పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -7
బాలకాండ
దినవహి సత్యవతి
86.
రాముని యౌవరాజ్య పట్టాభిషేక ప్రయత్నమును,
కైక దుష్టచింతన, భర్తను వరాలు కోరుటను,
తండ్రి మాటకై రాముడు అరణ్యవాసమేగుటను,
ఆ దుఃఖముతో దశరథుడు స్వర్గస్థుడగుటను,
రామపట్టాభిషేకంలో కల్గిన విఘ్నాలను వర్ణించె, సత్య!
87.
రాముని దుర్దశకు ప్రజలెంతో దుఃఖించుటను,
రాముడు అరణ్యమునకు తరలి వెళ్ళుటను,
రాముడు, గుహుడిని కలిసి సంభాషించుటను,
సుమంత్రుడు, రాముని అరణ్యాన విడచుటను,
సీతారామలక్ష్మణులు గంగానది దాటుట వర్ణించె, సత్య!
88.
రాముడు భరధ్వాజ మహర్షిని కలియుట,
ఆతని ఆజ్ఞపై చిత్రకూటముకు వెళ్ళుట,
అచట గృహము నిర్మించుకుని వసించుట,
భరతుడు, రాముడిని అరణ్యంలో చూడవచ్చుట,
తండ్రి మరణానికి రాముడు దుఃఖించుట వర్ణించె, సత్య!
89.
రాముడు, తండ్రికి ఔర్థ్వదేహిక క్రియలు చేయుట,
భరతుడు, రాముని తిరిగి రమ్మని అర్థించుట,
పాదుకలనిచ్చి రాముడు భరతుని సాగనంపుట,
భరతుడు పాదుకాపట్టాభిషేకము చేయుట,
నందిగ్రామంనుండి రాజ్యమేలుట వర్ణించె, సత్య!
90.
రాముడు దండకారణ్యంలో ప్రవేశించుట,
విరాధుని చంపి మహర్షులను దర్శించుట,
సీత, అనసూయను కలిసి సంభాషించుట,
ఆమె, సీతకు, పూసుకొను అంగరాగమిచ్చుట,
రాముడు అగస్త్యుని దర్శించుట, వర్ణించె వాల్మీకి, సత్య!
91.
రాముడు పక్షిరాజు జటాయువును కలియుట,
తదుపరి సీతారాములు పంచవటికి వెళ్ళుట,
రామలక్ష్మణులు రాక్షసి శూర్పణఖను చూచుట,
వారు, శూర్పణఖ ప్రవర్తనకు కోపిగించుకొనుట,
ఆమెకు రూపవికారము కలిగించుట వర్ణించె, సత్య !
92.
ఖర, త్రిశిరస్క రాక్షసులను రాముడు చంపుట,
రావణుడు, రామునికి అపకారం తలపుట,
మాయలేడి రూపుడౌ మారీచుని రాముడు చంపుట,
రావణుడు, మాయతో సీతను అపహరించుట,
జటాయువు రావణుని అడ్డగించుట, వర్ణించె, సత్య!
93.
రావణుడు జటాయువుని సంహరించుట,
సీతాపహరణము రాముని బాధించుట,
సీతాన్వేషణలో ఎదురైన కబంధుని చంపుట,
కబంధుడు చెప్పగా, పంపాసరస్సును చేరుట,
శబరిని, హనుమను, రాముడు కలియుట వర్ణించె సత్య!
94.
రాముడు ఋష్యమూక పర్వతానికి వెళ్ళుట,
సుగ్రీవునితో స్నేహం చేయుట, వాలిని చంపుట,
రాముడు, సుగ్రీవునికి, రాజ్యం తిరిగి ఇప్పించుట,
సీతాన్వేషణ చేయింతునని సుగ్రీవుడు చెప్పుట,
యుద్ధం పొసగుటకై రాముడు వేచిచూచుట వర్ణించె, సత్య!
95.
సీతాన్వేషణలో సుగ్రీవుడు ఆలస్యము చేయుట,
అందుకు రాముడు, సుగ్రీవునిపై కోపగించుట,
సుగ్రీవుడది గ్రహించి వానరులను పిలుచుట,
ప్రదేశాలు తెలిపి నాలుగుదిక్కులకు పంపుట,
రాముడు, హనుమకు ఉంగరమిచ్చి పంపుట వర్ణించె, సత్య!
96.
సీతాన్వేషణలో వానరులు ఋక్షబిలం చేరిరని,
అచ్చట సీత జాడకానక, నిరాశకు లోనైరని,
దుఃఖంతో ప్రాయోపవేశానికై సంసిద్ధులయ్యిరని,
అప్పుడు జటాయు సోదరుడు, సంపాతిని చూచిరని,
అటు హనుమా మహేంద్రపర్వతం చేరెనని తెలిపె, సత్య!
97.
గిరిపైనుండి ఎగిరి హనుమ, సముద్రం దాటెనని,
సముద్రుడు ప్రేరేపింప మైనాకపర్వతం వచ్చెనని,
మైనాకుని దర్శించి, సింహికను సంహరించెనని,
హనుమ, లంకలోని పర్వతభాగము కాంచెనని,
రాత్రికి లంకచేరి కార్యాచరణ యోచించెననియె, సత్య!
98.
లంకలో, హనుమ, రావణుని పుష్పకం చూచెననె,
మద్యపాన భూమిలో అంతఃపుర స్త్రీలగాంచెననె,
అశోకవనంలో ప్రవేశించి సీతను చూచెననె,
రాముని ఉంగరం, సీతకు, గుర్తుగా ఇచ్చెననె,
పిమ్మటే, హనుమ, రావణుని చూచుట జరిగెననె, సత్య!
99.
రాక్షసస్త్రీలు సీతను భయపెట్టుట వర్ణించె,
త్రిజట, తన స్వప్నం, సీతకు, చెప్పుట వర్ణించె,
హనుమకు, సీత చూడామణి ఇచ్చుట వర్ణించె,
అశోకవనంలో చెట్లు హనుమ విరుచుట వర్ణించె,
రాక్షసస్త్రీలు భయంతో పారిపోవుటయూ వర్ణించె, సత్య!
100.
హనుమంతుడు రావణుని భటులను చంపుట,
రావణసుతుడు ఇంద్రజిత్తుకు హనుమ చిక్కుట,
హనుమంతుడు లంకను దహించుచు గర్జించుట,
హనుమ మళ్ళీ సముద్రం దాటి వెనుకకు వచ్చుట,
వానరులు మధువనంలో మధువు త్రాగుట వర్ణించె, సత్య!
No comments:
Post a Comment