పుణ్యవతి (నవల) - 16 - అచ్చంగా తెలుగు

పుణ్యవతి (నవల) - 16

Share This

 పుణ్యవతి (నవల) - 16

రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
 



(ఉత్తరం చదివిన పుణ్యవతి త్వరలోనే సృజనకు మంచి సంబంధం అవుతుందని, ఈ సంబంధం తప్పిపోయినందుకు బాధపడవద్దని రంగనాధాన్ని ఓదారుస్తుంది. ఆరాత్రి మనస్తాపంతో రంగనాధం మరణిస్తాడు. రంగనాధం మరణవార్త విన్న పుణ్యవతి అన్నయ్య శేఖర్ వచ్చి అన్నగారి అంతిమయాత్రకు సిద్ధమవుతున్న జగన్నాధాన్ని పక్కకు పిలుస్తాడు. తరువాత...)
@@@@@@@@@@@

సుమారు గంటసేపు ఆ యింటి వాతావరణమంతా గగ్గోలుగా మారిపోయింది. రంగనాధం మరణవార్త విని చుట్టుపక్కల తెలిసిన వాళ్ళంతా పరామర్శకొచ్చి వెళ్తున్నారు. శేఖరం జగన్నాధాన్ని పక్కకు పిలిచి మాట్లాడటం గమనించి, పుణ్య అటువైపెళ్ళింది. చాటుగా అన్నయ్య మాటలు విని విస్తుపోయింది.

"జగన్నాధంగారూ! నేను మిమ్మల్ని ఇలా అడగటం వింతగా ఉండవచ్చు. కానీ నా మనసులో ఉన్నది దాచుకొని తరువాత బాధపడటం నాకు అలవాటు లేదు. నాన్న పోయాక, బంధువుల ఛీత్కారాల మధ్య కొన్నాళ్ళు గడిపిన అమ్మ, తన ఉద్యోగాన్ని ఈ ఊరికి బదిలీ చేయించుకుంది. నాకు పదేళ్ళ వయసులో అమ్మ నన్నూ, చెల్లిని తీసుకొని ఈ ఊరు వచ్చింది. అప్పుడే రంగనాధంగారు పరిచయమయ్యారు. మేమిక్కడ ఉన్న పదిహేను సంవత్సరాలు అమ్మను ఆయన సొంత చెల్లెలుగా ఆదరించారు. మా కష్టాల్లో చేదోడుగా నిలబడి, మా ఉన్నతికి మానసికంగా తోడ్పడ్డారు. నేను ఆయన చేసే సాయానికి మొహమాటపడుతుంటే - కొడుకులు లేని వాణ్ణి, నా ముప్పు నువ్వే గడపాలిరా-అనేవారు. ఆఖరికి అమ్మ చనిపోయినప్పుడు ఆర్థికసాయం కూడా చేసారు. అమ్మ పోయాక, కొన్ని కారణాల వల్ల రెండు వీధుల అవతలకు ఇల్లు మారవలసి వచ్చింది. కానీ ఆయన అనుబంధాన్ని, కోరికను నేను మరిచిపోలేదు. కష్టకాలంలో తండ్రిగా ఆదరించిన రంగనాధంగారి అభిమాన పుత్రుడిగా ఈ పని చేయాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే, ఆయన చితికి నన్ను నిప్పు పెట్టనిస్తారా?"

శేఖర్ కోరికకు ముందు విస్తుపోయినా, జగన్నాధం అతన్ని కాదనలేకపోయాడు. అక్కడ ఉన్న పెద్దలు కొందరు 'పిదప కాలం, పిదప బుద్ధులు ' అంటూ బుగ్గలు నొక్కుకున్నారు.

"తమ్ముడు ఉండగా, ఇలాంటి వాటిని బయటవాళ్ళెలా చేస్తారు? ఇలాంటి వాటికి కులం, గోత్రం ఏమీ చూడనక్కరలేదా?" అని సణిగారు. జగన్నాధమేమీ మాట్లాడక, అతన్ని అనుమతించాడు. అయినా ఇలాంటి వాటిని నలుగురూ అడ్డుకొని వెలివేసే రోజులు కాదు గనుక ముక్కున వేలేసుకోవటం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. స్నానం చేసి రంగనాధం అంతిమయాత్రకు సిద్ధమవుతున్న శేఖర్ ముందుకి పుణ్యవతి వచ్చింది.

