'ఆకాశం బాష్పావృతమైన రోజు'
--సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.
ప్రాణం నిలబెట్టే జ్ఞానార్జనకై
రాత్రింబగళ్లు ధారబోస్తున్న వాళ్లు…
శ్వాసను కొనసాగించే ప్రయాణంలో,
శ్వాస కోల్పోయారంటే ఎంత విషాదం
వైద్యవిద్యకు అంకితమైన చేతులు
సాకారం చేసుకునే కలలిచ్చిన కళ్ళు
ధవళ వస్త్రధారణతో మెరవాల్సిన
ఆ దేహాలు కాలి అస్తిత్వం కోల్పోయాయి..
రెక్కలు తెగిన రాబందులా మృత్యువిహంగం కుప్ప కూలింది
తమ వృత్తిలో రాణించాల్సిన వాళ్ళు అర్ధంతరంగా రాలిపోయారు
బిడ్డల భవిష్యత్ పై తల్లిదండ్రులు ఆశలు..
క్షణంలో ఆవిరయ్యాయి
ఆశలు, ఆశయాలని అసంపూర్ణం చేసిన ఘడియ అది!
ఆకస్మిక మృత్యు పరిష్వంగంలోకి జారిపోయారు
క్షణమాత్రపు అనూహ్య అగ్ని
బతుకుల్ని దహించేసింది
మేధానిర్మిత హర్మ్యాలపై
రాలి పడిన ఇనుప రెక్కలు,
తుత్తునియాలు చేశాయి
అక్షరాలు బూడిద కుప్ప, మస్తకాలు భస్మీపటలమయ్యాయి,
అయితే…
ఆ మంటల్లో చెక్కుచెదరని
సనాతన సారథి
జగద్గురువు ప్రవచిత భగవద్గీత
విశ్వానికి మార్గదర్శకి
కాలనిది... కాలాన్ని జయించినది!
శరీరాలు ఛిద్రమైనా, ఆత్మ నశించదు
గీత చెప్పింది అదే.
పుట్టిన వారు గిట్టినా...
మళ్ళీ పుడతారు...
జ్ఞానతృష్ణతో దేదిప్యమానమవుతారు
లోహ విహంగం నేలకొరిగినా
ఆదర్శగంథం ఆకాశానికి ఎగిసిందివేదాంతం!"
***
No comments:
Post a Comment