‘బియ్యంలో రాళ్ళు ‘ - పుస్తక పరిచయం
- బ్నిం
సమాజంలో జరుగుతున్న సంఘటనల్నే కథలుగా, హృదయావేదనతో శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి రచించిన 35 కథలు ‘బియ్యంలో రాళ్ళు ‘ నిజ జీవితంలో  వాస్తవిక అంశాలకు ప్రతిబింబం. కేవలం కాలక్షేపం కోసం కాకుండా కథలన్నీ చక్కని సందేశాలను అందిస్తున్నాయి. రచయిత్రి ‘నా.... ముందుమాట’ లో ఎన్నో జరిగిన వాస్తవిక సంఘటనలకి, ఇంకా జరుగుతూనే వున్న దారుణాలకు కలత చెంది ఈ కథారూపాలు సృష్టించినట్లు చెప్పారు. ఆమె పేర్కొన్నట్టుగా మంచి కథ రాయగలగడం అంత సులభం కాదు. ఈ కథలన్నీ వస్తు వైవిధ్యభరితంగా ఆకట్టుకొంటున్నాయి.  సంపుటిలో తొలికథ ‘బియ్యంలో రాళ్ళు’ ముఖ్యంగా ఒక సామాన్య గృహిణి మంచిని చెడునీ వేరుచేసే భావుకత కథావస్తువుగా, నిన్న కంటే నేడు, నేటి కంటే రేపు ఎంత ఘోరతరం అవుతున్నదీ అధ్బుతంగా వ్యక్తీకరించారు. యదార్ధంగా రచయిత్రి ఒక కుటుంబంలో చూసిన సంఘటన ఆధారంగా రాసిన ‘ ఒసే కమలా’ ఒక మధ్య తరగతి గృహిణి మమ్మీగా అందరిచేత పిలిపించుకోవటంలో ఎంతో వేదన వుంది. ‘ ప్రాచీన హోదా’ లో అందమైన తెలుగుభాషను భ్రష్టుపట్టిస్తున్న దిగజారుడు బోధన ఇతివృత్తంగా చెంపపెట్టు అందించారు. ‘ఎటు పోతుందో దేశం? ‘ లో రాజకీయనాయకుల పదవీ వ్యామోహాన్ని ఎత్తి చూపించారు. ‘ట్రాఫిక్’ కథలు నియంత్రనలేని ట్రాఫిక్ కారణంగా పాప ప్రమాదమరణం వ్యధ సృష్టించిన విషాద కథనం. యుగాది కథలో నాగావైష్ణవి కిడ్నాప్ దారుణ హత్యా దుర్ఘటన, ‘పరదామాటు’ కథలో స్కూటర్ మీద  వెడుతూ అమ్మాయిల పట్ల వేధింపులు, చైన్లు చోరీలు, ‘నీటిబొట్టు’ కథలో నగరాలలో రానున్న నీటి కరువు భవిష్యత్తులో సృష్టించే ఘోర వైపరీత్యం ఒక హెచ్చరికగా వుంది. ‘అందాలపోటీ’ కథలో ‘అపార్టుమెంటులో అందాలపోటీ పిల్లల ఆట ఆసక్తికరంగా సాగింది.’పిన్నీసు’ కథలో, పెళ్లి విడిదిలో పెద్ద స్టీలు పళ్ళెంలో నిండుగా పిన్నీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం వంటి కథావస్తువుగా రాయటం బహుశా తెలుగునాట యింత వరకు కథా రచయిత్రులలో ఒక్క శ్రీదేవి గారికే చెల్లింది. బిస్కట్, బూజులకర్ర, స్టిక్కర్స్ నోము, పాడుతా తీయగా, కందిపప్పు, వంటి కథలు ఈ సంపుటిలో ‘కాదేది కథకు అనర్హం’ అంటూ, సామాజిక స్పృహతో ఒక గృహిణిగా రచయిత్రి సృష్టించిన తీరుతెన్నులు హాస్య చమత్కృతితో కూడిన సందేశాన్ని అందిస్తున్నాయి. ప్రముద చిత్రకారుడు ‘బాలి’ ముఖచిత్రం సంపుటికి కొత్త అందాన్ని, నిండు చేకూర్చింది. పేజీలు  - 335, వెల – రు, 180  ప్రతులకు: పెయ్యేటి శ్రీదేవి  బి – 44, డి.కే. ఎన్ క్లేవ్ ,  మియాపూర్  హైదరాబాదు – 500049, ph, no- 040 - 23042400
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment