కనిపించే దైవం - అచ్చంగా తెలుగు

కనిపించే దైవం

Share This
కనిపించే దైవం
తులసి భాను 

     
రూప, పల్లెలకు వచ్చి ఆడవారిని ఒకచోట చేర్చి వారికి మంచిమాటలు చెప్పి బావిలోకప్పల బతుకుల నుంచీ వారికి తమ కనీస హక్కుల అవగాహన గురించి తెలియపరుస్తూ ఉంటుంది..

అక్కా తాగుడు దుకాణాలు మూయించేయాలక్కా..రోజూ రాత్రిపూట, వీధికి నలుగురు ఆడోళ్ళని వాళ్ళ మొగుళ్ళు కొట్టి కొట్టి సంపుతున్నారు..తాగుడు మత్తులో ఇళ్ళు పాడు సేసి సస్తున్నారు దొంగయెదవులు..చీపుర్లు తిరగేసి కొట్టండి మీ మొగుళ్ళని అని ఎంత సెప్పినా ఇనరు ఈ పిచ్చిమాలోకాలు అని చేతులు తిప్పుతూ రోషంగా మాట్లాడేస్తోంది సిన్ని..

అబ్బా ధీరవే నువ్వు..ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావో తెలుసా, మరి రేపు నీ పెళ్ళయ్యాక నీ మొగుణ్ణి నువ్వు తంతావా అడిగింది నవ్వుతూ రూప, సిన్నిని..మరి, పద్ధతిగా లేపోతే ఊరుకుంటానా, అస్సలూరుకోను..అనేసింది సిన్ని..అప్పుడు సిన్నికి పదమూడేళ్ళు..ఆ రోజు నించీ సిన్నిని, ధీర అనే పిలుస్తారు అందరూ..

ఇప్పుడు ఇరవయ్యేళ్ళు ధీరకి..ఊరిలో ధాన్యాన్ని కుప్పనూర్చి కొలిచిపోసే పనిలో ఆరితేరింది ధీర..మంచి పనిమంతురాలు, నిజాయితి ఉన్న మనిషి..ఆ రోజు ఊరి చివర గొడవలు పెద్దవై ఒకే కులానికి చెందిన రెండువర్గాల వాళ్ళు చచ్చేట్టు కొట్టుకున్నారు..పంతాల కోసం ప్రాణాలు కూడా బలిచేసుకున్నారు మూర్ఖులు..అంతా శూన్యంలాగా ఉందక్కడ..హాస్పిటల్ కి మనుషుల్ని, శవాల్ని తరలించేసారు, కానీ ఆ ప్రదేశం అంతా రక్తసిక్తంగా, చెత్తచెత్తగా తయారయ్యింది..ధీర అక్కడంతా శుభ్రం చేస్తోంది..చీపురుతో తుడుస్తూ నీళ్ళతో కడుగుతూ శుభ్రం చేస్తోంది..చిన్నపిల్లల మూలుగులాంటిదో, ఏడుపులాంటిదో సన్నగా వినిపిస్తోంది..ఏదో భ్రమనేమో అనుకుంది..తనపని తాను సేసుకుపోతోంది..ఎండ సుర్రుమంటోంది నెత్తిమీద..చిన్నపిల్లల ఏడుపులాంటిది మాత్రం చెవులనొదిలి పోవట్లేదు..అటూ ఇటూ పరీక్షించి చూసింది..దూరంగా ఒక పెద్ద పొడవాటి గంప వెనుక ఒక నీలం చొక్కాలాగా కనిపించినట్టయ్యింది..ఎందుకో గుండె అదిరింది..భయంలాంటిది వేస్తోంది..అడుగులో అడుగేస్తూ వెళుతుంటే చెమటలు కారిపోతున్నాయి, తెలియని మానసిక అలజడితో..గంప వరకూ వెళ్ళింది..ఊ ఊ ఊ అని ఒక చిన్నపాప కళ్ళు తుడుచుకుంటూ కూర్చునుంది..ఎవరూ అంది ధీర..పాప భయంగా లేచి నుంచుంది, వణికిపోతూ తల అడ్డంగా తిప్పుతోంది తననేమీ చేయొద్దు అన్నట్టు..నేనేం చెయ్యనమ్మా భయపడకు ఇలా రా అని పిలిచింది ధీర ఆ పాపని..ఆ పాప కళ్ళల్లో భయం, బాధ..చాలా జాలేసింది ధీరకి..నెమ్మదిగా మాటలు చెప్పి చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా నిమిరి పాప మనసుకి భరోసా కలిగించి ..ఏమయ్యింది అని అడిగింది ధీర..నాన్నని బాగా కొట్టీసారు అంది పాప..నాన్నకి రక్తం వచ్చింది, నొప్పేసినట్టుంది, అబ్బా అని అరుస్తూ పడిపోయారు..నేను  నాన్నదగ్గరికి వెళదామంటే అందరూ కర్రలతో కొట్టుకుంటున్నారు, నాకు భయమేసింది..ఇక్కడే దాక్కుండిపోయాను..నాన్న దగ్గరకి వెళ్ళాలని అనిపించింది, కానీ చాలా భయమేసింది అంది కళ్ళల్లో నీళ్ళు కారుతూనే ఉన్నాయి, యే దృశ్యాలు కళ్ళముందు కదలాడుతున్నాయో మరి..పాప కళ్ళు తన మెత్తటిపమిటకొంగుతో తుడిచి తలమీద ఓ ముద్దుపెట్టింది ధీర..పాప ధీర గుండెల్లో ఒదిగిపోయింది, ధీరని గట్టిగా హత్తుకుని..పాప ధీర చేతుల్లో వేళ్ళాడిపోయింది..

అయ్యో అని స్పృహ లేని పాపని భుజానికి ఎత్తుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది..డాక్టర్ అలీ ఆ ఊరికున్న ఒకే ఒక డాక్టరు..అతను పాప నాడి చూసి చాలా నీరసంగా ఉంది పాప..అని చల్లనిబట్టని తడిపి వళ్ళు తుడవమన్నాడు..వడకొట్టినట్టుంది పాపకి అని చికిత్స మొదలెట్టాడు..ఒక గంటకి తేరుకున్న పాపని ఇంటికి తీసుకెళ్ళి వేడిగా జావ కాసి ఇచ్చింది ..పాప వద్దని మొహం ఎన్నిసార్లు తిప్పేసుకున్నా..తాగమ్మా తాగమ్మా..నా తల్లివి కదూ నా బంగారు కదూ అని ముద్దుచేసి ఒక గ్లాసు మొత్తం తాగించింది..ఇహ తనకి నీరసంగా ఉందని ఓ ముద్ద అన్నంలో మజ్జిగ ఉప్పు వేసుకుని తింటోంది ధీర..అమ్మా మా నాన్నని చూడాలి అంది పాప..సరే సరే వెళ్దాం నాన్న దగ్గరికి అని సర్దిచెప్పింది ధీర..పాపా నీ పేరేంటీ అడిగింది ధీర..బేబీ అంది పాప..అవునా అనుకుంది ధీర..ధీర వళ్ళో తలపెట్టుకుని నాన్నా నాన్నా అని కలవరిస్తూ నిద్రపోయింది బేబీ..

సాయంత్రం ఆరింటికి ఇంటికొచ్చాడు శేషు..ఓసోస్ ఎవరే ఈ పాప అడిగాడు..అంతా చెప్పింది ధీర భర్తకి..మరి ఇప్పుడేం చేద్దాం అడిగాడు..ఊర్లో అడుగుదాము..బేబీని అడుగుదాము వాళ్ళ నాన్న వివరాలు..బేబీని వాళ్ళ నాన్నదగ్గరికి తీసుకెళదాము..అంది ధీర..ఆలీ ఇంకో ఇద్దరితో శేషు ఇంటికొచ్చాడు..ఇక్కడే ఉంది పాప అన్నాడు..ఆ వచ్చినవాళ్ళు పాపని ఇక్కడెందుకుంచారు, పాపని పంపెయ్యెండి అన్నారు..

పాప వివరాలు తెలుసుకుని పంపిస్తాము, పాపం చిన్నపిల్ల అన్నారు శేషు ధీర..పాపమే ఆ పాపని ఇంట్లోకి రానిచ్చి చేసుకున్నారు పాపం మీరు అన్నారు వాళ్ళు చీత్కారంగా..ఎవరో తెలుసా ఆ పాప, వాళ్ళకి మనకి పడదు, వాళ్ళు వేరు మనం వేరు అన్నారు కోపంగా, దౌర్జన్యంగా..ఏంటయ్యా మీరు చెప్పేది అంది ధీర తన దాగిన శక్తి అయిన ధైర్యం అనే ఆయుధాన్ని బయటకి తీస్తూ..దృఢంగా..ఆ పాప ఇక్కడుండకూడదు పంపించెయ్యండి అన్నారు వారు గట్టిగానే..వాళ్ళ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో పంపిస్తాము అని శేషు వారికి సర్దిచెబుతున్నాడు..అలీ ద్వారా ఇంకెంతమందికి తెలిసిందో, పాప ఇక్కడుందని ఇంకో పది, ఇరవయిమంది వచ్చి చేరారు..గొడవ పెరుగుతోంది..పొద్దునో పెద్ద గొడవ చూసి, మళ్ళీ ఇప్పుడు గొడవ చూస్తూ ఉన్న బేబీ భయంతో వణికిపోతూ ఏడ్చేస్తోంది..ధీర పాపని దగ్గరకు తీసుకుని ఇంటి తలుపు వేసేసింది..బయటున్నవాళ్ళు..ఏయ్ మా మాటను లెక్కచెయ్యదా నీ భార్య అని శేషూని చెంప మీద కొట్టాడు ఒకతను..ఏంటయ్యా ఇది ఏదన్నా ఉంటే పెద్దయ్యతో మాట్లాడుదాము పదండి అని శేషు బయల్దేరబోయాడు..వీపున ఇద్దరూ చెంప మీద ఒకడు ఆగకుండా కొడుతున్నారు..ఆగండిరా, నేను తిరిగి కొట్టలేక కాదు, ఆగండి అన్నాడు కోపంగా శేషు..పెద్దయ్య ఇంటికి చేరారు అందరూ..

విషయం విన్న నరసింహ శేషు ఊరి వాళ్ళ మాట వినాల్సిందేగా నువ్వు మరి అన్నాడు ..సిన్నపాపయ్యా, ఎవరూ పాప సొంతమోళ్ళు లేరు, అట్టా ఎట్టా వదిలేద్దాము అడిగాడు శేషు..ఎలా అయినా పోనీ , నీకెందుకు అన్నాడు గుంపులోంచి ఒక్కడెవడో..ధీర పాపని నడిపించుకుంటూ వచ్చింది..చిన్నపిల్లవిషయంలో కులాలు, మతాలు అని ఆలోచించకండి..ఇంత గొడవ సెయ్యకండి..ఆ పాప వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెబుతాను బేబీని అంది ధీర..మాకుతెలుసు ఆ పాప ఎవరో, వెళ్ళి అక్కడున్న వీధిలో ఏదో ఇంట్లో వదిలేద్దాము, వాళ్ళకు సంబంధించిన పాప, వాళ్ళే చూసుకుంటారు, మనకెందుకు..అన్నాడొకడు బాధ్యతారాహిత్యంగా..అంతే అంతే అన్నారందరూ గొర్రెలమందలా..

మీకేంటయ్యా నష్టం ఇప్పుడు ...ఈ పాప గురించి ఇంతలా ఎందుకు పంతం ..మీ పనులను కూడా మానేసి మరీ పంచాయితీలు పెట్టటమెందుకు అని అడుగుతున్న ధీరను మధ్యలోనే అడ్డగిస్తూ నరసింహ చెప్పాడు..మీకెందుకు అనిప్రశ్నించడాలు లేవు..నువ్వు మాత్రం రేపటికల్లా ఈ పాపని పంపిచెయ్యాలి..అన్నాడు ఖరాఖండీగా..వాదనొద్దు అని శేషు ధీరకు సైగచేసాడు..సరే అని ఊరుకుంది ధీర..

ఆ రాత్రంతా బేబీ నాన్నా నాన్నా అని కలవరిస్తూ, నిద్ర సరిగా పోకుండా దిగులుతో పొద్దునకల్లా జ్వరం తెచ్చేసుకుంది..తనకి తోచిన ఇంటిచిట్కాలు పాపకు చేస్తూ, హాస్పిటల్ తెరిచే సమయానికి బేబీని అలీ దగ్గరికి తీసుకెళ్ళారు ధీర,శేషు..

నేను ఈ పాపకి చికిత్స చేయను అనేసాడు అలీ..అదేందయ్యా ఎందుకలా అడిగింది ధీర..నీకు అన్నిటికీ జవాబు చెప్పాలా నేను, వెళ్ళిక్కడినుంచీ అన్నాడు అలీ..వైద్యుడు దేవుడు అంటారు కదా..ఇలా చేయొచ్చా జాలి, దయా  లేకుండా..అడిగింది ధీర..నలుగురికీ నీలాగా శత్రువులా నేను మారలేను, ఈ పాప కోసం అన్నాడు అలీ..అస్సలూ శత్రుత్వం ఎందుకూ..అడిగింది ధీర..వాళ్ళూ, మనమూ వేరు అన్నాడు అలీ..మరి మీరూ మేమూ కూడా వేరేగా అంది ధీర..ఆ అంతే మరి, ఇప్పటికైతే గొడవలు లేవు కాబట్టి కలిసి ఉన్నాము, ఏదన్నా తేడా జరిగితే, అప్పుడు  మనం మనం కూడా ఎవరికి వారే అనేసాడు తేలికగా అలీ..

మనం మనుషులుగా పుట్టామా, మతాలుగా పుట్టామా బాబు...ఆకలేస్తే తినేది తిండే, మతగ్రంధాలు తినాలని చూస్తే నోట్లోకి పోవు..అందరం నడవాల్సింది నేలమీదే..నువు తాగే నీరు నల్లగా, నేను తాగే నీరు ఎర్రగా ఉండదు, అందరికీ ఒకలాంటి నీరేగా కావాలి..అంత పెద్ద ప్రకృతే మీరంతా నాకు ఒకరకంగానే అని సాక్ష్యాలు చూపిస్తుంటే, మనమేమో విడివిడి గా వేరువేరుగా అనుకుంటూ ఎడం ఎడంగాబతకాలని నేర్చుకుంటున్నాము..మనిషిగా సాటిమనిషికి వైద్యం చెయ్యయ్యా అంది ధీర అలవాటు లేని పనైనా అలీని అర్ధిస్తూ అడిగింది..అలీకి ఏమనిపించిందో ఓ ఇంజెక్షణ్ చేసి, మందుబిళ్ళ రాసిచ్చాడు పాపకోసం..నేను మందుబిళ్ళ కొనుక్కుతెస్తా నువ్వూ, పాప ఇంటికి పొండి అన్నాడు శేషు..

పక్కింటి చందూ వచ్చి ధీరతో చెప్పాడు , జాన్ కూతురు ఈ బేబీ..జాన్ చచ్చిపోయాడు ముందురోజు గొడవల్లో, ఈ సారి గొడవ జరిగింది వాళ్ళల్లో వాళ్ళకే..కాకపోతే ఈ జాన్ కిందటేడు రచ్చబండ దగ్గర మనోళ్ళని చాలా అవమానం చేసాడు..అప్పటినుండీ వాళ్ళకి మనకి సరిగ్గా లేదు అని చెప్పాడు చందూ ధీరకి..

మర్రోజు జాన్ మనుషులు నలుగురొచ్చారు..మా పిల్లని మీ ఇంట్లో ఎందుకుంచారు అని ఎదురుగొడవకి దిగారు..పాప ఎవరని కూడా నాకు తెలియదు, ఒంటరిగా బాధలో, భయంలో ఉన్న పాపని ఎలా వదిలేసి వచ్చెయ్యను, పైగా స్పృహలో లేని పాపని ఎవరి పాప అని అడుగుతూ తిరిగితే ఇంతలో పాపకి ఏమన్నా అయి ఉంటే అని ఆలోచించి పాపకి సాయం చేసాను..ఇది తప్పెలా అవుతుంది అని నిలదీసింది ధీర వచ్చి గొడవచేసే వాళ్ళని..

ఇంతలో ఇంకో పదిమంది వచ్చి వాళ్ళ పాపని వాళ్ళకిచ్చేసెయ్యి, అసలా పాపని ఇంట్లో ఉంచుకోవటమే తప్పు అని గొడవ మొదలెట్టారు..ఏయ్ అంటే ఏయ్ అనుకుని గొడవ పెంచబోయారు రెండువైపులవాళ్ళు...బేబీ ధీరని కరుచుకుపోయింది..అమ్మా నన్ను పంపిచెయ్యకూ అని గట్టిగా ఏడుస్తోంది..అయ్యో అలా ఏడవకమ్మా, మీవాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు అంది ధీర బేబీకి ధైర్యం చెబుతూ..వద్దు, నాకు అమ్మ లేదు, నాన్నతో గొడవపడింది అతనే నేను అతనితో వెళ్ళను, నాకు భయం అని ఒకతన్ని చూపిస్తూ, గట్టి గట్టిగా ఏడ్చేస్తోంది బేబీ..పాప నాన్నను కొట్టిచంపింది నువ్వేనా అని నిలదీస్తోంది ధీర , బేబీ చూపించిన అతన్ని..అది నీకనవసరం, మాకూ మాకూ ఉన్న విషయాలు నీకెందుకు చెప్పాలి, మా పాపని మాకు అప్పగించు అన్నాడు పొగరుగా..తండ్రిని చంపినోడికి కూతురిని ఎలా అప్పచెబుతాననుకున్నావు, నేను బేబీని ఇవ్వను అంది ధీర స్పష్టంగా..ఏయ్ ఎందుకియ్యవూ అని ఒకవైపు వారు, పాపని పంపిచెయ్యి అని ఇంకొకరూ ధీరని మాటలతో కుళ్ళబొడుస్తున్నారు..నేను పాపని తీసుకుని పోలీసుల దగ్గరికి వెళతాను, రూపక్కకి విషయమంతా చెబుతాను..అప్పటివరకూ పాపని నా దగ్గరనుంచీ పంపను అంది..అంతే ఆడది అని కూడా చూడకుండా ధీరని చేతులతో కాళ్ళతో రాళ్ళతో కొడుతున్నారు రెండువైపుల వాళ్ళూ...వీలయినంత తప్పించుకుంటూ, ఎదురుతిరుగుతూ, దెబ్బలు తింటూ చాలాసేపు పాప వైపుకి ఒక్కరిని కూడా వెళ్ళనియ్యలేదు ధీర.. ఇంతలో రూపని తీసుకుని శేషు వచ్చాడు..నరసింహకి తెలుసు ధీర మొండితనం, అసలే ఆడపిల్ల ధీర, ఎక్కడ పాప కోసం ఇబ్బందుల్లో చిక్కుకుంటుందో అని ముందుజాగ్రత్తగా, రూపకి కబురుపంపించి ఊరికి రప్పించాడు..

రక్తసిక్తమైన ధీరని చూసి అంత గుండెధైర్యమున్న రూపకి కూడా కళ్ళు చెలమలయ్యాయి..ఛీ మీరు మనుషులేనా..ఏంటీ ఈ పశుప్రవృత్తి..ఇలాగేనా సాటిమనిషిని హింసిచేది..ఇదేనా మీకు మీ మతాలు నేర్పేది..మానవత్వం మర్చిపోవటమా మతం, కనపడని మతం, దైవం కోసం కనపడే మనిషిని కుళ్ళబొడవటమా మతం..మనిషులుగా ఉన్న మనం ఏం ఆశించి, ఏం సాధించుకోవాలని హద్దుదాటి మనిషి నుంచీ మృగాలుగా మారుతున్నాము..అని ఆక్రోశంతో అడిగింది రూప..ఒక్కరికీ పశ్చాత్తాపం లాంటిది లేదక్కడ..వింటూ ఉన్నారు అంతే, ఆ విన్నది కూడా ఒక చెవిలోంచీ దూరి ఇంకోచెవిలోంచీ బయటకి పోతోంది..మెదడుకి, మనసుకీ తాళాలు వేసేసుకుని చాలా రోజులయ్యింది..ఇంక అవెక్కడ స్పందిస్తాయి..విషయాలన్నీ వివరంగా తెలుసుకుంది రూప..జాన్ కి ఎవ్వరూ లేరు..బేబీని బాధ్యతగా చూసేవాళ్ళు కూడా సరిగ్గా ఎవ్వరూ లేరు..పైగా బేబీ, ధీర దగ్గరకితప్ప ఎవరిదగ్గరికీ వెళ్ళట్లేదు..గుర్తొచ్చినప్పుడల్లా దిగులుగా నాన్నా అని ఏడుస్తోంది బేబీ..అలాంటి పాపని ధీరకి దూరం చేస్తే పాప దిగులుతో ఏదైనా అయిపోవచ్చు..

ఊరివాళ్ళ వ్యతిరేకతని, ఛీత్కారాలని భరిస్తూ బేబీని సాకుతున్నారు ధీర, శేషు..మరీ మొయ్యలేని ఇబ్బంది వస్తే రూప సాయం కోరుతున్నారు..పోలీసులు, కోర్టూ అని ఊరిలో ఇరువైపులవారినీ హెచ్చరిస్తూ ధీరని శేషుని బేబీని కాపాడుకుంటూ వస్తోంది రూప..

ఎన్ని అవమానాలు, గొడవలూ, దెబ్బలూ భరించాల్సి వచ్చిందో ధీరకి శేషుకి ఊరివాళ్ళ వలన..బేబీని కూడా స్కూల్లో సాధిస్తూ, వేధిస్తూ ఇబ్బందిపెట్టేవారు బేబీకి అయినవాళ్ళూ, కానివాళ్ళూ కూడా. ఎన్ని భరించాల్సివచ్చినా ధీర చేతుల్లో ఉండగలిగితే చాలు అనుకుని అన్నీ భరిస్తూనే పదోతరగతి వరకూ చదివింది బేబీ..బేబీ తన తండ్రి జాన్ నేర్పిన పద్ధతిలోనూ ప్రార్ధిస్తుంది దేవుడిని, ధీర చేసే పద్ధతిలో కూడా పూజ చేయటం నేర్చుకుంది..ధీర ఏనాడు ఇలానే ఉండాలని బేబీని బలవంతపెట్టలేదు. రూపకి ధీరని చూస్తుంటే ఇంత గుండెధైర్యం ఎక్కడినుంచొచ్చింది ఈ ధీరకి అని ఆశ్చర్యం కలుగుతుంటుంది. దిక్కులేని అనాధగా బతకాల్సిన బేబీ ధీర వలన నిశ్చింతగా జీవిస్తోంది. బేబీ మనసులో దైవానికి ఒక రూపం కూడా ఉంది చాలా స్పష్టంగా..అది తనను తొమ్మిదినెలలు మోసి కన్న తల్లి కనులుమూసినా, తనను అక్కునచేర్చుకుని నిరంతరం తన గుండెల్లో మోసే తల్లికానితల్లి ధీర రూపం. ప్రశాంతంగా, నిర్భయంగా నవ్వే ధీర రూపం బేబీకి కనిపించే దైవం.
                                                 ******

No comments:

Post a Comment

Pages