బాపు స్టోరీ బోర్డ్ (నెవర్ బోర్డ్...! ఎవర్ లాస్టింగ్ స్టోరీ!!) - అచ్చంగా తెలుగు

బాపు స్టోరీ బోర్డ్ (నెవర్ బోర్డ్...! ఎవర్ లాస్టింగ్ స్టోరీ!!)

Share This

బాపు స్టోరీ బోర్డ్ (నెవర్ బోర్డ్...! ఎవర్ లాస్టింగ్ స్టోరీ!!)

- సుధామ

అలవోక గీచిన గీ తలు మురువులు - చిత్రలక్ష్మి తలమానికముల్ పలుకులు కులుకులు కవితా లలితములై చెలగు బాపు రమణీయమ్ముల్ - ముత్తేవి లక్ష్మణదాసు (లక్ష్మణయతీంద్రులు) 1970బాపు ముందు చిత్రకారుడు. ఆ తరువాతనే చలనచిత్రకారుడు. యాభై ఒక్క సినిమాలకు దర్శకత్వం వహించాడు. దర్శకుడు అంటే కేవలం నటీనటుల నుండి, యాక్షన్ రాబట్టడం, కెమెరామెన్ కు తనకు కావలసిన ఎఫెక్టులు చెప్పి రాబట్టుకోవడం మాత్రమే కాదు. సినిమాకూ, దాని చిత్రీకరణకూ సంబంధించిన అన్ని శాఖల మీదా పట్టు ఉండాలి. బాపు నిజంగా ఒక విలక్షణ దర్శకుడు. పత్రికల్లో వచ్చే రచయితల కథలే కాదు, సినిమా కథ కూడా తన బొమ్మలతో చెప్పేసి మెప్పించడమే ఆయన ప్రఙ్ఞ. బాపు బొమ్మ అంటే అందమైన అమ్మాయికి పర్యాయంగా స్థిరపడింది గానీ, ఏ పాత్రయినా, ఏ స్థలమూ, ఏ వాతావరణమూ అయినా బాపు చేతి గీతల్లో దృశ్యమానమై నిజంగా చూపరులను ఆశ్చర్యానందాలతో చిత్తరువులను చేస్తుంది. సీరియల్ నవలలు కొన్ని సినిమాలుగా వచ్చాయంటే వారపత్రికలో వారం వారం వాటికి సంతరించబడిన బాపు బొమ్మలు కలిగించిన ప్రేరణ కూడా ఒక మూలాధారనడి అనక తప్పదు. ఒక పాత్రను తన బొమ్మలతో సజీవం చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేయడం చిత్రకారుడిగా ఆయనకు అబ్బిన విద్య కాబట్టే, బాపు హీరోయిన్లే కాదు, ముత్యాలముగ్గులో క్షణకాలం కనిపించే ’మాడా’ వేసిన చిన్న పాత్రలవంటివి సైతం మరపురాని శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయి. దర్శకునిగా బాపు - రమణ రాసిన స్క్రిప్ట్ ను రాసుకుంటూ స్టోరీ బోర్డ్ రూపొందించుకునే వాడు. సత్యజిత్ రే లాగా తెలుగులో తన బొమ్మలతో స్టోరీబోర్డ్ తయారుచేసుకునే ఏకైక దర్శకుడు బాపుయే..! అసలు హైస్కూల్ చదివే రోజుల్లో 1943 - 44 లో, ’బాల’ పిల్లల పత్రికలో బాలన్నయ్య న్యాయపతి రాఘవరావుగారి ప్రోత్సాహంతో మొదలైంది, బాపు రేఖా bapu4రచన. బాపు నాన్నగారు కూడా బొమ్మలు, పెయింటింగ్స్ వేసేవారుట. ఆయనకది హాబీ. వాటి వల్ల ఒరిగేదేమీ ఉండదని తనలానే బాపును ’లా’ చదివించారు. కానీ బాపుకు ’లా’, హాబీలా అయ్యిందిగానీ చిత్రమూ, చలనచిత్రమూ సర్వస్వం అయ్యాయి. రమణ, బాపు కలిసి, ముందునుండీ బోలెడు సినిమాలు చూసేవారు. చూసిన వాటి గురించి మాట్లాడుకునేవారు. బాపు ఎవరివద్దా ఏ శిష్యరికం చేయకుండానే ’సాక్షి’ చిత్రంతో నేరుగా దర్శకుడు అయ్యాడు. 1950 ల్లో ’ఆనందవాళి’, ’ఆంధ్రపత్రిక’ల్లో కథలకు బొమ్మలు వేయడం మొదలెట్టిన బాపుది నిజంగా ’కెమెరాకన్ను’. ఎస్. ఎన్. చామకూర్, గోపులు వంటివారి బొమ్మలను పరిశీలిస్తూ ఎదిగిన బాపు అడ్వర్టైజింగ్ శాఖలో పనిచేశారు. జె. వాల్టర్ థామ్సన్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్ గా, ఏడాదిన్నర ఉండి, తర్వాత ఫ్రీలాన్సర్ అయ్యారు. ఆంధ్ర పత్రిక వారి ’అమృతాంజనం’ పబ్లిసిటీ, కె.సి.పి. సంస్థ వారి ’స్వీట్స్’ ప్రకటనలూ ఆ రోజుల్లో బాపు చేసిన విషయం కొందరికి తెలీకపోవచ్చు. 1956 - 66 మధ్యకాలంలో ఇండియాలో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ కి ఫోర్డ్ ఫౌండేషన్ తరుఫున ముఖ్య సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ ఐజన్ బర్గ్ పరిచయం బాపుని సాహిత్య ప్రియునిగా, పుస్తక ప్రియునిగా మార్చింది. బాపు మంచి ఫొటోగ్రాఫర్ అని కొందరికి తెలియకపోవచ్చు. ఐజన్ బర్గ్ తో దేశమంతా తిరిగి బాపు ఆరోజుల్లో వేలాది ఫొటోలు తీశారు. బాపుది ’కెమెరా కన్ను’ కావడం అప్పుడేనేమో. ఆ ప్రఙ్ఞను బొమ్మల్లోకి దింపడం ’బాపు’కే చేతనైందనాలి. లాంగ్ షాట్స్, మిడ్ షాట్స్, క్లోజప్ షాట్స్, జూమ్ ఇన్స్, జూమ్ ఔట్స్, క్రేన్ షాట్స్, ట్రాలీ షాట్స్ వీటన్నింటినీ తాను కథలకు, సీరియల్ నవలలకు బొమ్మలు వేయడంలో ఎంతో (ఎంత) అద్భుతంగా చిత్రించి చూపారో..! అందుకే చిత్రకారుడిగా బాపు అంతలా రాణించారు. bapu6"ఏదైనా బొమ్మ వేస్తే, ఏ మాత్రం వీలున్నా ఏదో మూల పుస్తకాల దొంతర బొమ్మలో చూపించు. ఎక్కడో అక్కడ ఓ పుస్తకం ఉండాలి" అని ఐజన్ బర్గ్ చెప్పిన మాట బాపు తన బొమ్మల్లో, చలనచిత్రాల్లో ఎక్కడో అక్కడ కచ్చితంగా పాటించి చూపించారు. బాపు ’స్టోరీబోర్డు’ ఆయన చేసుకునే హోంవర్కు మాత్రమే కాదు, అది కెమెరామెన్ కు, నటీనటులకు కూడా ఎందో ఉపయోగపడేదే..! షూటింగ్ విరామంలో ఆయన స్టోరీబోర్డ్ చూస్తూ ఎన్నో నేర్చుకుని, ఆయన ప్రేరణతోనే దర్శకురాలినై గిన్నిస్ బుక్ కు ఎక్కానని ’సాక్షి’ బాపురమణల తొలిచిత్రంలో హీరోయిన్ గా నటించి, మహిళాదర్శకురాలిగా మారిన విజయనిర్మల స్వయంగా ప్రకటించారు. వాణిశ్రీ వంటి పేరొందిన హీరోయిన్ సైతం బాపు ’స్టోరీబోర్డ్’ నుంచి ఆ బొమ్మలతో, వాటి హావభావాలతో, భంగిమలతో తన నటనకు మెరుగులు దిద్దుకుందిట..! ’సాక్షి’ నుంచి చివరిగా తీసిన ’శ్రీ రామరాజ్యం’ వరకూ బాపూ ’స్టోరీబోర్డ్’లన్నీ భావి దర్శకులకు, నటీనటులకు, కెమెరామెన్స్ కు అందరికీ అధ్యయనగ్రంథాలే. ఎటొచ్చీ భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఒక చిత్రనిర్మాణం గురించి రచయిత, దర్శకుడు చేసిన ’హోమ్ వర్క్’ విశ్వరూపాన్నీ, నిర్మాణ కార్యక్రమాల్నీ సమగ్రంగా ప్రతిబింబించిన విశిష్ట గ్రంథరాజం ’శ్రీ రామరాజ్యం’ ఒక్కటే. రచన’శాయి’ వాహినీ బుక్ ట్రస్ట్ 101 వ ప్రచురణగా దానిని వెలువరించారు. నిజానికి సాక్షి, సీతాకళ్యాణం, బుధ్ధిమంతుడు, ముత్యాలముగ్గు, అందాలరాముడు, రాధాకళ్యాణం, రాజాధిరాకు, బంగారు పిచిక, బాలరాజు కథ... ఇలా బాపు సినిమాల స్టోరీబోర్డులన్నీ గ్రంథాలుగా వెలువడి ఉంటే, ఎంత బాగుండేదో..?! అనిపిస్తుంది. స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లాంటి మాటలు వినడమే గానీ వాటిని రూపొందించడానికి దర్శకుడి కృషి గురించి తెలియజెప్పే వివరాలు, బాపు గారి స్టోరీబోర్డు చూస్తేనే తెలుస్తుంది. బాపు చేతివ్రాతలో సినిమాలోని పాటల సాహిత్యం అంతా కూడా ’శ్రీ రామరాజ్యం’ స్టోరీబోర్డ్ లో అచ్చులో అచ్చంగా అందించారు. బాపు స్టోరీబోర్డులు ఆయన దృశ్య సాహిత్య వైశిష్ఠ్యానికి దర్పణాలు అనాలి. ’సీతా కళ్యాణం’ ’సంపూర్ణ రామాయణం’ వంటి చిత్రాల సినేరియోలు చలన చిత్ర పరిశ్రమకే పాఠ్యగ్రంథాలని విదేశీయులు సైతం కొనియాడారు. బాపు తెలుగువారి ఏకైక రేఖాసాహిత్యవేత్త అని నిరూపించేవి ఆయన బొమ్మలే కాదు, చలనచిత్ర దర్శకునిగా వారు రూపొందించుకున్న స్టోరీబోర్డ్ లు కూడాను. bapu8’సీతాకళ్యాణం’ లండన్ ఫిఫా ఇనిస్టిట్యూట్ వారు టెక్స్ట్ బుక్ గా పెట్టి వారి లైబ్రరీలో ఒక ప్రింటు భద్రం చేశారు. స్టోరీబోర్డ్ ప్రతి పేజీలో ప్రొడ్యూసర్, టైటిల్, సీన్ నెంబర్, క్యారెక్టర్స్, లోకేల్, అది పగలా, రాత్రా, ఇండోరా, ఔట్ దోరా, సీన్లో స్పెషల్ ప్రాపర్టీస్ ఏమిటి, పి.యస్ అంటూ ప్రీవియస్ సీన్, ఎన్. యస్ అంటూ నెక్స్ట్ సీన్ కూడా నోట్ చేసుకుంటూ, ఎక్కడెక్కడ గ్రాఫిక్స్ తో చెక్ చేసుకోవాలో కూడా నమోదు చేసుకుంటూ ఒక ’మెటిక్యులస్ ప్లానింగ్’తో షూటింగ్ కు వెళ్ళే గొప్ప ’హోంవర్క్’ చేసుకునే దర్శకుడు బాపు. నిజంగా బాపు కెమెరా కన్ను గొప్పది. ’ముత్యాల ముగ్గు’ చిత్రం ద్వారా ’ఇషాన్ ఆర్య’ని కెమెరామెన్ గా మొట్టమొదట తెలుగువారికి పరిచయం చేసింది బాపునే. ఆ చిత్రానికి బెస్ట్ ఫొటోగ్రఫీకే నేషనల్ అవార్డు వచ్చింది. టైటిల్ సాంగ్ కూడా బాపు సినిమాల్లోని ఓ విశిష్టమైన సంగతి సినిమాకు అవసరమైన మూడ్ ను, చక్కని లీడ్ ని ఎలా ఇవ్వాలో స్టోరీ బోర్డ్ లో బాపు రూపొందించుకునేవారు. ఎగరేసిన గాలిపటాలు (’స్నేహం’ సినిమా), పలుకే బంగారమాయెరా (అందాల రాముడు), శ్రీ రామ జయరామ (ముత్యాల ముగ్గు), శ్రీరస్తు శుభమస్తు (పెళ్ళి పుస్తకం), జగదానంద కారకా (శ్రీ రామరాజ్యం) వంటివన్నీ బాపు టైటిల్స్ దగ్గరే ఆకట్టుకునేస్తాడనడానికి దాఖలాలే ! స్టోరీబోర్డ్ లో తాను హీరో, హీరోయిన్లని ఎలా చూపాలనుకుని బొమ్మలు గీసుకుంటాడో అచ్చంగా అలాగే వాటికి ఆయా నటీనటులతో జీవం పోసి చూపే దక్షత బాపుది. నటీనటుల శరీరాకృతులే కాదు, వారి ఆహార్యం తీరుతెన్నులు కూడా బొమ్మల్లో ఎలా గీసుకుంటాడో అలాగే దృశ్యంలో చలనచిత్రంగా జీవం పోస్తాడు బాపు. స్టోరీబోర్డు పేజీల్లోని కొన్ని బొమ్మలు చూస్తే అదేమిటో స్పష్టంగా అర్థమైపోతుంది ఎవరికయినా... బాపు చిత్రించిన నవరసాలు, వివిధ్యనాట్యరీతులు వర్ణ చిత్రాలను ఆంధ్రదేశంలోని పలు కళావేదికలపైనా, ఆడిటోరియాల్లోనూ కీ.శే. నూతన్ ప్రసాద్ ప్రదర్శింప storyboard page from Sakshi 001చేయడానికి ఎంతో కృషి చేశాడు. తనే ఒకసారి అన్నట్లు ’బాపుగారు ఎంతో అద్భుతంగా చిత్రిస్తారు. కానీ ’బొమ్మ చాలా బాగా వేశాను’ అని ఎప్పుడూ అనలేదు. ’బొమ్మ బాగా కుదిరింది’ అనే అనేవారు. స్టోరీబోర్డుతో గొప్ప హోంవర్క్ చేసి సినిమాలు తీసిన బాపుగారు అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా ఆ చిత్రాల జయాపజయాల మిదా తానే బొమ్మలు వేసుకున్నారు గానీ విజయాలకు విర్రవీగలేదు. ఓటమికి కృంగిపోలేదు. ’వంశవృక్షం’ నిర్మాత బాపుగారితో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ "ఇంతకు ముందు మీరు ట్రాజెడీలు ఏవీ తీసినట్లు లేదు" అన్నారు. "అఫ్ కోర్స్..! తీశాక చాలా చిత్రాలు ట్రాజెడీలే అయ్యాయి" అన్నారట బాపు చిరునవ్వులోంచి. బాపు కృషి, బాపు మార్గం గొప్పవి. ఆయన 51 సినిమాల స్టోరీబోర్డులూ గ్రంథస్థం అయితే ఎంత బాగుణ్ణో కదా..?!? భారత చలనచిత్ర రంగంలో సత్యజిత్ రే తర్వాత, సినిమా చిత్రీకరణ కోసం సమగ్ర వివరాలతో సచిత్రంగా ’స్టోరీబోర్డ్’ ను స్వహస్తాలతో తయారు చేసుకున్నది ఒకే ఒక్క ’బాపు’. ఆ స్టోరీబోర్డులన్నీ ఎవరన్నా పూనుకుని అందరికీ అందుబాటులోకి తేగలిగితే అది భావి దర్శకులకే కాదు చిత్ర రంగంలోని ఎందరికో ఉపయుక్తమవుతాయి. బాపుని అభిమానించే తెలుగువారెందరికో ఆనంద సంధాయకాలవుతాయి. bapu5 రమణ ’రాత’కారుడు బాపు ’గీతా’కారుడు గీతాసారం జగదానంద కారకం ! ఎప్పటికీ రక్తి కట్టే భక్తిముక్తిదాయకం !! తరతరాలకూ బాపు బొమ్మల ’సొగసు చూడతరమా !’ కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె నూయలలూపు ఓ కూనలమ్మా...! - ఆరుద్ర  

No comments:

Post a Comment

Pages