పుష్యమిత్ర -4 - అచ్చంగా తెలుగు

పుష్యమిత్ర -4 

టేకుమళ్ళ వెంకటప్పయ్య 


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మించడానికి అనువైన ప్రదేశం కోసం హిమాలయాలపైన  ఇస్రో వారు హెలికాప్టర్ల ద్వారా అన్వేషణ జరుపుతూ ఉండగా గమనించిన పాకిస్థాన్ ప్రభుత్వం, బార్డర్లో జరుగుతున్న హడావిడి ఏమిటొ తెలుసుకోమని, కరిముల్లా అనే అండర్ కవర్ ఏజెంటును నియమిస్తారు. కరిముల్లా చెప్పిన మాటలు నమ్మక అతని కూపీ లాగడానికి బయల్దేరిన జిలానీ బాషాని సుమంత్ అనే  ఇండియన్ అధికారి అడ్డగించి ఆర్మీ కి అప్పజెబ్తాడు. హిమాలయాలలోని శంబాలా అనే ప్రాంతం గురించి ఆర్మీ షెర్పా చెప్పిన మాటలు విన్న కనిష్కవర్ధన్ ఆశ్చర్యపోతాడు. టవర్ నిర్మాణం లో ఎదురైన అడ్డంకులను అధిగమించేందుకు స్థానిక ఇంజినీర్ల సహాయం అడుగుతాడు కనిష్కవర్ధన్. ఇక చదవండి.
 "అయాం నీల్ లోహిత్.. ఛీఫ్ ఇంజినీర్ ఫ్రం ‘డ్రిల్ రాక్ ఇంజినీరింగ్’ “  అన్నమాటలకు ప్రాజెక్టు  ప్రోగ్రెస్ రిపోర్ట్ ల్యాప్ టాప్లో  టైప్ చేస్తున్న కనిష్క వర్ధన్ తలెత్తి చూచి చిరునవ్వుతో.. అతనికి షేక్ హాండ్ ఇచ్చి  "మిస్టర్ నీల్ లోహిత్.. అయాం కనిష్కవర్ధన్.. ఫ్రం ఇస్రో.. మాకు ఒక పోల్ ను రాక్ లో 50 అడుగుల లోతు దింపాలి.  రాక్  పైన దాదాపు  వంద  మీటర్ల మేర ఐస్ గడ్డకట్టి ఉంది. ఆ ఐస్ ను తొలగించి..పోల్ ను ఫిక్స్ చెయ్యాలి.. అని ప్రాబ్లం ను వివరించి.. ఆ ప్రాంతాన్ని చూపాడు.   "కనిష్కాజీ ఐస్ ను ఫేజ్డ్ మానర్ లో తొలగించాలి. ట్రిప్ కు 5 అడుగులు తొలగించాలి. అలా మనం 20 సార్లు చెయ్యాలి.  దీనికి 20 గంటల సమయం పడుతుంది. మనం ఈ రోజు మొదలెడితే రేపు ఈవెనింగ్ లోపు అయిపోతుంది. మనకు " లార్జ్ ఆటో ఐస్ రిమూవల్ సా ఎక్విప్మెంటు" కావాలి అది మా వర్క్ షాప్ లో ఉంది. వెయిట్ సుమారు రెండు టన్నుల వెయిట్ ఉంటుంది. మీ హెలికాప్టర్ ద్వారా తెప్పించ గలరా?" అనగానే కనిష్క ష్యూర్ అని వివరాలు ఫోన్లో చెప్పాడు. రెండు గంటల్లో హెలికాప్టరు "సర్క్యులర్  సా మెషీన్" తో వచ్చింది.   పని ప్రారంభమయింది. దశల వారీగా ఆరోజుకు 40 అడుగులు తొలగించ గలిగారు.
మరుసటిరోజు ఎలాగైనా ఆ పని ముగించాలన్న పట్టుదలతో ఉదయం 8 గంటలకే పని ప్రారంభించారు. కనిష్క టెంట్ లో తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. 10 అడుగులు తొలగించాక, నీల్ లోహిత్ "మిస్టర్ కనిష్కా ప్లీజ్ కం అర్జెంట్"  అని ఎస్.ఎం.ఎస్ పెట్టాడు. వెంటనే వచ్చిన కనిష్క "వాట్ హాపెండ్? ఎనీ ప్రాబ్లం?" అని అడిగాడు. "ఎస్. ఇక్కడకు రండి... ఈ మంచు లో ఒక అడుగు లోతులో ఏదో పెద్ద వస్తువు ఎర్రగా మెరుస్తూ కనిపిస్తోందా మీకు?" "ఎస్. ఏమిటో పొడుగ్గా గొట్టం లాగా ఉంది. దాన్ని మనం దెబ్బ తినకుండా బయటకు తీయాలి మిస్టర్ నీల్ ప్లీజ్ ". అలాగే!  బట్ వుయ్ ఆర్ టేకింగ్ రిస్క్.  ఇట్ మే బీ ఎక్స్ ప్లోజివ్ ఆల్సో.. వుయ్ షుడ్ బి వెరీ కేర్ ఫుల్.  అందుకే మీకు చెప్తున్నాను. బాంబ్ డిటెక్టింగ్  స్క్వాడ్ ను పిలిపించగలరా?" అనగానే కనిష్కా "యెస్. వాళ్ళు వచ్చే వరకూ మనం వెయిట్ చేద్దాం" అని ఫోను చేసి నలుగురి టీం ఉన్న స్క్వాడ్ ను పిలిపించాడు. వారి సమక్షం లో మెల్లిగా ఆ వస్తువు ఏమిటి అని పరిశీలిస్తూ జగ్రత్తగా బయటకు తీయ సాగారు. మంచు లోపల చిన్న వస్తువు గా కనబడ్డా అది 8 అడుగుల పొడవు..4 అడుగుల వ్యాసార్ధం ఉన్న కాపర్ మెటల్ తో చేయ బడ్డ ఓ క్యాప్సూల్ లాంటి గొట్టం. బాంబ్ డిటెక్టింగ్ స్క్వాడ్ సాయంతో బయటకు తీసి పరీక్షించారు. దానిలోపల బాంబులు, ప్రేలుడు పదార్ధాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించిన తర్వాత దానిలో బాంబ్ కానీ ఆర్.డీ.ఎక్స్ మెటీరియల్ కానీ ఏమీ లేదని ధృవ పరుస్తూనే అందులో ఏదో జీవ పదార్ధం ఉందని చెప్పగానే ఆశ్చర్యపోయాడు కనిష్క. జీవ పదార్ధం అంటే జీవరసాయన ఆయుధాలా? లేక  ఏ ఇతర గ్రహాల నుండి వచ్చిన జీవుల తాలూకు వ్యవహారమా? అని అలోచిస్తూ..దాన్ని పరీక్షగా చూడగా దానిపై దేవనాగరి లిపి లో "సత్యమేవ జయతే" అని కనిపించింది. ఐతే ఇది ఇతర గ్రహాల వాళ్ళది కాకపోవచ్చుననుకుని అర్మీ చీఫ్ కు ఫోన్ చేసి "సర్. వెరీ ఇంపార్టంట్ మాటర్. వుయ్ హావ్ ఐడెంటిఫైడ్ వన్ టైం క్యాప్స్యూల్ లైక్ మెటీరియల్ అండర్ ది ఐస్.  అవర్ ప్యూపిల్ కంఫర్మడ్ దట్  ఎ లివింగ్ బాడీ ఇన్సైడ్" ఆ మాటలు వినగానే  అర్మీ చీఫ్.. "మై గాడ్" వెంటనే బాంబ్ స్క్వాడ్ తో ఆ కాపర్ క్యాప్స్యూల్ ను హెలికాప్టర్ లో ఇక్కడికి ఇమ్మీడియట్ గా చేర్చండి." బై అని పెట్టేసాడు. మరో పది నిముషాల్లో ఆ క్యాప్స్యూల్ తో సహా బాంబ్ డిటెక్టింగ్ స్క్వాడ్ వెనుదిరిగింది. కనిష్క బృందం వూపిరి పీల్చుకుని మళ్ళీ తమ పనిలో నిమగ్నమయ్యారు.
*  *  *
ఆర్మీ చీఫ్ వెంటనే డిఫెన్సు మినిస్టర్ కు చెప్పగా..ఆయన ప్రైం మినిస్టర్ కు ఇన్ఫాం చేయగా వారు హుటాహుటిగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం గనుక నేవల్ చీఫ్, ఎయిర్ఫోర్సు చీఫ్ కూడా అక్కడ హాజరయ్యారు. ఈ లోపు క్యాప్స్యూల్ తో హెలికాప్టర్ అక్కడకు చేరుకుంది. చాలా జాగ్రత్తగా కిందికి దింపి పరిశీలించి మొదట దాన్ని ఓపెన్ చెయ్యకుండా స్కానింగ్ చేసి లోపల ఏముందో తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్న మీదట, అందరూ ఆర్మీ హాస్పిటల్ కు చేరారు. అందరిలో ఉత్కంఠత.  లోపల ఏముందో అని. చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్కానింగ్ ధియేటర్ లోకి నలుగురు మనుషుల సాయం తో క్యాప్స్యూల్ ను పంపాడు. రిపోర్టు ఏమిటా అని అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఓ అరగంటకు మెడికల్ చీఫ్ బయటకు వచ్చి.. ఓ రిపోర్ట్ అందించాడు. అందులో లోపల ఏడడుగుల పొడవు గల ఓ బలిష్టమైన ఆకారం ఉందనీ...అది అచేతనం గా ఉండడం వల్ల ప్రాణంతో ఉందో లేదో నిర్ధారించలేక పోతున్నామని, ఆకారాన్ని బట్టి ప్రాధమికంగా హొమోసెపియన్ (మనుష్య జాతికి చెందిన జీవి) గా అనుకోవచ్చుననీ.. క్యాప్స్యూల్ పైన దేవనాగరి లిపిలో..  “సత్యమేవ జయతే” అని ఉండడం తో అది విదేశీయుల పని అయి ఉండకపోవచ్చునని కన్ క్లూడ్ అవుతూ.. దాన్ని బయటకు తీయిస్తే పూర్తి రిపోర్టు ఇవ్వగలమని ఉంది.
*  *  *
సుదీర్ఘ చర్చల అనంతరం మరుసటిరోజు ఉదయం 10 గంటలకు ఓపెన్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. ఐతే..హోమోసెపియెన్ కాకుండా అందులో ఏదైనా భయంకరమైన  డయినోసార్ లాంటి జీవి ఉన్నట్లైతే దాన్ని ఎదుర్కునేందుకు చుట్టూ మిలిటరీ వాళ్ళను ఏ.కే 47 గన్స్ తో నిలబడేట్టు ఏర్పాటు చేసుకున్నారు.   పక్కరోజు ఉదయం అనుకున్న టైం షెడ్యూల్ ప్రకారం అందరూ చేరుకున్నారు. సమయం ఉదయం గం.9.45 ని. అయింది. హాస్పిటల్ అండర్గ్రౌండ్ లో సెల్లార్ లాంటి ప్రాంతం లో ఆ క్యాప్స్యూల్ ను ఓపెన్ చెయ్యడానికి నిర్ణయించుకుని, చుట్టూ సాయుధ బలగాలనుంచారు. క్యాప్స్యూల్ పైన ఉన్న రాగి రేకు మాత్రమే కట్ అయ్యే అడ్వాన్స్డ్ లేత్ మెషీన్లను ఏర్పాటు చేసారు. సీ.సీ కెమేరాల ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుండి చూస్తూ..ఆదేశాలిచ్చేందుకు సైంటిస్టులు, టెక్నికల్ బృందం, డాక్టర్లు, సాంకేతిక సలహాదార్లు, మిలిటరీ అధికార్ల బృందాలను ఉంచారు. ఎంతో ఉత్కంఠతగా అందరూ ఎదురు చూస్తుండగా ఆపరేషన్ 10 గంటలకు "ఆపరేషన్ టైం క్యాప్స్యూల్" ప్రారంభమయింది.
మిలిటరీ లెఫ్టినెంట్ జనరల్ ఆధ్వర్యం లో జరుగుతున్న ఆపరేషన్ అది. రాగి రేకును చాలా సున్నితంగా ఏమాత్రం లోపలి పదార్ధం దెబ్బ తినకుండా కట్ చేయడానికి ఐ.ఐ.టీ మెకానికల్ ఇంజినీర్ల బృందం రెడీ అయ్యారు. జనరల్ "స్టార్ట్" అన్న మాట వినగానే ఆపరేషన్ ప్రారంభమయింది. వెంట్రుక వాసి గాటు పెట్టి రాగి రేకుకు సున్నితంగా విడదీసారు. మెషీన్ పై భాగాన అమర్చిన సీ.సీ కెమేరాలను క్లోజప్ జూం చేసారు. అందరూ లోపల ఉన్న పదార్ధం చూడడంలో నిమగ్నమయ్యారు కానీ...అది తెరుచుకోగానే.. గుప్పెడు ఊదా రంగు వాయువు బయటికి వచ్చి అనంత వాయువుల్లో కలిసి పోవడం ఎవ్వరూ గమనించలేదు దగ్గరగా ఉన్న ఓ సైనికాధికారి తప్ప. అయితే ఆయన ఆ విషయానికి ప్రాముఖ్యం ఇచ్చి వెంటనే చెప్పిఉన్నట్లైతే ఎంతో విలువైన సమాచారం వెలుగులోకి వచ్చేది.
అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. లోపల కోమా లో ఉన్నట్టుగా అచేతనంగా ఓ భారీ కాయుడు. ఏడడుగుల పొడవు. ఆ శరీరం కనీసం 150 కే.జీల బరువు ఉండవచ్చు. రాజులను పోలిన కేశాలు. వస్త్రధారణ మాత్రం సద్బ్రాహ్మణ వంశీయులవలె ఉంది. మెడలో  జ్యంధ్యం ఉంది. ప్రాణం తో ఉన్నదీ లేనిదీ తెలీదు.
అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. హాస్పిటల్ చీఫ్ దాన్ని ఒక స్ట్రెచ్చర్ లో స్కానింగ్ ధియేటర్ కు పంపమని అదేశాలిచ్చారు. అందరూ యధా స్థానాలకు వెళ్ళిపోయారు.
*  *  *
కనిష్క వర్ధన్ ఈ విషయం తెలుసుకుని ఆ బాడీ ఎవరిది? ఎందుకలా టైం క్యాప్స్యూల్ లో ఉంచాల్సి వచ్చింది అని అలోచనలో పడతాడు. అనుకున్న విధంగా తన పనులను పూర్తిచేసుకుని శ్రీహరికోట కు వెళ్ళిపోతాడు. ఇక ఎరక్షన్ బృందం వారు "గ్లోబల్ ఐ" ని టవర్ పై  మాగ్నెటిక్ ఫీల్ద్ యాక్సిస్ లో నిలిపి తమ పనిని పూర్తి చేసుకోవాల్సి ఉంది.
*  *  *
అది అత్యాధునిక వసతులున్న ఆర్మీ హాస్పిటల్. చీఫ్ ఆదేశాలమేరకు బాడీ ని సీ.టీ. స్కానింగ్ మెషీన్ లోకి పంపి టెస్టులు చేస్తున్న రేడియాలజిస్ట్ అతని గుండె చాలా మెల్లిగా కొట్టుకుంటూ ఉండడం గమనించి షాక్ కు గురయ్యాడు. ఓ నిముషం ఏమీ తోచలేదు. దీన్ని డెడ్ బాడీ అని చెప్పారు. లోపలి ఆర్గాన్స్ ఏవైనా పనికి వస్తాయా అని మాత్రమే టెస్ట్ చెయ్యమన్నారు. కానీ ఈ వ్యక్తి చనిపోలేదు. బతికే వున్నాడు. దాదాపు కోమా లేక హైబర్నేషన్ స్టేట్ లో. వెంటనే హాస్పిటల్ చీఫ్ కు ఫోన్ చేసాడు.  "సర్. ది బాడీ ఈస్ నాట్ డెడ్. ఇట్ ఈస్ స్టిల్ హావింగ్ లైఫ్." చీఫ్ "మై గాడ్! ఫెంటాస్టిక్! నేను అక్కడకు వస్తున్నాను." నిముషాల్లో అక్కడకు చేరుకుని స్క్రీన్ మీద పరిశీలించగా గుండె నిముషానికి 12 సార్లు మాత్రమే కొట్టుకుంటూ ఉండడం గమనించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇంత నిదానంగా గుండె కొట్టుకునే వాళ్ళు బ్రతికి ఉండడం సాధ్యమా అని అడిగిన రేడియాలజిస్టు ప్రశ్నకు ఈ లోకం లోకి వచ్చాడు చీఫ్. "ఎస్. పాజిబుల్.. దీజ్ ఆర్ కాల్డ్  మెడికల్ వండర్స్. నీకో విషయం చెప్పాలి. ఇంతవరకూ హిస్టరీలో  నిముషానికి 30 నుండి 35 సార్లు హార్ట్ బీట్ ఉన్నవాళ్ళ గురించి మెడికల్ రికార్డు ఉంది. ఐతే ఆ తర్వాత నిముషానికి 26 సార్లు హార్ట్ బీట్ ఉన్న బ్రిటీష్ వ్యక్తి పేరు డేనియల్ గ్రీన్. ఆయన వయసు 80 పైచిలుకు సంవత్సాలు.  రోజూ ఎక్సర్సైజులు గట్రా చేస్తున్న వ్యక్తి. నిముషానికి 26 సార్లు హార్ట్ బీట్ అన్న విషయం నిర్ధారించుకోవడం కోసం 24 గంటలపాటు అతన్ని ఈ.సీ.జీ మెషీన్ తో పరీక్షలు చేసారు. గత నలభై సంవత్సరాలుగా ఆయన ఏ హాస్పిటల్ మొహం చూడలేదు అంత ఆరోగ్యవంతుడాయన. అలా మెడికల్ వండర్స్ జరుగుతూనే ఉంటాయి ప్రపంచం లో. దానికి ఈ మనిషే ఉదాహరణ.  పూర్తిగా పరీక్షించి రిపోర్ట్ తీసుకుని రండి. అబ్జర్వేషన్ లో ఉంచండి." అని చెప్పి వెళ్ళిపోయాడు చీఫ్. కానీ శ్వాస పూర్తిగా బంధించబడింది. ఇలాంటి "యాప్నియా" స్టేజ్ లో మనిషి సజీవుడా! నిర్జీవుడా! లేక బ్రెయిన్ డెడ్? నిర్ధారించలేక పోతున్నందుకు తన సర్వీసు లోనే సవాల్ గా తోచింది రేడియాలజిస్ట్ కు. జంతువుల్లాగా మనిషి దీర్ఘ కాలం నిద్రావస్థ (హైబర్నేషన్) లో ఉండడం దుస్సాధ్యం. మెడికల్ హిస్టరీ లో పీటర్ స్కిల్బెర్గ్ అనే స్వీడిష్ ఆటగాడు మంచు లో కప్పబడిపోయి రెండు నెలల తర్వాత బయట బడ్డాడు. అదే హ్యూమన్ బీయింగ్స్ లో అతి పెద్ద హైబర్నేషన్.  ఏది ఏమైనా గాడ్ ఈస్ గ్రేట్ అనుకుంటూ... పరీక్షలు అయ్యాక అతను సజీవుడని, ఆక్సిజెన్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ద్వారా తీసుకోకపోయినప్పటికీ, ఎప్పుడైనా లేచే అవకాశం ఉందని రిమార్కు రాసి స్పెషల్ క్రిటికల్ ఐ.సీ.యూ కు తరలించాడు.
*  *  *
మరుసటి రోజు ఉదయం 11 గంటలు. అప్పటికి  స్పెషల్ క్రిటికల్ ఐ.సీ.యూ లో ఉంచి సరిగ్గా 24 గంటలైంది. స్పెషల్ రూం లో పైన దేదీప్యమానమైన వెలుగులు. ఇంద్రభవనాన్ని తలపించే గది అది.  కేవలం వీ.వి.ఐ.పీ లకు మాత్రమే ఉపయోగించే గది.  ఆ గదిలో తెల్లటి వెలుగులతో విచిత్రమైన కేశాలంకరణతో ఉన్న ఓ అస్పష్టమైన మనిషి ఆకారం వచ్చి నిల్చుంది. దీర్ఘ నిద్రలో ఉన్న అతని హృదయస్థానం పై తడిమి, ముక్కుపై మూడు సార్లు మెల్లిగా రాచి, ఆకాశం వేపు అరచేతులు చూపి ఏవో మంత్రాలు అస్పష్టంగా ఉచ్చరించిన తర్వాత,  "పుష్యమిత్రా! నీవు లేవవలసిన తరుణం ఆసన్నమైంది! లే! ” అన్న మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూచింది ఆ ఆకారం.   అలా కళ్ళు తెరవడం  సీ.సీ టీవీల్లో క్లోజ్ గా గమనిస్తున్న డాక్టర్లకు కేవలం అతను కళ్ళు తెరవడం మాత్రమే కనిపించింది.  డాక్టర్లు  హాస్పిటల్ చీఫ్ కు ఆ కబురందించి కంగారుగా ఐ.సీ.యూ కు పరుగులు తీశారు.  (సశేషం)
*  *  *

No comments:

Post a Comment

Pages