"అన్నయ్యా!" పిలిచిన పుణ్యను శేఖర్ సూటిగా చూడటంతో భయపడింది. మౌనంగానే అతనికి రెండు చేతులు జోడించి పక్కకు తప్పుకొంది. కానీ అన్నలోని ఆదర్శానికి మాత్రం ఆమె మనసులో పొంగిపోయింది. ఇన్నాళ్లు శేఖరానికి చెల్లిగా పుట్టటం తన దురదృష్టం అనుకునేది. జీవితంలో మొదటిసారి 'ఇలాంటి అన్నకు చెల్లిని చేసినందుకు ' భగవంతునికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొంది. చిన్నప్పటినుంచి అంతే! మంచిపనులు చేసినప్పుడు అన్నను తను మెచ్చుకోవాలనుకొనేది. కానీ వాడి ముఖంలో గాంభీర్యాన్ని చూసి భయంతో మిన్నకుండిపోయేది. అతను అన్ని విషయాల్లోను బాగుంటాడు. కానీ ఆడపిల్ల దేనికీ ఎదురుచెప్పకూడదన్నదే అతనిలో పుణ్యకి నచ్చని అంశం. జరగవలసిన తంతులు జరిగాక, సాయంత్రం శేఖర్ తన ఇంటికి వెళ్ళిపోతూ, పుణ్యని పన్నెండు రోజులు అక్కడే ఉండమన్నాడు.
@@@@@

అప్పటికి రంగనాధం చనిపోయి వారం రోజులైంది. సృజన, జగన్నాధం దంపతులు, పుణ్య తప్ప ఇంటికొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. ఊరెళ్ళిన రవి ఏ కారణం చేతనో ఇంకా రాలేదు. ఉన్నట్లుండి ఆ రాత్రి అలికిడయి, నిద్ర లేచిన పుణ్యకు పక్కలో సృజన కనిపించలేదు. బాత్రూంకి వెళ్ళి ఉంటుందనుకొన్న ఆమెకు వంటింట్లోంచి చప్పుడు వినిపించి లేచి చూసింది. అక్కడ సృజన నీళ్ళగ్లాసులో పక్కనున్న పాకెట్లోంచి ఏదో తీసి కలపటం కనిపించింది.

"ఏంటే కలుపుతున్నావ్?" పుణ్య గొంతు విని సృజన త్రుళ్ళిపడింది.

"ఏమీ లేదు" అంటూ పక్కనున్న పాకెట్టుని కంగారుగా గూట్లో దాచేసింది.

దాని ప్రవర్తనకు అనుమానించిన పుణ్య పరుగులాంటి నడకతో స్నేహితురాలిని సమీపించింది. వెంటనే ఆమె గ్లాసులోని ద్రవాన్ని కంగారుగా తాగబోయింది. సృజన చేతిలోని గ్లాసుని పుణ్య ఎగరగొట్టింది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. ఉన్నట్లుండి సృజన గొంతు భీకరంగా మారిపోయింది.

"నేనేం చేస్తే నీకెందుకే? మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళిపో!" సృజన పిచ్చిగా అరిచింది. దయ్యం పట్టినట్లు అరిచే ఆమెను చూసి పుణ్య భయపడింది. అయినా ధైర్యంగా గూట్లోని పాకెట్టుని చూడాలని అటు వెళ్ళింది. వెంటనే సృజన ఉద్రేకంగా స్నేహితురాలి మీదకు దూకింది.

"వెళ్ళమని చెబితే నీక్కాదు" ఆమె గొంతు తీవ్రమైంది.

పుణ్య ఆమెను తప్పించుకొని గూట్లోని పాకెట్టుని తీసి చూసింది. ఎలకలమందు. పుణ్య కొప్పును బిగించి పట్టుకొని విసురుగా లాగింది సృజన. ఆ విసురుకి పుణ్య పక్కనే ఉన్న గోడ మీదకు తూలిపడింది. ఆమె చేతిలోని పాకెట్టు దూరంగా నేలపై పడింది. పరుగులాంటి నడకతో పాకెట్టు వైపు వెళ్ళబోయిన సృజీని నడుము పట్టుకొని ఆపిందామె. వెంటనే సృజన వెనక్కి తిరిగి పుణ్యను నేల మీదకు పడదోసింది.

"నన్ను చావనీకుండా ఆపుతావు కదూ! ముందు నిన్ను చంపి తరువాత నేను చస్తానే!" అంటూ ఆమె పుణ్య గుండెలపై కూర్చుని, ఆమె జుట్టుని పట్టుకొని తలను నేలకేసి బలంగా కొట్టింది. ఆ దెబ్బకి పుణ్యకు తల దిమ్మెక్కినట్లయి, స్నేహితురాలిని తన మీదనుంచి తోసెయ్యాలని చూసింది. అదే సమయంలో నేలకు తల తగలకుండా చేతులతో కాసుకొంటూనే పుణ్య కేకలేసింది. ఆ చీకటి రాత్రి నిశ్శబ్దంలో పుణ్య అరుపులు వినిపించి జగన్నాధం దంపతులు కంగారుగా వచ్చారు. పుణ్యవతి నేల మీద వెల్లకిలా పడి ఉంది. "చావు" అని సృజన పిచ్చెక్కినదానిలా ఆమె తలను నేలకేసి బలంగా కొడుతోంది. సృజన వెనుకనుంచి జగన్నాధం ఆమె భుజాలను పట్టుకొని బలంగా వెనక్కి లాగాడు. సృజన వేళ్ళ మధ్య తన జుట్టు ఇరుక్కోవటంతో పుణ్య గట్టిగా అరిచింది. సృజన ముందుకి జగన్నాధం భార్య దూకి, తన రెండు చేతులతో ఆమె చెంపలను గట్టిగా వాయించింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక సృజన నీరసంతో నేల మీదకు జారిపోయి, వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది. జగన్నాధం తల దిమ్మెక్కి పడి ఉన్న పుణ్యను లేవదీసి గ్లాసుతో నీళ్ళు తాగించాడు.

"నీకేం దయ్యం పట్టిందే? నిక్షేపంలాంటి పిల్లను చంపెయ్యాలని చూసావ్!" తిడుతున్న జగన్నాధం భార్యను ఆగమని పుణ్య వేడుకొంది.

"పిన్నీ! ఊరుకో! నన్ను చంపాలని కాదు. . .తనే చచ్చిపోవాలని చూసింది. నేను అడ్డుపడ్డందుకు యిలా. . . అబ్బా! చావుకి తెగించిన వాళ్ళు రాక్షసుల కన్నా బలవంతులంటారు. నిజమే!" అని నేలపై పాకుతూ, సృజన వద్దకెళ్ళింది పుణ్యవతి.

"సృజీ!" ఆమె భుజంపై చేయి వేసి కుదిపింది. నేలపై బోర్లా పడుకొని ఏడుస్తున్న సృజన ఒక్కుదుటున లేచి పుణ్య ఒళ్ళో తల ఉంచి భోరుమంది. ఆమె తన చేతితో స్నేహితురాలు తల నిమురుతూ, "ఇప్పుడేమి జరిగిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?" అని అడిగింది.

"ఏముందీ? పిచ్చి. . . ఆత్మహత్యలు వీళ్ళ కొంపలో ఉన్నదే కదా!" అంటున్న జగన్నాధం భార్యకు చేతులు జోడించింది పుణ్యవతి.

"పిన్నీ! ఏమనుకోకపోతే, మమ్మల్ని కొద్దిసేపు వదిలేస్తారా?"

"అది కాదురా! అది మళ్ళీ. . ."

"లేదు పిన్నీ! తన చావుకి నేను అడ్డుపడ్డానని అది కొంచెం ఆవేశపడింది, అంతే! ప్రస్తుతం దానిలోంచి తను బయటపడింది. నాకొచ్చిన భయమేమీ లేదు. మీరు వెళ్ళండి" అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు.

స్నేహితురాళ్ళిద్దరి మధ్య కొద్ది క్షణాలు మౌనం.

"పుణ్యా! నన్ను క్షమిస్తావు కదూ!" పుణ్య ఒళ్ళోంచి లేచి కూర్చుని వెక్కుతూ అంది సృజన.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages