దేవుఁడట యీతఁడు దేవులట మహాలక్ష్మి
డా.తాడేపల్లి పతంజలి 
రేకు:
84-5
సంపుటము:
17-445
తాళ్లపాక
పెదతిరుమలాచార్య శృంగార సంకీర్తన తాత్పర్య విశేషాలు
దేవుఁడట యీతఁడు దేవులట మహాలక్ష్మి
దేవుని దేవిని నగి తెగడరో హరిని  ॥పల్లవి॥
1.రోలఁ గట్టువడె నని రోకలి చేఁ బట్టె నని
రోలా రోఁకటఁ బాడరోఁ హరిని
కాల బండి దన్నె నని కైకొనె మానము లని
కాలనే మానమున కాడఁ గదరో హరికి     ॥దేవు॥
2.సుద్దులే దొంగరికాలు మద్దులు విఱచినాఁడు
సుద్దులు మద్దులుఁ జెప్పి చూపరో హరిని
చద్దులు చిక్కానఁ గట్టే చాలఁ జిచ్చువేఁడి మింగె
చద్దికి వేఁడికి మీరు సతులెల్ల నగరో        ॥దేవు॥
3.చేతనే చీరలు దీసె వాతఁ బిల్లఁ గోలు వూదె
చేత వాత బ్రియములు చెప్పరో హరికి
యేతుల శ్రీవేంకటాద్రికృష్ణుడు మనలఁ గూడె
యీతల నాతలఁ బంత మియ్యరో హరికి   ॥దేవు॥
తాత్పర్య విశేషాలు
పల్లవి
ఇతడు
కృష్ణుని వేషములో ఉన్న దేవుడట .
మహాలక్ష్మి  రుక్మిణీదేవి రూపములో ఉన్నది. ఆమె దేవి అట.
ఆ ఇద్దరిలో
– దేవుడిని-దేవిని చూస్తూ నవ్వుకొంటూ నిందించండి.
విశేషాలు
దేవి
శబ్దానికి బహువచనము దేవులు. కాని  అన్నమయ్య
వంశీకులు  “దేవులు” అనే బహువచనాన్ని దేవి అనే
ఏక వచనంలో వాడతారు. అందుకే పెద తిరుమలయ్య “దేవి”కి బదులు “దేవులు” అన్నాడు.
చిన్నపిల్లలరూపంలో
వాళ్లిద్దరూ చేసే ముద్దుచేష్టలను చూసి  నవ్వు
వస్తుంది. హాయిగా నవ్వుకోండి.
చిన్నపిల్లలను
ఓరి భడవా  అంటాం. ఇది పైకి తిట్టులా అనిపించే
ముద్దు. ఇలా ముద్దుగా తిట్టండని కవి చెబుతున్నాడు.
.01 వచరణము
తాత్పర్యము
రోలుకి
కట్టుబడ్డాడని, రోకలి చేతిలో పట్టుకొన్నాడని, రోలులో రోకలి దంచుతూ బాల కృష్ణుడైన హరిని
గురించి పాటలు పాడండి
తన
కాలితో బండి తన్నాడని, గోపికల చీరలు దొంగిలించి వారి (అభి) మానములు స్వీకరించాడని 
కాలనేమి
అను రాక్షసుని(కంసుని) శ్వాసలో నాటుకొనేటట్లు 
బాల కృష్ణుని గురించి ఆడండి.  
విశేషాలు
యశోద
శ్రీకృష్ణుని నడుముకి రోలుకి కట్టింది. కృష్ణుడు రోలు లాగుకొంటూ  రెండు చెట్ల మధ్యకు వచ్చాడు. నడుముతో ఒక్క లాగు
లాగ గానే, చెట్లు మొదళ్ళతో కూలిపోయాయి.నలకూబరుడు, మణిగ్రీవుడు ఇద్దరు గంధర్వులకు శాపం
పోయింది. ఇది అన్నమయ్య చెప్పిన రోలు 'దొబ్బిన’ కథ. రోలఁ గట్టువడె
నని పెద తిరుమలయ్య ఈ కీర్తనలో అన్నారు. (అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు అను అన్నమయ్య పాటకు స్వీయ
వ్యాఖ్యానము)
 చిన్నవాడి
లేత పాదం ఎంత ఉంటుందండి! ఎలా ఉంటుందండి! ముట్టుకొంటేనే కందిపోతుంది. అటువంటి పాదంతో
రాక్షసుడి మాయతో నిండిన బండిని ఒక్క  తన్ను తన్నాడు .ఈ వృత్తాంతాన్ని ఈ
కీర్తనలో  కాల బండి
దన్నె అని పెద తిరుమలయ్య  వివరించాడూ.   కంసుడు క్రిందటి జన్మములో కాలనేమి అను రాక్షసుడు.
అతని శ్వాసలో నాటుకొనేటట్లు   అంటే అతనికి
ఊపిరి తిరగనివ్వకుండా అని అర్థం.
2వ చరణము
కృష్ణుని  వృత్తాంతాలు దొంగపనులు.మద్దిచెట్లు విరిచాడు.
సుద్దులు(మంచిమాటలు)
లెక్కలు చెప్పండి. చెప్పటమే కాదు. అలా మంచిగా , లెక్కప్రకారంగా ఉన్నవాళ్లను ఈ చిన్ని
కృష్ణునికి చూపండి.
వీడు
చద్దన్నం చిక్కములో (దారముతో అల్లిన చిన్న
సంచి.లో) కట్టాడు.అగ్నివేడిని(దావాగ్నిని) మింగాడు.
ప్రొద్దున,
మధ్యాహ్నము   వస్తూ  పోతూ  మీచుట్టూ
తిరిగే వీడిని చూసి  నవ్వండి.
విశేషాలు
కాళీయ
మర్దనం తర్వాత అందరూ ఆనందముతో  ఉన్నప్పుడు వచ్చిన
దావాగ్నిని అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పి కృష్ణుడు   మింగేసాడు.దీనిని కవి ఈ చరణములో ప్రస్తావించాడు.
3వ చరణము
ప్రయత్నముతో
గోపికల చీరలు దాచాడు.చిన్నకర్ర వేణువు ఊదాడు.
ఇంతకీ
ఆ కృష్ణునికి సంతోష కరమైన వార్తలు చెప్పండి.
గొప్పలు
చూపుతూ , బడాయిలతో  ఈవేంకట పర్వతముపై ఉంటున్న
వేంకటేశుడనే కృష్ణుడు  మనలను కలిసాడు.
కొంచెము
పెందలకడగాని కొంచె మాలస్యముగా గాని ఈ వేంకటేశుడనే కృష్ణునికి పోటీ ఇవ్వండి.
విశేషాలు
 తెలుగు జాతీయాలకు పట్టాభిషేకం చేసిన కీర్తనలలో ఇది
ఒకటి.
ఒక
పాదంలో కృష్ణుడు ఏంచేసాడో చెప్పి, రెండవ పాదంలో 
ఏం చేయాలో సరసంగా పెద తిరుమలాచార్యులు ఈ కీర్తనలో ఆవిష్కరించారు. స్వస్తి.
****
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment