవడంతో భార్య
విశాలాక్షిని
" చిన్నోడేడి విశాల? " అని భార్యని అడిగాడు.
" ఏమోనండి... నిన్న షాప్ నుంచి వచ్చినప్పటి
నుంచి ఏదో పోగొట్టుకున్న వాడిలా చాలా డల్ గా ఉన్నాడు. పొద్దున్నే లేపడానికి వెళ్తే
ఇవాళ షాపు తీలేను అన్నాడు. " అని చెప్పింది విశాలాక్షి.
తానే విరాజ్ గదిలోకి నడిచాడు గవర్రాజు.
కాట్ మీద బోర్లా పడుకున్న విరాజ్ పక్కనే
కూర్చుని " చిన్నోడా ఏంనాన్నా?ఇవాళ ఇంకా లేవలేదు? " అంటూ వీపు మీద తట్టాడు.
" ఇవాళ షాప్ కి వెళ్లాలని లేదు నాన్న. షాపు
తీయను."
"ఏం ఎందుకని?"
" ఓ వారం పది రోజులు ఫ్రెండ్స్ అందరితోటే టూర్ వెళ్లాలని ఉంది నాన్న. నా మనసంతా చాలా
చికాకుగా ఉంది. " అన్నాడు.
" ఏమి? మళ్లీ ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా హ్యాండీచ్చిందా? "
" అవును ఎవరో పేద పిల్ల లవ్ లో ఉన్నట్టున్నావే? "
" అయితే ఎప్పటికప్పుడు విషయాలు అన్నీ
తెలుసుకుంటున్నారన్నమాట."
No comments:
Post a Comment