తెలుగుభాష ప్రాభవం
పోడూరి శ్రీనివాసరావు 
తెలంగాణా అయితే నేమి?
రాయలసీమ అయితే నేమి?
సర్కారు అయితే నేమి?
త్రిలింగ దేశం మనది!
తెలుగు భాష మనది!!
  
‘అమ్మ’ అనే రెండక్షరాల మధుర భాష మనది!
ఆత్మీయత తో పెనవేసుకునే తెలుగు జాతి మనది!!
ఆంధ్రభోజుడు మెచ్చిన భాష మన తెలుగు భాష!
బ్రౌన్ దొర ఆప్యాయంగా హత్తుకున్నదీ మన తెలుగు భాష!!
  
గిడుగు రామ్మూర్తి పంతులు, గురుజాడ, నండూరి
దేవులపల్లి,శ్రీశ్రీ,సినారె,కాళోజీ,కరుణశ్రీ
దాశరథి,ఆత్రేయ,ఆరుద్ర,వేటూరి......
ఇలా ఎందరెందరో....మహానుభావుల
నీరాజనాలందుకున్నదీ...మన తెలుగు భాష!
  
చిలకమర్తి ప్రహసనాలు,విశ్వనాథ విసురులు,
పానుగంటి వ్యాసాలు,శ్రీనాథుని చమక్కులు,
పోతనామాత్యుని భక్తిరసాలు,మొక్కపాటి హాస్యాలు,
వికటకవి విశ్వరూపాలు,అల్లసాని పద కవితా ప్రబంధాలు,
రామదాసు కీర్తనలు,త్యాగరాజు ఆలాపనలు,
అన్నమయ్య జిగిబిగిలు,ముత్తుస్వామి దీక్షితుల సంగీత కృతులు,
బాలమురళీ గళాన జాలువారిన గమకాలు
చిట్టిబాబు కరకమలా విరిసిన వీణానాదాలు
ఘంటసాల కంచు కంఠాన వినిపించిన మధురగానాలు
తెలుగుకోకిల సుశీలమ్మ సుమధుర సహగానాలు
తేటతెలుగు ఒరవడి,ఈనాటికీ
కనులముందు కదలాడే సాహితీ ఝారి.
  
అనితరసాధ్యం – అవధాన ప్రక్రియ మనసొంతం
అందమైన కందం,ఆటవెలది
తేటగీతి సీస పద్యాల ఒరవడి మనదే!
రాగయుక్త పద్యగీతాలాపన మన పేటెంటు
మరే ఇతర భాషకూ లేదయ్యా....ఈ గ్రాంటు
హరికథలు,బుర్రకథలు,అతిహృద్యంగా,
మనోహరంగా ఆలపించడం
శ్రోతలనలరించడంలో మనమే ఫస్టు
వేరెవరికీ తెలియదయ్యా దీని టేస్టు
ఇవన్నీ తెలుగు సంగీత సాహిత్యాల్లో అజరామరాలు.
  
గతచరిత్ర వైభవం – మన తెలుగు భాష సొంతం
కాపాడు కొందాం – మనమందరం
ఎలుగెత్తి చాటుదాం – ఏ కరువు పెడదాం
భావితరాలకు తెలియ చెప్పుదాం
మనకు గర్వకారణమైన తెలుగు పలుకు మాధుర్యం
తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వించు
సాహిత్య చరిత్రలో ఆంధ్రభాష వైభవం
సువర్ణాక్షరాలతో లిఖించు.
తెలుగు జండా రెపరెపలు ఎగరాలి నింగి నిండా!
****
 
 
       
    
 
 
 
 
            
          
 
 
 
 
No comments:
Post a Comment