పల్లెలు నాడు - నేడు
పోలంరాజు శారద
1. ఆ.వె
సంకురాత్రి వచ్చె సంబరాలు సలుప
పల్లె వీధు లెల్ల పరవశించ
రంగవల్లి తీర్చె రమణు లందరు చేరి
తెలుగు వెలుగు మురిసె తెలియ రారె 
2. ఆ.వె
అల్లుడొచ్చె ననుచు అత్త మురిసె బంధు
మిత్రు లాదరించె, మేల మాడె
బావమరది, మురిసె పల్లె జనములెల్ల
పంట చేరె యిళ్ళ పండగనుచు 
3. ఆ.వె
కాలి అందియల్లు ఘల్లుఘల్లు మనగ 
కడవ శిరము నుంచె కమల నయన
సోయగంబుకుర్ర సోకులాడు మురిసె
పొగడ మాటు నుండి పొంచి చూడ
4.  తే.గీ     
 రవి కిరణములు పొడవ సరసులు మంద 
 గమనలయి కడు కనువిందుగ స్వగృహముల  
 ప్రాంగణ మలరించిన మన పల్లె  లోన
 తెలుగు వెలుగుల జిలుగుల తెల్ల వారె   
5. తే. గీ       
అరుణ కిరణముల వెలుగు యొప్ప కొలను
కలువల జిలుగు లలరింప కనుల కింపు
పికముల కలకల రవము పిలువనంప  
తెలుగు వెలుగుల జిలుగుల తెల్ల వారె 
పల్లెలు నేడు.....
1. ఆ.వె
పల్లెలన్న దేశ పట్టుకొమ్మ లనుట
గగన కుసుమ మాయె కనగ లేము
పాడి పంట చేల పంట కాపు బతుకు
దుర్భరమ్ము చేసె దుష్ట జనము
2. ఆ.వె 
పలుకు తేనె లన్న పదము మరిచి పర
బాస రుచులు మరిగె, పరుగు లెత్తె
ఎండమావి యెరుక లేని బడుగు జీవి
పేద వృద్దు లైన పితరు లొగ్గి 
3.  ఆ.వె
పెంకుటిళ్ళు మారె  పెనుభవనములొచ్చె
చెఱువు లన్ని యెండె చెలమ  మిగిలె
కట్టు బొట్టు మాట కలగ పులగమాయె
రాజకీయ మెల్ల రాజ్య మేలె 
4. ఆ.వె
కులపు వృత్తు లెల్ల కూడు నివ్వ వనుచు
వలస పాయె నకట వదలె తల్లి
ఒడిని, రెంటికిన్ని చెడిన రేవని రీతి
గట్టులెల్ల నునుపు కాన రాగ  
. 
5. ఆ.వె. 
కూడు గుడ్డ కొరకు గూడు వదిలె బిడ్డ
కడలి దాటి నాడు కలల పంట
కాటి  చేర్చు వాడు కరువాయె ధనికుని
కయిన దిక్కు నీవె కాద దేవ  
6 ఆ.వె
అంత్య కాల మందు యాదరణలు లేక
కాల రాసి నట్టి కన్న బిడ్డ
అంత్య క్రియలు చేసె యాడంబర ముగను
ఆహ యనుచు నూరి జనులు మెచ్చ
******************************
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment