పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -5 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -5

Share This

                                    పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -5

బాలకాండ

దినవహి సత్యవతి




2 వ సర్గ 

      రామచరిత వ్రాయుమని బ్రహ్మ వాల్మీకిని ఆదేశించుట...

59.

మహాముని వాల్మీకి ధర్మబుద్ధి కలవాడు,

పద, వాక్య విశేషములు తెలిసినవాడు, 

శిష్యులకూడి సంక్షిప్తరామాయణం విన్నాడు, 

నారదమహర్షిని శ్లాఘించి పూజించినాడు, 

వాల్మీకినుంచి సెలవుకోరి వెడలె నారదుడు, సత్య!   

60.

నారదుడు ఆకాశమార్గాన దేవలోకం చేరెను, 

వాల్మీకి కూడా జాహ్నవీనది విడచి వెళ్ళెను,  

చేరువునే ఉన్న తమసా నదీతీరము చేరెను, 

బురదలేని రేవుని చూచి  శిష్యుని పిలిచెను,    

శిష్యుడౌ భరధ్వాజునికి రేవు గూర్చి తెలిపెను, సత్య! 

61.

రేవు, సత్పురుషుని హృదివలె యున్నదనెను,  

సుందర నిర్మల మనోహరంగా యున్నదనెను,

శిష్యుడితో, చేతి జలపాత్ర,  క్రిందయుంచమనెను, 

తదుపరి తనకు నారచీర తెచ్చి యిమ్మనెను, 

వాల్మీకి తమసాతీర్థంలో స్నానమాడ వెడలెను, సత్య! 

62.

శిష్యుడు వాల్మీకికి  నారచీర తెచ్చి యిచ్చెను, 

ఇంద్రియనిగ్రహుడైన వాల్మీకి చీర చేకొనెను, 

అది చేతబట్టి  విశాలవనాన సంచరించెను, 

తమసా తీర్థంవద్ద క్రౌంచపక్షి జంటను కాంచెను, 

అవి ఎడబాటులేక మనోహరంగా కూయుచుండెను, సత్య! 

63.

ఇంతలో వచ్చె క్రూర నిర్ణయముకల బోయవాడు,

పశుపక్ష్యాదులను నిష్కారణంగా ద్వేషించువాడు,

వాల్మీకిముని చూచుచున్నాడని యెరిగినవాడు,

అయిననూ భయసంకోచములు లేకుండినవాడు,

రతిక్రీడనున్న పక్షుల్లో మగపక్షిపై బాణం వేసె, సత్య! 

64.

బాణం తగిలి రక్తసిక్తమై క్రౌంచ  నేలకూలెను, 

బాధలో పొరలుచున్న క్రౌంచను క్రౌంచి చూచెను, 

పెనిమిటి వియోగంతో క్రౌంచి దీనముగా ఏడ్చెను, 

బోయచే నేలకూలిన క్రౌంచను వాల్మీకి చూచెను,

ధర్మాత్ముడైన మహర్షికి క్రౌంచపై జాలి కలిగె, సత్య! 

65.

విలపించే క్రౌంచిపై వాల్మీకికి  దయకలిగెను, 

క్రౌంచ మరణము వాల్మీకిమునిని బాధించెను, 

బోయవాని చర్య ధర్మముకాదని తలంచెను, 

నిర్భాగ్యుడని బోయపై వాల్మీకి కోపగించెను,

తత్ క్షణాన ముని నోటినుండొక వాక్యం వెలువడె, సత్య ! 

66.

క్రౌంచ జంటలో మగపక్షిని బోయ చంపెననెను, 

మన్మథపరవశులౌ  జంటను విడదీసెననెను,

అందుచే బోయ కలకాలం జీవించబోడనెను, 

తాను పలికిన వాక్యం మరల పరిశీలించెను, 

శోకించు పక్షినిగని దుఃఖంతో పల్కితిననుకొనె, సత్య! 

67.

వాల్మీకి మహాపండితుడు, బుద్ధిమంతుడు,  

శోకార్తుడై ఆ వాక్యం పలికితినని గ్రహించినాడు,    

వాక్యంలో నాల్గుపాదాలున్నవని యెరిగినాడు, 

ప్రతి పాదంలో సమానాక్షరాలున్నట్లు గ్రహించినాడు,  

అది సంగీతవాద్యాలతో పాడదగినదనుకొనె, సత్య! 

68.

    తాను ఆ వాక్యాన్ని శ్లోకమని పిలిచెదననెను, 

    అది  శ్లోకమను పేరిటే ప్రసిద్ధి కావలెననెను, 

    అత్యుత్తమమౌ ఆ వాక్యాన్ని శిష్యుడు స్వీకరించెను, 

   ‘మా నిషాద...’ ఇత్యాది వాక్యాలను కంఠస్థం చేసెను,

   శిష్యుడి చర్యకు వాల్మీకిమహర్షి సంతసించెను, సత్య!   

69.  

పిదప వాల్మీకి తీర్థమందు స్నానము చేసెను,

జరిగిన సంఘటన గూర్చే ఆలోచించసాగెను, 

శిష్యుడు, జలంతో నిండిన, కలశం తీసుకొనెను, 

మునిని అనుసరించి ఆశ్రమానికి మరలెను, 

శిష్యులు, పక్షి వృత్తాంతమే ముచ్చటించుకొనిరి, సత్య! 

70.

లోకములు సృజించినవాడు, చతుర్ముఖుడు,

లోకాధిపతి, గొప్ప తేజస్వి బ్రహ్మదేవుడు, 

వాల్మీకిని చూచుటకై స్వయముగ వచ్చినాడు, 

బ్రహ్మను చూసి ముని ఆశ్చర్యచకితుడైనాడు, 

అంజలి ఘటించి, యథాశాస్త్రంగా ప్రణమిల్లినాడు, సత్య! 


No comments:

Post a Comment

Pages