చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 25
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery 
నవలా రచయిత : Carolyn Keene
(మాటల్లో తనకొచ్చిన చంద్రమణిని నాన్సీ తన మగ మిత్రులకు చూపిస్తుంది.  అందమైన వెన్నెల్లో విహారయాత్ర చేయాలని మూడు జంటలు ఒక పడవను అద్దెకు తీసుకొని అక్కడ నదిలో తిరగటానికి వెళ్తారు.  వారలా విహారయాత్రలో ఉండగా, ఒక పడవ వారిని ఢీకొడుతుంది.  ఆ పడవ నడిపే వ్యక్తి నదిలో దూకి పారిపోతాడు.  తమను ఢీకొన్న పడవను పరీక్షించిన వారికి, కావాలనే తమ పడవను ఢీకొట్టి, ఆ వ్యక్తి నదిలోకి దూకి తప్పించుకొన్నాడని నాన్సీ బృందానికి అర్ధమౌతుంది.  జార్జి తన ప్రేమికుడితో ఆ పడవలో ఎక్కి వెళ్తూండగా, పోలీసులు వారిని పట్టుకొని, ఆ పడవను  దొంగిలించారన్న నేరంపై అరెస్టు చేసి పోలీసు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తారు.  తరువాత. . .) 
@@@@@@@@
ఆరుగురు స్నేహితులను ఒక భవనంలోకి ప్రవేశపెట్టారు.  అది ప్రధాన పోలీసు కేంద్ర కార్యాలయం యొక్క గది.  అక్కడ అందరినీ ప్రశ్నించారు.  చివరగా  నాన్సీ చెప్పింది, "కారు దొంగిలించబడ్డ నాన్సీ డ్రూని నేనే!"
  "అవును, మాకు తెలుసు" అని అధికారి చెప్పాడు.  "అది యింకా దొరకలేదు."
  "ఇప్పుడు మేము ఎవరో మీకు తెలిసింది.  మేము పడవ దొంగలం కాదు.  దయచేసి మమ్మల్ని వెళ్ళనిస్తారా?" 
  "ఇంకా లేదు.  దొంగిలించబడ్డ పడవ లోపల కనిపించిన మీలో యిద్దరు, ఆ పడవను దొంగిలించలేదని యింకా నిరూపణ కాలేదు."
  "మా దగ్గర సాక్ష్యం లేదు" నాన్సీ బదులిచ్చింది.  "కానీ మీ దగ్గర కూడా మేము పడవను దొంగిలించినట్లు సాక్ష్యం లేదుగా!" 
  అధికారి ఆమెను పరిశీలనాత్మకంగా చూసాడు.  "నువ్వు న్యాయవాదిలా కనిపిస్తున్నావు."
“బహుశా నేను నా తండ్రి నుండి నేర్చుకుని ఉంటాను. ఆయన రివర్ హైట్స్ కి చెందిన  కర్సన్ డ్రూ-ఒక న్యాయవాది."
  అకస్మాత్తుగా అధికారి ముఖం చిరునవ్వుతో విప్పారింది.  "కర్సన్ డ్రూ?  ఆ విషయం  మా రివర్ పోలీసులకు మొదట్లోనే ఎందుకు చెప్పలేదు? "  
  నాన్సీ బదులివ్వలేదు.  అధికారి కన్ను గీటుతూ, "కేసు కొట్టివేస్తున్నా!" అన్నాడు.
యువజనమంతా బయట కాలిబాటను చేరుకొన్నాక,  నాన్సీ పక్కకొచ్చి,  డేవ్ తన భుజాన్ని ఆమె భుజం కేసి రుద్దాడు.  "అబ్బాయీ! ఇటువంటి సుప్రసిద్ధ వ్యక్తి స్నేహితుడిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది!" అన్నాడు.  
  అందరూ నవ్వారు.  ఆ సమూహంలో ఉల్లాసకరమైన మానసికస్థితి తిరిగి పునరుద్ధరించబడింది.  తిరిగి వారంతా హుందాను సంతరించుకొన్నాక, జార్జ్ అంది, "మనను ఢీకొట్టాలని ప్రయత్నించిన వ్యక్తి, కేవలం దాని కోసమే ఆ పడవను దొంగిలించి ఉంటాడు."   
  "అతనెవరా అని నేను ఆశ్చర్యపోతున్నాను" పరధ్యానంగా అంది బెస్.  
  మరునాడు ఉదయం నాన్సీ, ఆమె స్నేహబృందం నెడ్ కారులో కోటకు వెళ్ళారు.  వాళ్ళంతా చెట్ల నీడ పడే వీధి గుండా వెడుతూండగా,  యింకా కిందకే వాలి ఉన్న కందకం మీద వంతెనని చూసి నాన్సీ, జార్జ్ మురిసిపోయారు.  వాళ్ళు దాని మీద గుట్టగా అమర్చిన రాళ్ళు కూడా, వాటిని పెట్టిన స్థానంలో అలాగే ఉన్నాయి.  
  "ఐనప్పటికీ, నేను నా కారుని ఇటు పక్కనే వదిలిపెడతాను" అన్నాడు నెడ్.
  బర్ట్ కిలకిలా నవ్వాడు.  "మనం తెచ్చుకొన్న ఈత దుస్తులను యిప్పుడు ఉపయోగించాల్సిన అవసరం లేదు." 
  "నేను ఒక అద్భుతమైన ఏర్పాటు చేస్తున్నాను.  నేనొక సాహస వీరుడినై, ఉన్నత కులమున పుట్టిన ఈ స్త్రీలు దాటడానికి వీలుగా ఈ కందకపు వంతెనను కిందకే ఉండమని ఆజ్ఞాపిస్తున్నాను!"  నాటక ఫక్కీలో అన్నాడు డేవ్.
  నాన్సీ. జార్జ్ నవ్వుతూ, కోట లోపలనుంచి వంతెనను పైకి లేపటానికి వీలు గాకుండా, తాము ఎలా కిందకు దించారో చూపించారు.  
  "తెలివైన పని"  నెడ్ మెచ్చుకొన్నాడు.  సందర్శకులు వేగంగా వంతెనను దాటి, రాళ్ళు పరచిన ప్రాంగణంలోకి అడుగుపెట్టారు.  అక్కడ నేలంతా గుత్తులుగా పెరిగిన పచ్చిక, కలుపు మొక్కలతో నిండి ఉంది; అవి బీటలు వారిన ద్వార మంటపాలనుంచి కూడా బయటకు పొడుచుకొచ్చాయి.  కోటకు ఒక చివర ఉన్న బురుజు దగ్గరనుంచి తమ శోధన ప్రారంభించాలని నాన్సీ, నెడ్ నిశ్చయించుకొన్నారు.  మొదటి అంతస్తులో, నేరుగా బురుజు కిందిభాగంలో పెద్ద సభామంటపాన్ని వాళ్ళు కనుగొన్నారు.  దానిలో ఏళ్ళ తరబడి పేరుకుపోయిన దుమ్ము, సాలెగూళ్ళు తప్ప ఏమీ కనపడలేదు.  
  "ఇది ఒకప్పుడు శోభాయమానంగా ఉండి ఉండాలి" అంది జార్జ్.  ఆమె, బర్ట్ మిగిలిన వాళ్ళను ఆ పెద్ద గదిలోనే కలిసారు.
కోట లోపల దాక్కున్న వారినెవరినీ తాము తప్పిపోకుండా  ఉండటానికి వాళ్ళంతా మూడు జంటలుగా విడిపోయారు.  ప్రతి జంట కోటలో ఒక వైపు శోధిస్తుంది.  వాళ్ళంతా గది తరువాత గదిని వెతుక్కొంటూ వెళ్తున్నారు.  కొన్ని గదులు ఒక సమూహంగా ఒకదానికొకటి ఆనుకొని ఉంటే, కొన్నిటికి చివర పోర్టికోలు కలిసి ఉన్నాయి.  చివరికి స్నేహబృందం ఆరుగురు తిరిగి వచ్చి పెద్ద హాల్లో కలుసుకొన్నారు.   
  "మీరు ఏదైనా కనుగొన్నారా?" ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వేరొకరిని అడిగారు.  కానీ ఎవరూ ఏమీ చూడలేదు.  
  "ఇక్కడ ఎవరైనా నివసిస్తున్నారని తెలిపేందుకు మంచం, పొయ్యి, ఆహారం, కనీసం దుస్తులు కూడా లేవు" జార్జ్ చెప్పింది.
శోధకులకు మొదటి అంతస్తులో మూడు మెట్ల మార్గాలు  కనిపించాయి.  ఒకటి పై అంతస్తుకి పోయే విశాలమైన మెట్ల మార్గమైతే, మిగిలిన రెండు తలొక మూల నుంచి పైకి తీసుకొనిపోయే యిరుకైన మెట్లు.  ప్రతి జంట తలో మార్గాన్ని ఎంచుకొని రెండవ అంతస్తుకి చేరుకొన్నారు.  అక్కడ వాళ్ళకి వరుసలో ఉన్న గదులు కనిపించాయి.  వాటిలో కొన్నింటికి మాత్రమే తలుపులు ఉన్నాయి, మిగిలిన వాటికి ఊడిపోయినట్లున్నాయి.
"నా ఊహ ప్రకారం యిక్కడ చాలా మటుకు పురాతన వస్తువుల వేటగాళ్ళు, విధ్వంసకుల చేతుల్లో దోపిడీకి లోనైంది" నాన్సీ అనుమానం వ్యక్తపరిచింది.  
  "నేను అదే భయపడుతున్నాను" నెడ్ అన్నాడు.  "ఇంత అందమైన ప్రదేశాన్ని పరిరక్షించకపోవటం చాలా సిగ్గుచేటు."
  మిగిలిన రెండు జంటలు వీరిని కలిసినప్పుడు, తాను, బర్ట్ వస్తున్న దారిలో మూసి ఉన్న ఒక తలుపును చూశామని జార్జ్ నివేదించింది.  దాన్ని తెరిస్తే తప్ప  అక్కడ గది ఉందా, బురుజు మీదకు పోయే మెట్ల దారి ఉందా అన్నది వారికి తెలియదు.  
   ఇది విన్న నాన్సీ ఉత్తేజితురాలైంది.  "బురుజులో ఎవరో నివాసం ఉంటూండవచ్చు!" అని ఆమె ప్రస్తావించింది.  "మన బుంగమీసాల మిత్రుడు!"
  జార్జ్ వాళ్ళందరినీ భారీ సింధూరవృక్షపు తలుపు దగ్గరకు తీసుకెళ్ళింది. దానికి అడ్డంగా చెక్క గడియ మాత్రమే ఉంది, తాళమేమీ లేదు. గడియ తీసి,  ఎంత ప్రయత్నించినా తలుపు మాత్రం తెరుచుకోలేదు.
నెడ్, బర్ట్ తలుపుకి ఉన్న పెద్ద పిడిని పట్టుకొని, బలంగా తమ శక్తినంతా  వినియోగించారు.  ఈసారి తలుపు భళ్ళున తెరుచుకొంది.  కానీ వాళ్ళంతా తమ ముందున్న చీకటి మెట్ల మార్గాన్ని చూసి భయంతో వెనక్కి పడ్డారు.  
  వారి మీద అక్కడ ఉన్న గబ్బిలాల మంద దాడి చేయబోయింది!
  ఆ బృందం ఒక్కసారిగా పరుగు లంకించుకొన్నారు.  అందరి కన్నా చివర్లో ఉన్న నాన్సీ నెడ్ తో సమానంగా పరుగుపెడుతోంది.  ప్రస్తుతం గబ్బిలాలకు ఏమైందో చూడటానికి నాన్సీ వెనక్కి తిరిగింది.  ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఒక మగాడు బురుజు మెట్లమార్గాన కిందకు పరుగెత్తుకొని వచ్చి, వారికి వ్యతిరేకదిశలో దిగువనున్న హాలు వైపు పారిపోవటం కనిపించింది.
  "నెడ్!" అతని భుజాన్ని గట్టిగా పట్టుకొని ఆపుతూ నాన్సీ అరిచింది.  "ఆ బురుజు మీద సంకేతాలిచ్చే వాన్ని చూశాను! అతన్ని వెంబడిద్దాం!"  
  ఆమె మిగిలిన మిత్రబృందాన్ని వెనక్కి తిరిగి తమను అనుసరించమని అరిచి చెప్పింది కానీ వాళ్ళెవరూ ఆమె మాటలు వినలేదు.  
  నెడ్, ఆమె కిందనున్న హాలు దిక్కు పరుగెడుతున్న అతని వెనుక పరుగు ప్రారంభించారు.  
  వాళ్ళొక మలుపు తిరగ్గానే, ఆ వ్యక్తి యిరుకు మెట్లదారుల్లో ఒక దాన్ని చేరి, కిందకు దిగుతుండటం నాన్సీ చూసింది.  
  "ఆగు!" అరిచిందామె.  "మేము నీకు హాని చెయ్యం! కేవలం నీతో మాట్లాడాలనుకొంటున్నాం!"
  అపరిచితుడు వారి కేకలను పట్టించుకోక మాయమయ్యాడు.  నాన్సీ, నెడ్ అతని వెంట పరుగెత్తారు, కానీ వాళ్ళు మొదటి అంతస్తు చేరుకొనే సమయానికే అతను కనుమరుగయ్యాడు.
 "మనం అతన్ని కనుక్కోవాలని ఆశిస్తే, విడిపోయి వెతకటం మంచిది" అంది నాన్సీ.     
  "సరె! కానీ జాగ్రత్తగా ఉండు" నెడ్ అంగీకరిస్తూ చెప్పాడు. 
  ఇద్దరూ విడిగా తలోదిక్కుకు పరుగెత్తారు.
(సశేషం)
 

 

.jpg)
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment