పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం - 4
బాలకాండ
దినవహి సత్యవతి
46.
సముద్రునిపై తీక్షణమౌ బాణములు ప్రయోగించెను,
క్షోభించిన సముద్రుడు భయముతో కంపించెను,
రాముని యెదుట నిజరూపాన ప్రత్యక్షమయ్యెను,
సేతువు కట్టుటకు రాముడికి ఉపాయం చెప్పెను,
నలునిచే సేతువు కట్టించె రాముడనె, నారదుడు, సత్య!
47.
సేతుమార్గమున రాముడు లంకను చేరెను,
యుద్ధమునందు రావణాసురిని సంహరించెను,
సీతను తిరిగి స్వీకరించుటకు సిగ్గుపడెను,
పరగృహాన వసించిన సీతను దూషించెను,
అవమానపడి సీత అగ్నిప్రవేశం చేసెననె, సత్య!
48.
సీత పాపరహితయని అగ్నిదేవుడు పలికెను,
అగ్నిదేవుని మాటలకు రాముడు సంతసించెను,
రాముడు మహాత్ముడని దేవతలచే పూజలందెను,
రావణుని చావుకు ముల్లోకాలూ సంతసించెను,
ఋషులూ, దేవతలూ రాముని స్తుతించిరనె, సత్య!
49.
రాముడు పూర్వం విభీషణుని అభిషిక్తుని చేసెను,
నాడతని లంకకు రాజు చేతునని ప్రతిజ్ఞ చేసెను,
అటులే విభీషణుని లంకాభిషిక్తుని జేసెను,
తన ప్రతిజ్ఞ నెరవేర్చుటలో కృతకృత్యుడయెను,
దేవతలు రాముని చూడవచ్చి వరాలిచ్చిరనె, సత్య!
50.
ఆ వరాలతో మృతవానరుల బ్రతికించుకొనెను,
పుష్పకవిమానారూఢుడై అయోధ్యకు తరలెను,
హితులతో రాముడు, భరధ్వాజఆశ్రమం చేరెను,
పిదప హనుమను, భరతునివద్దకు పంపెను,
సుగ్రీవాదులకు పూర్వవృత్తాంతము చెప్పెననె, సత్య!
51.
సీతాసమేతుడై రాముడు నందిగ్రామం చేరెను,
అచట తన సోదరులను మరలా కలిసెను,
సీతతో, లక్ష్మణునితో కలిసి జటలు విడిచెను,
అటుల సీతనూ, తిరిగి రాజ్యమునూ పొందెను,
అయోధ్య రాజుగా అభిషిక్తుడయ్యె రాముడనె, సత్య!
52.
రాముడు రాజైనందుకు అయోధ్య ప్రజ ప్రీతి చెందెను,
ప్రీతిచెందిన ప్రజ ధర్మమాచరించుచుండెను,
లోకమంతా సంతోషాతిశయంచే పరవశించెను,
ఆనందముచే లోకానికి పరిపుష్టి లభించెను,
లోకమందు సకలబాధలు తొలగిపోయెననె, సత్య!
53.
రామరాజ్యంలో, తండ్రియుండ పుత్రుడు మరణించడనె,
స్త్రీలు వైధవ్యంలేక సదా పతివ్రతలై యుందురనె,
అగ్ని, జల, వాత, జ్వర, చోర భయములుండవనె,
క్షుధ్బాధ లేక దేశాలు సర్వసమృద్ధాలై యున్నవనె,
కృతయుగంలోవలే ప్రజలు సంతుష్టులైయున్నారనె, సత్య!
54.
రాముడు, వేలాది అశ్వమేధయాగాలు చేయుననె,
‘బహుసువర్ణక’ యాగాలతో సురల పూజించుననె,
పదివేలకోట్ల గోవులు, ధనం బ్రాహ్మణులకిచ్చుననె,
దానాలతో తనదౌ శాశ్వతస్థానము పొందగలడనె,
రాజ్యాలిచ్చి క్షత్రియుల వంశాభివృద్ధి చేయుననె, సత్య!
55.
నాల్గువర్ణాల వారిచే ధర్మాచరణ చేయించుననె,
ప్రజలు సుఖము పొందునట్లు పాలించగలడనె,
పదకొండువేల యేండ్లట్లు రాజ్యపాలన చేయుననె,
పిదప రాముడు బ్రహ్మలోకమును చేరుననె,
వేద సమ రామచరిత్ర పరిశుద్ధి కల్గించుననె, సత్య!
56.
రామచరిత పుణ్యమిడి, పాపం నశింపజేయుననె,
చదువరుల సర్వపాపములు తొలగిపోవుననె,
రామాయణ ఆఖ్యానంతో ఆయుర్వృద్ధి కల్గుననె,
వారు పుత్రపౌత్రాదులతో సుఖంగా యుందురనె,
భృత్యు, బంధుగణాలతో సౌఖ్యాలనుభవింతురనె, సత్య!
57.
రామాయణాఖ్యాన పఠితుడు స్వర్గం చేరుననెను,
అచట దేవతలచే పూజింపబడగలడనెను,
అట్లు నారదుడు సంక్షిప్త రామాయణకథ చెప్పెను,
నారదుని పల్కులు వాల్మీకి శ్రద్ధగా ఆలకించెను,
కథ విని నారదమహర్షికి ప్రణమిల్లె వాల్మీకి, సత్య!
58.
రామాయణ గ్రంథమునెల్లరూ పఠించదగును,
ద్విజుడు పఠింప అష్టాదశ విద్యల్లో నేర్పరగును,
క్షత్రియుడు పఠించిన భూమండలాధిపతియగును,
వైశ్యుడు పఠింప వ్యాపారంలో లాభము పొందును,
శూద్రుడు పఠించిన గొప్పవాడగునని తెలుపబడె, సత్య!
(మొదటి సర్గ సమాప్తం)
No comments:
Post a Comment