నల్లధనము
 డా.బల్లూరి ఉమాదేవి 
కామవరం,ఆదోని.
 తనది కాని దేది తరము కాదు
 పైన నొకడు చూచు భగవంతు డుండును
 నల్లధనము నమ్మి నష్టపోకు.
2ఆ.వె:వేతనమునకింత విలువకట్టిన పన్ను
 కట్టవలెను జనులు క్రమముగాను
 కాసుకాశ పడిన కష్టముల్ దప్పవు
 పట్టుబడిన తాను బంది యగును.
3.ఆ.వె:న్యాయరీతి లోన నార్జించిన ధనము
 తృప్తి నొసగుచుండు సృష్టి యందు
 కాదు కూడదనుచు కాపాడ జూచిన
 నల్లధనమె బ్రతుకు నల్ల బరచు
4.ఆ.వె:అక్రమమ్ము గాను నార్జించు ధనమును
 నల్లధనమటంచు నందు రిలను
 దొరకనంత వరకు దొరలు తామౌదురు
 దొరక గానె వారి పరువు పోవు. 
5.ఆ.వె:నల్లధనమువెలికి నయముగా రప్పింప 
 యుక్తిపన్నెగాదెయుర్వి లోన 
 ముఖ్యసచివు డొకడు, మొదట కష్టమె యైన 
 పిదప మేలు కలుగు భీతి వలదు. 
6.ఆ.వె:నీతితోడనున్న నెమ్మదిచెడబోదు 
 పన్ను కట్టకున్నబాధ పెరుగు 
 అట్టి వారి కిలను నగచాట్లు హెచ్చౌను 
 తెలుసుకొనుము బిడ్డ తెలిివి కలిగి 
7.ఆ.వె:ఒక్కనోటుమార్చ నుర్విమారగ బోదు 
 దొంగ నోట్లుదాచు దొరల కిపుడు 
 నుయ్యి ముందు వెనకగొయ్యి చందంబయ్యె 
 అడుసుతొక్కనేల యడలనేల. 
8.ఆ.వె:ఉగ్ర వాద మణచనుర్విలో యత్నించి 
 ధనమె మూలమంచు దారి తప్పు 
 ధనము ,నిటుల మంచి దారినిడగ నెంచి 
 పెద్ద నోట్లు'మోడి'రద్దుచేసె. 
9.ఆ.వె:ఆది లోనకలుగు నన్నియాటంకముల్ 
 సర్దు కొనును వేగ జగతి యందు 
 నో( ఓ)రి మున్న చాలు నొనగూరు సుఖములు 
 ననెడు మాట లెపుడు నమ్మవయ్య. 
10.ఆ.వె:నల్ల ధనమటన్న నల్లని పామేను 
 కాటు వేయు నదియుకడకు నిన్ను 
 పన్ను కట్ట నీకు పైకంబు మిగులును 
 దాచు కొన్నదెల్ల దోచ బడును. 
11.ఆ.వె:లంచములను మ్రింగి లక్ష్మిపుత్రుడ నంచు 
 చెప్పుకోకు మయ్య చేటు కలుగు 
 నిచ్చుటయును మరియు పుచ్చుకొనుట కూడ 
 నేరమనెడి మాట నెరుగవయ్య. 
12.ఆ.వె:అక్రమముగ ధనము నవనిలో నార్జించి 
 దాచి యుంచ నదియు తప్పె యగును 
 పరుల కొంప కూల్చి పైకంబు దాచంగ 
 చివర చేతి కెపుడు చిప్ప మిగులు. 
13.ఆ.వె:సక్రమముగ ధనము సంపాదించితి వేని 
 తరతరములవరకు ధరను మిగులు 
 అక్రమముగ వచ్చు నార్జనమ్మంతయు 
 పట్టు బడగ బోవు వసుధ యందు. 
14.ఆ.వె:ధనమె మూలమంచు దయమాలి కొందరు 
 లంచములను కోరి కొంచమైన 
 జాలి లేక జనుల జగతిలో పీడింప 
 నదియె గనుమునిలనునల్ల ధనము. 
15.ఆ.వె:గొప్ప నిర్ణయమ్ము ఘనముగా చేపట్టి 
 మార్గదర్శకుడయ్యె మహిని మోడి 
 కొత్తనోట్లు తెచ్చి చిత్తు చేసెను గదా 
 నీతిలేనివారి నిలను తాను. 
16.ఆ.వె:దిగులు పడగ వలదు జగతిలో జనులార 
 సగటు జీవులకును సంతసమ్ము 
 కలుగువార్త నిదియుకలవరము వలదు 
 నల్లధనమనునదితెల్లనగును. 
17.ఆ.వె:నల్లధనమ దెెపుడు నాణ్యమైనది కాదు 
 న్యాయము విడనాడి యార్జనమ్ము 
 చేయ తొలగు సుఖము, చిత్త మశాంతమై 
 మిగులు సతము నీకు దిగులు గనుము. 
18.ఆ.వె:కట్టె పెట్టె లందు గుట్టుగా దాచిన 
 పైకమెల్ల నేడు పనికి రాక 
 తికమకపడుచుండి తిట్టుచు నేతలన్ 
 ఖర్చు చేయ లేక కస్తి పడిరి. 
19.ఆ.వె:పెట్టె లందు యున్న పెద్దనోట్లన్నియు 
 పెద్ద పాములల్లె భీతి గొలుప 
 గుట్టు రట్టు కాగ గుండెగుభిలనంగ 
 నేమి చేయ వలెనొ నెరుగ రైరి. 
20.ఆ.వె:బీరువాలయందు పెద్ద పెట్టెల యందు 
 వంట యింటిలోన వాసిగాను 
 మంచమరల యందు మంచిగా దాచిన 
 సొమ్ము వ్యర్థమనగ సోలిరెల్ల. 
21.ఆ.వె:పెద్ద నోట్లనెల్ల పెట్టెలలో దాచి 
 భరత జాతి యొక్క పరువు తీసి 
 పరుల పేరు లందు పైకమ్ము దాచిన 
 మోసగాళ్ళకిపుడు మూర్ఛ వచ్చె. 
22.ఆ.వె:పేద ప్రజల దోచి పెట్టెలు నింపుచూ 
 ముందు జాగ్రతనుచు మోహ మంద 
 కలము పోటు తోడ కంగారు పెట్టుచు 
 ఘనుడు నయ్యె మోడి కనగ రండు. 
23.ఆ.వె:దార్శనికత తోడ ధరణిలో యీనేత 
 నల్లధనము నెల్ల తెల్ల చేయ 
 నోట్లు రద్దు చేసి గుట్టురట్టునుచేసె 
 నూత మొసగ రండు నుత్సుకతన. 
24.ఆ.వె:స్వచ్ఛభారతమ్ముసాధింప సమకట్టి
గొప్పనిర్ణయమ్మ కువలయాన 
 తీసుకొనియె నితడుదేశమ్ము నికపైన 
 బలముపుంజు కొనుచుబాగు పడును. 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment