పుష్యమిత్ర – 09

- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మించడానికి అనువైన ప్రదేశం కోసం హిమాలయాలపైన  ఇస్రో వారు హెలికాప్టర్ల ద్వారా అన్వేషణ జరుపుతూ టవర్ నిర్మాణం లో ఎదురైన మంచును తొలగించే దశలో బయటపడ్డ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనుడు తారసపడతాడు. పుష్యమిత్రుడు సింహకేతనునితో తలపడి అతన్ని ఓడిస్తాడు. సింహకేతనుడు నగరం వదలివెళ్తాడు. అష్టసేనానులతో జరిగిన తొలి సమావేశంలోనే మహారాజుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం స్పష్టమౌతుంది. మహారాజు పుష్యమిత్రుని గత చరిత్ర గురించి చెప్పడానికి వెళ్తుండగా కోటలో జరిగిన కన్యాపహరణం, ఆమె ఆత్మహత్య సంఘటనలు పుష్యమిత్రుని దిగ్భ్రాంతికి గురి  చేస్తాయి. తన గతం గురించి చెప్తూ చతుర్వేదాలను సాంగోపాంగంగా నేర్చుకోవడానికి సుదర్శన వేదాంత భట్టు వద్దకు వెళ్ళిన విషయం,  మళ్ళీ గతంలోకి వెళ్ళి ఫ్ల్యాష్ బాక్ ద్వారా  చెప్పడం అరంభిస్తాడు. (ఇక చదవండి).
 అలా పది సంవత్సరాలు గడిచాయి. "నాయనా! పుష్యమిత్రా.. ఆ పరాత్పరుని దయవల్ల నీ విద్యాభ్యాసం నిర్విఘ్నంగా కొనసాగింది. ఒక్క సామవేదమే గాక నాలుగు వేదాలు, వేదాంగాలు నీకు కరతలామలకమయ్యాయి. నాకు నీవంటి శిష్యుడు లభించడం ఆ దేవ దేవుని కృపయే! ఇక నీవు మీ దేశానికి తిరిగి వెళ్ళి హైందవ మతోద్ధరణకు పాటుబడ వలసిన సమయం ఆసన్నమయింది" అని సుదర్శన భట్టు అనగానే నమస్కరించి.."ఆచార్యా అవశ్యం! దానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను" అన్నాడు. "మంచి రోజు చూసి మీ సౌరాష్ట్ర దేశానికి పంపుతాను" అని చెప్పి అప్పటివరకూ.."తోటి విద్యార్ధులకు వేదపఠనానికి సహాయకునిగా ఉండు. వచ్చే వారం మా గురువుగారు కాశ్మీరదేశం నుండి ఇక్కడికి విచ్చేయనున్నారు. వారి ఆశీర్వాదం తీసుకున్నాక నీ ప్రయాణ సన్నాహం సాగుతుంది" అని భట్టు అనగా వారం రోజులు ఇట్టే గడిచిపోతాయి.
*  *  *
"వేదాంత భట్టాచార్యుల వారికి స్వాగతం...సుస్వాగతం.. అంటూ  సగౌరవంగా ఆహ్వానం పలికారు సుదర్శన భట్టు ఆయన శిష్యబృందం. ఆ చుట్టుప్రక్కల ఉన్న గొప్ప గొప్ప క్షేత్రాలను దర్శించి.. పుణ్యనదులలో స్నానమాడి పరమానంద భరితులై తమ స్వస్థలానికి వెళ్ళదలచి “సుదర్శనా తగు ఏర్పాట్లుచెయ్యి" అనగా.. ఆయన ఆ ఏర్పాట్లలో ఉన్నాడు.
ఆశ్రమంలో అటూ ఇటూ తిరుగుతూ..ఒక చెట్టు క్రింద ఋగ్వేదాన్ని బోధిస్తున్న పుష్యమిత్రుడిని చూసారు వేదాంతుల వారు. ఋగ్వేదం గొప్పదనం గురించి వివరిస్తున్నాడు పుష్యమిత్రుడు తోడి శిష్యులకు "ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాథలుగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని దశమ మండలంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది. ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదం. వర్షాలు పడాలంటే పర్జన్య సూక్తాలు పఠించాలని సూచింప బడింది. ఈవిషయాలన్నీ గురువుగారు మనకు నిత్యం చెప్తున్నవే!" అంటూ కొనసాగిస్తూ "ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వినీసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి. ఇంకా.. అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.  శుదర్ణ లో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. (నేటి టెలిఫోను ను పోలిన వర్ణన)  “క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం” అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. అలాగే పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం" మొదలైన మంత్రాలలో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి. ఇవి మీరు క్షుణ్ణంగా నేర్చుకోవాలి. నిద్రించే సమయంలో తప్ప మిగతా సమయమంతా  ధారణలోనే ఉండాలి". ఈ శ్లోకం వినండి.
“ తత్త్వాయామి బ్రహ్మణా వందమాన - స్తదా శాస్తే యజమానో హవిర్భి:/అహేళ మానో వరుణేహ బోధ్యు - రుశంస మా న ఆయు: ప్రమోషీ:”
అందరిచేత వేదం సుశ్రావ్యంగా వల్లె వేయిస్తున్నాడు పుష్యమిత్రుడు.  ఆనంద పులకితుడై.. "సుదర్శనా! ఓ సారి ఇటు రా!" అని పిలిచి.  "ఎవరా బాలుడు నిండా పదహైదు సంవత్సరాలు లేవు. ఎంత సుగాత్రంగా పిల్లల చేత వల్లె వేయిస్తున్నాడు." అనగా.. భట్టు "ఆ అబ్బాయి పేరు పుష్య మిత్రుడు. ఏక సంధాగ్రాహి. అతను సౌరాష్ట్ర దేశం నుండి నుండి వచ్చాడు. వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, తర్క వేదాంత మీమాంసలు  క్షుణ్ణంగా 10 సంవత్సరములలోపే అభ్యసించాడు. ఇంక నేర్చుకునేందుకు నా వద్ద ఏమీ మిగలలేదు. నేడో రేపో వారి స్వస్థలానికి చేర్చడం నా బాధ్యత. బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు ఎలానూ ఉన్నాయి. వార్తికం రాసే యోచనలో ఉన్నాడు" అనగానే.. "వాని జాతకం నీవద్ద ఉందా?" అని అడిగాడు. వెంటనే గుర్తొచ్చిన సుదర్శన భట్టు లొనికి వెళ్ళి జాతకం తీసుకుని వచ్చి ఇచ్చాడు. పరిశీలించిన వేదాంత దేశికులు “ సుదర్శనా! ఈతనిది సామాన్య జాతకం కాదు. ఈ దేశాన్ని ఏలే చక్రవర్తి జాతకం" అన్నాడు. "నిజమా?" ఆశ్చర్య పోయాడు సుదర్శనులవారు. "
శుక్రరవిబుధకేతు
లగ్నం, గురు
రాశి చక్రముచంద్రుడు
పుష్య మిత్ర
అంగారక
రాహుశని
సుదర్శనా! ఒక జాతకాన్ని చూడగానే అది మామూలు జాతకమా లేక దివ్యపురుషుని జాతకమా అనే విషయం వెంటనే బోధ పడుతుంది. ఐదు గ్రహాలు తమ తమ ఉచ్చ లో ఉండగా కర్కాటక లగ్నంలో, వాక్పతి చంద్రునితో కలిసి ఉండగా జన్మించాడు. గజకేసరి, హంస, రుచక, శశ మహాపురుష యోగాలు ఇతని జీవితం లో ఉన్నాయి. ఏమీ ఋజువు అక్కరలేదు. ఈ రవిని చూసావా పదింట ఉచ్చ వలన ధర్మ పరిపాలన చేసే చక్రవర్తి యనీ..రాజ భోగాలు అనుభవింపదగిన వాడని తెలుస్తోంది.
"సుదర్శనా! ఒక మాట ఇతన్ని వేదవేదాంగాలకు కట్టిపడవేయ తగదు. ఇతనికి ఇతడు అఖిల శాస్త్ర పారంగతుడే గాక నిఖిల శస్త్రాస్త్ర కోవిదుడూ కావాలి. ఇతన్ని వాని దేశానికి పంపించుట తగదు. ఓ మారు అతన్ని పిలువు. మాట్లాడదాం." అనే సరికి గురువు సైగను గ్రహించి వారికి కొన్ని పనసలు ఇచ్చి వల్లె వేయమని చెప్పి వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. దేశికులవారు చెప్ప సాగారు. "నాయనా పుష్యమిత్రా! బౌద్ధ, జైన మతాల ధాటికి నానాటికీ అణగారి పోతున్న హైందవ మతాన్ని పునరుద్ధరించవలసిన సమయం వచ్చింది. నీవు ప్రస్తుతం ఇంటికి వెళ్ళక కొన్ని సంవత్సరముల పాటు శస్త్రాస్త్ర విద్యలు నేర్వవలసి యున్నది" అనేసరికి పుష్యమిత్రుడు "అవశ్యం గురోత్తమా! అదేశించండి! నేను ఏమి చేయాలో! " అన్నాడు. ఆనందపరవశులైన భట్టులు వానిని కళింగ దేశంలో భారత దేశంలోనే పేరు పొందిన "దేవాపి మహర్షి" వద్దకు పంపడానికి సుముహుర్తం నిశ్చయించారు.
*  *  *
దేవాపి మహర్షికి నమస్సుమాంజలి. నా పేరు పుష్యమిత్రుడు. నేను సుదర్శన భట్టారకుని శిష్యుడను. వారు ఇచ్చిన లేఖ మీకు సమర్పిస్తున్నాను అని లేఖను అందజేసాడు. లేఖను చదివిన దేవాపి చిరునవ్వుతో "నాయనా.. నేను ధనుర్విద్య, కత్తి సాము, శూల యుద్ధం వంటి విద్యలను నీకు ఐదారు సంవత్సరాలలో నేర్పింప గలను". నీ అసాధారణ ధారణ శక్తిని గురించీ, జాతక విశేషాల గురించీ.. ఇతరత్రా నాకు ఉత్తరం లో వివరంగా రాశారు. నీవు అనతి కాలంలో భారత దేశం గర్వించదగ్గ వ్యక్తివి కాగలవు. "తమ ఆశీర్వాదం గురువర్యా!" అని సాష్టాంగ నమస్కారం చేసాడు పుష్యమిత్రుడు.
*  *  *
మొదటగా నీకు ధనుర్విద్యా రహస్యాలను బోధింపవలసి ఉంది. నీవు  మన భారత దేశ అస్త్ర విద్యల పరాక్రమం గురించి తెలుసుకోవాలి. యవన సామ్రాట్ అలెగ్జాండర్ పై పురుషోత్తముని కోట బురుజు మీద నుండి ఒక  సామాన్య సైనికుడు వేసిన బాణం వల్లే మరణించాడు. అంతటి శక్తి మన ధనుర్విద్యకు ఉంది. అంతటి ప్రపంచ విజేత ఒక సైనికుని చేతి బాణం వల్ల మరణించాడనేది నమ్మ శక్యం కాని విషయం.  ఏకలవ్యుడు బొటనవేలు గురుదక్షిణగా ఇచ్చినందువల్ల ధనుర్విద్యను కోల్పోయాడని పురాణాలు చెప్తున్నాయి. కానీ షుంగ్-నూ (మంగోలియా దేశపు క్రీస్తు పూర్వపు పేరు) దేశస్తులు వేలికీ మధ్యవేలుకూ మధ్యలో పట్టుకుని శరసంధానం చేస్తారు.  ఏకలవ్యుడు ఆవిధంగా మళ్ళీ విద్యను నేర్చుకుని, తర్ఫీదు పొంది వుంటే విషయం మరోలా వుండేది. అన్ని దేశాలలో ప్రజలు ఏవిధంగా విలువిద్యను ప్రదర్శిస్తారో ఆ రహస్యాలను బోధించాడు. ఆకాశం లో యెగురుతున్న పక్షి ని కొట్టడం, వెనువెంటనే పంగాలు కర్ర (బూమ్ర్యాంగ్) లాంటి వస్తువును వేసి ఆ పక్షినీ ఆ పంగాలు కర్రను తనవద్దకు రప్పించుకోవడం వంటి విద్యలు ఎన్నో నేర్పాడు మహర్షి.
కత్తి సాము, గుర్రపు స్వారి, ఒకే సారి రొండు గుర్రాలపై రొండు కాళ్ళను ఉంచి స్వారి చెయ్యడం వంటి గొప్ప విద్యలు ఎన్నో నేర్చుకున్నాడు. బల్లెం విసరడం అనే విద్య మాత్రం తిరుగులేనట్టి విద్యగా నేర్పి చివరగా మర్మకళ నేర్పడానికి మళయాళ దేశం నుంచీ వచ్చిన "ఉత్తం తిరునాళ్ మార్తాండ వర్మ" వద్ద నేర్పించాడు. కానీ ఆ కళను కేవలం ప్రాణాపాయం వచ్చినప్పుడే శతృవు మీద ప్రయోగించాలని చెప్పాడు.
*  *  *
“నాయనా పుష్యమిత్రా! నీ శస్త్రాభ్యాసం ముగిసినట్టే! నాకు నీ విద్యాభ్యాసం ఎంతో సంతృప్తి కలిగించింది. సుక్షత్రియులైన రాజ వంశీయులు సైతం పది సంవత్సరాలలో నేర్చుకునే సర్వ విద్యలనూ కేవలం ఐదు సంవత్సరాలలో కైవసం చేసుకున్నావు. మీ గురువు భట్టాచార్యుల వారి కోరిక ప్రకారం నీ జీవితం ప్రారంభించు. ప్రాణాపాయ, విపత్కర పరిస్తితులలో తప్ప మర్మకళను వాడవద్దు. వినోదం కోసం నీ విద్యలు ప్రదర్శించకు. బ్రాహ్మణులకు ఎవ్వరూ శతృవులు ఉండకూడదు. ఎవరైనా నీ మీద అకారణ ద్వేషం చూపినా నీవు మాత్రం ద్వేషం వహించక.. స్థితప్రజ్ఞత చూపాలి. మరీ తప్పని సరి పరిస్తితులలో, దేశ ప్రజల రక్షణ  సమయాలలో, రణరంగంలో మాత్రం ఎవరినైనా సంహరించవచ్చు... పాపం అంటదు. ఈ నియమాలను అతిక్రమించనని నాకు మాట ఇవ్వు.  బృహద్ధ్రధ చక్రవర్తి   మహాసైన్యాధికారి హస్తినాపురిలో హఠాన్మరణం చెందారని మొన్ననే మాకు వార్త అందింది. నీవు మీ సౌరాష్ట్ర దేశానికి వెళ్ళి తల్లిదండ్రులను కలిసి వారి అశీర్వాదం తీసుకుని బృహద్ధ్రధ మహారాజును కలిసి నీ అభీష్టం తెలియజేయి.  నిన్ను పోటీలో జయించే వాడు ఉంటాడని నేను అనుకోను. జయోస్తు వెళ్ళిరా! ఈ గుర్రాన్ని నీవు నా కానుకగా నీవు మీ దేశానికి తీసుకెళ్ళవచ్చు! మన సనాతన ధర్మమైన హిందూ ధర్మాన్ని పరిరక్షించి యజ్ఞ యాగాదులను పునరుద్ధరించి, హైందవ మతానికి మరల ఉజ్జ్వల భవిష్యత్తు తేగలవని విశ్వసిస్తున్నాను.” పుష్యమిత్రుడు సాష్టాంగ నమస్కారం చేసి గురువుదగ్గర సెలవు తీసుకుని సౌరాష్ట్రకు బయలుదేరాడు.
*  *  *
ఇదీ నా కధ మహారాజా అని చెప్పి, రాత్రి చాలా పొద్దు పోయింది, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అని పల్లకీ ఎక్కి వెళ్ళిపోయాడు పుష్యమిత్రుడు. మౌర్య వంశం బౌద్ధానికే కట్టుబడింది. పుష్యమిత్రుడు హిందూ ధర్మ సంరక్షణ అంటాడు. రెండు విరుద్ధ భావాలు ఎలా కుదురుతాయి ? అనుకుంటూ విశ్రాంతి కోసం శయన మందిరానికి వెళ్తుండగా.. పుష్యమిత్రుడు మహారాజు దుర్వ్యసనాలు, దుబారా ఖర్చులు మానిపించడం ఎలా అని అలోచిస్తూ సాగుతున్నాడు. (సశేషం)
*  *  *

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top