మనసే మాట వినదు - అచ్చంగా తెలుగు

మనసే మాట వినదు

Share This
మనసే మాట వినదు   
పి.ఎల్.ఎన్.మంగరత్నం 


సాయం సంధ్య ..
కనుచీకటి కమ్ముకుంటున్న వేళ .. చల్లగాలి మందగమనంతో సాగుతూ .. మనసుని ఆహ్లాదపరుస్తుంటే, వాళ్ళిద్దరూ  తెన్నేటి పార్కులో కూర్చున్నారు దిగాలుగా. 
పార్కులో పిల్లలు చేసే సందళ్ళు గానీ, సముద్రంలోఅల్లరిగా ఎగసిపడే అలలు గానీ, నీలాకాశంలో  తేలియాడే పక్షులు గానీ వాళ్ళ దృష్టిని తమ వైపు తిప్పుకోలేక పోతున్నాయి. 
వాళ్ళు విడిపోవాల్సి క్షణాల్ని తలచుకుని మదనపడుతున్నారు.
“ రేపటి రోజుని తలచుకోవాలనుకు౦టే .. భాధగా ఉంది” అన్నాడు జీవన్. తను వాళ్ళ ఊరు వెళ్ళిపోయే రోజు.
“ నాకూ అంతే” అంది సునీత.
“ ఫోన్లో ఎంతసేపని మాట్లాడుకోగలం”
“ అవును. వీడియో కాల్ అయినా ఎంతసేపు చూసుకోగలం”
“ ఫోను మనసుల్ని దగ్గర చేసినా .. దూర౦ దూరమే కదా” చెప్పాడు జీవన్. 
“ అయితే ఏం చేద్దాం” అడిగింది. ఏదో ఒకటి చేసి తీరాలి అన్నట్లు.
వాళ్ళిద్దరూ  ఇంటర్మీడియట్ ఎడ్వాన్సుడు పరీక్షలు వ్రాసారు.  వేరు వేరు కాలేజీల్లో చదువుకున్నారు.  ఒకళ్ళను ఒకళ్ళు ఎప్పుడూ చూసుకోలేడు. పూర్తిగా అపరిచితులు.
అయితే,
ఇప్పుడు,  ఎడ్వాన్సుడు పరీక్షలు వ్రాసేటపుడు మాత్రం .. ఓ పరీక్ష హాలులో కలుసుకున్నారు.  
ఒకే రూములో, ఇద్దరివీ దగ్గర దగ్గర నెంబర్లు కావడంతో పరిచయాలూ .. పలకరింపులూ  కొద్ది సమయంలోనే ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడ౦తో ..  వాట్స్ యాప్లూ, ఫేస్ బుక్కుల పుణ్యమా అని, రోజుల పరిచయంతోనే బాగా దగ్గరయ్యారు. 
జీవన్ చాలా చలాకీగా మాట్లాడేవాడు. మంచి మాటకారి. అదే ఎక్కువ నచ్చేది సునీతకి. 
సునీత కూడా ఏ విధమైన ఆడంబరాలూ లేకపోయినా చూడ చక్కని నాజూకు బొమ్మ. అందుకే ఇష్టపడ్డాడు జీవన్.
ఇప్పుడు వాళ్ళ సమస్యల్లా ఆ పరీక్షలు అయిపోయి .. ఇప్పటిలా రోజూ కలుసుకోలేక పోవడమే.  
జీవన్ రాజమండ్రి నుండి వైజాగు వచ్చి హాస్టల్లో ఉండి చదువుకునేవాడు.
ఉన్న ఊరిలొ చదువు కన్నా .. పెద్ద సిటీలో చదివే గొప్పదని భావించారు ఆర్ధిక వెసులుబాటున్న జీవన్ తల్లితండ్రులు. అక్కడైతే, ముందు ముందు ప్లేస్మెంట్స్ వస్తాయి.  జీవితం గాడిన పడుతుందని. 
అయితే, జల్సా ఎక్కువై, చదువు తక్కువైయ్యింది.
సునీతది వైజాగే.
అక్కయ్యపాలెంలోనే ఉంటుంది.  
జీవన్ లాగే కొన్ని బాక్ లాగ్స్ ఉండిపోవడంతో మళ్ళీ వ్రాస్తుంది.
ప్రేమ గుడ్డిదనడం నిజమో కాదో తెలీదు గాని, పరీక్షల పేరుతొ వాళ్ళిద్దరూ  కలుసుకోవడం ..  ప్రేమలో పడడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.  వయసు ఆకర్షణ అటువంటిది. 
సునీతకు తండ్రి లేడు. ఇంటి ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే. తల్లి పుష్పవల్లి టైలరింగు చేస్తుంది.  అన్నయ్యది ఓ  చిన్న ప్రైవేటు ఉద్యోగం.
తనకు వయసు వచ్చింది మొదలు తల్లి, తన పెళ్లి గురించే ఆలోచిస్తు౦ది .. ఆలోచన అయితే ఉంది గాని, ఆచరణే సాద్యం కావడం లేదు. 
జీవన్ కి వాళ్ళ ఊరిలో మంచి టర్నోవర్తో నడిచే ప్రింటింగు ప్రెస్ ఒకటి ఉంది. కొన్ని పుస్తకాలు అక్కడి నుంచే ప్రింటు అవుతాయి కూడా.
ఎక్కడా ఉద్యోగం రాకపోయినా దాన్ని చూసుకోవచ్చనుకున్నా, పెద్దలు తమ ప్రేమని వప్పుకుంటేనే అది సాధ్యం.  
ఆలోచనలో పడిన జీవన్ మౌనం ఆమెను భయపెట్టింది. “ నువ్వు లేకుండా నేనుండలేను. ఇన్నాళ్లూ ఎలా బ్రతికానో తెలీదు. నిన్ను చూసిన వెంటనే . నన్ను నేను మరచిపోయాను”  అంటూ అతని భుజం మీద తల వాల్చి కన్నీళ్ళు కార్చింది అది పబ్లిక్ పార్క్ అన్న విషయం కూడా మరచిపోయి, నాకు దూరంకాబోకు సుమా అన్నట్లు.
ఆమె భయాన్ని అర్ధంచేసుకున్న వాడిలా “ మన౦  పెద్దల్ని ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. ముందు మన కాళ్ళ మీద నిలబడితే, పరిస్థితులు చక్కబడతాయి. అంత వరకూ ధైర్యంగా ఉండాలి ” చెప్పాడు ఆమె చేతిపై చెయ్యి వేస్తూ భరోసాగా. 
సమయం చూసుకుని తమ ప్రేమని అమ్మతో చెప్పెయ్యాలి. అలా అని జీవన్ గురించి అస్సలు చెప్పక కాదు. ఒకటిరెండు సార్లు చెప్పింది. ‘చాలా మంచివాడని, పరీక్షల్లో తనకు సహాయంగా ఉంటున్నాడని’
“అయితే మాత్రం .. ఇలానా ” అంటే. తనేం సమాధానం చెప్పగలదు? 
మనసు మాట వినడం లేదు .. అంటు౦దా!
      ***
సునీత ప్రతినిముషం జీవన్ ఫోన్ కాల్ కోసమే చూస్తుంది.
రోజుకి ఒక్కసారన్నా మాట్లాడుకోవాలి. 
తలి పుష్పవల్లి కూతురిని గమనిస్తూనే ఉంది. 
“ఫోన్ ఎప్పుడూ చేతిలోనే ఉండాలా?  అది తప్ప వేరేలోకమేలేనట్లుందే. దాని మీద ఉన్న శ్రద్ద ..  చదువు మీద ఉంటే, ఈ పాటికి పాసై ఉండేదానివి. ఆ చదువేదో పూర్తి అయితే,  పెళ్లి చేసేద్దాం అనుకుంటే, అది పూర్తవదు. నీ తోటి  వాళ్లందరూ పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా ఉన్నారు ” కోపం తెచ్చుకుంది పుష్పవల్లి. 
తల్లి మాటలకి కాస్సేపు ఫోన్ పక్కన పెట్టి, మిషను వర్కు పూర్తి అయి, ప్రక్కన వేసిన  జాకెట్టు చేతిలోకి తీసుకుంది విసుగ్గా. తను సూది పని చేస్తే తల్లికి కాస్త వెసులుబాటు.
“నిన్నో అయ్య చేతిలో పెట్టి ..  ఆ తరువాత అన్నయ్యనీ ఓ ఇంటి వాడిని చేస్తే నా భాద్యత నెరవేరినట్లే. మామయ్య నీ కోసం ఓ సంబంధం చూసాడు. అబ్బాయిదీ ఈ వైజాగే. స్టీల్ ప్లాంటులో ఉద్యోగం చేస్తున్నాడట”  చెప్పింది..  
రోగి కోరిందీ వైద్యుడు ఇచ్చే అదే అన్నట్లు తల్లే పెళ్ళి ప్రస్తావన తేవడంతో, ఇదే తగిన సమయం అన్నట్లు భావించి “ అమ్మా!  నేనే చాలా రోజులుగా .. నీతో ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను” చెప్పింది భయం భయంగా. 
ఆ మాటకి సందేహపడింది పుష్పవల్లి. కూతురు తనతో చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్న విషయం ఏమై ఉంటుందబ్బా,  కొంపదీసి ఎవడినైనా ప్రేమించానని అంటుంది గానా అన్నట్లు  చూసింది.  
“మరే .. జీవన్ అని చెప్పానుగా .. అతనంటే నాకు ఇష్టం”  
అనుకున్నంతా అయ్యింది.
తన అసమర్ధతని కూతురు వేలెత్తి చూపిస్తున్నట్లు అనిపించింది.  
సునీత వంక ఆశ్చర్యంగా చూస్తూ  “నువ్వు ఆ అబ్బాయి పేరు పలుకుతు౦టేనే అనుమానం వచ్చిందే. నీకు అప్పడే చెప్పాను .. అనవసరపు స్నేహాలు చెయ్యకూ అని.  కనీసం రిజల్టు అన్నా రాలేదు. అప్పుడే .. ఇలా స్వంత నిర్ణయాలా?” అంటూ మండిపడింది. 
తల్లి కోపం తెలిసినదే అయినా, ఈసారి మాత్రం సూటిగా తాకింది.
రెండు నిముషాల తరువాత కాస్త సమాధానపడిన పుష్పవల్లి  “నాతో అంటే అన్నావు గాని, మరెవరితోనూ అనకు.  కులం కానీ వాడ్ని చేసుకుంటాన౦టే, చూస్తూ ఊరు కోలేను. మన బంధువులు హర్షించరు. కాబట్టి, ఆ మాటలు ఇంతటితో వదిలేసి .. మామయ్య చూసిన సంభంధం కుదిరేలా ఉంది. చూసుకోవడానికి వస్తానన్నారు. అన్నీ బాగుంటే. తల తాకట్టు పెట్టయినా .. నీ పెళ్లి చేసి నా భాద్యత నెరవేర్చుకుంటాను ” చెప్పింది.
“ లేదు. నాకిష్టం లేదు. నేను మరెవ్వరినీ చూడను” కన్నీళ్ళు పెట్టుకుంది సునీత. 
***
అక్కడ జీవన్ పరిస్తితీ  అలానే ఉంది. మగవాడు కాబట్టి ధైర్యంగానే ఉన్నా .. తండ్రి మాటలు జీర్నించుకోలేక పోతున్నాడు. 
“ ఈసారన్నా పరీక్ష పాసు అయి, ఇంటరు గట్టెక్కితే,  ఆ తరువాత డిగ్రీ చేయించి,  ప్రింటింగు ప్రెస్ భాద్యత అప్పగించాలనుకుంటున్నాను. నువ్వు ప్రేమా, దోమా అంటూ ‘దేని’ వెంటో పడితే  ఊరుకునేది లేదు. నిన్ను వైజాగు పంపించి, చదివించింది భవిషత్తులో పైకి వస్తావని”
“ ఏదో .. మొన్నటి ‘ పరీక్ష సెంటరు’లో చూసాడట. అందుకు మేం ఇష్టపడాలట. సెల్ పోన్లు వచ్చి మిమ్మల్ని తగలేస్తున్నాయి. బుద్ధిగా చదువుకో. అనవసరపు ఆకర్షణను ప్రేమ అని బ్రమపడకు. నీకు ఓ చెల్లీ, తమ్ముడూ ఉన్నారు వాళ్ళకీ పెళ్ళిళ్ళు అవ్వాలి కదా! మొదటి వేరు సరిగ్గా లేకపోతే, మిగిలిన వేర్లు సరిగ్గా పెరగవు. ఇక మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకు ” అంటూ తండ్రి భీమశంకర౦ ఇచ్చిన వార్నింగు మర్చిపోలేకపోతున్నాడు.
కాల్ చేస్తే చాలు ఏడుస్తుంది సునీత. ఇంట్లో తనకు సంభంధాలు చూస్తున్నారని. 
అందుకే .. వెంటనే  ఓ నిర్ణయానికి వచ్చారు.
ఇద్దరూ లేచిపోయి,  పెళ్ళి చేసుకోవాలని. అదీ ఏదైనా గుడిలో. 
పెళ్ళంటూ అయిపోతే, తమని ఎవరు వేరు చేస్తారు? అయినవాళ్ళు కొన్నాళ్ళు దూరం పెట్టినా .. తరువాత కలవకపోతారా? ఎన్ని సినిమాల్లో చూడడం లేదు. 
***
ఆలోచన రావడంమే ఆలశ్యం  స్నేహితులు  ప్రత్యక్షం అయ్యారు.
ఫ్రెండు ఇంటికి వెళ్ళే నెపంతో .. అనుకున్న ప్రకారం ఇద్దరూ అన్నవరంలో కలుసుకున్నారు. స్నేహితుల సమక్షంలో .. దేవుడి సాక్షిగా దంపతులయ్యారు జీవన్, సునీతలు.  
వాట్స్ యాప్లో ఫోటోలు పెద్దలకి చేరాయి. 
***
జీవన్, సునీతను తనుండే రాజమండ్రికి తీసుకు వచ్చేసాడు. తల్లితండ్రులకు దూరంగా ..  రెండు గదుల అద్దె ఇల్లు తీసుకున్నారు. 
వెంటనే, ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాడు.  సునీత తల్లికి తెలీకుండా .. తన నగలన్నీ తెచ్చుకుంది. అవే తన వెంట వచ్చే ధైర్యం.
ఇప్పుడు హద్దులు లేని ప్రేమ సామ్రాజ్యంలో స్వేచ్చా విహంగాలు. అనుకున్నది సాధించిన ప్రేమ విజేతలు. హద్దులు లేని అనందం .. లోకం దృష్టిలో చిలకా గోరింకలు. 
ఇష్టపడితే కష్టమైనా హాయిగానే ఉంటుంది. అద్దె ఇంట్లో చాపలే పూలపాన్పులయ్యాయి. కొత్త ప్రపంచం .. కొత్త కొత్తగా మత్తు మత్తుగా ఉంది.
అయితే, ఆశనిపాతంలా వాస్తవమే భయపెడుతుంది..
***
తెలిసిన వాళ్ళ సహాయంతో రాజమండ్రిలో  ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్తుగా చేరింది సునీత. ఎనిమిది వేలు జీతం.  
కాస్త ధైర్యం వచ్చింది. ఇంటి అద్దే రెండువేలు. అదే పెద్ద ఖర్చు వాళ్ళ సంపాదనకి. 
మొదట్లో కొత్తజంటను చూసి, స్వాగతించిన ఇంటి ఓనరు పరదేశమ్మ తరువాత తరువాత ఇష్టపడకుండా పోయింది.
“ఉద్యోగస్తులకే ఇల్లు ఇవ్వాలనుకున్నాను. నెల తిరిగే సరికి అద్దె డబ్బులు వచ్చిపడేవి.  మీవా చిన్న ఉద్యోగాలు. ఎవరో వచ్చి బ్రతిమాలితే కొత్త సంసారం అంటే ఇచ్చాను. కన్నోళ్ళ మద్దతు లేకపోతే, ఇలాగే కష్టపడాలి ” అంటూ సణుక్కునేది.  
“ ఆయన కూడా  హార్లిక్స్ ఫాక్టరీలో ప్రయత్నం చేస్తున్నారు కదా! మీ అద్దె కేం ఇబ్బంది ఉండదు పిన్నిగారూ” అనేది సునీత .
నెల తరువాత జీవన్  హార్లిక్స్ ఫాక్టరీలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు.  
ఇద్దరి సంపాదన కూడా కలుపుకుంటే తమ కాళ్ళ మీద తాము నిలబడగలనన్న ధైర్యం వచ్చింది. 
ప్రొద్దుటే, ఇద్దరూ పనులు తెముల్చుకుని ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయేవారు. పెళ్ళి చేసుకున్న కొత్తల్లో సినిమాకు వెళ్ళాలంటే, సరదాగా ఉన్నా రూపాయి నోటు తియ్యడానికి భయపడేవారు. 
ఇప్పుడు అంత గడ్డు పరిస్థితి లేకపోయినా, వెళ్ళే తీరికా, ఓపికా లేవు. 
బ్రతుకు తాపత్రయం తప్ప.   
***
నాలుగు నెలలు గడిచాయి. 
సంపాదించింది తిండి అవసరాలకే సరిపోయేది. ఆడంబరాల మాటే లేదు. 
ఇది వరకటి తీరికా లేదు, ప్రేమ ఊసులూ లేనే లేదు.  వండుకోవడం, తినడం.
పని .. పని.
ఎప్పుడో అలసి సొలసి నిద్రలోకి జారుకోవడం. కళ్ళలోన కళ్ళు పెట్టి చూసుకుని, మనసుపెట్టి మాట్లాడుకునీ ఎన్నాళ్ళయిందో.
హోటల్లో పని ఎక్కువగా ఉండేది సునీతకి. ఎవరైనా తన తోటి స్టాఫ్ శెలవు పెట్టినప్పుడు ఆ పని కూడా మీద పడి, ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరుకునేది.
అలవాటు లేని కష్టంతో ఆరోగ్యం పాడయి సరిగా డ్యూటీకి వెళ్ళలేకపోయేది అప్పుడప్పుడూ. ఫలితం తుమ్మితే, ఊడిపోయే ముక్కు .. ఊడిపోయింది. 
ఇప్పుడు ఆమె ఖాళీ. 
మళ్ళీ వేట. బ్రతుకు పోరాటం.  
అనుకోకుండా ఓ సారి జీవన్, తమ్ముడు వెంకటేష్ కలిసాడు. 
అదిమొదలు అప్పుడపుడూ ఇంటికి వచ్చి పోతున్నాడు.  సునీతని “ వదినా” అనడంతో సంతోషపడింది.
పరిస్తితి తెలుసుకుని “ అమ్మ ఇమ్మంది” అంటూ అన్న చేతిలో కొన్ని డబ్బులు కూడా పెడుతున్నాడు.
సునీతకు, తనకూ తల్లిని కలుపుకోవాలని అనిపించి .. ఫోన్ చేసింది. 
నాలుగు సార్లు ప్రయత్నం తరువాత ఎత్తి “ ఏం తక్కువై అమ్మ గుర్తుకు వచ్చిందీ” అంటూ తిట్టింది. అన్న కూడా కోప్పడ్డాడు.
మొదటిసారిగా విసుగు పుట్టింది సునీతకు. 
జీవితం అంటే, ఇంతేనా వండుకోవడం తినడమేనా! అని.
***
తిరగ్గా తిరగ్గా ఈసారి .. 
ఓ చిన్న కాన్వెంటు స్కూల్లో టీచరు పోస్టు సంపాదించుకుంది సునీత.  జీతం పూర్తిగా ఐదువేలు లేదు. అక్కడా బండ చాకిరీనే. సరిఅయిన క్వాలిఫికేషన్ లేన౦దుకు ఏ పని చెప్పినా అంది పుచ్చుకోవలసి వచ్చేది. ఆశ్రయం దొరికిందే పది వేలన్నట్లు. 
అలవాటు అయి, జీవన్ అప్పుడప్పుడూ తమ్ముడిని డబ్బు అడుగుతున్నాడు.
లేకపోతే, తెలిసినవాళ్ల దగ్గర చేబదులు తీసుకుంటున్నాడు. అలా ఇచ్చిన వాళ్ళు నెలతిరిగేసరికి, ఇంటికొచ్చి అసలుతో పాటు వడ్డీ కూడా గుంజుతున్నారు. 
సునీత బంగారానికి రెక్కలోస్తున్నాయి. 
తరచూ గొడవలు పడుతున్నారు. అవీ పప్పూ, ఉప్పూ .. చింతపండు కోసమే.
“ ఆర్ధిక స్వావలంబన లేని జీవిత౦ ఇంత కష్టతరమా!” మొట్టమొదటగా అనుకున్నాడు జీవన్. జీవితం సుఖంగా అనుభవించాలంటే డబ్బు కావాలి. డబ్బు సంపాదించడానికి చదువు కావాలి. తమ ఇద్దరికీ అదే తక్కువైంది. ప్రేమ మత్తు కమ్మి పెద్దల్ని ఎదిరించాలని అనుకున్నారే గాని, బ్రతుకు తెరువును గురించి ఆలోచించలేదు. చదువు మీద దృష్తి పెట్టలేదు.
అదో అనవసర విషయం అప్పట్లో. ఇప్పుడు పైవేటుగా డిగ్రీ కట్టాలనుకున్నాడు జీవన్. 
అన్నిటికీ డబ్బే ముఖ్యం. ఆలోచన అయితే, సాగుతుంది గానీ, తోక అందడం లేదు. డబ్బు కోస౦  వెంపర్లాట.
***
వెంకటేష్ కి ఫోన్ చేసాడు జీవన్. విషయం అంతా చెప్పి ఫీజులకీ, పుస్తకాలకీ  ‘పదివేలన్నా’ కావాలన్నాడు. 
“అంత డబ్బు నాన్నకు తెలీకుండా ఒక్కసారిగా ఎలా సర్దుబాటు అవుతుందన్నయ్యా! అమ్మతో చెబుతాను”    
చాలా నిరాశ చెందాడు జీవన్.
సునీత కూడా అలాంటి ఆశ నిరాశలకు గురిఅవుతూనే ఉంది. పెద్దల్ని కాదని ప్రేమ పెళ్ళి చేసుకున్నారే గాని, ఆర్ధిక ఇబ్బందులు ఇంతగా చుట్టుముడతాయని అనుకోలేదు. తెల్లవారుతుందంటే, బ్రతుకు భయం పట్టుకుంది.
పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు అయితే, ఇరువైపుల నుంచీ సహాయ సహకారాలు ఉండేవి. వీళ్ళు అవన్నీ తెంపేసుకున్న నిర్భాగ్యులు. ఆశ నిరాశల మధ్య .. చుక్కాని లేని నావలా  సంసారసాగరాన్ని ఎలా ఈదగలరు? ఈదే ధైర్యం వాళ్ళకు కనిపించలేదు. ముందుకు వెళ్ళే దారి దొరకలేదు.
వాళ్ళిద్దరూ ఏం నిర్ణయించుకున్నారో గాని ..
ఆరోజు ..
బారెడు పొద్దెక్కినా ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. వీధి వాకిలి ముందు ముగ్గు పడలేదు. కోపం తెచ్చుకుంది ఇంటి ఓనరమ్మ ‘ఎంత పొద్దుపోయే దాకా పనులు చేస్తే మాత్రం .. తెల్లవారి ఇంతసేపైనా  లేవరా! ఎప్పుడు కసవు ఊడ్చి .. ముగ్గేస్తుంది ఈ అమ్మాయి’ అనుకుంటూ తలుపు కొట్టింది.
“ సునీతా! ఓ సునీతా లే ఎంత పొద్దెక్కింది ” అంటూ.
ఆమె గొంతు ప్రతిధ్వనించి౦దే గాని పలుకులేదు. ఇంకా గట్టిగా కొట్టింది. చడీ లేదు. చప్పుడూ లేదు. 
అంతా ప్రశాంతం. 
పరదేశమ్మకు ముచ్చెమటలు పట్టాయి.  ఎందుకు తెరుచుకోలేదు తలుపులు అని. మళ్ళీ దబదబా బాదింది. ఫలితం అంతే. ఆ హడావుడికి చుట్టుప్రక్కల జనం పోగయ్యారు.
కిటికీ తలుపులు త్రోసి చూస్తే, హాలులో ఇద్దరూ ప్రక్కపక్కనే పడిఉన్నారు. ఏదో మందు త్రాగేసినట్లున్నారు. చక్కగా పనిచేసింది. 
తెలిసీ తెలియని వయసు ప్రేమ .. ఆరు నెలల పెళ్ళితో ఆ సంబరం ముగిసిపోయి౦ది.  
షరా మాములే పోలీసు కేసూ, పోస్టుమార్టంలు.
పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న పెద్దల దుఃఖానికి అంతులేదు. తమని ఎదిరించారన్న కోపం ఉన్నా వాళ్ళ జీవితాలు ఇంత అర్ధాంతరంగా ముగిసినందుకు కుమిలిపోయారు. 
***

No comments:

Post a Comment

Pages