గూఢచారులుగా పనిచేసిన రావణాసురుని మంత్రులు శుక సారణులు
అంబడిపూడి శ్యామసుందర రావు
రావణాసురుని మంత్రులైన శుక ,సారణుల ప్రస్తావన రామాయణంలో యుద్ధ కాండ లో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు వస్తుంది శ్రీరాముడు సేతువును నిర్మించి యుద్దానికి సిద్ధమవుతుండగా రావణుడు ఈ ఇద్దరు మంత్రులను వానర సేన లో మారు వేషాలతో ప్రవేశించి వానర బలాలను వారి శక్తి సామర్ధ్యాల గురించి తెలుసుకొని తనకు తెలియజేసే కార్యం పై అంటే గూఢచారులుగా పంపిస్తాడు. రాముడు వానర సైన్యంతో సముద్రాన్ని దాటి లంకకు చేరాడని తెలియగానే ధైర్యవంతుడైన రావణాసురుడు మానవమాత్రులకు సాధ్యం కానీ పనిని అంటే సేతువును నిర్మించి లంకకు చేరి యుద్దానికి సన్నద్ధమవుతున్న విషయాన్ని తెలుసుకుని ప్రమాదాన్ని గుర్తించి తన మంత్రులైన శుక సారణులను వానర సైన్యం యొక్క బలాబలాను అందలి వీరుల శక్తి సామర్ధ్యాలను తెలుసుకు రావడానికి పంప నిశ్చయించి వారితో," మంత్రి పుంగవులారా ఇదివరకు కనీవినీ ఎరుగని సేతువును సముద్రం మీద నిర్మించి ఇంతవరకు ఎవరికీ రానలవి కానీ మన పట్టణానికి వానర సైన్యంతో సముద్రాన్ని దాటి వచ్చినదని తెలిసింది. సముద్రానికి సేతువు కట్టడం అనేది నమ్మశక్యం కాకుండా ఉన్నది.ఆ దాటి వచ్చిన వానర సైన్యం ఎటువంటిదో మనము తెలుసుకోవాలి అందువల్ల మీరు ఉభయులు ఎవరికీ తెలియకుండా వానర సైన్యం లోనికి పోయి ఆ సైన్యం యొక్క పరిమాణం, ఆ వానరుల పరాక్రమము ఎటువంటిదో ,వారిలో ముఖ్యులు ఎవరో, ఆ రాముడి మంత్రులు ఎవరో సుగ్రీవుని మంత్రులు ఎవరో, యుద్ధ సమయంలో ముందు నిలిచే వానర వీరులెవరో మీరు తెలుసుకొని రావాలి అంతే కాకుండా బలవంతులైన వానర వీరులు ఏయే దేశాల వారో , ఇప్పుడు రాముడి ప్రయత్నం ఏమిటి ? రాముడి పరాక్రమము ఎటువంటిది ఎటువంటి ఆయుధాలను ఉపయోగిస్తాడు రాముని తమ్ముడైన లక్ష్మణుడి పరాక్రమము ఎట్టిది వానరుల సేనానాయకుడు ఎవరు మొదలైన విషయాలను అన్నీటిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని మీరు వెంటనే ఇక్కడకు రావాలి." అని చెప్పినాడు.
రాజాజ్ఞ ప్రకారం మంత్రులైన శుక సారణులు ఇద్దరు వానర వేషాలలో ఎవరికీ తెలియకుండా వానర సైన్యం లోకి ప్రవేశించారు. వానర సైన్యాన్ని అంతా చూచిన వారికి వానర సైన్యం పరిమాణానికి వాళ్ళ ఒళ్ళు గగుర్పొడిచింది. ఆ వానర సైన్యాన్ని లెక్కించడం వారికి అసాధ్యం అనిపించింది ఎందుకంటే ఆ వానర సైన్యం పర్వత శిఖరాల మీద కొండ చరియల్లో, సముద్రతీరాన వనాలలో, కొంత సైన్యం ఇంకా సముద్రాన్ని దాటి వస్తుంది విడిది చేసిన మహా బలవంతులు సింహనాదాలు చేస్తున్నారు వానర సైన్యం శుక సారణులకు ఒక మహాసముద్రం వాలే తోచింది.వారు వానర వేషాలలో ప్రచ్ఛన్నముగా తిరుగు ఉన్నప్పటికీ మహా తేజోవంతుడైన విభీషణుడు వారిని గుర్తించి వారిని రామునికి అప్పజెప్పాడు.రాముని చూచిన వారిద్దరూ ప్రాణాలపై ఆశ వదులుకొని చేతులు జోడించి, "ఓ పుణ్యాత్ముడా ఈ వానర బలాన్ని చూసి ఇక్కడి సంగతులు అన్నీ తెలుసుకు రమ్మని మా ఏలిక రావణాసురుడు పంపించాడు అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము
కరుణాసాగరుడైన రాముడు వారిద్దరిని చూచి నవ్వుతు ,"మా బలాన్ని అంతా చూచినట్లయితే మీ ప్రభువు రావణాసురుడు మీకు చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని ఉన్నట్లయితే మీరు మీ దారిన మీరు యదేచ్చగా పోవచ్చు లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే అంతా చక్కగా చూచి పోండి ఈ విభీషణుడి మా సేనను అంతా చూపిస్తాడు . పట్టు బడ్డందుకు భయపడవద్దు. మీకు ప్రాణ భయం ఏమీ లేదు ఆయుధాలు లేని వాళ్ళను, దూతలను చంపకూడదు మేము మిమ్ములను చంపము.ఓ రాక్షస మంత్రులారా .మీరు లంక పట్టణమునకు పోయి మీ ప్రభువుకు నేను చెప్పే మాటలు ఎక్కువ తక్కువలు కాకుండా చెప్పండి "అని రాముడు శుక సారణులతో చెప్పి తన సందేశాన్ని వారికి చెబుతాడు.
"ఓ రావణా నీ సేనలను బంధువులను అందరిని సమకూర్చుకొని యుద్దానికి సిద్ధంగా వుండు. రేపు ప్రాతః కాలాన నీ లంక పట్టణ బహిర్ ద్వారాలను ప్రాకారాలను బద్దలు కొట్టి నీ రాక్షస సేన ను ధ్వంసం చేస్తాను నీవు నీ బలాలతో సిద్ధంగా వుండు" అని రాముడు తన సందేశాన్ని శుక సారణులకు చెప్పినాడు.
ధర్మవత్సలుడైన రాముడిని శుక సారణులు అభినందించి లంకా పట్టణానికి చేరి రావణాసురుని సమక్షమున చేరి," ఓ రాజా మేము వానర బలాలను అన్నింటిని చూచినాము,కానీ మమ్మల్ని విభీషణుడు పట్టుకొని రాముడి సమక్షమున తీసుకు వెళ్ళినారు. ధర్మాత్ముడైన రాముడు మమ్మల్ని విడిచి పెట్టాడు రాముడు అతని తమ్ముడు లక్ష్మణుడు విభీషణుడు సుగ్రీవుడు నలుగురు ఏకం అయినారు ఆ నలుగురు లంకా పట్టణాన్ని ప్రాకారాలతో పెళ్లగించగలరు రాముని చూసినాక మిగిలిన ముగ్గురితో పనిలేదు రాముడొక్కడే లంకాపట్టణాన్ని అంతా సంహారము చేయగలడని అనిపించింది .రాజా రాముడు నూరు యోజనాలు పొడవు ఉన్న, సముద్రానికి సేతువు నిర్మించాడు ఆ సేతువు మీది నుండి వానరసేన సముద్రాన్ని దాటి వచ్చింది. మహా బలవంతులైన వానర వీరులందరు యుద్దోత్సాహము తో ఉన్నారు వారితో యుద్ధము వద్దు. నీవు నీ కోపాన్ని వదిలి పెట్టి శాంతించు రామునికి సీతాదేవిని ఇవ్వు "అని శుక సారణులు రావణాసురునితో హితవచనాలు చెప్పి వారికి అప్పగించిన కార్యాన్ని ముగిస్తారు.




No comments:
Post a Comment