శ్రీథర మాధురి - 132
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
శివ గురునాథన్ ఒక స్కూల్ టీచర్, అతడు చాలా పవిత్రమైన వ్యక్తి. ప్రతిరోజూ స్కూల్ కి వెళ్లే దారిలో ఉన్న ఒక పురాతన శివాలయానికి వెళ్లి, అతడు సాష్టాంగ ప్రణామాలు అర్పించేవాడు.
ఒక రోజున కుండపోతగా వాన పడ సాగింది, అతడు స్కూల్ కి లేట్ అయ్యాడు. కనుక శివాలయానికి వెళ్లలేదు.
ఆ రోజున నేను అతని స్కూల్ కి వెళ్ళాను. లంచ్ సమయంలో అతడిని కలిశాను. తను చాలా దిగులుగా ఉన్నాడు. నేను అతడిని ఇలా అడిగాను 'నిన్నేదైనా ఇబ్బంది పెడుతుందా శివా?'
శివ 'అవును గురూజీ! ఈరోజు ఉదయం నేను నా శివుడిని చూడకుండానే వచ్చేసాను. వాన పడుతూ ఉండడం వల్ల ఆలస్యమై, నేను స్కూల్ కి త్వరగా రావలసి వచ్చింది.'
నేను ఇలా అన్నాను 'దిగులు పడకు. ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. దైవానికి మాత్రమే ఆ కారణం ఏమిటో తెలుస్తుంది. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటారు. నీ ప్రక్కనే నిలబడతారు.'
అప్పుడే ఆలయ పూజారి ఆలయ ప్రసాదాన్ని తీసుకుని వచ్చాడు.
పూజారి 'మీరు ఇవాళ ఉదయం రాలేదు. కనుక నేను ఆలయం మూసివేసాక, మీకు ప్రసాదం ఇచ్చి వెళ్లడానికి వచ్చాను.'
శివ చాలా ఉత్సాహపడ్డాడు. నేను కూడా చాలా సంతోషించాను.
ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు స్కూల్ అయిపోయాక, శివ ఇంటికి బయలుదేరాడు. ఆలయం వద్ద ఆగాడు. ఆలయం లోపలికి వెళ్ళాడు.
పనిమనిషి ఆలయాన్ని ఊడుస్తూ ఉండగా చూసి ఆమెను ఇలా అడిగాడు 'పూజారి ఎక్కడ ఉన్నారు?'
ఆమె ఇలా అంది 'పూజారి గారి మామగారికి సీరియస్ గా ఉందని, ఆయన తన భార్యతో కలిసి, నిన్న ఆయన్ను చూడ్డానికి వెళ్లారు.
శివ అవాక్కయి నా మొబైల్ కి ఫోన్ చేశాడు.
****************************** ****************************** *************
రాజగోపాలన్ డ్రైవ్ చేస్తూ ఉండగా మేమిద్దరం, మానకిన్ సాబోత్, వర్జీనియా యుఎస్ఎ లో ఉన్న 'సాయి అమృత నారాయణ' ఆలయానికి వెళ్తూ ఉన్నాము. ఉదయం ఎనిమిది గంటలు కావస్తోంది.
శివ 'గురూజీ! ఇవాళ మధ్యాహ్నం మీరు నన్ను చూసేందుకు స్కూల్ కి వచ్చినప్పుడు ఆలయ పూజారి వచ్చి, నాకు ప్రసాదం ఇచ్చారు కదా? ఆయన ఒక రోజు ముందే, ఆయన భార్యతో కలిసి, ఆరోగ్యం బాగాలేని మామగారిని చూసేందుకు ఆవిడ స్వగ్రామానికి వెళ్లారట. అటువంటప్పుడు లంచ్ సమయంలో ఆ పూజారి ఎలా వచ్చారు? ఇదొక అద్భుతం. మీరే దానికి సాక్ష్యం!
నేను నవ్వి, ఇలా అన్నాను 'నాకు కూడా ఇది ఒక అద్భుతమే! కేవలం దీనికి భగవంతుడే సాక్షి. రెండు రోజుల క్రితం నేను అమెరికాకు బయల్దేరి వచ్చాను. నేను ఇప్పుడు రిచ్మండ్ లో ఉన్నాను. ఇప్పుడు సమయం ఉదయం 8 గంటలు అయింది. నీతో ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఆయన స్వయంగా భగవంతుడే కావచ్చు.'
అంతా దైవానుగ్రహం.
ఓం క్షం మహా భైరవాయ నమః
ఓం నమః శివాయ.
No comments:
Post a Comment