అజ్ఞానబాధ
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
"ఇవాళ
మీ పత్రికా విలేఖరులందర్నీ ఎందుకు పిలిచానంటే?" అని కాస్తాగి..గాఠ్ఠిగా
ఊపిరితీసుకుని "ఇహనుంచి నేను ‘అజ్ఞానబాధ’ ని అని తెలియజేయడానికి దుఃఖిస్తున్నాను..ఇప్పటిదాకా
మనకు బోలెడంత మంది నిత్యానంద, ఆత్మానంద, పూర్ణానంద, సంపూర్ణానంద, జ్ఞానానంద
బాబాలు, స్వాములూ ఉన్నారు. దేవుళ్లకు సంబంధించిన విషయాలన్నీ వాళ్లకు
స్పష్టంగా తెలిసినట్టూ, భక్తబృందాల సమస్యలు అన్నీ అవగతమయినట్టూ
ఉంటారు. రామాయణ, మహాభారత, భాగవతాలు నమిలి
మింగేసినట్టు మైకుల ముందు నొక్కి వక్కాణిస్తారు. కానీ ఈ ప్రపంచంలోకి మనుషులు వస్తున్నారు,
పోతున్నారు, బాబాలు వెలుస్తున్నారు, పరమపదిస్తున్నారు. కొత్త బాబాలు అవతరిస్తున్నారు. ఆస్తులు సంపాదిస్తున్నారు.
కార్పోరేట్ లెవెల్లో వ్యాపారాలు చేస్తున్నారు. సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. అందుకే
నిన్నటిదాకా మామూలు మానవుడిలా ఉన్న నా ముందు, విష్ణుమూర్తి ప్రత్యక్షమై
నా చెవిలో ‘అవతారాలెత్తీ..ఎత్తీ విసిగిపోయాను. ఇహ నావళ్ల కాదు. అంచేత ఈసారి ఈ భూప్రపంచానికి
నీ రూపంలో కొత్త రూపాన్నిస్తాను."అన్నాడు.
"అంటే
ఎలా?"" అన్నాడు ఒక విలేఖరి.
"నాకు
తెలియదు. నిజానికి ఎవరికీ ఏదీ పరిపూర్ణంగా తెలియదు. అయినా జ్ఞానులం అని మురిసిపోతాం.
అదే అజ్ఞానం."
"కాస్త
వివరంగా చెప్పండి"
"చెబుతాను
మీరు విలేఖర్లు. న్యూస్ సేకరించడం, అందించడం తప్ప మరొకటి
తెలియదు, అలాగే డాక్టర్లకి, ఇంజనీర్లకి,
లాయర్లకీ వాళ్ల విషయం తప్ప మరోటి పట్టదు. అంటే ఇతర విషయాల్లో వాళ్లు
అజ్ఞానులే కద. వాళ్ల విషయం కూడా వాళ్లకి సంపూర్ణంగా తెలియదు. మనందరం ప్రకృతిముందు ఎప్పటికీ
అజ్ఞానులమే. చావుపుట్టుకలు, జీవితగమ్యం తెలియని మనం అజ్ఞానులం
కాదంటారా"
అక్కడున్న అందరూ
పెద్దపెట్టున చప్పట్లు కొట్టారు.
"అయితే
మీరు మరో స్వామీజీనా" అడిగింది మహిళా విలేఖరి.
"పొరబడుతున్నారు.
నేను స్వామిని కాను అజ్ఞానబాధను. అంటే జ్ఞానం ఉంటే ఆనందం, అజ్ఞానం ఉన్న చోట బాధే కదమ్మా ఉండేది. అందుకేగా అజ్ఞానంధకారం అన్నారు."
"మీ తదుపరి
కార్యక్రమాలు"
"అజ్ఞానులం
కాబట్టి పెద్దగా ఏం ఉండవు. మాకిష్టమొచ్చినప్పుడు లేస్తాం. ఇష్టమైనవి చేస్తాం. ప్రార్థనలూ, భజనలూ, బృందగానాలూ ఉండవు. ఎవరూ ఎవర్నీ ఏ విషయంలోనూ బలవంత
పెట్టం, పెట్టుకోం"
"ఏవన్నా
తెలుసుకుని లేదా నేర్చుకుని అజ్ఞానం నుంచి జ్ఞానం దిశగా అడుగులెయ్యరా"
"నువ్వు
మళ్లీ మొదటికొచ్చావమ్మా! తెలుసుకుంటే జ్ఞానానందలమవుతాం. కళ్లు నెత్తికొస్తాయి. మన ముందున్నదంతా
పిపీలికంలా కనిపిస్తుంది. గర్వంతో రెచ్చిపోతాం..అందుకే నేను అజ్ఞానబాధనని చెప్పుకుంటా..నిగర్విగా
ఉంటా"
"అజ్ఞానం
బాధ అయినప్పుడు ఆనందం కోసం, సుఖం కోసం ఏం చెయ్యరా?"
"బాధే
సౌఖ్యమనే భావన రానీవోయ్ అని ఒక సినీగేయ రచైత అన్నాడా లేదా? అందరూ సుఖాన్ని కోరుకుంటే మరి బాధను భరించేదెవరు? మేము
బాధకు బాసటగా ఉంటాం."
"అంటే
బాధల్లో ఉన్నవాళ్లని ఆదుకుంటారా?"
"నేను
చెప్పేది బాధను బాధగా భరించాలని..మళ్లీ వాళ్లను ఆదుకుని ఆనంద పరచడమెందుకు? మానుంచి దూరం చేసుకోవడమెందుకు? బాధితులంతా ఏక్ హై"
"స్వామీజీలు, బాబాలు కాషాయ, ధవళ, ఇలా ఏదో ఒక
రంగు ప్రత్యేక దుస్తులు ధరిస్తారు..మరి మీరు?"
"నో డ్రస్
కోడ్..చిరిగిపోయినవి, చీకిపోయినవి, వెలిసిపోయినవి,
మాసిపోయినవి ఏవైనా ధరించవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లోని రోగులు..పూటగడవని
బిచ్చగాళ్లు, బీదవాళ్లు అంతా నావాళ్లే."
"అసలు
మీరేం చెయ్యదలుచుకున్నారు?"
"ఏం చెయ్యం."
"మరి ఈ
విలేఖరుల సమావేశమెందుకు?"
"ఈ ప్రపంచంలో
మేమూ ఉన్నామని తెలియజేయడానికి"
"ఇంకా?"
"ఏంలేదు"
*****
( ఈకథ కేవలం
హాస్యం కోసం రాయబడింది. ఎవర్నీ నొప్పించడానికి కాదు)
No comments:
Post a Comment