శ్రీరామకర్ణామృతం -26
సిద్ధకవి
                                                                           డా.బల్లూరి ఉమాదేవి. 
తృతీయాశ్వాసం.
41శ్లో:వైదేహీ వశవర్తిననం రణజితం రత్నాకరాగారిణం
       పంక్తిగ్రీవ మదాపహం పటుభుజం పద్మాప్తకోటి ప్రభం
       విష్ణుం జిష్ణు మవార్య శౌర్యనిలయం నీలాంబుద     శ్యామలం
         రత్నాలంకరణాన్వితం రఘుపతిం శ్రీరామ చంద్రం భజే.
భావము:సీతకు వశమందుండునట్టియు యుద్ధమందు జయించునట్టియు సముద్రము గృహముగా గలిగినట్టియు రావణు మదమును గోసివేసినట్టియు సమర్థములైన హస్తములు గలిగినట్టియు కోటిసూర్యులకాంతి కలిగినట్టియు వ్యాపకస్వభావుడైనట్టియు ,అడ్డగింప శక్యము గాని శౌర్యమునకు స్థానమైనట్టియు,నల్లని మేఘమువలె నలఅలనైనట్టియు,రత్నాలంకారములతో కూడినట్టియు రఘుపతియగు శ్రీరామచంద్రుని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:అవనీజావశవర్తి జిష్ణు రఘురామాధీశు దోస్సారునిన్
   రవికోటి ద్యుతి నీలనీరద నిభున్ రత్నాకరాగారు రా
    ఘవు సర్వాత్ము నవార్యశౌర్యు గనకాకల్పోజ్జ్వలున్ బంక్తికం
      ఠ వినిర్భేదను విష్ణునిన్  హృదయపీఠంబందు భావించెదన్.
42శ్లో:దేవానాం హితకారణేన భువనే ధృత్వావతారం ధ్రువం
  రామం కౌశిక యజ్ఞ విఘ్నదళనం శ్రీ తాటకా సంహరమ్
 నిత్యం గౌతమ పత్ని శాప దళన శ్రీపాద రేణుం శుభం
 శంభోరుత్కట చాపఖండన మహా సత్త్వం రామం భజే.
భావము:దేవతల కిష్టము చేకూర్చుట యను హేతువు చేత భూమియందవతారము ధరించి శాశ్వతుడైనట్టియు విశ్వామిత్ర యజ్ఞ విఘ్నమును పోగొట్టునట్టియు తాటకను సంహరించినట్టియు నహల్యాశాపమును పోగొట్టిన పాదధూళి కలిగినట్టియు  శుభస్వరూపుడైనట్టియు శివుని గొప్పధనుస్సును ఖండించినట్టి గొప్ప బలముగల రాముని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
చ:అమర హితార్థమై ధరణియందవతారము దాల్చి తాటకన్
సమయగ జేసి గాధిసుత సత్ర విఘాతుల సంహరించి స
త్కమల పరాగ రాజి మునికాంతకు శాపము బాపి శంభు చా
పము నవలీల ద్రుంచిన శుభంకరు రాఘవు నాశ్రయించెదన్.
43శ్లో:రాజీవ నేత్ర రఘుపుంగవ రామభద్ర
 రాకేందు బింబ సదృశానన నీలగాత్ర
 రామాభిరామ రఘువంశ సముద్భవత్వం
  శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం.
భావము:
పద్మములవంటి కన్నులు గలవాడా రఘుశ్రేష్ఠుడా పూర్ణచంద్రబింబముతో సమమగు ముఖము కలవాడా నల్లని దేహము గలవాడా సుందరులలో సుందరుడా రఘువంశమందు పుట్టిన వాడా రామచంద్రా రామభద్రా నాకు చేయూత నిమ్ము.
.
తెలుగు అనువాదపద్యము:
ఉ:సారసపత్ర నేత్ర రఘుసత్తమ నీరద నీలగాత్ర శృం
గారనిధీ శరచ్ఛశివికాసిత వక్త్ర మహాత్మ రాఘవా
శ్రీరఘువంశ వార్ధిమణి శ్రీరమణీముఖపద్మ భాస్కరా
ధీర జనావనా రఘుపతీ యభయంబు నొసంగవే దయన్.
44శ్లో:ముకుర రుచిర గండం పుండరీకాభితుండం
 కరికర భుజ దండం రౌద్ర తేజోగ్ని కుండమ్
  నమిత భువన షండం భేదితోగ్రారి మండం
 గుణ నికర కరండం నౌమి రామ ప్రచండం.
భావము:అద్దములవలె సుందరములైన చెక్కులు గలిగినట్టియు పద్మశోభగల ముఖముగలిగినట్టియు ఏనుగు తొండములవంటి చేతులు గలిగినట్టియు భయంకరముగానుండు తేజస్సున కగ్నిగుండమైనట్టియు,నమస్కరించుచున్న లోకసమూహము గలిగినట్టియు బ్రద్దలు చేయబడిన భయంకర శత్రుమండలము కలిగినట్టియు గుణసమూహమునకు గనియైనట్టియు తీక్ష్ణ
పరాక్రమశాలి యైన రాముని నమస్కరించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:ఘనరౌద్రజ్వలదగ్ని కుండ నిభు రక్షవ్యూహ విధ్వంసకున్
ధనసద్భూషణు దుండితుండ సమదోర్దండ ప్రచండున్ సరో
జనినాభున్ ముకురాభ గండయుగళున్ సర్వాత్ము సర్వ ప్రపం
చ నతాంఘ్రిద్వయు సద్గుణాకరు రఘుస్వామిన్ మదిన్ గోల్చెదన్.
45శ్లో:కోదండ కాండ వినివేశిత బాహుదండ
 మాఖండలాద్య మరవర్షిత పుష్పవర్షం
 అయోధన స్థుత రజఃపరిధూసరాంగ
  మత్యూర్జితం రఘువరేంద్ర మరిప్రభేదం.
భావము:ధనుర్దండమందుంచబడిన భుజాదండము గలిగినట్టియు ఇంద్రుడు మొదలగు దేవతలచే వర్షింపబడిన పువఅవులవాన గలిగినట్టియు యుద్ధమందున్న ధూళిచే మలినమగు దేహము గలిగినట్టియు బలము గలిగినట్టియు శత్రువులము ఛేదించునట్టి రఘుశ్రేష్ఠుని కొలుచుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:దనుజాధీశు విదారియై పఅరకట యుద్ధ క్ష్మాపరాగోల్లస
త్తనుడై వాసవముఖ్య దేవతలు మందార ప్రసూన ప్రవృ
ష్టిని వర్షింప శరాసనాగ్రకరుడై చెల్వొంద సూర్యాన్వవా
యనదీశోత్పల మితఅరు రామవిభు సీతాధీశు బ్రార్థించెదన్.
46శ్లో:సేవ్యం శ్రీరామ మంత్రం శ్రవణ శుభకరం శ్రేష్ఠసుజ్ఞాని మంత్రం
 స్తవ్యం శ్రీరామ మంత్రం నరక దురిత దుర్వార నిర్ఘాత మంత్రం
భవ్యం శ్రీరామ మంత్రం భజతు భజతు సంసార నిర్హార మంత్రం
దివ్యం శ్రీరామ మంత్రం దివి భువి విలసన్మోక్ష రక్షైక మంత్రం.
భావము:
సేవించదగినట్టియు చెవులకు శుభమును చేయునట్టియు శ్రేష్ఠజ్ఞానుల మంత్రమైనటఅటియు స్తోతఅరము చేయదగినట్టియు నరకములకు పాపములకు నివారించ శక్యము కాని పిడుగైనట్టియు క్షేమకరమైనట్టియు సంసారము దాటించునట్టియు శ్రేష్ఠమైనట్టియు భూమ్యాకాశములయందలి వారికి మోక్షరూపసంరక్షణమునకు ముఖ్యమైన శ్రీరామమంత్రమును జనము సేవించు గాక.సేవించుగాక.
.
తెలుగు అనువాదపద్యము:
చ:శ్రవణ శుభంకరంబు పటుసంస్కృతి తాపనివారకంబు రౌ
రవముఖ హేతు దుష్కృత నిరాకరణంబు రిపు ప్రహారమున్
భువి దివి ప్రకాశితము మోక్షదమున్  సువివేక కారణం
బవు రఘురామ నామక మహా మనుజప్య మొనర్తు నిత్యమున్.
47శ్లో:ఆజాను బాహు మరవింద దృశం శుభాంగం
 రాజాధిరాజ మఘరాజితమః పతంగమ్
 శ్రీ జానకీ ముఖ సరోరుహ మత్త భృంగం
 శ్రీ నాయకం హృదిరభజామి కృపాంతరంగం.
భావము:
మోకాళ్ళ పర్యంతము బాహువులు కలిగినట్టియు పద్మములవంటి కన్నులు కలిగినట్టియు శుభమగు దేహము కలిగినట్టియు రాజులకు రాజైనట్టియు పాపపంక్తియను చీకటికి సూర్యుడైనట్టియు సీతాముఖపద్మమునకు తుమ్మెదయైనట్టియు
లక్ష్మికి పెనిమిటి యైనట్టియు దయాహృదయుడైన రాముని మనస్సున సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:అరవిందాయత పత్రనేత్రు వరకల్యాణాంగు శ్రీ జానకీ
 తరుణీ వక్త్ర సరోజ మత్త మధుపున్ దైత్యారినాజానుబా       హు రమేశున్ గలుషాంధకార రవి నాద్యున్ సత్కృపాంబోధి సుం
దరునిన్ రాజలలాము రామవిభు నానందంబునం గొల్చెదన్.
48శ్లో:ఏకేన బాణ మపరేణ కరేణ చాపం
      హర్షాద్ వహంత మసమాన జటా శిరస్కమ్
     సీతాసహాయ మనుజేన సమం చరంతం
     శ్రీరామచంద్ర మనిశం కలయామి చిత్తే.
భావము:ఒకచేత బాణమును మరియొక చేత ధనస్సును సంతోషము వలన వహించుచున్నట్టియు గొప్ప జటలు శిరస్సున గలిగినట్టియు సీతకు సహాయుడైనట్టియు తమ్మునితో సంచరించుచున్నట్టి శ్రీరామచంద్రు నెల్లప్పుడు చిత్తమందు దలచుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
చ:కరయుగళ ప్రదీప్త శరకార్ముఖుడై రిపునాశకారియై
  స్ఫురిత జటాశిరస్కుడయి భూమిసుతాయుతుడ శ్రితార్తి సం
హరుడయి తారహార ధరుడై  సహలక్ష్మణుడై  చరించు సు
స్థిరు రఘురాము సంస్మరణ జేసి యభీష్టము చెందు చిత్తమా.
49శ్లో:అమీలయన్ దశశిరోవదనాంబుజాత
       మున్మీలయన్ జనకజా నయనోత్పలే చ
  ఆనందయన్ సకల జీవ చకోర రాశిం
   శ్రీరామ చంద్ర విభురస్తు మదీయ చిత్తే.
భావము:రావణ ముఖ పద్మమును ముకుళింప చేయుచు సీతా నేత్ర పద్మములను వికసింప చేయుచు సమస్త ప్రాణులనెడు చకోరపక్షుల సమూహమును ఆనందింప చేయుచు నున్న శ్రీ రామ చంద్ర ప్రభువు నామనస్సు నందుండు గాక.
తెలుగు అనువాదపద్యము:
చ:ఘనబల బాహు శౌర్య దశకంఠ ముఖాంబుజముల్ మొగుడ్ప భూ
తనయ విశాల నేత్ర కుముద ద్వయమున్ వికసింప సర్వ స
జ్జన వరచాతకావళికి సైభ్రమ మొప్ప సముత్సహింప జే
సిన రఘురామ చంద్ర నుతిచే సఫలత్వము నొందు చిత్తమా.
.
50శ్లో:రామం పురాణపురుషం రమణీయవేషం
 రాజాధిరాజ మకుటార్చిత పాదపీఠమ్
  సీతాపతిం సునయనం జగదేక వీరం
  శ్రీరామ చంద్ర మనిశం కలయామి చిత్తే.
భావము:పూర్వపురుషుడైనట్టియు మనోహరవేషము కలిగినట్టియు రాజులకు రాజులైన వారి కిరీటములచే పూజింపబడిన పాదపీఠము గలిగినట్టియు,సీతకు పెనిమిటి యైనట్టియు మంచినేత్రములు కలిగినట్టియు జగత్తుల యందు ముఖ్యవీరుడైన రామచంద్రునెల్లపుడు చిత్తమందు తలచుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
ఉ:రాము బురాణపురుషుని రాజలలామ కిరీట సన్మణి స్తోమ విరాజమాన పదతోయరుహద్వయు రమ్య వేషునిన్
దామరసాక్షు భూసతిసుతారమణున్ జగదేకవీరు శ్రీ
రాము గుణాభిరాముని నిరంతరమున్ స్మరియింపు చిత్తమా.
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment