ఆక్రమణలో ఆనందం - అచ్చంగా తెలుగు
ఆక్రమణలో  ఆనందం
అయ్యలసోమయాజుల సుబ్బారావు 

“అనాదిగా రాజులు, చక్రవర్తులు మరియు నవాబులు/సుల్తానులు అనేక దండయాత్రలు చేసారు.  ఇరుగు పొరుగు రాజ్యాలను ఆక్రమించారు. సంపదలను దోచేశారు. అది కేవలం రాజ్యకాంక్షయే కాదు, ఒక రకమైన ఆనందం.  చరిత్రలో మనం ఎందరి గురించో చదువు కున్నాం, దేశాలను కొల్లగొట్టిన వాళ్ళ గురించి.

రాజుల సొమ్ములు రాళ్ళ (శిల్పాలు, వజ్రాలు మొదలగునవి) పాలు.  అయితే ఈ రోజుల్లో భూముల స్వాధీనాలు, ఆక్రమణలు; చెరువులను కప్పెట్టి ఇళ్ళు కట్టే పథకాలు చేపట్టడం లాంటివి మనం చూస్తూంటాం, కానీ ఏమీ చెయ్యం.

వాడెవడో కొన్ని కోట్లు మింగేసాడు, వీడెవడో ఎన్నో కోట్లు స్వాహా చేసి బ్రిటన్ కి పారిపోయాడు అని వాపోతాం, బాధగా చర్చిస్తాం.

అలా మనలో చర్చించే కొందరు జెంటిల్మెన్ మన అపార్ట్ మెంట్ లలో దొరికితే చాలు ఆక్రమిస్తున్నారు”, అని జయద్రధ కామ్ప్లెక్ష్ ప్రెసిడెంట్ గారు మొన్న జనవరి 26న జెండా వందనం చేసాక కామన్ ప్లాట్ లో చక్కగా ఉపన్యసించారు.

అది విన్న రాఘవయ్య నలుగురిలో ఇలా అన్నాడు, “మా బ్లాక్ లో, 5 ఫ్లోర్ లే ఉన్నాయి కదా అని ఈ కాంప్లెక్స్ లో ఇల్లు కొనుక్కున్నాం, మాది 5వ అంతస్తు, లిఫ్ట్ లో నైనా వెళ్ళాలి లేదా మెట్లెక్కి వెళ్ళాలి.  లిఫ్ట్ లోంచి బయటకు వచ్చి కారిడార్ (బాల్కొనీ లాంటిది) ద్వారా మా ఫ్లాట్ లోకి వెళ్ళాలి. ఈ కారిడార్ వెడల్పు 5 అడుగులుంటుంది. మాది చివర ఫ్లాట్. మా ఫ్లాట్ దాక వెళ్ళుచుండగా మధ్యలో వేరే ఇతర ఫ్లాట్స్ మీదుగా వెళ్ళాలన్న మాట!  ఆ ఇరుకు లోనే రెండేసి షూ ర్యాక్ లను ఫిక్స్ చేయించుకున్నారు. అయినా వాళ్ళ చెప్పులు, బూట్లు బయటే ఉంటాయి, మనం జాగ్రత్తగా నడవక పొతే కింద పడడం ఖాయం. అంతేకాదండోయ్, వీళ్ళ సెక్యూరిటీ బంగారం గాను. వీళ్ళ గ్రిల్ డోర్ లు లిఫ్ట్ గ్రిల్ డోర్ ల్లాగా స్లయిడింగ్ కావు.  రెండు తలుపుల గ్రిల్ పెట్టించు కున్నారు, బిల్డర్ వద్దని మొత్తుకున్నా కూడా. మహానుభావులు వాళ్ళ గ్రిల్ తలుపులు సాధారణంగా పగటి పూట తెరిచే ఉంటాయి. ఏ మాత్రం జాగ్రత్తగా నడవలేదో అంతే ఇనుప తలుపులు చచ్చేటట్టు తగులుతాయి. షూ ర్యాక్ లను, ఇనుప తలుపులను తప్పించుకున్నా, కొందరి మొక్కలను కూడా చూచుకుని నడవాలి.  లేదా వాటి ఆకులు, పుల్లలు మనకు గుచ్చుకుంటాయి, మన అంట ఎత్తు ఎదిగిన మొక్కలు కూడా ఉన్నాయి. తులసి మొక్కలను కూడా కారిడార్ దారిలో పెట్టి పూజలు చేసేస్తున్నారు. వీక్షించడానికి ఆఆ మొక్కలు చాల బాగుంటాయి, కానీ వాటి భాగాలు మన కళ్ళలో చొరపడ్డాయో, అంతే, మన భాగ్యం గోవిందా. ఇదండీ పరిస్థితి. దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు.  రోజూ లిఫ్ట్ నుండి మా ఫ్లాట్ దాకా వెళ్ళడం, విఠాలాచార్య సినిమాలో హీరో, రేండంగా ఊగే ముళ్ళ పెండ్యులాలనుండి తప్పించు కునే దృశ్యాలు గుర్తు చేస్తుంటాయి. ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు వీరికి కారిడార్ ను ఆక్రమించడం అంటే మహా సరదా, ఆనందం. వీళ్ళ ఆనందం తగలెయ్య ! మాకు ఇలాంటి ఆనందాన్ని బిల్డర్ మరియు భగవంతుడు ఇవ్వడం లేదు”, అని.

వెంటనే వేరే బ్లాక్ లో ఉండే వెంకయ్య గారు ఇలా అన్నారు, “చూడండి రాఘవయ్య గారూ! నూటికి తొంభై శాతం మంది మీరు చెప్పినట్లే ఉంటారు.  మీ డయలాగ్ లు నాకు తగిలాయి, మీకు మరీ ఇబ్బంది అనిపిస్తే వేరే ఇల్లు కొనుక్కుని మారడం ఉత్తమం, తరువాత మీ ఇష్టం!”.

ఆ తరువాత కనకారావు ఇంకో విషయం ప్రస్తావించాడు ఇలా, “మన అందరి బ్లాక్ లలో కొందరి ఇండ్లలో పెంపుడు కుక్కలు ఉన్నాయి.  వాటిని వాటి యజమానులు రెగ్యులర్ గా షికార్ కోసం మరియు నేచర్ కాల్ కోసం ప్రాంగణంలో తిప్పుతూంటారు. లిఫ్ట్ దిగగానే ఆ కుక్కలచే లిఫ్ట్ కి ఇరుప్రక్కలా ఉచ్చలు పోయిస్తున్నారు, కొన్ని కొన్ని పిల్లర్ ల వద్ద కూడా ఉచ్చలు పొయిస్తూంటారు.   వాటి మరకలను చూడగలం. ఒకసారి ఒక ఆసామిని అడిగాను కూడా, వారి కుక్క అరుస్తున్నప్పుడు, మీ కుక్క పర్యటన ముచ్చట లేదు అని, విసుక్కుంటూ అరుస్తున్న కుక్కను అదోలా చూస్తూ. ఆయన అన్నాడు గదా, నాకు జంతువులపై ప్రేమ లేదంట”.

అప్పుడు రాఘవయ్య గారు ఇలా సెలవిచ్చారు, “క్రోటన్ మొక్కలను పెంచూతారు గానీ ఎవరూ కరివేపాకు మొక్కను పెంచరు!  పూల మొక్కలను కూడా పెంచరు. కానీ చాలా నీళ్ళు తగలేస్తారు ప్రతీ రోజూ.”

ఆక్రమణదారుడైన వెంకయ్య లాంటి వాళ్లకు ఆనందం,  రాఘవయ్య మరియు కనకారావు లాంటి విక్టిమ్ లకు బాధలు ఎన్నో ఫ్లాట్స్ లలో, అపార్ట్మెంట్ లలో, కాంప్లెక్స్ లలో రోజూ ఉండే భాగోతమే..

దీనికి సమాధానం లేదట.

పక్కోడి కంచంలో నుండి కూడా బువ్వ తినగలిగితే ...అది పరమానందం ... అందుకే ఆక్రమణే మహా భాగ్యం .....ఎలా చేయాలో తెలుసుకోండి.   దీనికోసం కోచింగ్ సెంటర్ లో చేరనక్కర లేదు.

గుండెను దిటవు చేసుకోండి.. దెబ్బలాడడానికి ధైర్యం కావాలి.

ఆ ఆ ఆ ఆక్రమణ్ !!!!!

No comments:

Post a Comment

Pages