పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -6
బాలకాండ
దినవహి సత్యవతి
71.	
 అవిచ్ఛిన్నమగు కుశలమడిగి పాద్యమిచ్చెను,  
 అర్ఘ్యము, ఆసనము, వందనము సమర్పించెను, 
 బ్రహ్మను ఉత్తమాసనముపై కూర్చుండజేసెను, 
 బ్రహ్మ అనుజ్ఞతో  ఆయన ఎదురుగా కూర్చుండెను,  
 కానీ వాల్మీకి అపుడు అన్యమనస్కుడై యుండెను, సత్య! 
72.	
వాల్మీకి క్రౌంచపక్షి గూర్చియే ఆలోచించుచుండెను, 
దుఃఖనిమగ్నుడై  బాహ్యవిషయాలు మరచెను, 
మా నిషాద శ్లోకము మననం చేసుకొనుచుండెను, 
వాల్మీకి మనఃస్థితిని బ్రహ్మ అర్థంచేసుకొనెను,   
వాల్మీకి  కూర్చినది నిస్సందేహంగా శ్లోకమేయనెను, సత్య! 
73.	
 వాల్మీకి ఋషిశ్రేష్ఠుడని, బ్రహ్మ కొనియాడెను, 
తన సంకల్పం చేతే ఆ వాక్కు ఆవిర్భవించెననెను, 
 రాముడు ధర్మస్వభావుడు, పండితుడని యనెను, 
 లోకములో ప్రశస్తమైన గుణాలు కలవాడనెను, 
 రామచరిత  కావ్యరూపంగా రచింపుమనె బ్రహ్మ, సత్య!  
74.	 
నారదుడినోట విన్నది విన్నట్లుగా వ్రాయుమనెను, 
సీతారామలక్ష్మణాదుల చరిత్ర వ్రాయుమనెను,   
రహస్యమౌ రాక్షసుల చరిత్ర వ్రాయుమనెను,  
మున్నెవ్వరెరుగని విషయాలూ వ్రాయుమనెను,  
వాల్మీకికవన్నీ స్పష్టంగా తెలియగలవనె  బ్రహ్మ, సత్య!   
75.	
రామాయణకావ్యం పుణ్యమూ మనోహరమూయనె, 
వాల్మీకిని, రామకథ  శ్లోకబద్ధము చేయుమనె,  
అందులో  తెలిపినదేదీ అసత్యం కానేరదనె,  
రామాయణకావ్యం భూతలాన నిలిచియుండనె, 
గిరులు, నదులున్నంతవరకూ వ్యాప్తిలో యుండుననె, సత్య! 
76.	
 ఊర్థ్వ, అధోలోకములు తన సృజనయేయనెను, 
 అందు రామాయణకథ ప్రచారంలోయుండుననెను, 
 కావున వాల్మీకి ఆ లోకాల సంచరించవచ్చనెను, 
 వాల్మీకితోనట్లు పలికి బ్రహ్మ అంతర్థానమయ్యెను, 
 అది చూచి వాల్మీకి శిష్యులూ ఆశ్చర్యపడిరి, సత్య! 
77.	
వాల్మీకి శిష్యులు అమితముగా సంతోషించిరి,  
 సమ అక్షరముల శ్లోకము మరలా పఠించిరి, 
నాల్గుపాదములూ  ఒకరికొకరు చెప్పుకొనిరి,  
అట్లా శ్లోకానికి ఇంకనూ శ్లోకత్వం  కలిగించిరి,  
అదిజూచి వాల్మీకి ఒక నిశ్చయమునకు వచ్చె,  సత్య! 
78.	
 కావ్యమంతా అదే శ్లోక వృత్తంలో వ్రాయదలచెను,
 యశస్వి రాముని మహాత్మ్యము తెలుపదలిచెను, 
మనోహర, ఉత్తమవృత్తాలతో కావ్యం రచించెను,   
 శబ్దార్థాలు, సమాక్షరాలతో శోభించునట్లు వ్రాసెను,   
 వందలాది శ్లోకాలతో రామకథ రచించె వాల్మీకి, సత్య! 
79.	 
రామకథలో, సంధులు శ్రావ్యములై యుండెను, 
సమాసములు నాతిదీర్ఘములుగ యుండెను,
శబ్దవ్యుత్పత్తి శాస్త్రసమ్మతముగ యుండెను, 
వాక్యాలు సమ, మధుర, అర్థవంతంగ యుండెను, 
వాల్మీకి రచించిన కావ్యం వినదగినదై యుండెను, సత్య!  					
				               3 వ సర్గ 
      వాల్మీకి రచించిన రామాయణ  సంక్షిప్త వర్ణన... 
80.	
రామాయణము ధర్మసహితమై యుండెను, 
నారదుడు తెలుపగనది వాల్మీకి ఆలకించెను, 
ఇంకనూ ఏమైనా ఉన్నదాయని ఆలోచించెను, 
రామచరితమును పూర్తిగా పరిశీలింపగోరెను, 
దర్భాసనము వేయుమని శిష్యులకు తెలిపెను, సత్య! 
81.	
దర్భల అగ్రభాగం తూర్పుకు అమరింపజేసెను,  
దానిపై కూర్చుని మహర్షి ఆచమనం చేసెను, 
అనంతరం దోసిలికట్టి దివ్యదృష్టి సారించెను,  
రామచరిత గూర్చి యెరుగను ఉద్యుక్తుడయ్యెను, 
ఎన్నో విషయములు యథార్థముగా తెలుసుకొనె, సత్య!
82.	
సీతారామలక్ష్మణాదులు చేసిన కార్యాలు,  
రాముడు భార్యాసహితుడై చేసిన కార్యాలు,  
రాజ్యముతో ఉన్నప్పుడు పొందిన ఫలితాలు,  
వారు నడచిన, నవ్విన, మాట్లాడిన రీతులు,   
ఇత్యాది విషయాలన్నీ సవివరంగా తెలుసుకొనె, సత్య! 
83.	
కామార్థములనె పురుషార్థములకు చెందినది,
ధర్మప్రధానమైన గుణములు అధికంగాగలది, 
రత్నాలతో సమృద్ధమైన సంద్రమువలెనున్నది, 
అందరి చెవులను, మనస్సులను ఆకర్షించునది,
సకల వేదసార సంగ్రహరూపము రామాయణం, సత్య! 
84.	
రాముని అవతార, సౌందర్యముల గురించి,   
అతడి ఓర్పును, మహాపరాక్రమం గురించి,  
అతడు అందరికీ ఇష్టుడిగా ఉండుట గురించి,    
అతడి అనుకూలత, సత్యశీలత గురించి,    
రామాయణంలో హృద్యముగా వర్ణించె వాల్మీకి, సత్య! 
85.	
రాముడు, విశ్వామిత్రుని కలిసిన సంఘటనను, 
నాడు జరిగిన విచిత్రమైన పలుకథలను, 
శివధనుర్భంగము, జానకీ పరిణయమును, 
పరశురామ, దశరథరాముల వివాదమును, 
రాముని సద్గుణాలను వర్ణించె వాల్మీకి, సత్య! 
***
 

 
.jpg)
.jpg)
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment