అంతర్యామి-7
  
పెయ్యేటి రంగారావు 
(ఆస్తికుడైన రామదాసు, నాస్తికుడైన లావా ఆప్తమిత్రులు.  అంతర్యామి అనే ఆంజనేయస్వామి భక్తులు రామదాసుగారింట్లో బస చేసారు.  ఆయన బండారం బైట పెట్టాలని లావా ప్రయత్నిస్తున్నాడు.  అంతర్యామిని దర్శించుకోవాలని దూరాన్నుంచి ద్వారక అనే యువతి వచ్చి, లావాకు దగ్గరవుతుంది.  అంతర్యామిగారికి నరసాపురంలో అది ఆఖరి రోజు.  వారి మహిమలు చూడడానికి, వారి సందేశం వినడానికి ఎక్కడెక్కడి నుంచో జనం తండోపతండాలుగా వస్తున్నారు.  ఇక చదవండి.)ఆ వీధి వీధంతా జనంతో కిటకిటలాడి పోతోంది!అంతర్యామిగారు తన పూజా సామగ్రిని, దేవుళ్ళ విగ్రహాలని పందిరిలో అమర్చిన వేదిక మీదకు తీసుకువచ్చి ప్రతిష్టించారు.అగరుధూపాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  మూడు నిముషాలకో కొబ్బరికాయ పగులుతోంది.  అంతర్యామి గారి కార్యదర్శి అయిన భగవంతంగారు వేదిక మీద హడావిడిగా తిరుగుతూ ఏర్పాట్లు చేస్తున్నారు.  అక్కడి వాతావరణం ఎంతటి నాస్తికుల నయినా ఆస్తికులుగా మార్చివేసేలా అనిపిస్తోంది.  ఐతే ఆ పవిత్రమైన వాతావరణంలో ఇద్దరి చిరకాల వాంఛలు పూర్తి కావలసి వున్నాయి.  అంతర్యామి గారి బండారాన్ని బైట పెట్టి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలనే లావా కోరిక!  మరి ద్వారకకున్న కోరికేమిటో సరిగ్గా తెలీదు.  కాని ఆమె ప్రవర్తన చూస్తూంటే, లావా తోడు లభించడం భగవంతుడామెకు అందించిన అపూర్వమైన వరంగా భావిస్తున్నట్లనిపిస్తోంది.  వారి స్నేహం వివాహానికే దారి తీస్తుందో, విడిపోవడానికే కారణమవుతుందో తెలియదు.  ఎందుకంటే వాళ్ళిద్దరికీ భావాలలో చాల వైరుధ్యం వున్నట్టు స్పష్టమవుతోంది.  స్నేహంగా వుండడం వేరు, జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి వుండడం వేరు.  ఒకవేళ లావాని వివాహం చేసుకోవాలనే ద్వారక గనక నిశ్చయించుకుని వుంటే, ఆమె పొరపాటు పడిందేమోననే అనిపిస్తోంది.  ఏది ఏమైనా, ఆ రాత్రి అక్కడ కొన్ని అద్భుతాలు జరగవచ్చనే అనిపిస్తోంది. 
******************
          అంతర్యామిగారు ప్రజలనుద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టారు.
' శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం భూయో భూయో నమామ్యహం ||మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి || 
           సభాయైనమ:  ఇక్కడకు విచ్చేసిన పరమ భాగవతోత్తములారా!  అపూర్వ భక్తశిఖామణులారా!  పరస్త్రీని కన్నెత్తి కూడా చూడని ఏకపత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలనా దురంధరుడు, ఐహిక సుఖాల కన్న నైతిక విలువలకే అత్యధిక ప్రాధాన్యత వున్నదని చాటి చెప్పిన మహనీయుడు అయిన ఆ రఘువంశ సుధాంబుధి చంద్రుడు, ఆ ఇనకుల తిలకుడు, ఆ జానకీ హృదయనాథుడు, ఆ శ్రీరామచంద్రుడు మీకు సకల సుఖాలు కలిగించు గాక!సర్వకాల సర్వావస్థల యందు శ్రీరాముని పాదపద్మములనే మనసులో ధ్యానించుకొనువాడు, జితేంద్రియుడు, ధీశాలి, అపూర్వబల సంపన్నుడు, వాయుసూనుడు, లంఖిణి పీచమడంచిన వాడు, లక్ష్మణ ప్రాణదాత అయిన అంజనాసూనుడు, ఆ ఆంజనేయస్వామి మీకు ఆయురారోగ్యములను, సకలైశ్వర్యాలను, సుఖశాంతులను ప్రసాదించు గాక!నా ఉపన్యాసం లోని సారాంశం ఇప్పటికే మీకు అర్థం అయివుంటుంది.  కేవలం అర్థం చేసుకున్నంత మాత్రాన సరిపోదు.  నేను చెప్పే విషయాలు మీరు ఆచరణలో పెట్టాలని మీకు సందేశమిస్తున్నాను.కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు.  అంటే మన మోక్షమార్గంలో అవి అవరోధాలన్న మాట.  ఈ ఆరు శత్రువులను జయించడం మానవుల ప్రథమ కర్తవ్యం.  మన జీవన విధానాన్ని తదనుగుణంగానే మలుచుకోవాలని మీ అందరికీ నేను ఆదేశమిస్తున్నాను.  ధర్మార్థ కామ మోక్షాలలో అర్థ కామముల ధ్యాసయె గాని, ఇతరములు లేక మగ్గిపోయే మానవాళికి నేను హెచ్చరిక చేస్తున్నాను.  ధర్మమార్గాన్ని అనుసరించండి.  మోక్షగాములై చరించండి.  ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు అని చెప్పారు.  వాటిని పురుషార్థాలే అని ఎందుకన్నారు?  స్త్రీల అర్థాలు అని ఎందుకనలేదు?  ఆలోచించండి.  తండ్రి చాటున, భర్త సంరక్షణలో, పుత్రుల పోషణలో వుండవలసినది ఆడది!  ఆమెని సరైన మార్గంలో నడిపించవలసిన వాడు మగవాడు!  స్త్రీ ఎక్కడైతే పూజింప బడుతుందో, అక్కడ సకలైశ్వర్యాలు వుంటాయి.  కలకంఠి కంట కన్నీరొలికిన చోట దారిద్ర్యం తాండవిస్తుంది.  కనక మీరంతా సన్మార్గ గాములై చరించాలని, స్త్రీకి సమాజంలో అత్యున్నత స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని, ఇంద్రియ నిగ్రహంతో సాధన చెయ్యాలని సందేశమిస్తున్నాను.  
          ప్రస్తుత సమాజంలో అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  హింస పెచ్చుమీరి పోతోంది.  రాజకీయం భ్రష్టు పట్టింది.  దేశానికి చక్కని పరిపాలనని అందించ వలసిన నాయకులు ధనసంపాదనే ధ్యేయంగా చేసుకుని, రాజకీయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేసారు.  అసెంబ్లీ లోను, పార్లమెంటులోను, రాధ్ధాంతాలు, వాకౌట్లే తప్ప పరిపాలన సాగటల్లేదు.  ప్రతిపక్షాలవారు ప్రభుత్వాన్ని మీ పాలనలో లంచగొండితనం పెరిగిపోయిందని, నేరాలు, అత్యాచారాలు ఎక్కువై పోయాయని ఆరోపిస్తారు.  దానికి ప్రభుత్వం వారు, మీ పాలనలో ఇంతకన్న ఎక్కువగానే ప్రజలను దోచుకున్నారని, మీ పాలనలో హత్యలు, మానభంగాలు ఇంతకన్న ఎక్కువగానే జరిగాయని సిగ్గు లేకుండా సమాధానమిస్తారు.  ఎం.ఎల్.ఏ.లు, ఎం.పి.లు రోడ్ల మీద పడి, గూండల కన్న హీనంగా అరాచకాలు సృష్టించడం, బందుల పేరుతో ప్రభుత్వ ఆస్తులని, ప్రైవేటు ఆస్తులని ధ్వంసం చెయ్యడం చేస్తున్నారు.  ఒకవేళ పోలీసులు గత్యంతరం లేక లాఠీచార్జి చేస్తే, వారిని కూడా చితకబాదుతున్నారు.  ఆస్తులని ధ్వంసం చేసిన వారి మీద, బస్సులని తగలబెట్టిన వారిమీద పోలీసులు కేసులు పెడితే, ఈ ప్రజానాయకులే హీనంగా ఆ కేసులు ఎత్తివేయాలని, లేకపోతే మళ్ళీ బందులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.  దోపిడీలు, హత్యలు చేసే గూండాలు కూడా రాజకీయాల్లోకి వచ్చి, కొద్ది రోజుల్లోనే కోట్లకు పడగలెత్తుతున్నారు.  ఉద్యోగులకు జీతాలు పెంచాలంటే, యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికార్లు కలిసి సమావేశమై, ట్రైపార్టైట్ టాక్స్ జరిపి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.  కాని ఎం.ఎల్.ఏలు, ఎం.పి.లు వారికి వారే జీతాలు, అలవెన్సులు విపరీతంగా పెంచేసుకుంటారు.  ధరలు విపరీతంగా పెరిగిపోతూ, సామాన్య మానవుడి జీవితం దుర్భరమై పోతున్నా ఎవరూ పట్టించుకోరు.  ఏ పార్టీవారు అధికారంలోకి వచ్చినా, మరే పార్టీవారు ప్రతిపక్షంలో కూర్చున్నా ఇదే తంతు.సినిమాలలో హీరోల దగ్గర్నుంచి, రాజకీయాలలో పదవుల దాకా అంతా వారసత్వమే తప్ప, అర్హులకి స్థానం లభించదు.సంఘంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది.  ధర్మాసుపత్రులలో, ప్రభుత్వ కార్యాలయాలలో, ఒక చోట అనేమిటి, అన్ని చోట్లా లంచగొండితనం ఎల్లలెరుగకుండా స్వైరవిహారం చేస్తోంది.చదువుకుని వృధ్ధిలోకి రావాల్సిన విద్యార్థులు ఇహలోక సుఖాలపై ఎక్కు వ మొగ్గు చూపుతున్నారు.  ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వేధించడం, వాళ్ళు తమ ప్రేమను అంగీకరించక పోతే వారిపై పట్టపగలు నడిరోడ్డు మీద యాసిడ్ దాడులు చెయ్యడమో, లేక హత్య చెయ్యడమో చేస్తున్నారు.  నేరగాళ్ళు చిన్నపిల్లల్ని సైతం వదలటల్లేదు.  వారిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తున్నారు.  దొంగలు పట్టపగలే స్త్రీల మెడలలోంచి అతి పవిత్రమైన మంగళసూత్రాలని సైతం లాక్కుని పరారవుతున్నారు.  నిద్రిస్తున్న వారిని కిరాతకంగా చంపేసి దోపిడీలకు పాల్పడుతున్నారు.  ఆ నేరస్తుల్ని పట్టుకుని ఒకవేళ కోర్టులో హాజరు పరిచినా కేసులు ససంవత్సరాల తరరబడి సాగుతాయి.  ఆ నేరస్తులకి రాజకీయ నాయకుల ప్రోద్బలం వుంటుంది.  వారికి జైళ్ళలో కూడా సకల రాజభోగాలు జరుగుతాయి.  వారికి రాజకీయ నాయకులతో సంబంధాలు వుండే నిమిత్తం సెల్ ఫోన్లు కూడా సప్లై చెయ్యబడతాయి.  ఒకవేళ వారికి కింది కోర్టులో శిక్ష పడినా, వారు పై కోర్టుకి, అక్కడ చుక్కెదురైతే సుప్రీం కోర్టుకి వెళతారు.  ఈలోగా బెయిలుపై విడుదలయి మరిన్ని నేరాలు చేస్తారు.  లేకపోతే ప్రభుత్వం వారే అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అనో, మరే కారణమో చూపి కరడు గట్టిన నేరస్తుల్ని సైతం మూకుమ్మడిగా విడుదల చేసేస్తారు.  న్యాయస్థానం వారు అది తప్పని మొట్టికాయలు వేసినా వారికి సిగ్గెగ్గులుండవు.  సమాజం ఇంతలా పాడైపోవడానికి ముఖ్య కారణం మనలో భక్తి తగ్గిపోవడం, మనలో ఆధ్యాత్మిక తత్వం సన్నగిల్లడం.  అందువల్ల మళ్ళీ మనందరం దైవభక్తి పెంపొందించుకోవాలి.  అంతేకాదు, మీరంతా చుట్టూ వున్న తమస్సుని తిట్టుకుంటూ కూర్చోకుండా, మీ మీ వంతు బాధ్యతని చిత్తశుధ్ధితో నిర్వర్తించాలని చెబుతున్నాను.  ఈ సందర్భంగా మీకో పాట పాడి వినిపిస్తాను, వినండి. 
ఎటు పోతోందీ దేశం? ఆలోచించు నేస్తం! చుట్టూ చీకటి, మదిలో చీకటి వెలిగించు చిరుదీపం ||విద్యార్థులమని అంటారు కళాశాలలకు వస్తారు సమ్మెలు చేస్తూ వుంటారు చదువుకు నామం పెడతారు ||ప్రజాసేవకులమంటారు ప్రభుత్వసంస్థల నుంటారు లంచాలను తెగమేస్తారు నీతికి గంతలు కడతారు ||ప్రజానాయకులమంటారు ఎన్నికలెన్నిక లంటారు ఓట్లకు నోట్లను ఇస్తారు భ్రష్టులు నాయకులౌతారు ||  కళారాధకులమంటారు ప్రజలను మార్చాలంటారు ఏమార్చే వాళ్ళవుతారు కాసుల కమ్ముడు పోతారు ||  గంగాయమునలు పారేటి ధర్మభూమి అని అంటారు ధర్మో రక్షతి రక్షిత: ఈ సూత్రం తెలియక వున్నారు || 
          ఇక ఈ రోజు మంగళవారం.  మంగళ ప్రదమైన రోజు.  ఆంజనేయస్వామికి ప్రీతిపాత్రమైన రోజు.  ఇక్కద భక్తశిఖామణులందరు సంఘటితమైన రోజు.  ఈనాడు మనందరం హిందూమతాన్ని పునరిధ్ధామని దృఢదీక్షా కంకణ బధ్ధులమవుదాం.  ఇప్పుడు విచ్చలవిడిగా చెలరేగుతున్న నాస్తికత్వాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించి, తిరిగి కృతయుగంలోకి, అంటే ఏ యుగంలోనైతే ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందో, అక్కడికి, అంటే కొన్ని వేల ఏళ్ళ వెనక్కి ఈ భారతదేశాన్ని తీసుకువెళ్ళిపోదాం!ఇప్పుడు మీకందరికీ ఎలుగెత్తి పిలుపునిస్తున్నాను.  అందరూ ముక్తకంఠంతో భగవంతుడిని కీర్తించండి.  ఒక్కరు చేసే ప్రార్థన కన్న సామూహికంగా చేసే ప్రార్థనకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  మీరు కీర్తించేటప్పుడు భక్తిభావన ఉప్పెనలా గుండెలనించి చిప్పిల్లాలి.  కేవలం భక్తిరసమె కాదు.  మీ పిలుపుకి భగవంతుడు ప్రతిస్పందించాలంటే మీలో దైన్యముండాలి.  అహంకారాన్ని వదిలివేసి, ప్రాపంచిక విషయాలని కాసేపు విస్మరించి, అకుంఠిత భక్తిభావంతోను, అత్యంత దీనభావం తోను ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో, వారికి తప్పకుండా ఫలితం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.అందరూ నాతో గొంతు కలపండి.జై పవనపుత్ర హనుమాన్ కీ ---------  వేలకొద్దీ గొంతులు బదులు పలికాయి-----------' జై '  భజన ప్రారంభమయింది. 
' అంజనిపుత్రా - ఆంజనేయా వాయునందనా - ఆంజనేయా రామభక్తా - ఆంజనేయా లంఖిణి జంపిన - ఆంజనేయా! భక్తరక్షకా - ఆంజనేయా! దుష్టశిక్షకా - ఆంజనేయా! 
          జనంలో కొందరికి ఆవేశం అంతకంతకూ అధికమవుతోంది.  భక్తిపారవశ్యంతో ఒళ్ళు మైమరిచి పోతున్నారు.పదిమంది తమను తాము అదుపులో వుంచుకోలేక దిగ్గున లేచారు.వారితో పాటు సౌందర్యానికి పరాకాష్ట ఐన ద్వారక కూడా లేచింది!  విచిత్రమైన కాంతితో వదనం మిలమిల మెరుస్తుండగా ఆమె వేదిక మీదకు భజన చేసుకుంటూ, ఊగిపోతూ వెళ్ళింది.ఆ పదిమంది కూడా వేదిక మీదకు భజన చేసుకుంటూ, పూనకం వచ్చిన వారిలా ఊగిపోతూ వెళ్ళి, ఆంజనేయస్వామి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, నృత్యం చెయ్యసాగారు.  దాన్నే శాస్త్రజ్ఞులు మాస్ హిస్టీరియా అంటారేమో మరి!  ద్వారక కళ్ళు అరమోడ్పులయ్యాయి.  ఆమెకు తనెక్కడుందో కూడా తెలియటల్లేదు.  సాక్షాత్తు భగవంతుని సన్నిధిలోనే తానున్నది అనుకుంటోంది.  ఈ ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్లు, తను, తన స్వామి తప్ప మరెవరితోను సంబంధం లేనట్లు కనిపిస్తోంది.  భజన ఇంకా తీవ్రతరమైంది. 
' జ్ఞానసాగరా - ఆంజనేయా! జయ కపీశ్వరా - ఆంజనేయా! అతి బలశాలీ - ఆంజనేయా! శూరా వీరా - ఆంజనేయా! వజ్రశరీరా - ఆంజనేయా! కేసరి తనయా - ఆంజనేయా! జగద్వంద్యుడా - ఆంజనేయా! 
          అంతర్యామిలో చలనం ఆరంభమైంది.  ఆయన కూడా ఆవేశంగా ఊగిపోసాగారు. 
' విద్వన్మణివే - ఆంజనేయా! సుగుణసాగరా - ఆంజనేయా1 చతురుడవయ్యా - ఆంజనేయా! రామదాసువే - ఆంజనేయా!' 
          రామదాసు కళ్ళనుంచి అశ్రువులు ధారగా జాలువారుతున్నాయి.  ఆయన కళ్ళు మూతలు పడిపోయాయి.  తన్మయత్వంతో గొంతెత్తి భజన చేయసాగారు. 
' సూక్ష్మరూపా - ఆంజనేయా! విశ్వస్వరూపా - ఆంజనేయా!' 
          అంతర్యామిగారి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి!  మొహమంతా కందగడ్డలా అయిపోయింది!  శరీరమంతా వణికిపోతుండగా దిగ్గున లేచాడు.  నిలువెల్లా ఆవేశంతో ఊగిపోతున్నాడు.  మూతి పొడవుగా ముందుకు సాగింది!  గదను ధరించినట్లుగా చేయి గాలిలోకి లేచింది!  ఆయనకు ఆంజనేయస్వామి వంటిమీదకు వచ్చాడు!అందరూ జయజయ ధ్వానాలు చేసారు.  ఎవరికీ వంటిమీద స్పృహ లేదు.భగవంతంగారు, మిగిలిన శిష్యులు కలిసి గబగబా నూటేడు కొబ్బరికాయలు కొట్టారు.నూట ఎనిమిదవ కొబ్బరికాయ కొట్టబోతుండగా, అంతర్యామిగారు ఆవేశంగా ఆ కొబ్బరికాయను చేతుల్లోకి తీసుకుని, అరచేతితో దానిమీద చరిచారు.  అది భళ్ళున బద్దలలయింది!  చేతిని గాలిలోకి తిప్పారు.  అల్లా తిప్పుతూండగానే ఆయన చేతిలో హారతి కర్పూరం ముద్ద తెల్లగా కనిపించింది.!  అందరూ చూస్తుండగానే ఆ హారతి కర్పూరం భగ్గున మండింది!  ఎక్కడినుంచో గంటలు గణగణమని మోగుతున్నట్టు చప్పుదు వినిపించసాగింది!  ఆ కర్పూరం అల్లా మండుతుండగానే, ఆ మండుతున్న ముద్దను నోట్లో వేసుకుని అంతర్యామిగారు మింగేసారు!  వేదిక పైన కట్టిన షామియానా లోంచి సుగంధాలు వెదజల్లుతూ రకరకాల పువ్వులు కురిసాయి!  ఆ అద్భుతాలను తిలకించిన అందరి తనువులూ పులకరించిపోయాయి!  వారందరరి జీవితాలు ఆ అపూర్వ దృశ్యాలను వీక్షించడం వలన పరమ పునీతమయ్యాయి!  భగవంతంగారు పళ్ళెంలో పెద్ద ముద్దహారతి కర్పూరం వుంచి అంతర్యామిగారికి హారితి ఇచ్చారు.  మెల్లగా అంతర్యామిగారి కళ్ళు తెరుచుకున్నాయి.  ఆయన తిరిగి మామూలు మనిషిగా అయ్యారు.  ఆంజనేయస్వామి విగ్రహం కేసి చూస్తూ భజన కొనసాగించారు. 
' భీమరూపా - ఆంజనేయా! అసుర సంహారా - ఆంజనేయా! లక్ష్మణ రక్షక - ఆంజనేయా! చిరంజీవివే - ఆంజనేయా! జలధిని దాటిన - ఆంజనేయా! బ్రోవుమయా మము - ఆంజనేయా1' 
          ఉన్నట్లుండి ద్వారక కెవ్వున అరిచింది!అందరూ ఆమెకేసి తిరిగారు.ఆమె పూనకం వచ్చి ఊగిపోతోంది.  ధరించిన దుస్తులు అస్తవ్యస్తమై పోతున్నాయి.  మొహం ఎర్రగా మారిపోయింది.  కళ్ళు అరివీర భయంకరంగా నెత్తుటి వర్ణంలోకి మారిపోయాయి!  నోట్లోంచి నాలుక బాగా పొడుగ్గా వెళ్ళుకు వచ్చింది!ఆ నాలుక నిండా రక్తం అంటుకుని వుంది!  ఆమె వంటి మీదకు కాళికాదేవి వచ్చింది!  ఆమె చేతులు పక్కకి చాపి, మహిషాసురమర్దినిలా భీకరంగా నృత్యం చెయ్యసాగింది!  జనంలో భక్తిభావం మరింత పెల్లుబికింది.  వేదిక మీదకు వెళ్ళి నృత్యం చేస్తున్న యువకులు గబగబా ఆమెకు హారతి ఇచ్చి, నిమ్మకాయలు కోసి ఆమెకు నివేదన చెయ్యసాగారు.  విచిత్రంగా ఆ నిమ్మకాయల లోంచి రక్తం కారుతోంది!!  జనమంతా ఆమెకు సాష్టాంగ నమస్కరాలు చెయ్యసాగారు.  ఆమె గొంతు చించుకు అరుస్తోంది, ' ఒరేయ్!  నేనురా.......!  మీ అందరికీ అమ్మనిరా.....!  మహిషాసురమర్దినినిరా!  నన్నే మరిచిపోతారురా?.....'  అందరూ చూస్తూండగా ఆమె చెయ్యి గాలిలోకి తిప్పింది.  ఆమె చేతిలో కొబ్బరికాయ ప్రత్యక్షమైంది!  ఆ కొబ్బరికాయను గాలిలోకి విసిరి, తల అడ్డు పెట్టింది.  ఆ కొబ్బరికాయ భళ్ళున పగిలి, అందులోంచి నీళ్ళకి బదులు ఎర్రని రక్తం వచ్చి, ఆమె తలంతా తడిపేసింది!  ఆమె రూపం భీకరంగా కనిపించసాగింది.  ఆమె రెండు చేతులూ గాలిలోకి తిప్పేసరికి, రెండు నిమ్మకాయలు ఆమె రెండు చేతులలోకి వచ్చాయి!  వాటిని కర్కశంగా నలిపేస్తుంటే, వాటిలోంచి రక్తం ధారలుగా ప్రవహించ సాగింది!  ఆమె ఆబగా రక్తం జుర్రుకోసాగింది!  ఆ యువకులు ఆమె చుట్టూ చేరి, వంగి వంగి దణ్ణాలు పెడుతూ, ' అమ్మా!  కాళీమాతా!  శాంతించు తల్లీ!  మీ బిడ్డలం తల్లీ!  మమ్మల్ని క్షమించమ్మా!' అంటూ వేడుకోసాగారు.  ఆమె ఉగ్రంగా అరిచింది, ' మీరు కాదురా అపరాధులు!  మీ మీద కాదురా నా ఆగ్రహం!  వీడురా........వీడురా..........
(ఇంకా వుంది)
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment