చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 1
ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery
నవలా రచయిత : Carolyn Keene
అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)  
"త్వరగా! పాకేజీని విప్పు నాన్సీ!" 
 ముగ్గురు బాలికలు నాన్సీ డ్రూ ఇంటి హాలులో నిలబడి, ఒక చిన్న కాగితం చుట్టి  ఉన్న పెట్టెను చూస్తూ ఉన్నారు.  ఇది పోస్టులో వచ్చింది.  దానిపై పంపినవారి పేరు ,  చిరునామా లేవు.
 "ఎవరో అజ్ఞాతవ్యక్తిలా ఉన్నాడు" అని బెస్ మార్విన్ అనే అందమైన అమ్మాయి వ్యాఖ్యానించింది.
"అవును" గోధుమరంగు జుట్టు గల నాన్సీ అంగీకరించింది.  దాన్ని పంపిన వ్యక్తి చిరునామాలోని అక్షరాలు, అంకెలు కనిపించకుండా అడ్డదిడ్డంగా ఆ బంగీని అతికించాడు.   "పేర్లు చేతితో వ్రాయక, వార్తాపత్రికలో వివిధ అక్షరాలను కత్తిరించి అతికించాడు.  చూడు నా. . .న్సీ. . .డ్రూ! . .  అంతేగాక అతను ఈ బంగీని చుట్టినప్పుడు చాలా కంగారులో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది."
  "సరే, దాన్ని తెరవండి" అని మూడవ అమ్మాయి జార్జ్ ఫేన్ అసహనంతో అంది. ఆమె చీకటిరంగుని పోలిన నల్లటి జుట్టు గల అమ్మాయి.  ఆమె చాలా సన్నగా, మగరాయుళ్ళా ఉంది.   "పంపినవారి పేరు బహుశా లోపల ఉండవచ్చు!" 
  గూఢచర్య ప్రవృత్తిని జీర్ణించుకొన్న నాన్సీ ఆ పాకెట్టు పైభాగం ఏమీ చెడిపోకుండా చాలా జాగ్రత్తగా విప్పింది.  ఆ పాకెట్టులోంచి బయటపడిన తెల్లని చిన్న పెట్టిపై ఎలాంటి గుర్తులు లేవు.  దానిలో ఆభరణాలు పెట్టుకొనే సాదా రింగు బాక్స్ ఉంది.   అప్పటికీ ఆ అమ్మాయిలు తమ ఊపిరి బిగబట్టి ఆపేక్షగా దాన్ని చూస్తున్నారు.   నాన్సీ మెల్లిగా దాని మూత తెరిచింది.  
  "ఎంత అందంగా ఉంది" బెస్ ఆశ్చర్యపోయింది.  
  పట్టుగుడ్డ పరచిన ఆ చిన్న పెట్టె లోపల నాన్సీ అంతవరకూ చూడని అత్యుత్తమమైన చంద్రకాంత శిల ఒదిగి ఉంది.  ఆమె ఆశ్చర్యంతో కన్నార్పకుండా చూసింది.  
  "చాలా చక్కగా ఉంది" అంది జార్జ్.   తరువాత చిరునవ్వు నవ్వింది.   "నీవు పరిష్కరించవలసిన ఒక రహస్యం.   ఈ కేసు నీకు తెలియని ఆరాధకుడిది!"
  నాన్సీ నవ్వింది.   "ఏమైనా, అతను నెడ్ అని మీరు నన్ను ఏడిపించలేరు.  ఈ బంగీ యిక్కడ రివర్ హైట్స్ నుంచి పంపబడింది.  అతనేమో  యిక్కడకు మైళ్ళ దూరంలో ఉన్నాడు."   నాన్సీతో తరచుగా తిరిగే నెడ్ నికెర్సన్ ఒక కాలేజీ విద్యార్ధి.  
   తెల్లని అట్టపెట్టె దిగువ భాగంలో జోడించిన కాగితం ముక్కను అకస్మాత్తుగా నాన్సీ గమనించింది.   ఆమె వేగంగా దాన్ని విప్పింది.  ముగ్గురు అమ్మాయిలు దానిపై అతికించిన సందేశాన్ని గట్టిగా పైకి చదివారు.  వార్తా పత్రికలోని  వివిధ అక్షరాలను కత్తిరించి కూర్చిన ఆ సందేశం యిలా ఉంది : 
"ఒక శ్రేయోభిలాషి నుంచి మీకు అదృష్టం పట్టాలనే ఆకాంక్ష.  తదుపరి కొన్ని వారాల్లో దాని అవసరం మీకు కలుగబోతుంది."
"నాన్సీ! నువ్వు ఏమి చేస్తున్నావు?" బెస్ అడిగింది.  "ఇదేదో ప్రమాదకరంగా అనిపిస్తోంది."  
"ఇప్పటి వరకు నేను అలా అనుకోలేదు" నాన్సీ సాలోచనగా బదులిచ్చింది. “నాన్న ఒక కేసులో పని చేస్తున్నాడు.  అతనికి సహాయం చేయమని నన్ను అడిగాడు.   అమ్మాయిలూ! పోస్టాఫీసుకు వెళ్లి, ఈ చంద్రశిలను పంపిందెవరో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం." 
  ముందుగా ఆమె బయటకు వచ్చి వేగంగా గేరేజీ వైపు వెళ్ళింది.  ఆమె డ్రయివరు సీట్లో కూర్చుని, కారుని వెనక్కి నడిపి, గేరేజీలోంచి బయటకొచ్చింది.  తరువాత ముగ్గురు మిత్రులు పోస్టాఫీసు వైపు బయల్దేరారు.  ఒక బ్లాక్ మాత్రమే ప్రయాణించాక నాన్సీ ఒక చోట తన కారుని ఆపింది.
  "ఏదైనా సమస్యా?" జార్జ్ అడిగింది.  
  "లేదు.  కానీ కాలినడకన వెళ్ళటం మరింత తెలివైన పని అని అనుకొన్నాను.  ఆ  శ్రేయోభిలాషి సందేశంలోని వివరాలు నన్ను ఎవరో నీడలా వెంటాడటం గాని, నిఘా ఉండటం కానీ చేస్తున్నట్లు ఆలోచింపచేస్తున్నాయి.  నేను ముందు ఒంటరిగా వెళ్తుంటే, మీరు నన్ను అనుసరిస్తూ చుట్టూ గమనిస్తారా?"
  "సరె!" జార్జ్ అంగీకరించింది.  జార్జ్ బంధువు అయిన బెస్ "జాగ్రత్త!  మేము నిన్ను యిక్కడ తరువాత కలుస్తాం" అంది. 
   నాన్సీ రావిచెట్టు నీడ ఉన్న వీధిలోకి వేగంగా వెళ్ళింది.  ఆమె వాణిజ్య ప్రాంతాన్ని చేరుకోగానే, పోస్టాఫీసు ఉన్న వీధిలోకి మళ్ళింది.  బెస్, జార్జ్ ఆమెకు వంద గజాల వెనుక ఉన్నారు.  అకస్మాత్తుగా బెస్ ఆమె బంధువు చేతిని పట్టుకొంది.  "ఇప్పుడే ఆ వీధి దాటిన వ్యక్తి!  అతను నాన్సీని అనుసరిస్తున్నాడు!  అటు చూడు." 
 జార్జ్ ఆ వ్యక్తి వైపు ఏకాగ్రతతో చూసింది.
(ఇంకా ఉంది)
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment