ఒకటైపోదామా... ఊహల వాహినిలో - 2
కొత్తపల్లి ఉదయబాబు
 
(టాంక్ బండ్ మీద కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు విరాజ్, హరిత)
 ''ఒక్క మాట అడగనా... ''
  ''అడుగు''
  '' ఆడపిల్లలంటే అంత చులకన భావం
ఎందుకు విరాజ్ మీ మగవాళ్లకు?''
  'ఎందుకేమిటి? ఏ అవసరము, కోరిక లేకుండానే ఆడవాళ్లు మగవాళ్ళతో
స్నేహం చేస్తున్నారా...ఈరోజుల్లో...''
  ''అంటే తమ కోరికలు తీర్చుకోవడం
కోసం మాత్రమే  ఆడపిల్లలు మగవాళ్లతో స్నేహం
చేస్తున్నారంటావా?   అందరూ
అలాగే ఉంటారనుకుంటే  ఎలా?''
  ''కొందరు అలా ఉండకపోవచ్చు నీలాగా
.... కానీ మగవాడు వాళ్ళ అందరినీ ప్రేమిస్తూ కూర్చోలేడే  ఆఫర్ దొరికింది కదా అని!  వాళ్ళల్లో తనకు ఇష్టమైన వాళ్ళను ...అదీ తనకు
నచ్చిన, ఏదో తెలియని ప్రత్యేకత ఉన్న అమ్మాయిని మాత్రమే
ప్రేమిస్తాడు. నేను అలా ప్రేమించిన అమ్మాయి ఇపుడు నా పక్కనే ఉంది.''
  హరిత
మాట్లాడలేదు. తమ మీద పడిన విద్ద్యుద్దీపాల కాంతిని  మెరుపు నగలాగా ధరించి అది లభించిన చిరు
ఆనందానికే అటూ..ఇటూ ఊగిసలాడుతున్న కన్నెపిల్ల మనసులా కదులుతున్న హుస్సేన్‌సాగర్
లోని నీటి అలలను చూస్తూ ఉండిపోయింది..
  "ఏంటి
అంతగా ఆలోచిస్తున్నావ్? నా ప్రపోజల్ నీకు ఇష్టం లేదా?" అడిగాడు విరాజ్.
  " ఇక్కడ
విషయం ఇష్టం కాదు విరాజ్. ఒక ఆడదాని జీవితం. అదీ ....ఒక పేద ఇంటి ఆడపిల్ల జీవితం.
హు.మీకేం.. డబ్బున్న మగమహారాజులు.. కావాలనుకుంటే ఒక ఆడపిల్లని క్షణాల్లో
ప్రేమించగలరు... వద్దనుకుంటే అవసరం తీరాక 
క్షణాల్లో 'మసి'  కూడా చేసేయగలరు. మనం ఒకరినొకరు
మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాక కూడా 
నువ్వు మన ప్రేమకి ఇలాంటి  నియమం
పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వేమీ అనుకోనంటే  నేను నీతో మనసు విప్పి మాట్లాడవచ్చా పది
నిమిషాలు? "
  "
కావలసినంత సేపు మాట్లాడు. ఇంటికి వెళ్ళాక కూడా నువ్వు కావలసినంత సేపు ఆలోచించు.
చివరకు ఒక నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత  అయ్యో నేను ఒప్పుకోకుండా ఉండాల్సిందే అని
పొరపాటున కూడా నువ్వు బాధపడకూడదు. సరేనా?
"
  ఆమె కళ్ళ లోతుల్లోకి
ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ 
అడిగాడు  విరాజ్.
  అతనికి
ఆలోచనకి  అందకుండా ఎంతో మనోహరంగా
నవ్వేసింది హరిత.
  ''ఈ సృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమాన ప్రతిపత్తి కలిగినవారు. కానీ  ఇప్పటికి కూడా స్త్రీ పురుషాధిక్యతతోనే సమాజంలో
బతుకు ఈడుస్తోంది ఆనాటి నుంచి ఈనాటివరకూ.''అంది హరిత.
  ''నీ మాటకు మధ్యలో అడ్డు
వస్తున్నాను. పురాణ కాలాలు వదిలేయ్. అవి మనం చూడలేదు. ఏదో పురాతన నాటకాల రూపంలోనో,
పురాణాలు, కావ్యాల రూపంలలోనో చూసినా, చదివినా...ఆనాడు ఆడది అలా 
ఆటబొమ్మలాగే  చూడబడింది అన్నదానికి
సాక్ష్యాలు లేవు.  చరిత్రలో నాయకురాలు
నాగమ్మ, ఝాన్సీ లక్ష్మీ బాయి ...ఇలాంటి వారున్నట్లు
సాక్ష్యాలు ఉన్నాయి...అప్పటినుంచి చెప్పు.'' అన్నాడు విరాజ్.
  ''మంచి వారిని గుర్తు
చేసావ్...అవకాశం ఇస్తే, లేదా...దొరికితే ఆడది తానూ 'సబల' అని నిరూపించుకోగలదు.  అలా నిరూపించుకున్న వాళ్ళ ఆధిక్యతను మగవారు
ఒప్పుకోలేకపోయారు.''
  ''కావచ్చు. కానీ కొందరు సంఘ
సంస్కర్తలు....ఏ కోరికలూ తీరకుండానే విధవలుగా మారి  కోరికలు అణుచుకుని పుట్టిళ్లలోనే మగ్గిపోయి,
చివరకు ఎవరికి చెప్పుకోలేని చూపించుకోలేని రోగాలతో మరణించినవారిని
చూసారు. తమలాగే స్త్రీలకూ మనసు ఉంటుందని వారికీ కోరికలు ఆశలు ఉంటాయని  గుర్తించడం చాలా గొప్పవిషయం. స్త్రీలకూ
స్వేశ్చనివ్వాలని, వారూ చదువుకోవాలని ప్రతిపాదించి, వితంతు వివాహాలు చేశారు...వయసు పరిపక్వత లేకుండా చేసే బాల్య వివాహాలు  చేయకుండా అడ్డుకున్నారు. స్త్రీలకూ ఇచ్చిన స్వేశ్చని
కొందరు ఉపయోగించుకుని స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనే స్థాయికి ఎదిగారు.  పూర్వకాలంతో పోలిస్తే కాలం గడిచే కొద్దీ
స్త్రీలకూ విలువ పెరిగిందని తెలుస్తోందిగా...''అన్నాడు
విరాజ్.
  తామిద్దరినీ
మఫ్టీలో ఉన్న మనుషులు ఇద్దరు దూరంగా విడివిడిగా నిలబడి పరిశీలిస్తున్నట్టు
వారిద్దరికీ తెలియదు.
(సశేషం)
 
No comments:
Post a Comment