పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం-2
బాలకాండ
దినవహి సత్యవతి
16.	
అరణ్యవాసము చేయవలెను రాముడనెను, 
పట్టాభిషేకము చేయవలెను భరతునికనెను,
అట్లు సత్యవాక్పాలకుడైన భర్తను కైక కోరెను,     
ధర్మబద్ధుడై తండ్రి, సుతుని కానలకేగమనెను,  
తండ్రి ఆజ్ఞ పాటించెను రాముడనె, నారదుడు, సత్య!
17.	
సుమిత్ర సుతుడు,  లక్ష్మణుడు, వినయశీలుడు,
రామునికి ఇష్టమైన సోదరుడు లక్ష్మణుడు, 
లక్ష్మణుడునూ రామునిపై ప్రేమున్నవాడు, 
తల్లి ఆజ్ఞతో రాముని వెంట అడవికి వెళ్లాడు, 
అందుకు సుమిత్ర సంతసించెననె, నారదుడు, సత్య! 
18.	
సీత, జనకుని వంశమునందు పుట్టెను,
దశరథుని కోడలై రఘువంశము మెట్టెను, 
రామునికి, సీత పంచప్రాణములయ్యెను, 
దేవమాయవలె సీత, యసురుల, భ్రమింపజేసెను, 
సీత లోకోత్తర సౌందర్యవతియనె, నారదుడు, సత్య! 
19.	
సాముద్రికశాస్త్రపు మంచి లక్షణాలున్నది,
స్త్రీలలో ఉత్తమురాలిగా సీత నిలిచినది,
అహర్నిశలూ రాముని హితము కోరినది,
చంద్రునికై రోహిణిలా, పతిని అనుసరించినది, 
సీత, మహాసాధ్వియని, పలికె నారదుడు, సత్య! 
20.	
రాముడు, సీత వనవాసముకు తరలి వెళ్ళిరి, 
దశరథుడు, పౌరులు వారిని దూరం వెన్నంటిరి, 
సీతారామలక్ష్మణులు గంగాతీరము చేరిరి, 
శృంగేరీపురాన, బోయరాజు, గుహుని కలిసిరి, 
 తన సారథి సూతుని వెనక్కు పంపె రాముడనె, సత్య! 
21.	
ఒక వనమునుంచి మరొక వనము చేరుచూ,   
సీతారామలక్ష్మణులు, నదులను దాటుచూ,  
 భరధ్వాజమహర్షి ఆదేశము పాటించుచూ,  
చిత్రకూటపర్వతాన పర్ణశాలలో వసించుచూ,  
 దేవగంథర్వులవలె సుఖముగా యుండిరనె,  సత్య! 
22.	 
తండ్రి ఆజ్ఞపై రాముడు చిత్రకూటము వెళ్ళెను, 
పుత్రశోకమున దశరథుడు పీడితుడయ్యెను, 
తాళజాలని బాధవలన అతడు మరణించెను, 
రాజ్యము పాలించ భరతుడు అజ్ఞాపించబడెను, 
అన్నపై గౌరవంతో భరతుడందుకొప్పుకోలేదనె, సత్య!
23.	
భరతుడు రాగద్వేషాలను జయించినవాడు,
రాముని అనుగ్రహముకై అడవికి వెళ్ళినాడు, 
వినయమున, సత్యవ్రతుడు, సుమహాత్ముడు, 
సమస్తధర్మమెరిగినవాడు రాముడన్నాడు,    
కావున అతడే  రాజు కావలెనని ప్రార్థించెననె, సత్య!  
24.	
ఆశ్రయించినవారి కోరికలు తీర్చు సుముఖుడు, 
తండ్రి ఆజ్ఞ పాటింప  దీక్షబూనిన రాముడు, 
రాజ్యం స్వీకరించలేనని తమ్మునికి  చెప్పినాడు, 
భరతుడెంత ప్రార్థించిననూ తిరస్కరించినాడు, 
అన్న నిర్ణయానికి భరతుడు దుఃఖించెననె, సత్య! 
25.	
రాముడు, తన పాదుకలను భరతునికి ఇచ్చెను, 
భరతునికి నచ్చజెప్పి  అయోధ్యకు పంపెను,  
భరతుడాపాదుకలను సేవించ స్వీకరించెను, 
అన్న సుఖంగా తిరిగి రావాలని కోరుకొనెను, 
నిరాశగా అయోధ్య తిరిగివచ్చెను భరతుడనె, సత్య! 
26.	
అన్నలేని అయోధ్యలో నివసించలేననుకొనెను, 
అయోధ్యలో సింహాసనంపై పాదుకలనుంచెను, 
సమీప నందిగ్రామం నివాసానికై ఎన్నుకొనెను, 
భరతుడు నందిగ్రామంనుండే రాజ్యం పాలించెను, 
అట్లు నారదుడు రాముని గూర్చి వాల్మీకికి తెలిపె, సత్య! 
27.	
అయోధ్య పౌరులు, ఇతరులూ, భరతుడు, 
మరలా చిత్రకూటం రాగలరని తలచె రాముడు,  
తండ్రి ఆజ్ఞపాలన చేయదలచిన రాముడు,  
సావధానుడై దండకారణ్యంలో ప్రవేశించినాడు,
విరాధరాక్షసుని చంపెను రాముడనె, నారదుడు, సత్య!
28.	
అరణ్యంలో రాముడు అగస్త్యమునిని జూసెను, 
అతని తమ్ముని, శరభంగ, సుతీక్ష్ణుల జూసెను, 
ఇంద్రుడగస్త్యునికొక ధనుస్సునిచ్చి యుండెను, 
ఖడ్గబాణాలు, అమ్ములపొదులనిచ్చియుండెను,  
అగస్త్యుడవి తనకివ్వగా రాముడు గ్రహించెననె, సత్య! 
29.	
రాముడు, శరభంగుని ఆశ్రమమునకు చేరెను,
అగ్నితుల్య తేజస్విలైన ఋషులకది తెలిసెను,  
ఋషిగణము రామునివద్దకేగి ప్రార్థించెను, 
అచట వసించు దైత్యుల చంపమని కోరెను, 
రాక్షసుల చంపెదనని మాటనిచ్చె రాముడనె, సత్య!
30.	
దండకారణ్యంలో శూర్పణఖ నివసించుచుండెను,     
కామరూపిణియైన ఆమె రాముని చూచి మోహించెను,       
	లక్ష్మణుండామె ముక్కుచెవులు కోసి కురూపింజేసెను,  
శూర్పణఖ విరూపితయగుట ఖరుడు చూసెను, 
త్రిశిర, దూషణలతో కూడి పోరుకి వచ్చెననె, సత్య! 
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment