ఆలంబన - అచ్చంగా తెలుగు
 ఆలంబన
యార్లగడ్డ లక్ష్మి 
           

“అమ్మ!మీ ఫ్రెండ్ సుమతి ఆంటీ రేపు మనింటికి వస్తున్నారట”అని చెప్పాడు వినోద్.
        తన గదిలో మంచం మీద పడుకొని సీలింగ్ కేసి చూస్తూ ఉన్నదల్లా కళ్ళు తిప్పి తన కొడుకు కేసి ఒక్కక్షణం చూసి మరల చూపు మరల్చుకుంది భారతి.తల్లి ఏమన్నా మాట్లాడుతుందేమోనని కాసేపు అక్కడే తచ్చాడి ఆమె ఏమీ మాట్లాడక పోవడంతో మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
       కొడుకు వెళ్ళిపోవడం గమనించిన భారతి ఒక నిట్టూర్పు విడిచింది.ఆయన పోవడం తో తనకు ఒంటరితనం శాపం లా పరిణమించింది.భర్త కుటుంబరావు తను విజయవాడకు దగ్గరలోని పల్లెటూర్లో ఉండేవారు.వ్యవసాయం చేసేవారు.ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు.అందరికీ చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేశారు.కూతుళ్ళు ఒకరు హైదరాబాదులో మరొకరు బెంగుళూరులో ఉంటున్నారు.కొడుకు విజయవాడ లో ఉంటాడు. అందరికీ పిల్లలు ఉన్నారు.చదువు కుంటున్నారు.కూతుళ్ళు పిల్లలతో సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసి వెళతారు.కొడుకు మాత్రం రెండు నెలలకు ఒకసారి వచేవాడు.బాధ్యతలన్నీ తీరినాక పొలం కౌలుకు యిచ్చి తామిధరూ అక్కడే ఉండేవారు.పెరట్లో కూరగాయలు పండిస్తూ కాస్త సమయం ఉంటే చుట్టుపక్కలవారు అరుగుల మీద చేరి కబుర్లతో కాలక్షేపం చేసేవారు.సహజం  గా భారతికి కబుర్లంటే ఆసక్తి ఎక్కువ.ఎప్పుడూ ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉండేది.అలా అని ఆరాలు తీయడం ఇతరుల్ని నొప్పించే మాటలు అనడం చేసేది కాదు. అందుకే అందరూ ఆమె దగ్గర చేరేవారు.
                  అలా జరిగిపోతుండగా కుటుంబరావు హఠాత్తుగా రెండు రోజుల అనారోగ్యం తో కన్నుమూశాడు.కొడుకు,కోడలు పదిరోజులు అక్కడే ఉండి కార్యక్రమాలన్నీ నిర్వహించారు.”అమ్మ ఇక్కడ ఒక్కటే ఎలా ఉంటుంది?అమ్మో ఇద్దరు మసలిన ఇంట్లో ఒక్కటే ఉండాలంటే కష్టమే! సగం పనులు ఆయన చేస్తే ఈవిడ ఇంత ఉడకేసి పెట్టేది—ఇలా బంధువులు చుట్టుపక్కల వారు తన భారమేదో వాళ్ళు మోయాల్సి వస్తుంద్దన్నట్లుగా తలా ఒకమాట మాట్లాడడం తో తన ప్రమేయం లేకుండానే ఇక్కడకు తీసుకు వచ్చి పడేశాడు.మూడు పడగ్గదుల ఇల్లు.తనకొక గది అన్ని సౌకర్యాలతో.టి.వి కూడా ఉంది.కోడలు శైలజ దగ్గర్లోని పల్లెటూళ్ళో ఉపాధ్యాయు రాలిగా చేస్తుంది. ఉదయం 8.30 కల్లా వెళ్ళిపోతుంది.టిఫిను భోజనం అన్నీ టేబుల్ మీద పెడుతుంది. తనకు ఆకలి వేసినప్పుడో తినబుద్ది అయినప్పుడో తింటుంది.పనమ్మ్మాయి కూడా తను ఉండగానే పనులన్నీ చేసి వెళుతుంది.కొడుకు వినోద్ ప్రైవేట్ ఆఫీసులో చేస్తాడు.  పిల్లలు కూడా స్కూలుకు వెళతారు.తిరిగి 6 ,6.30కి కాని ఒక్కొక్కరు ఇంటికి చేరరు.అప్పటి వరకు తను ఒక్కటే ఇంట్లో. పలకరించే వారుండరు.ఆ అపార్టుమెంట్లో తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉంటారు.వాళ్ళు వచ్చినాక  కూడా ఎవరి పనుల్లో వారుంటారు.సమయం ఉంటే కోడలు టి.వి కి ,కొడుకు కంప్యూటర్ కు పిల్లలు వీడియో గేంస్ కి అతుక్కు పోతారు.తను పలకరించినా ఆ  ఊ అనడమే కాని ముచ్చట తీరా మాట్లాడే పని ఉండదు.వాళ్ళు మాట్లాడుకున్నా ఏవో ఆఫీసు విషయాలు ఫ్రెండ్స్ గురించి చెప్పుకుంటారు.అవి తనకొక్కటి కూడా తెలియవు.ఊరి నుంచి వచ్చినాక మనసు తీరా మాట్లాడింది లేదు.ఇదుగో ఇప్పటికి సుమతి వస్తోంది దానితో నన్నా కరువుదీరా మాట్లాడాలి.సుమతిది మా ఊరే.చిన్నప్పటినుండి ఫ్రెండ్స్.పెళ్ళై వేరే ఊరు వెళ్ళినా వచ్చినప్పుడల్లా కలిసేది.కష్టం,సుఖం చెప్పుకునేవారు. ఈయన పోయినప్పుడు కూతురు దగ్గరకు అమెరికా వెళ్ళింది.వచ్చినాక విషయం తెలిసి తనను చూడటానికి వస్తున్నట్లున్నది.
                               మరునాడు మధ్యాహ్నం సుమతి వచ్చింది.”అమ్మేది “అని అడ్గటం వినిపిస్తూనే ఉమ్మది.
        “బాగున్నారా?అమెరికా నుండి ఎప్పుడు వచ్చారు?”
        “నేను వచ్చి పది రోజులయ్యింది.నాన్నగారి విషయం తెలిసి అమ్మను చూద్దామని  వచ్చాను.పిల్లలు ఎలా ఉన్నారు?శైలజ లేదా?”
            “పిల్లలు బాగానే ఉన్నారు.బయటకు ఆడుకోవడానికి వెళ్ళారు.శైలజ ఏవో కొనాలని వెళ్ళింది.వచేస్తుంది.అమ్మ గదిలో ఉంది ఆంటీ.ఎక్కువ అలా పడుకునే ఉంటుంది.అదివరకు ఎదుటివారికి విసుగు వచ్చేటట్లు ఎలా మాట్లడేది?ఇప్పుడు అలా స్తబ్దుగా ఉంటుంది.అమ్మను అలా చూస్తుంటే నాకు బాధగా ఉంటుంది.మీరన్నా చెప్పండి ఆంటీ”
               “నువ్వేమీ బాధ పడకు.నేను అమ్మతో మాట్లాడతాలే!”అంటూ గదిలోకి వచ్చింది సుమతి.
               సుమతి ని చూస్తూనే మెల్లగా లేచి కూర్చుంది భారతి.”ఎలా ఉన్నావు “స్నేహితురాలిని పలకరించింది.
           ఆత్మీయురాలిని చూడగానే భారతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.గద్గదంగా “ఇదిగో ఇలా జీవశ్చవంలా ఉన్నాను.”
            “ఏమైంది నీకు కొడుకు కోడలు బాగానే చూసుకుంటున్నారుగా.టి.వి ఉన్నది కాలక్షేపానికి.పిల్లలతో ఆడుకోవచ్చు.నీకేమి లోటు చెప్పు?”
            “నిజమే నాకు లోటేమీ లేదు.చూసే వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది.అన్ని సౌకర్యాలున్నాయి.కాలు కదప కుండా అన్నీ అమరుతాయి.కాలుతో పాటు నోరు కూడా మెదిపే పని లేదు.నాది మేడిపండు లాంటి జీవితం.ఇలాగే ఉంటే కొన్ని రోజులకు పిచ్చి దాన్నైపోతానేమో.”
            “ఛ అలా మాట్లాడకు.ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను పట్టించుకునే వారు ఎంత మంది ఉన్న్నరు చెప్పు.ఎంతసేపు ఈ గదిలోనే కూర్చోకపోతే బయటకు వచ్చి   కోడలి తో పిల్లలతో కబుర్లు చెప్ప వచ్చు కదా!”
               “నాకూ మాట్లాడాలనే ఉంటుంది.ఉదయమే ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చినాక పనులు చూసుకొని కోడలు టి.వి కి ,కొడుకు కంప్యుటర్ కు, పిల్లలు హోం వర్క్ పూర్తి చెయ్యడమే వీడియో గేంస్ కి అతుక్కు పోతారు.నేను గదిలో నుంచి కాలు బయట పెట్టడమే కోడలు ఏం కావాలి అత్తయ్యా అంటుంది.నాకేదో కావాల్సి బయటకు వచ్చానన్నట్లు.నా కొడుకు కంప్యూటర్ నుంచి తలపైకెత్తి ఒకసారి చూసి అది తనకు సంబంధించిన విషయం కాదన్నట్లు మరల తన పని లో పడతాడు.ఇక పిల్లల్ని పలకరిస్తే హోం వర్క్ చాలా ఉంది చేసుకోవాలంటారు.లేదంటే వీడిYఓ గేంస్ లో టార్గెట్ రీచ్ కావాలి మమ్మల్ని కదిలించకు అంటారు.ఇక నాతో మాట్లాడే వారు ఏరి?అందుకే ఈ గదికే పరిమితమయ్యాను.అందరూ  ఉన్నా ఒంటరి దాన్నే! నోరు విప్పి మాట్లాడే పని లేదు.కొన్ని రోజులకు నాకు మాటలు వచ్చు ఆన్న విషయం కూడా మర్చి పోతానేమో! ఊరి నుంచి వచ్చిన ఇన్నాళ్ళకు ఇవ్వాళ నీ పుణ్యమాని ఇన్ని మాటలు మాట్లాడాను.మరల ఎన్ని రోజులకు ఈ అవకాశం వస్తుందో?”
               “అలా అనకు భారతీ!మనం కూడా పరిస్థితులను బట్టి మనం మారాలి.  లేదా పరిస్థితులను మనకు అనుకూలం గా మార్చుకోవాలి.అంతే కాని నిరాశా నిస్పృహలతో జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు.మన ఆయువు మన చేతుల్లో లేదు.ఆ భగవంతుని పిలుపు వచ్చేవరకు ఎదురుచూడాలి.చిన్న విషయాలకే చావుని కోరుకోవడం మూర్ఖత్వం.సరే చాలాసేపయ్యింది.నేను వెళతాను.”
          “అప్పుడే వెళతావా?ఈ రోజు ఉండొచ్చు కదా!”దిగులుగా భారతి.
         “మరల వస్తానులే.అప్పుడు తీరిగ్గా మాట్లాడతాను.నీ ఒంటరితనం పోగొట్టే మార్గం చూద్దాము.”అంటూ బయటకు వచ్చింది సుమతి.
           “వస్తా వినోద్.ఇంకా శైలజ వచ్చినట్లు లేదు”
         “పని అవలేదేమో రాలేదు.కాసేపు ఉండండి వచేస్తుంది”
         “పర్వాలేదు.మరల రెండు రోజుల్లో వస్తా.అప్పుడు కలుస్తాలే”అంటూ వెళ్ళిపోయింది  సుమతి.
           రెండు మూడు రోజులు ఎదురు చేసిన భారతి కొడుకు ని పూట పూటకు ఆంటీ ఫోన్ చేసిందా అని అడుగుతూనే ఉంది.అలా పది రోజులు గడిచిపోయాయి.ఆ రోజు ఆదివారం ఉదయమే వెంట కుక్క పిల్లను తీసుకొని వచ్చింది సుమతి.ఆమెను చూడగానే భారతి ముఖం వికసించింది.”ఇదిగో వస్తానన్నావు. ఇప్పుడా వచ్చేది”అంది నిష్ఠూరంగా.
                       “నీకు తెలుసు కదా మా కోడలు అనిత కూడా జాబ్ చేస్తుందని.మా మనుమరాలికి జ్వరం తన కోసం ఇంట్లో ఉండాల్సి వచ్చింది.”ఇంతలో కుక్కపిల్ల భారతి కాళ్ళ దగ్గరకి వచ్చి నాకుతోంది.చల్లగా తగలడం తో గబుక్కున కాళ్ళు వెనక్కు లాక్కుంది.”ఇదేమిటి దీన్ని తీసుకు వచ్చాను?”
                         “నీ కోసమే .నీతో మాట్లాడే వారు లేరన్నావుగా.నీ తోడు కోసం”
            “ఛీ ఈ కుక్క పిల్ల నాకు తోడా !నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా?దీనితో ఏమి మాట్లాడతాను?ఇదేనా నువ్వు చూపించే పరిష్కారం?నాకొద్దులే.దాన్ని తీసుకు ని నువ్వు వెళ్ళు.”అంది కోపంగా భారతి.
            “అలా కోప్పడకు భారతీ.నదిలో కొట్టుకు పోయేవాడికి గడ్డిపోచ దొరికినా ఆనంద పడతాడు.నేను ఒంటరిని అనే విచార సాగరం లో కొట్టుకు పోతున్న నీకు ఇది ఆలంబన అవుతుంది.మనకు అలవాటు లేదు కాని విదేశాలలో వయసుమళ్ళినవారు చాలామంది తమ ఒంటరి తనాన్ని పోగొట్టుకోవడానిక్కి కుక్క పిల్లల్ని,పిల్లి పిల్లల్ని పెంచుకుంటారు.ఇదేమీ తప్పు కాదు.ఇప్పటి దాకా నీ మాటలు ఎవరూ వినడం లేదనే కదా నీ బాధ.నీ మాటలన్నీ ఇది వింటుంది.సాయంకాలం కాసేపు దానితో కలసి వాకింగ్ కు వెళ్ళి బయట గాలి పోసుకున్నట్లు ఉంటుంది.చుట్టూ చీకట్లు ఉన్నాయని  తిట్టుకుంటూ కూర్చోకుండా ప్రయత్నించి చిరు దీపం వెలిగించాలి.నీ చుట్టూ ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టుకోడానికి ఈ చిరు ప్రయత్నం చెయ్యి.ఒక వారం పది రోజులు చూడు.అప్పటికీ నీకు ఇష్టం లేకపోతే దీన్ని తీసుకు వెళ్ళిపోతాను.”అంది సుమతి.
               “నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి సరే.ఒక వారం చూస్తాను.నా కిష్టం లేదంటే తీసుకు వెళ్ళాలి మరి.”కొంచెం అయిష్టం గానే ఒప్పుకుంది.దానికి  ఏమి పెట్టాలో ఎలా సమ్రక్షించాలో చెప్పి వెళ్ళింది సుమతి.
              నెల వరకు ఫోన్  చేయలేదు సుమతి.భారతి ఎలా ఉన్నదో అని ఫోన్ చేసింది. వినోద్ తీశాడు.”అమ్మ ఎలా ఉన్నది?”అని అడిగింది.
      “మీరా ఆంటీ.అమ్మ చాలా సంతోషంగా ఉంది.మీరిచ్చిన కుక్క పిల్లకు డాలీ అని పేరు పెట్టి దాన్ని సమ్రక్షణ చేయడం దానితో కబుర్లు చెప్పడం షికారుకు తీసుకు వెళ్ళడం క్షణం ఖాళీ ఉండటంలా .మాకు ఇలాంటి ఆలోచన రాలేదు.మీ ఆలోచన అమ్మ మీద మంచి ప్రభావం చూపించింది.థాంక్స్ ఆంటీ.”
                “స్నేహితురాలిగా నాకు తోచిన సహాయం నేను చేసాను.పెద్ద వయసు వచ్చినాక చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా తట్టుకోలేరు.తాము ఒంటరి వరిమి అన్న భావం పెరిగిపోతుంది.తాము ఎవరికి పనికిరామని బాధ పడుతుంటారు.ఏదైనా వ్యాపకముంటే అలాంటి ఆలోచనలు మనసులోకి రావు.నేను చేసింది అదే .మీ అమ్మకి ఒక వ్యాపకం కల్పించాను అంతే.”
                         “ఫోన్ అమ్మకిస్తాను మాట్లాడండి ఆంటీ “
              “హలో భారతీ రేపు రానా డాలీని తీసుకు వెళ్ళడానికి”అంది ఉడికిస్తున్నట్లుగా
భారతి కంగారుగా “వద్దు వద్దు రావద్దు.డాలీ నాకు బాగా అలవాటు అయ్యింది. నన్ను వదిలి ఒక్కక్షణం కూడా ఎక్కడకీ వెళ్ళడం లేదు.పిల్లలు కూడా డాలీ కోసం నా దగ్గరికి వస్తున్నారు.నాకు బాగా కాలక్షేపం అవుతోంది.నువ్వన్నట్లు ఏ సమస్యకైనా పరిష్కారముంటుంది.మనం కొంచెం సమ్యమనం తో ఆలోచించాలి. దిగులు పడుతూ కూర్చుంటే జివితాన్ని చేతులారా నిరర్ధకం చేసుకున్నట్లు.నాకు మంచి తోడునే బహూకరించావు.ఈ వయసులో మనుషల కంటే మూగ జీవాలే నయమేమో .ఈర్ష్యా అసూయలకు అతీతంగా ఆనందంగా గడపవచ్చు.థాంక్యూ సుమతీ “అంది మనస్ఫూర్తిగా భారతి.
           “నువ్వు సంతోషం గా ఉన్నావు నాకు అది చాలు.మూగజీవైనా అవి మన భావాలు చక్కగా అర్ధం చేసుకుంటాయి.ఇంకెప్పుడూ నువ్వు ఒంటరి దానివన్న ఆలోచన మనసులోకి రానీయకు”
            “అలాగే ఇంకెందుకు రానిస్తాను.ఇక ఉంటానే డాలీకి పాలు తాగే సమయం అయ్యింది
      “అలాగే”మనసులో నువ్వు కుంటూ ఫోన్ పెట్టేసింది సుమతి.
  **** 

No comments:

Post a Comment

Pages