రక్త సంబంధం - అచ్చంగా తెలుగు

 రక్త సంబంధం 

(కథ )
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.




పూణే రైల్వేస్టేషన్.
కోణార్క ఎక్సప్రెస్ కదలడానికి సిద్ధంగా ఉంది.
హడావుడిగా వచ్చి రైలు ఎక్కింది మైత్రేయి.
అప్పుడే రైలు కదిలింది.
ఆ సెకెండ్ క్లాసు కంపార్ట్మెంట్ లో  తన సీటు నెంబర్ చూసుకుంటూ బెర్త్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అప్పటికే అక్కడ నలుగురు యువకులు కూర్చుని ఉన్నారు.
ఆమెది లోయర్ బెర్త్.
సందేహిస్తూనే వెళ్లి కిటికీ పక్కన వెళ్లి కూర్చుంది.
రైలు వేగం పుంజుకొంది.
'తన ప్రయాణం విజయవాడ దాకా. వీళ్ళు అక్కడి దాకా వస్తారా?' అనుకుంటూ వాళ్ళను చూసింది.  కాస్త డీసెంట్ గా కనిపించారు.

'వెకిలి వేషాలు వేయరు కదా!వేస్తే రైల్వే పోలీసులకు చెప్తాను!'అనుకుంది ధైర్యంగా.
ఒకసారి చైన్ వైపు చూసింది. ఇంకాస్త ధైర్యం వచ్చింది.

సర్దుకొని కూర్చుంది.

ఈ లోపల "ఎక్కావా?" అంటూ అమ్మ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది.
మైత్రేయి లేచి తలుపు దగ్గరికి వచ్చింది.
"ఎక్కాను... కంగారు పడి పదిసార్లు ఫోన్ చెయ్యకు! నేనే చేస్తాను!"అని అమ్మతో చెప్పింది.

కాసేపు తలుపు దగ్గరే నిల్చొని ఆ తర్వాత బెర్త్ దగ్గరికి వచ్చింది.

ఆ యువకులు వాళ్ళల్లో వాళ్ళు మరాఠీలో మాట్లాడుకొంటున్నారు.
అందులో ఒకడు జుట్టు పొడుగ్గా పెంచుకొని ఆడపిల్లలాగా పోనీటైల్ వేసుకొని ఉన్నాడు. వాడి  కుడి చెవికి రింగ్ పెట్టుకున్నాడు.

"విశాల్!ఏం చేద్దామురా?" అన్నాడు పోనీటైల్ వాడు.

"చేసేదేముంది యష్!.. వెయిట్ చెయ్యడమే!"
అన్నాడు ఎఱ్ఱ చొక్కా వాడు.

"ఇంట్లో పరిస్థితి బాగలేదురా!... డబ్బులు రాకపోతే  ఎలాగారా ?"అన్నాడు మూడోవాడు. అతడు తెల్లగా  పొడుగ్గా వున్నాడు. 

"ఇంట్లో వాళ్లకు ఏదో ఒకటి చెప్పొచ్చు గోకుల్ !హైదరాబాద్ ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ దొరికితే బాగుండు!పది రోజుల్లో అద్దె కట్టకపోతే రూమ్ ఖాళీ చెయ్యమన్నాడా సన్నాసి."అన్నాడు యష్.

నాలుగో వాడు నల్లగా సన్నగా ఉన్నాడు.
వీళ్లందరి కంటే చిన్నగా కనిపిస్తున్నాడు.

"దిగులు పడకండి భయ్యా!నా డబ్బులు తీసుకోండి!"అన్నాడు.

మిగిలిన వాళ్ళు నవ్వారు.

"జీతూ గాడికి ప్రాబ్లమ్స్ లేవురా!మనకు బ్యాంకు లెక్కన కుదిరాడు!"అని యష్ అతడి తల మీద చేత్తో తట్టాడు.

"ప్రాబ్లమ్స్ ఉండడానికి నాకు మీలాగా ఫ్యామిలీ ఉంటేగా?"జీతూ మాట పూర్తి కాకుండానే 
"మేము నీ ఫ్యామిలీ కాదట్రా!"అన్నాడు గోకుల్.

మైత్రేయికి అర్ధం అయింది.వాళ్ళు హైదరాబాద్ దాకా వస్తున్నారు.
వాళ్ళ సామాన్లను చూసింది.గిటార్, తబలా లాంటి సంగీత పరికరాలు.
వాళ్ళ మీద కాస్త మంచి అభిప్రాయం కుదిరింది ఆమెకు.
టికెట్ కలెక్టర్ వచ్చి వెళ్ళాడు.

కాసేపటికి బ్యాగు లోనుంచి బాక్స్ తీసింది.
అరడజను చపాతీలు ఉన్నాయి.
పూణేలో ఉద్యోగం చేస్తూ  పేయింగ్ గెస్ట్ గా ఒక ఫ్యామిలీలో ఉంటోంది. ఆ ఇంటి ఆంటీ చాలా మంచిది. డబ్బు మనిషి కాదు. విజయవాడ దాకా వెళ్లాలని చపాతీలు, కూరతో పాటు రెండో రోజు మధ్యాహ్నం దాకా ఉంటాయని కాసిని గట్టి పూరీలు కూడా పెట్టి ఇచ్చింది.
వాళ్ళేమి తింటున్నారో చూసింది.
అతి చౌకగా ఉన్న బన్నులు తింటున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు మరి!
కాసేపటికి  టిఫిన్ తినడం ముగించింది మైత్రేయి.

"నేను పై బెర్త్ మీద పడుకుంటాను!"అంది హిందీలో వాళ్ళతో.

వాళ్లు పైన ఉన్న తమ సామానును తీశారు.
పైన తన బ్యాగును పెట్టుకొని పడుకొంది.
ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు.
వాళ్ళ నలుగురు ఎలా ప్రవర్తిస్తారేమోనని కొంచెం బెరుగ్గా అనిపించింది.
అదేమీ లేదు.
తెల్లవారుతుండగా కిందకు దిగింది మైత్రేయి.
ఆ నలుగురు కూడా లేచారు.
ఈ లోపల 'టీ టీ 'అంటూ తిరుగుతున్నాడు చాయ్ వాలా.
"టీ తాగుదాము!"అన్నాడు యష్.
"వద్దులేరా!కాసేపటికి హైదరాబాద్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక  టీ తాగుదాం!"అన్నాడు విశాల్.
 కిందకు వచ్చి కూర్చుంది.
"మీరు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారా?" అని అడిగింది.
"అవును "అన్నాడు గోకుల్.
"నేను విజయవాడ వెళ్తున్నాను. వారం రోజుల్లో నా పెళ్లి. మీ హైదరాబాద్ ప్రోగ్రామ్ అయ్యాక విజయవాడ రండి!మ్యూజిక్ ప్రోగ్రామ్ చేద్దురుగానీ!"అంది.
వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి.
విశాల్ తన ఫోన్ లో నుంచి వీడియోలు ఆమెకు చూపించాడు.
"చూడండి మేడం!మాకు క్లాసికల్ మ్యూజిక్ తో పాటు హిందీ సినిమా పాటలు కూడా వచ్చు!వెస్ట్రన్ కూడా చేస్తాము!సుస్వర బ్రాండ్ మాది."అన్నాడు గబగబా.

వీడియోలు చూస్తుంటే చాయ్ వాలా మళ్ళీ వచ్చాడు.
వాళ్లకు కూడా టీలు తీసుకొంది మైత్రేయి.

"బాగున్నాయి!"అని వీడియోలను మెచ్చుకొంది.

కాసేపు వాళ్ళ స్థితిగతుల గురించి చెప్పారు వాళ్ళు.

గోకుల్ కాశ్మీరుకు చెందినవాడు.

"టెర్రరిస్టులు మా ఊరి మీద పడ్డారు. ఆ దాడిలో మా అత్త, మామ, తాత, బామ్మ చనిపోయారు. మమ్మల్ని, మా అత్త పిల్లల్ని తీసుకొని మా అమ్మా నాన్న ఎలాగో పారిపోయి ట్రైన్ ఎక్కి పూణేకు వచ్చారు.దగుడుషేఠు గణపతి గుడి దగ్గర పూజా సామాగ్రిని అమ్ముతూ మమ్మల్ని పెంచారు. నేను సంగీతం నేర్చుకొని వీళ్ళతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తుంటాను."అని వివరించాడు.

"మేము కూడా పేదరికం నుంచి వచ్చిన వాళ్లమే. కానీ జీతూ మాత్రం అనాథ!"అని చెప్పాడు యష్.

బాక్స్ తీసి టిఫిన్ వాళ్ళ కిచ్చింది ఆమె.
"మీరు విజయవాడదాకా వెళ్ళాలి కదా!ఉంచుకోండి!"అన్నాడు యష్ సందేహంగా.

"ఇంకా పూరీలు ఉన్నాయి!"అని ఇడ్లీ, వడ కూడా వాళ్ళకోసం తెప్పించింది.
ఆబగా తింటున్నాడు జీతూ.
"మీరు ఇచ్చే డబ్బుల్లో వీటి ఖర్చు తగ్గించండి మేడం!"అన్నాడు విశాల్ మొహమాటంగా.
నవ్వింది మైత్రేయి.
ఇంతలో హైదరాబాద్ వచ్చింది.
వాళ్ళు సామాన్లు తీసుకొన్నారు నలుగురు యువకులు.
వాళ్ళ ఫోన్ నెంబర్లను ఆమెకు ఇచ్చారు.
తన నెంబర్ చెప్పింది ఆమె.
"మీ పేరు?"
అడిగాడు గోకుల్.
"మైత్రేయి" అంది.
స్టేషన్ లో రైలు ఆగింది.
ఆ నలుగురు ఆమెకు చాలా సార్లు కృతజ్ఞతలు చెప్పి దిగిపోయారు.
సీటుకు జారగిల పడింది మైత్రేయి.
చిన్నప్పటి నుండి తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేమాట.
"ఇతరులకు తోచినంత సహాయం చేస్తే మనకు భగవంతుడు తోడుగా ఉంటాడు."
ఆ మాటను ఎప్పుడూ మరచిపోదు.
విజయవాడ స్టేషన్ వచ్చింది.
కూతురిని దించుకోవడానికి రామకృష్ణతో పాటు కాబోయే భర్త హితేష్ కూడా వచ్చాడు.
రైల్లో కలిసిన నలుగురు యువకుల గురించి చెప్పింది మైత్రేయి.
నవ్వారు ఇద్దరు.

"మామయ్యగారి  కూతురివి. పరోపకారి పాపమ్మగా అయిపోయావన్న మాట!"అన్నాడు హితేష్.
"ఏదో తోచినంత!"అంది మైత్రేయి కూడా నవ్వుతూ.

ఆరునెలల్లోనే  హైదరాబాద్ నుంచి పూణేలోని కంపెనీకి మారాడు హితేష్. కొత్త కాపురాన్ని మొదలు పెట్టారు హితేష్, మైత్రేయిలు.

మూడేళ్లు గడిచాయి.తనకు తెలిసిన వాళ్లకు సుస్వర బ్రాండ్ గురించి చెప్పి ప్రోగ్రామ్స్ ఇప్పించేది మైత్రేయి.పూణేలో మైత్రేయి,హితేష్ లకు బంధువులలాగా ఉన్నారు ఆ నలుగురు మిత్రులు. వాళ్ల కుటుంబాల వాళ్లు కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు.
ఈ మూడేళ్లలో సుస్వర బ్రాండ్ కు మంచి పేరు వచ్చింది.ఆ నలుగురు స్థిరపడ్డారు.
పూణే చుట్టుప్రక్కల మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ డబ్బులు సంపాదించారు.
మైత్రేయి గర్భవతి అయింది.
ఉద్యోగం ఉంది కాబట్టి పూణేలోనే కాన్పు అనుకున్నారందరు.
ఆ రోజు రాత్రికి మైత్రేయికి ప్రసవం అయింది. ఆడపిల్ల పుట్టింది. కానీ  బొడ్డు కోయంగానే పాపకు రక్తస్రావం అయింది.వెంటనే రక్తం ఎక్కించాలన్నారు డాక్టర్లు.
హితేష్ బ్లడ్ గ్రూపు పాపకు సరిపోలేదు.
అందరూ కంగారు పడ్డారు.
తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేస్తూ,విశాల్ కు కూడా ఫోన్ చేసి విషయం చెప్పాడు హితేష్.
"ఎవరైనా ఆరోగ్యవంతలు ఉంటే కావాలి. ఇప్పుడే పుట్టిన మా బేబీకి రక్తం ఎక్కించాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి!"
వార్తను వినంగానే హాస్పిటల్ కు వచ్చారు నలుగురు మిత్రులు.

"రక్తం ఇచ్చే వాళ్లకు పదేళ్ల కిందటి నుంచి మలేరియా లాంటి జ్వరాలు వచ్చి ఉండకూడదట!అలాంటి వాళ్ళు దొరుకుతారా?" అడిగాడు కంగారుగా హితేష్.

"చూద్దాము!చూద్దాము!"అంటూ హితేష్ కు ధైర్యం చెప్పారందరు.

తెల్లవారే సరికి హితేష్ మిత్రులు కొంతమంది వచ్చి చేరారు. డాక్టర్లు కొంత మందికి టెస్టులు చేశారు. వాళ్ళల్లో జీతూ రక్తం పాపకు సరిపోయింది.
పదేళ్ల కిందటి నుంచి అతడికి సీజనల్ వచ్చే జ్వరాల్లో ఒక్కటయినా రాలేదు.కరోనా కూడా అంటుకోలేదు.

మొత్తానికి పాపకు రక్తం ఎక్కించారు డాక్టర్లు.
రెండు రోజులకు పాపను ఐసియు నుండి రూముకు తీసుకొచ్చారు.
పాప చిరునవ్వులు చిందిస్తూ ఉంది.

"ఇదిగో నీ మేనకోడలు."అంటూ జీతూకు పాపను అందించాడు హితేష్. మురిపెంగా 
పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు జీతూ.తన రక్తాన్ని పంచుకున్న ఆ పాపను గుండెలకు హత్తుకొన్నాడు.
ఏదో తెలియని బంధము, బాధ్యత అతడి హృదయాన్ని కట్టిపడేసింది.
'ఈ చిన్నారికి నేను మేనమామను.' అనుకున్నాడు సంతోషంగా.
పాప నవ్వింది.

(సమాప్తం )

No comments:

Post a Comment

Pages