అత్రి మహర్షి
గోత్రములు_ ఋషులు -5
మంత్రాల పూర్ణచంద్రరావు
         అత్రి మహర్షి సప్త మహర్షులలో  ఒకరు.  సృష్టి కర్త అగు బ్రహ్మ తనకు సహాయకునిగా ఉండుటకు తన మానసమునుండి అత్రిని పుట్టించెను.అత్రి జన్మించి తండ్రికి నమస్కరించి నన్ను ఏ కారణమున శ్రుష్టించితివి, నేను ఏమి చేయవలెనో ఆనతి ఇవ్వమని అడిగెను. అందులకు బ్రహ్మ నాయనా నీవు మహాతపస్సు చేసి లోక సంరక్షణకు కొందరిని శ్రుష్టించ వలసి ఉన్నది. అందులకు నేను సహాయము చేసెదను. అని చెప్పి అత్రిని తపోవనమునకు పంపెను.
        తండ్రి మాటలు విని అత్రి మహాతపస్సు చేయుటకు ఒక వనమునకు వెళ్లి తపస్సు మొదలు పెట్టెను.పంచ భూతములచే నిర్మించ బడిన శరీరమును సుష్కంప చేసి ఆత్మజ్ఞానము పొందుటయే ఘోర తపస్సు, అట్టి తపస్సు చేయుచు ఆత్మానందము పొందిన అత్రి కళ్ళనుండి ఒక మహా తేజము పుట్టెను, ఆ తేజస్సు దినదినము అభివృద్ధి చెంది కొంత కాలమునకు దసదిశలు  మోయలేక సముద్ర గర్భమున పడెను. ఆ విషయము బ్రహ్మ దేవునకు తెలిసి ఆ తేజస్సును తాను ధరించి,తిరిగి పురుష రూపము చేసి అత్రి మహాముని కి వివాహము అయిన తరువాత అనసూయ ద్వారా ఒక పుత్రుడు, తరువాత క్షీరసాగర మధనమున జనించునని చెప్పి అంతర్దానము అయ్యెను.
        కొంత కాలమునకు కర్దమ ప్రజా పతికి బ్రహ్మ దేవుని అనుగ్రహమున తొమ్మిది మంది కుమార్తెలూ, ఒక కుమారుడు జన్మించెను. కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను బ్రహ్మర్షులకు ఇచ్చివివాహము చేయ తలచి అందులో ఒకరు అయిన  అనసూయను అత్రి మహర్షికి ఇచ్చి వివాహము చేసెను.ఈ ప్రకారముగా అత్రి మహర్షి సతీ సమేతుడయి వనమునకు వెళ్ళెను. అనసూయ తన భర్తనే దైవముగా తలచి సకల సేవలు చేయుచుండెను ఆమె చేయు సపర్యల వలన రోజురోజుకూ అనసూయ గొప్పతనము పెరుగుచుండెను.
         ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ గురించి విని ఆమెను పరీక్షించుటకు వచ్చి ఆతిధ్యము కోరెను,అత్రి వారిని ఆహ్వానించి సపర్యలు చేయుచుండగా వారు అయ్యా మేము ముగ్గురము ఒక వ్రత నియమమున ఉన్నాము, మాకు ఒడ్డించు స్త్రీ నగ్నముగా వడ్డించ వలెను , అని చెప్పిరి. అత్రి మహర్షి ఈ విషయమును అనసూయకు తెలపగా ఆమె అంగీకరించెను. అంత త్రిమూర్తులు స్నానము చేసి వచ్చి కూర్చుండగా అనసూయ వారిమీద మంత్రించిన జలము చల్లెను, ఆమె మహత్యమున వారు ముగ్గురూ అభం శుభం తెలియని చిన్నపిల్లలుగా మారిపోగా, ఆమె నగ్న అయి వడ్డించి వస్త్రము ధరించి తిరిగి వారిపై మంత్రజలము చల్లగా వారు మామూలుగా మారగా వారిని భుజింపు మని కోరెను. పిమ్మట భుజించిన తరువాత వారిని మరల చంటి పిల్లలను చేసి ఊయలలో పడుకోపెట్టి ఊపుచుండెను.ఇంతలో లక్ష్మి, సరస్వతి, పార్వతులు తమ భర్తలను వెదుకుచూ  వచ్చి అనసూయను పతిబిక్ష పెట్టమని కోరెను.అనసూయ వారిని ఆదరించి ముగ్గురు చంటిబిడ్డలను ఇచ్చెను, అది చూసి వారు ఆశ్చర్య పడగా మంత్రజలము చల్లి వారిని త్రిమూర్తులుగా మార్చెను.ఆమె మహాత్యమునకు త్రిమూర్తులు మెచ్చి లోకోద్ధారకులు  అయిన ముగ్గురు పుత్రులు కలుగుదురు అని ఆ దంపతులను ఆశీర్వదించి వెడలిపోయెను.
          అటు పిమ్మట కొంత కాలము తరువాత అత్రి మహర్షి భార్యాసమేతుడయి ఋక్ష్య పర్వతము పై నిలిచి దేవదేవుని గూర్చి వంద సంవత్సరములు పైగా తపస్సు చేసెను, ఆ తాపమునకు త్రిమూర్తులు ప్రత్యక్ష మయిరి. నేను సత్సంతానము కొఱకు దేవదేవుని గూర్చి తపస్సు చేయగా ముగ్గురు వచ్చితిరి ఏమి, మీలో అధికులు ఎవ్వరు అని ప్రశ్నించెను. మేము త్రిమూర్తులము మాలో బేధము లేదు, మా అంశము లతో మీకు ముగ్గురు కుమారులు జన్మించెదరు అని చెప్పి అంతర్ధానమయ్యెను.
     కాలక్రమమున అత్రి మహర్షి నేత్ర గోళములనుండి  చంద్రుడునూ, అనసూయా గర్భమున దత్తాత్రేయ, దుర్వాసులునూ జన్మించిరి.త్రిమూర్తుల అంశమున జన్మించుటచే  వారు అతి తేజస్సుతో దినదిన ప్రవర్దమానముగా పెరుగుచూ తల్లిదండ్రులకు ఆనందము చేకూర్చుచుండెను. ఇట్లు పుత్రులు పెరుగుచుండగా అత్రి మహర్షి తపోధ్యానమునకు పోదలచి భార్యతో తన కోరిక తెలిపి నీవు కూడా నాతొ వత్తువా లేక పుత్రులను చూచుకోనుచూ ఇచటనే ఉందువా  అని అడిగెను. అందులకు అనసూయ స్వామీ  పుత్రులు ఇంకనూ పెద్దవారు కాలేదు,ఆశ్రమము  విడిచిపోవుట ధర్మము కాదు కదా, పుత్రుల పోషణకు పృధు చక్రవర్తి వద్దకు వెళ్లి ధనము తీసుకొని రండి, పుత్రులు పెరిగిన పిమ్మట ఇరువురమూ కలిసి పోయెదము, అయిననూ మీకు చెప్పతగిన దాననా అనెను. అత్రి మహర్షి అట్లే అని పృధు చక్రవర్తి వద్దకు వెళ్ళగా చక్రవర్తి ఆశ్వమేధ యాగము చేయుచుండెను. యాగము తరువాత  చక్రవర్తి యాగాశ్వమును విడిచి పుత్రుని తో పాటు అత్రి మహర్షిని వెళ్ళమని ప్రార్ధించెను. ముని అందులకు అంగీకరించి వెళ్ళుచుండగా పృధు చక్రవర్తి యాగ వైభవమును చూడలేక అసూయ చెంది ఇంద్రుడు మారువేషమున యాగాశ్వమును అపహరించి ఆకాశమున పోవుచుండగా పృధు కుమారుడు అత్రి సాయమున వానిని అనుసరించి వెళ్లి ఇంద్రుని పై బాణములు వేసి గాయపరచగా అశ్వమును వదిలి ఇంద్రుడు పారిపోయెను. యజ్ఞము నిరాటంకముగా జరుగగా ప్రుధుడు మెచ్చి అత్రి మహర్షిని పొగడగా, అత్రి కూడా రాజుని ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడెను.  గౌతమ మహర్షి ఇది విని ఒక మానవ మాత్రుని ఇంతగా పోగుడుదువు ఎందుకు అనగా తన  మాటలలో తప్పులేదని అత్రి వాదించెను. ఇరువురకూ వాదము పెరుగగా కాశ్యప మహర్షి లేచి ఈ వాదమునకు  సంపత్కుమారుడు తప్ప వేరెవ్వరూ సమాధానము చెప్పలేరని తెలుపగా అత్రి గౌతములు సంపత్కుమారుని వద్దకు వెళ్లి ఈ వాదమును తెలిపెను. ఆయన అత్రి మహర్షి చెప్పిన మాటలలో దోషములేదు అని చెప్పగా సదస్యులు అందరూ పృధు చక్రవర్తి వద్దకు వచ్చి విషయము వివరించగా ఆ చక్రవర్తి అత్రి మహర్షిని ధన,కనక,వస్తు వాహనములతో సత్కరించెను. మహర్షి ఆ ధనముతో ఆశ్రమము చేరి పిల్లలకు పంచి ఇచ్చి వారు పెద్దవారు అయిన తరువాత భార్యాసమేతుడయి తపమునకు వెళ్ళెను.
         ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధము  జరుగుచుండెను,అందు రాహువు అస్త్రముతో సూర్యచంద్రులను పడవేసెను. ఆ కారణమున లోకమంతయు చీకటి కలుగగా ఆ అవకాశము తీసుకుని రాక్షసులు రెచ్చిపోయి దేవతలను సంహరించుచుండెను. అప్పుడు దేవతలు అందరూ అత్రి మహర్షికి విషయము చెప్పి శరణు అడుగగా, అత్రి మహర్షి సూర్య చంద్రులను నక్షత్రములుగా చేసి,తన తీక్షణ దృష్టి చేత రాక్షసులను సంహరించెను.జగత్తు మంచి కొఱకు, దైవ కార్యము కొఱకు అత్రి ఇటువంటి మహత్తులు చాలా చేసెను.
         ఒక సారి కొంతమంది ఋషులు అత్రి మహర్షిని దర్శించి మహాత్మా నీవు ప్రపంచములో గోప్పవాడవు, సర్వ శాస్త్రములు తెలిసినవాడవు కావున మా యందు దయ ఉంచి దైవములలో ఉత్తముడు ఎవరు ? ఏది పరమ ధర్మము ? ఏది పరమావిధి ? పరమేశ్వరుని అర్చించు విధానము తెలుపుమని కోరెను. అందులకు అత్రి మహర్షి ఋషులారా శ్రీమన్నారాయణుడే ఉత్తమ దైవము, ఈతడే పరంధాముడు, పరంజ్యోతి, ఉపవాస వ్రత దానములతో ఆతని అర్చించుట పరమ శ్రేష్టము .ఉదయము, సాయంత్రము దేవాలయమునగాని,గృహమునగాని బ్రాహ్మణులు భక్తి భావముతో అగ్నిహోత్రము  చేసి పరమేశ్వరుని ప్రతిమను పూజించుట శ్రేయస్కరము. భ్రుగుడు, కాశ్యపుడు, మరీచి , నేను కూడా  దీనినే అభినందించును. అని సవివరముగా ఉపదేశించెను. ఇదియే " అత్రి సంహిత" గా  పేరు పొందెను.
     ఇందు అత్రి మహర్షి కర్మ, ప్రతిష్ట , పూజా స్నపనోత్సవము, ప్రాయశ్చిత్తము లను పొండుపరచెను.
ఇందు దేవాలయ స్థల పరిశీలన, దైవ ప్రతిమా నిరూపణము మొదటి భాగము  నందును,దేవతా ప్రతిష్ట , ప్రధాన పరివారము రెండవ భాగమున,పూజా విధానము మూడవ భాగమున, మహాభిషేకము మొదలయినవి నాలుగవ భాగమున,ఉత్సవ విశేషములు వాటి నిబంధనలు అయిదవభాగమున, పూర్వోక్త విదానమునందు ఉన్న దోషములకు ప్రాయశ్చిత్తము ఆరవ భాగమున వివరించెను.ఈ విధముగా పూజలు, దేవతార్చనలు అత్రి మహర్షి లోకమునకు చెప్పెను.
        ఇవి కాక అత్రి సంహితలు, అత్రి స్మృతులు మొదలగు గ్రంధములను కూడా రచించెను. వీటిలో దానములు, ఆచారములు,  గురు ప్రశంస, చాతుర్వర్ణ ధర్మములు,జపమాల పవిత్రత,బ్రాహ్మణులకు ఉండవలసిన సుగుణములు,యమ నియమములు, పుత్రులు,  దత్త పుత్రులు,ప్రాయశ్చిత్తములు, అశౌచములు, మొదలగు ఎన్నో విషయములు గురించి వ్రాసెను.
     సమాజములో అస్ప్రుశ్యులు లేరు,రజకులు, పాదరక్షలు తయారుచేయు వారు,పల్లెవారు, భిల్లులు,యాత్ర వివాహ యజ్ఞాదులలో తాకరాని వారు , తాక తగిన  వారు అను పట్టింపు లేదు, అని అత్రి మహర్షి స్పష్టంగా చెప్పినారు. ఆ రోజులలోనే అత్రి మహర్షి ఎంత చక్కగా వివరించినారో కదా ..
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment