వన భోజనాలు - అచ్చంగా తెలుగు

కార్తీక వనభోజనాలు 

-సుజాత.పి.వి.ఎల్,

సైనిక్ పురి, సికిందరాబాద్ 




వనమందు విరియుచు విరబూసిన పుష్పగుచ్ఛములా

మనసులు వికసించి మమకార బంధములు మటుమాయమయ్యే

పచ్చదనమున పరిమళమై పరమానందమున మునిగె

అచ్చమయిన సఖ్యసౌహార్ద మాలిక విరౠసె ధాత్రీవాసమున

పచ్చని చెట్ల నీడన కూచొని చిలుకల కిలకిల స్వరమందు

పిండివంటల ఘుమఘుమలతో
 పసిడికాంతుల ప్రకృతి పలకరింపుల నడుమ 
భుజియించు భోజనం అమృతతుల్యం!
మనసు పరిమళమై పరవశించు పల్లవగానము 
వనభోజన సమారాధనమున
వసుధ మురిసె కార్తికమాసమందు॥

వనభోజనం అంటే కేవలం భోజనం కాదు. ప్రకృతిలో మనసుల కలయిక, ప్రేమ, స్నేహం, ఆనందం కలిసిన పండుగ.
పచ్చని చెట్ల నీడలో నవ్వులు, పాటలు, వంటల సువాసనలతో
మానవసంబంధాల సౌరభం వెదజల్లే వసంతసమయం అది. వనభోజనాలు కార్తీక మాస పూజా విధానాల్లో ముఖ్యమైనది. వన భోజనం వల్ల ముక్తి, భక్తి, సమైక్యతే కాకుండా ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అందరూ కలిసి ఆనందంగా పచ్చటి ప్రకృతితో మమేకమై ఐక్యంగా ఉండటం వల్ల బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు మరింత బలపడతాయి. 'వనము ' అంటే అనేక వృక్షముల సముదాయము. ముఖ్యంగా ఉసిరి, రావి, మర్రి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, నేరేడు, మామిడి, వేప, పనస, ఇత్యాది వృక్షాలతో..తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ చెట్లతో, రకరకాల పూల మొక్కలతో కూడివుండాలి.  దాహం వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి. ఇవి ఉన్న చోట జింకలు, కుందేళ్లు, నెమళ్ళు, చిలుకలు మొదలైన సాధు జీవులు తప్పకుండా ఉంటాయి.  దానినే 'వనము ' అంటారు కానీ, అడవిని 'వనము' అనరు. 'వనము ' అంటే వసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట. వేటకు క్రూరత్వానికి తావు లేనిది వనము. అట్టి వనము దేవతా స్వరూపము. ఎందుకంటే, పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు మొదలైనవి..దేవతలకు, మహర్షులకు ప్రతి రూపాలు.  ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాలమైన తపోవనం నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశం. అలాంటి వనాలను ఏడాదికొక్కసారైనా, ప్రత్యేకించి కార్తీక మాసంలో దర్శించడం ఏంతో ముఖ్యం, అదృష్టం కూడాను. అందుకనే కార్తీక వనభోజనాలనే నియమాన్ని మన పూర్వీకులు పెట్టారు. ఇందువల్ల ఆధ్యాత్మిక,ఆరోగ్య, ఆనందమైన కారణాలు ఎన్నో వున్నాయి. కార్తీక మాసం నాటికి వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమౌతాయి. చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ 'కార్తీక మాసం'. ఆధ్యాత్మికపరంగా శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఉసిరిని మనం విష్ణుమూర్తిగా భావిస్తాం. ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షం, ఆమలిక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనాలకు 'ధాత్రీ భోజనం' అనే పేరు కూడా ఉంది. ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శుద్ధమైన గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడింది. ధాత్రీ వృక్షాల నీడన అరిటాకుల్లోకానీ, పనసాకుల్లో గాని పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టుకింద భక్తి శ్రద్దలతో పూజ చేసి భోజనం భుజిస్తే అశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేదపురాణాలు చెబుతున్నాయి. అందుకే వన భోజనాలు ఏర్పాటుచేశారు మన పెద్దలు. ' దేవుడి మీద భక్తా? లేక ప్రసాదం మీద భక్తా?' అంటే..పైకి ఎవరూ ఒప్పుకోకపోయినా ప్రసాదం మీద భక్తే అనిపిస్తుంది నాకు. కనీసం భోజనం మీద భక్తి తోనైనా వనవిహారానికి వచ్చేవారున్నారు కదా! స్వార్ధంలో పరమార్థం అంటే ఇదేకామోసు!.

వనభోజనం అంటే కేవలం తిని తిరగడమే కాదు. దానికో పద్ధతి, నియమం ఉంది. నిత్య కృత్యాలు, స్నానపానాదులు పూర్తి చేసుకున్న తర్వాత,
అందరూ బంధుమిత్రులు , పరిచయస్తులు,
ఇరుగుపొరుగు కలిసి, ఒకే వాహనంలో వారు ఎంచుకున్న వనానికి సూర్యోదయానికి పూర్వమే చేరుకోవాలి. ముందుగా ఒక వట వృక్షం కింద ఇష్టదేవతా విగ్రహాలుంచి పూలతో అలంకరించి పూజ చేయాలి. ఆనందం పంచుకోవాలంటే అందరూ తలా ఒక పని చేస్తూ, మగవారు పాటలు పాడుతూ కూరలు తరుగుతుంటే, ఆడవారు చీర కొంగులను, డ్రెస్ చున్నీలను నడుం చుట్టూ బిగించి అందరూ తలోరకం వండుతూ ఉంటే..ఆ కిక్కే వేరప్పా..! పిల్లలంతా కలిసి చేసి అల్లరిలో మజా ఉంటుంది. చాటుమాటుగా చూసుకునే కుర్రజంట చూపుల కలయిక ఖుషీగా ఉంటుంది. అనుభవంతో పెద్దలు చెప్పే సూక్తులు, ఛలోక్తుల చురకల వేడి వేరుగా వున్నా..సరదాగా ఉంటుంది. కొత్తగా పెళ్లైన దంపతుల గుసగుసల తమాషాల వాడే వేరు. ఇన్ని ఆనందాల మధ్య జరిగే సాంప్రదాయ, సంస్కృతుల సమాన వేదిక వన సమారాధనం .
సామూహికంగా కలిసిమెలిసి చేసిన శాకాహార వంటకాలు పూర్తయిన తర్వాత, ఆ వండిన పదార్థాలు పూజాస్థలానికి తీసికెళ్ళి మహా నివేదన చేసి, ఆ ప్రసాదాన్ని అందరూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటుంటే..' అబ్బో! సామూహిక సహజీవనంలో ఇంత రుచి ఉందా !'' అని అనిపించక మానదు. సమిష్టి భోజనానంతరం తిన్నది అరగాలి కదా!..ఇక ఆట పాటలదే ప్రముఖ స్ధానం.  అంతరించిపోతున్న ప్రాచీన సంప్రదాయ ఆటలకు సమాన వేదిక ఈ వన భోజనాలు. ఈ ఆట పాటల్లోనే కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు కలుగుతాయి. కొత్త సంబంధాలు బంధుత్వంగా మారడానికి, మాఘ, ఫాల్గుణ మాస ముహుర్తాలు మనకోసం మనముందే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, కార్తీక వనభోజన ప్రదేశాన్ని మించిన గొప్ప ' మ్యారేజ్ బ్యూరో ' ఈ ప్రపంచంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.
మరింకెందుకు ఆలస్యం ? 'వన భోజనాలకు' త్వరపడండి..మిత్ర బంధుత్వ సంబంధాలు కలుపుకుని ఒకింటి వాళ్ళు కండి ..!

***

No comments:

Post a Comment

Pages