ఆ(య్! మా(చదివిన వారందరి)ది నర్సాపుర(వండి!
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
జనని మీద, జన్మభూమి మీద ప్రేమాభిమానాలు లేనివారుండరు. ఏదేశమేగినా, ఎందుకాలిడినా పుట్టినూరుతో పెనవేసుకున్న ఆత్మీయాతానుబంధాలు అప్పుడప్పుడు మదిని తడి చేస్తుంటాయి. పసితనం నుండి పెద్దతనందాకా తోడుండే మధురానుభూతులవి. ఒక ఊరివాళ్ళు ఎక్కడన్నా కలిస్తే ఇక అడ్డూఆపూలేని కబుర్ల ప్రవాహం సాగుతూనే ఉంటుంది. ఊరంటేనే జీవిత కథలు. తమ ప్రాంతాల విషయాలనీ, విశేషాలనీ తలచుకోని వారుండరు. అయితే ఊళ్ళోని మనుషుల్నీ, కట్టడాల్ని, సంగతులని, సందర్భాలని కథలుగా మలచి అందించిన తెలుగు రచయితలు బహు అరుదనే చెప్పాలి. అటువంటి రచయితల ద్వారా ఆయా ఊళ్ళకు చెందినవాళ్లు చదివి మురిసిపోతే, ఇతరులు ఆ ఊరి మూలాల్ని గ్రహించి ఆనందించడమే కాక, తమ ఊరిని స్ఫురణకు తెచ్చుకుని సంతోషాంబుధిలో ఓలలాడతారు. శ్రీమతి భావరాజు పద్మినిగారు ఇరవయ్యొక్క కథలతో వెలువరించిన ఆ(య్! మాది నర్సాపుర(వండీ ప్రతి ఒక్క తెలుగు పాఠకుడు చదివి తీరాల్సిన వాస్తవ కథల సంపుటి. కథలు చదువుతూంటే మనం నర్సాపురవాసులమైపోతాం! అక్కడి భాషకి సరదాపడిపోతాం!! ఒక్కో కథా ఒక్కో జీవ గోదావరి చుక్క. కథలు చదివి అనునుభవైకవేద్య అనుభూతిని పొందాలి తప్ప, నే రాసినా, చెప్పినా అది కలగదు. ఇందులో ఒక కథ ’మూగమనసులు మేడ’ ను మచ్చుకు మీ మనసుకు రుచి చూపిస్తాను. అప్పట్లో మూగమనసులు సినిమా ఓ భావ సంచలనం. గోదారి అందాల్ని వెండితెర మీద ఆరబెట్టి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన సినిమా. ఇప్పటి తరం కచ్చితంగా చూడాల్సిన సినిమా. అలాంటి సినిమా నేపథ్యాన్నీ, మనకు తెలియని ఎన్నో విషయాలనీ పూసగుచ్చిన తీరు విస్మయపరుస్తుంది. తారలు వారి తీరులు, వాళ్లకి ఏర్పరచిన బసలు, సమస్యలు వాటినెదుర్కొన్న తీరు ఒక్కటనేమిటి, ఎన్నెన్ని విషయాలని పొందుపర్చారో.
నేనూ గోదావరి వాసినే! కాకపోతే నాన్నగారి ఉద్యోగరిత్యా ఎప్పుడో దూరమయ్యాను. అయితేనేం, ఈ పుస్తకం నా మనసును ఎంతగానో ఊరటపరచింది. అందుకే మనసు పేటికలో భద్రపరచుకున్నాను.
మీరూ చదవండీ, మీ మనసు రెక్కలు కట్టుకుని నర్సాపురంలో అలా అలా తిరిగి, మీ మీ ఊళ్ళకి చేరి అక్కడి చెట్లమీదో, గుడి గోపురాలమీదో వాలి ఊరంతటినీ వీక్షించకపోతే ఒట్టు!
అమ్మా, పుస్తకంలో జన్మభూమి నర్సాపురానికి ప్రాణప్రతిష్ట చేసి జన్మ ధన్యం చేసుకున్నావు. శుభమస్తు!
***
పుస్తకం కొనుగోలు లింక్:
Aay! Maadi Narsapuravandi - Acchamgatelugu
***




No comments:
Post a Comment