పద్నాక్షు దేవేరి పసిడి తల్లి 
కొలువుండి ముచ్చటల్ కోడలు వాణితో 
శ్రీలక్ష్మి పలికెను చింత తోడ  
భాగ్యమౌ దేశము భరతఖండమునందు 
మనకు పూజలు చేయు మానవాళి 
దీనులై యున్నారు దిక్కులేకయిపుడు
అంటురోగమొకటి అంకురించ 
 మందుమాకులులేక మహిలోన జనులెల్ల
కష్టపడుచునుండ కనులుచుంటి 
నలువసతియెపల్కె నలినాక్షి!ఓయత్త! 
విద్యనాయువుమేము వెల్లువలుగ.
 అవనిజనులకెల్ల అధికమ్ముగా నిచ్చి 
రక్షణ చేతుము రమ్యవదన ! 
కుందకు మమ్మరో! కువలయాక్షియనుచు 
లాలనతో చెప్పె లక్ష్మి తోడ 
వీరిమాటలతీరు విన్నవిరించియే 
భార్య మాటకతడు బద్ధుడయ్యె  
ఆ.వె. వాణి వైద్యులమది వైద్యమ్మునీయగా
అజుడు మొద మొప్ప ఆయువీయ
ధరణివైద్యగణము ధన్వంతరులుగాగ  
దీవెనొసగె  బ్రహ్మదీప్తులలర .
సీ. ఇదియేమి రోగమో ఈ కరోనా వచ్చి
మహిలోన శాపమై మసలుచుండి 
సరస జీవనమున సంతోష మందగా
వీలులేదనుచును విస్తరించి 
ప్రేయసీప్రియులకు పెను విరామము తెచ్చి
దూరముగానుంచి తుష్టి చెంది 
చెఱువుగట్టులయందు చిఱుతోటలందున
నిర్జన మగునట్లు నిలువరించి 
ఆ.వె.  ప్రభువు చేయలేని పనులను చేయుచు
జాగృతమొనరించి జనుల కెల్ల 
కట్టడిపుడె చేతు గమనింపు డనుచును 
ఈ కరోన చెప్పె యెలమి తోడ.
ఆ.వె.  కరము కరము కలుపు కరచాలనమ్ములు 
ముఖము ముఖము చేర్చి ముద్దులాడు 
కలయికలకరోన గమనించి జనులను 
దూరముంతుననియె తుమ్ముతోడు.
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment