కడిగిన ముత్యం - అచ్చంగా తెలుగు
కడిగిన ముత్యం
లత పాలగుమ్మి



“వదినా!! ఏంటి, మీ అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరిందటగా” అని పక్కింటి ఆమె అడుగుతుంటే అవునొదినా అని అమ్మ చాటంత మొహం చేసుకొని చెప్తుంది. ఆ ఊరిలో ఏ నోట విన్నా ఇదే “శ్రావణికి అమెరికా సంబంధం ఖాయమైయిందన్న వార్తే”.

“ఎక్కడో సప్త సముద్రాలూ దాటి చాలా దూరంఎల్లాలంటగా” అని సుబ్బయ్య మామ ఆశ్చర్యంగా నాన్నని అడిగితే నాన్న మీసం మెలేసుకుంటూ “ఆయ్” అన్నాడు ఎంతో గర్వంగా. పిల్ల అదృష్టవంతురాలు బాబాయ్ అని శ్రావణి నెట్టి మీద ఓ మొట్టికాయ మొట్టి వెళతాడు సుబ్బయ్య మామ.

పట్టు లంగా, ఓణీ, జాకెట్ వేసుకొని పెద్ద వాలు జడని అటు ఇటు తిప్పి కొట్టుకుంటూ అద్దంలో చూసుకుంటూ “నిజంగా నేను అదృష్టవంతురాల్నే” అని మురిసిపోతుంది శ్రావణి.

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. శ్రావణి తల్లితండ్రులు ఊరి పెద్దలందరి ఆశీర్వాదంతో శ్రావణి, శేఖరుల పెళ్లి అంగ రంగ వైభవంగా జరుగుతుంది.

పదహారు రోజుల పండుగ అయిన వెంటనే శ్రావణి భర్త సెలవు లేదని చెప్పడంతో ఆమెని పంపడానికి అట్టహాసంగా తయారీలు మొదలవుతాయి . కొత్త అల్లుడు రెండు సూటుకేసుల లగేజ్ తో మాత్రమే అమెరికా వెళ్ళాలని అల్టిమేటం ఇవ్వడంతో శ్రావణి తల్లితండ్రులు డీలా పడిపోతారు. శ్రావణి బట్టలకే రెండు సూటుకేసులు సరిపోకపోవడంతో ఏం చేయాలో తెలీక, అమెరికా అల్లుడికి కోపం తెప్పించడం ఇష్టం లేక వాళ్ళని అలాగే సాగనంపుతారు.

ఎయిర్పోర్టుకి వెళ్ళిన దగ్గర నుండి శ్రావణి తిప్పలు మొదలవుతాయి. మెట్లు ఎక్కకుండా పైకి వెళ్లేదాన్నే ఎస్కలేటర్ అంటారని మెుదటిసారిగా చూసిన శ్రావణికి భయంతో ముచ్చెమటలు పట్టేస్తాయి. అది ఎలా ఎక్కాలో తెలియక తికమకతో, అందరూ తననే చూస్తున్నారనే భావనతో సిగ్గుతో ముడుచుకుపోతుంది శ్రావణి. అందరు ఆమెని దాటి వెళ్ళి పోతుంటారు. శేఖరు కూడా ఎస్కలేటర్ లో పై ఫ్లోర్ కి వెళతాడు ఆమె తనతో వస్తోందో లేదో కూడా చూసుకోకుండానే. మళ్ళీ కిందకు వచ్చి “ నేను వెళుతుంటే కూడా రావాలని తెలీదా?? అలా వెర్రి మొఖం వేసుకొని చూడకపోతే” అని విసుక్కుంటాడు. ఆమెకు కళ్ళ వెంట నుండి బొట బొటా నీళ్ళు వచ్చేస్తాయి. “నీకు అసలు కామన్ సెన్స్ లేదా? అందరూ మనల్నే చూస్తున్నారు, కళ్ళు తుడుచుకో “ అని గదమాయిస్తాడు.

మా ఊరి నుండి బయలు దేరిన దగ్గర నుండి ఈయన ప్రవర్తనే మారిపోయింది, ఎవరో తెలియని వ్యక్తి తో ప్రయాణం చేస్తున్నట్లు చాలా భయంగా ఉంది అనుకుంటుంది శ్రావణి. అమ్మ, నాన్న, వాళ్ళ ఊరు అన్ని గుర్తుకువ పెద్ద పెట్టున ఏడవాలనిపిస్తుంది ఆమెకి.

ఎట్టకేలకి విమానం ఎక్కుతారు శ్రావణి శేఖర్ లు. విండో సీట్ ప్రక్కన కూర్చుంటుంది శ్రావణి సంతోషంగా. తాత్కలికంగా అతని విసుగులు అన్నీ మరచిపోయి. విమానం టేక్ ఆఫ్ అవుతుంది మెల్లగా...... భయంతో శ్రావణి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఏమనుకున్నాడో ఏమో గానీ ఆమెకేసి ఒక చూపు చూసి ఊరుకుంటాడు. కాసేపటికి సర్దుకుని బయటకు చూస్తుంది. మొదటిసారిగా మేఘాలు అంత దగ్గరగా చూస్తుందేమో, చిన్నపిల్లలా సంబరపడిపోతుంది శ్రావణి. ఎంత సంతోషంగా ఉన్నా మనసులో భావాలు పంచుకుందామంటే పక్కన కూర్చున్నది దూర్వాస మహాముని ఆయే. ఎంతో సీరియస్ గా లాప్ టాప్ లో ఏదో చేసుకుంటున్నాడతను.

మా ఊరులో కొత్తగా పెళ్లి అయిన వాళ్ళందరూ చెట్టా పట్టా లేసుకొని ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు వదలకుండా తిరగడం చూశాను, ఈయనేంటో, ఎప్పుడు సీరియస్ గా ఉంటారు అనుకుంటుంది శ్రావణి.

రెండు ఫ్లైట్స్ మారి మొత్తానికి అమెరికా చేరుకుంటారు. ఇల్లు చాలా బాగుంటుంది నీటుగా. ఇంటి నిండా ఖరీదైన వస్తువులే. సోఫాలు, డైనింగ్ టేబుల్, ఎన్నో గ్లాస్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ తో నిండి ఉంటుంది. ఇతనికి ఇంత మంచి టేస్ట్ ఉందా!! అని ఆశ్చర్యపోతుంది. ఏది ముట్టుకుంటే ఏమవుతుందోననే భయంతో తన ఇంట్లో తనే గెస్ట్ లా ఫీల్ అవుతుంది శ్రావణి. ఒక్క రోజు గడవకముందే కింద ఫ్లోర్ వాళ్ళ నుండి కంప్లైంట్ గట్టిగ నడుస్తున్నారని. గంగిరెద్దులా ఏంటా గెంతుతూ నడవడం, మెల్లగా నడవలేవా!! అని ఈయన గదమాయింపు. మా ఊరిలోలా పరుగులు పెడుతూ గెంతుతూ నడవడానికి కూడా లేదు ఈ అమెరికాలో అని వాపోతుంది శ్రావణి.

కొద్ది రోజులలోనే ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఏది ఎలా వాడాలో నేర్చుకుంటుంది స్వతహాగా తెలివైన శ్రావణి. శేఖర్ కి రెండోసారి చెప్పాలంటే విసుగు అని.

మా వారిని భర్త అనే కన్నా “చండ శాసనుడు ” అంటే బాగుంటుందేమో. అతని మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువైపోతోంది రోజురోజుకి నాకు అనుకుంటుంది శ్రావణి.

సమయం తెలీకుండా రెండు నెలలు గడిచిపోతాయి. శేఖర్ ఆఫీసుకి వెళ్ళగానే శ్రావణి అమ్మ వాళ్ళతో, తన చిన్ననాటి స్నేహితులతో కబుర్లలో పడుతుంది. వీడియో కాల్ చేసి ఇల్లంతా చూపించటం, వాళ్ళు ఆశ్చర్యంగా వినేవారు ఆమె చెప్పేవన్నీ. మైక్రోవేవ్, డిష్ వాషర్, వాషింగ్ మెషిన్ అన్నీ వాడటం వచ్చేశాయని చెప్పటంలో ఎంతో సంతోషం ప్రపంచాన్నే జయించినంత.

శేఖర్ కలీగ్ వాళ్ళ ఇంట్లో పాట్ లాక్ అట. అందరు తలా ఒక ఐటమ్ చేసుకొని వెళ్ళి ఓక చోట కూర్చుని తినడాన్నే పాట్ లాక్ అంటారని అప్పుడే తెలుస్తుంది శ్రావణికి.

నీకు తినడమేనా? ఏదైనా వెరైటీ ఐటమ్ చేయడం వచ్చా? అని వెటకారంగా అడుగుతాడు శేఖర్, అతనికేదో తెలీనట్లు.

ఆ రోజు సాయంత్రమే పార్టీ. బిర్యాని తయారు చేస్తుంది శ్రావణి.

రెడ్ బెనారస్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్, రెండు పేట్ల ముత్యాల గొలుసు వేసుకొని సింపుల్ గా రడీ అవుతుంది. ఆమెని చూస్తూనే రుస రుసలాడుతూ మనం వెళ్ళేది పార్టీకి, పెళ్ళికి కాదు. నీకు అసలు డ్రెస్ సెన్స్ లేదు, అయినా పల్లెటూరి బైతుని చేసుకోవడం నాదే తప్పు అని విసుక్కోవడంతో ఆమె కళ్ళ నుండి టప టపా కన్నీరు వరదలై పొంగుతుంటే, నెత్తి మీద నీళ్ళ కుండ పెట్టుకున్నట్లు “ఎప్పుడూ ఈ ఏడుపొకటి నా ప్రాణానికి” అని భళ్ళున తలుపు వేసి బయటకు వెళతాడు శేఖర్.

వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం వల్లనేమో ఆమెని తీసుకు వెళ్ళక తప్ప లేదు.

శ్రావణి చేసిన బిర్యానీ చూసి మెచ్చుకోకపోగా, ఎందుకు ఇంత చేసావు? ఇక్కడెవరూ ఊరివాళ్లలాగా కుంభాలు, కుంభాలు తినరు. సింపుల్గా తింటారు అని దోవంతా సాధింపే. కిమ్మనకుండా కూర్చుంటుంది శ్రావణి. ఎక్కువగా మౌనమే ఆమె సమాధానం. ఏం అంటే తప్పు పడతాడోనని భయం.

శేఖర్ ఫ్రెండ్ ఇంటికి చేరుకుంటారు. అక్కడి వాతావరణం చూసిన శ్రావణికి గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్టు అవుతుంది. ముక్తసరిగా అందరికి శ్రావణిని పరిచయం చేస్తాడు శేఖర్.

లివింగ్ రూంలో జెంట్స్, కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర బార్ చెయిర్స్ లో లేడీస్ కూర్చుంటారు. పార్టీ హోస్ట్ చేసినామె పేరు కృష్ణ వేణి ఐతే అందరు ఆమెని అబ్బాయిని పిలిచినట్లు కృష్ణ అని పిలవడం.........

కొందరు ప్యాంటు షర్ట్స్ .....మరికొందరు చిన్న షార్ట్స్ , చిన్ని టాప్ వేసుకోవడం ...... అందునా అందరూ వివాహితులవడం......... ఎప్పుడూ పల్లెటూరి నుండి పట్నమైనా వెళ్ళని శ్రావణికి అన్ని విచిత్రంగాను......విడ్డూరంగాను ......అనిపిస్తాయి .


బార్ చెయిర్ లో కూర్చుంటే ఎక్కడ పడిపోతానో అని భయమేసి కిచెన్ లో పై అరలో ఉన్న వాటిని రీచ్ అవడం కోసం హోస్ట పెట్టుకున్న టూ స్టెప్పర్ లాడెర్ ని స్టూల్ అనుకుని ఇరుకుగా ఉన్నా అందులో యడఁజూస్ట్ అయి కూర్చుంటుంది...... అది చిన్న నిచ్చెన....... అని తెలియని శ్రావణి. అందరూ సైగలు చేసి వాళ్లలో వాళ్లే నవ్వుకుంటారు....... కానీ ఎవరూ చెప్పరు అది లాడెర్ అని.

ఈ లోపే అటుగా వచ్చిన శేఖర్ అది చూసి మండి పడతాడు...... శేఖర్ ని ఊరుకోమని చెప్పి అతని ఫ్రెండ్ మంచి చైర్ తెచ్చి శ్రావణి కి ఆఫర్ చేస్తాడు కూర్చోమని. మీరయినా చెప్ప వచ్చు కదా....... ఆమెని అలా యంబరాస్ చేయకపోతే అంటాడు అక్కడున్న లేడీస్ ని ఉద్ధేశించి.

అందరు తెలుగువాళ్లే అయినా వాళ్ళ సంభాషణ అంతా ఇంగ్లీష్ లోనే సాగుతోంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని మూళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంటుంది శ్రావణి.

శేఖర్! “నీ వైఫ్ మరీ ట్రెడిషనల్ అనుకుంటా” అని కొంచెం వెటకారంగా అంటుంది కృష్ణ.

మీరే తనకి ట్రైనింగ్ ఇవ్వాలి కృష్ణా!!! తను పూర్తిగా విలేజ్ గర్ల్” అని చెప్తాడు శేఖర్. ఏదో విలేజ్ నుంచి రావడం తప్పన్నట్లు.

అందరూ ఫోర్క్, నైఫ్ యూస్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ.... నవ్వుకుంటూ తింటున్నారు. పిల్లల ఆటలు, నవ్వులతో ఆ ప్రదేశమంతా హోరెత్తిపోతోంది. శ్రావణి ఒక్కర్తే ఒంటరిగా....... భయ భయంగా అటు ఇటూ చూస్తోంది...... ఫోర్క్ నైఫ్ తో ఎలా తినాలో తెలీక.

ముందే చెప్పొచ్చు కదా ఈయనైనా...... ఇంట్లో రెండు రోజుల ముందే ప్రాక్టీస్ చేసుకుని వచ్చేది కదా తను...... అని ఆలోచిస్తూ బిక్కు బిక్కుమంటూ భగవంతుడి మీద భారమేసి తినడానికి ఉపక్రమిస్తుంది శ్రావణి. శేఖర్ కళ్ళతో ఇచిన వార్నింగ్ కి భయపడి తను కూడా వాళ్ళలా తిందామని ట్రై చేస్తుంటే పొరపాటున ప్లేట్ కిందపడి భళ్ళున పగులుతుంది.

శేఖర్ కళ్ళకి శక్తే ఉంటే తను అక్కడే భస్మమైపోయుండేదాన్ని ఆ చూపులకి అనుకుంటుంది శ్రావణి.

హోస్ట్ తనకెంతో ఇష్టమైన డిన్నర్ సెట్ ప్లేట్ పగిలిపోయినందుకు కొంచెం మొహం మాడ్చుకున్నా, శేఖర్ ఆమెకి కొత్త సెట్ కొనిస్తానని ప్రామిస్ చేయడంతో కూల్ అవుతుంది.

హోస్ట్ హస్బెండ్ శ్రావణి పరిస్థితిని అర్ధం చేసుకుని ప్లేట్ లో అన్ని ఐటమ్స్, స్పూన్ కూడా వేసి ఆమె చేతికి ఇచ్చి .......... డోంట్ వర్రీ అండీ...... మా పిల్లలు రోజుకో ప్లేట్ పగలకొడతారు అని ఆమెకి నచ్చ చెప్తాడు.

బ్రతుకుజీవుడా..... అని గాలి పీల్చుకుంటుంది శ్రావణి.

అందరికి బిర్యానీ ఎంతో నచ్చడంతో “బాగా చేసారు అని” మెచ్చుకుంటూ తింటారు. శ్రావణి పెద్ద హాట్ కేస్ నిండా చేసిన బిర్యానీ అంతా ఖాళీ అవ్వడంతో చాల హ్యాపీ అవుతుంది. శేఖర్ మొహం కూడా వెలిగి పోతుంది అందరూ శ్రావణిని పొగడటంతో.

కృష్ణ వేణి గారి కాలి మీద వేడి వేడి కాఫీ ఒలికిపోవడంతో పెద్ద పెద్ద బొబ్బలు ఎక్కి పోతాయి. అందరూ టెన్షన్ పడుతూ ఎమెర్జెన్సీకి కాల్ చేస్తారు. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తూ కూలబడి పోతుంది. అందరు భయంతో నిలబడి చూస్తూ ఉండిపోతారు ఏం చేయాలో పాలుపోక.

శ్రావణి కృష్ణ హస్బెండ్ ని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అడిగితే అందరు నోరెళ్ళబెట్టి చూస్తారు........ శేఖర్ తో సహా.......ఈ పల్లెటూరి అమ్మాయికి ఏం వచ్చు అనే సందేహంతో. ఆమె ఎక్స్పర్ట్ ల ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసిన వారెవరికీ నోట మాట రాదు.

వేసవి సెలవల్లో మాఊరిలో ఇంకేమి వ్యాపకాలు లేకపోవడంతో సహజంగా వైద్య వృత్తి అంటే మక్కువ ఉన్న నేను మా ఊరిలో డాక్టర్ దగ్గర చిన్న చిన్న చికిత్సలు నేర్చుకున్నానని చెప్తుంది శ్రావణి.

కృష్ణ వేణి ఒక వారం రోజుల పాటు నడవటానికి లేదని బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్తారు. పూర్తిగా నడవడానికి రెండు వారాలు పైగా పడుతుందని చెప్పడంతో కృష్ణ వేణి, ఆమె హస్బెండ్ టెంషన్ పడతారు. వాళ్ళది బిజినెస్ అవడంతో అతను వెళ్లక తప్పదు. కృష్ణ వేణి మదర్ ఇండియా నుండి వచ్చేలోగా ఎవరైనా డే టైములో హెల్ప్ చేయడానికి తనతో ఉండాలి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎవరికివాళ్లు మాకు కుదరదంటే మాకు కుదరదు అని గుసగుసలాడుతుంటే విని ఆశ్చర్యపోయి తను హెల్ప్ చేస్తానని చెప్తుంది శ్రావణి.

మా ఊరిలో అయితే ఇదొక సమస్య కానే కాదు. అందరూ హెల్ప్ చేస్తారు. నిజం చెప్పాలంటే హెల్ప్ అని కూడా ఎవరు అనుకోరు. కాజువల్ గా చేసేస్తారు.

వీళ్ళెంతో ప్రాణ స్నేహితుల్లా ఉన్నారు ఇప్పటి వరకు..... చిన్న హెల్ప్ చేయడానికి ఎందుకింత ఆలోచిస్తున్నారు..... అనుకుంటుంది శ్రావణి.

వారం రోజుల పాటు రోజూ ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడు కృష్ణ వేణి ఇంట్లో శ్రావణిని డ్రాప్ చెయ్యడం, సాయంత్రం పిక్ అప్ చెయ్యడం చేసేవాడు శేఖర్. వాళ్ళ తో పాటు తనకి కూడా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకు వెళ్ళేది శ్రావణి. ఆ వారం రోజులలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు.

కృష్ణ వేణికి బోర్ కొట్టకుండా లేసులతో టేబుల్ మాట్స్, రక రకాల క్రాఫ్ట్స్ తయారు చేయడం, కలర్స్ తో రంగోలి వేయడం నేర్పిస్తుంది శ్రావణి.

శ్రావణి మంచి మనసుకి.... తెలివితేటలకు.... పొందికతనానికి..... కళా నైపుణ్యానికి.... ఆమెకి ఫిదా అయిపోతుంది కృష్ణ వేణి.

ఆమెకి కాలు పూర్తిగా తగ్గి నడవడం ప్రారంభిస్తుంది. శేఖర్ సాయంత్రం పిక్ అప్ కి వచ్చినప్పుడు కృష్ణ వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతుంది.

శ్రావణి పల్లెటూరి అమ్మాయని, కల్చర్ లెస్ అని, మోడరన్ గా లేదని మేమంతా చాల ఎగతాళి చేసాము.

“మా అందరి కన్నా గొప్ప మనసు” మీ అవిడది శేఖర్. తను మా దగ్గర నుండి కాదు, మేమే తన దగ్గర నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది అని......

నా కెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారని చాలా గర్వం గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ సమయానికి ఎవరూ హెల్ప్ కి రాలేదు. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకున్నారు......

మేమందరం ఫాషన్ అనే ముసుగులో మానవత్వాన్ని మర్చిపోయాము. ఈ బిజీ లైఫ్ లో ఎంత సేపు నేను, నా ఫామిలీ అని గిరి గీసుకొని బతికేస్తున్నాము, పక్కవాడికి ఏమైందో కూడా పట్టించుకోకుండా. “నువ్వు మారకుండా కడిగిన ముత్యంలా ఉండి , మా అందరికి మార్గదర్శకం అవు శ్రావణి “ అంటుంది కృష్ణ వేణి.

కృష్ణ వేణి మాటలు శేఖర్ లో కూడా మంచి మార్పు తెస్తాయి. ఆ రోజు రాత్రి  సారీ శ్రావణి, భార్య అంటే నేను చెప్పిన ప్రతి మాటకి జవదాటకూడదు అని, పల్లెటూరి అమ్మాయి ఐతే నా మాటే నెగ్గుతుందని నిన్ను చేసుకున్నాను.

నీ మీద ఎంత ప్రేమ ఉన్నా అది వ్యక్తం చేయకుండా భార్య మీద అజమాయిషీ చేస్తేనే మాట వింటుందనే మూర్ఖత్వంతో నిన్ను బాధ పెట్టాను. బయట వాళ్ళు చెపితే కానీ నీ విలువ తెలుసుకోలేక పోయాను.

“నన్ను క్షమించు శ్రావణి” అని మనస్ఫూర్తిగా అడుగుతాడు శేఖర్. ఈ మార్పు శ్రావణి మనసుకి ఎంతో ఊరట నిస్తుంది.

మీరు నన్ను క్షమించమని అడగడమేమిటండీ అని, మీరు మారారు, నాతో ప్రేమతో ఉంటే నాకంతే చాలు అని పెళ్ళైన ఇన్ని రోజులకి అతనంటే భయపడకుండా సంతోషంతో అతని కౌగిలిలో ఒదిగిపోతుంది శ్రావణి.

****

No comments:

Post a Comment

Pages