అటక మీది మర్మం -18 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం -18

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-పద్దెనిమిదవ భాగం (18)
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)

 
(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్. తన స్నేహితురాళ్ళతో అతని యింటికి వెళ్ళిన యువగూఢచారి అతని యింటిని, అటకని గాలించినా ఫలితం శూన్యం. తట్టురోగంతో యింటికి తిరిగి వచ్చిన మార్చ్ మనుమరాలి సంరక్షణకు ఎఫీ అన్న అమ్మాయిని నియమిస్తుంది. ఆమె ద్వారానే ఆ యింటిలో ఆగంతకుడెవరో తిరుగుతున్నట్లు తెలుసుకొంటుంది. ఒకరోజు అటక మీద ఆమెకు బీరువాలో ఒక అస్తిపంజరం కనిపిస్తుంది. ఇదే సమయంలో తండ్రి తనకు అప్పజెప్పిన మరో కేసులో డైట్ కంపెనీలో దూరి బుషీట్రాట్ అన్న వ్యక్తిని కనుక్కోవటమే గాక, ఆ లాబ్ నుంచి రెండు సీసాల్లో పట్టు పరికిణీలు తయారుచేసే రసాయనిక ద్రవాల నమూనాలను రహస్యంగా సంపాదించి, తన తండ్రికి యిస్తుంది. ఆగంతకుడు తరచుగా కనిపించటంతో భయపడుతున్న ఎఫీని ఒక రోజు యింటికి వెళ్ళమని చెప్పి, తన స్నేహితురాళ్ళతో కలిసి ఆ రాత్రికి మార్చ్ భవంతిలో ఉండిపోతుంది నాన్సీ. ఆ రాత్రి ఒక ఆగంతకుడు భవంతి వెనుకకు వెళ్ళటం గమనించి అతన్ని అనుసరిస్తుంది. కానీ అతను అకస్మాత్తుగా మాయమవుతాడు. తన స్నేహితురాళ్ళను భవంతి బయట కాపలా ఉంచి, తాను మార్చ్ తో కలిసి అటకమీదకు వెడుతుంది. ఈ లోపున బయటినుంచి స్నేహితురాళ్ళ కేకలు వినిపించి వాళ్ళకు సాయపడటానికి బయటకు వెడుతుంది. వాళ్ళు ముగ్గురు ఎంత వెంబడించినా, సమయానికి అతనికి ఒక కారు సాయంగా రావటంతో, అతను దాన్ని ఎక్కి పారిపోతాడు. బెస్ రేడియోలో వచ్చిన సంగీతాన్ని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూండగా, ' మళ్ళీ అదే తప్పు చేసారంటూ' మార్చ్ అరుస్తాడు. నాన్సీ అతన్ని సముదాయించి అతని కుమారుడికి బాణీలు కట్టే అలవాటు ఉందని తెలిసినవాళ్ళ గురించి అడుగుతుంది. కోర్టుకెళ్ళాలంటే సాక్ష్యం ముఖ్యం. రేడియోలో వినబడిన పాటకు బాణీ కట్టింది బెన్ బాంక్సె గాక హారీహాల్ అని చెబుతారు. ఆ రోజు దొంగ మరొక పాటను దొంగిలించినట్లు గమనించారు గనుక ముగ్గురు అమ్మాయిలు మరునాడు ఆ భవంతిలో దొంగ వచ్చి పోయే రహస్య మార్గాన్ని కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమవుతారు. అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకే్దో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి అస్తిపంజరం దిగువన ఒక నాబ్ కనిపిస్తుంది. తరువాత జరిగిందేమిటంటే. . . ..)
@@@@@@@@@@@@@@@@

" అమ్మాయిలూ! నేనొక రహస్యప్రదేశాన్ని కనుగొన్నాను."

పదే పదే దొరికిన పిడిని ఒడిసిపట్టి పైకి గుంజటానికి ఆమె ప్రయత్నించింది. తేమ వల్ల చెక్క ఉబ్బి మూత గట్టిగా బిగిసిపోయింది.

" ఏదీ? నన్ను చూడనీ?" జార్జ్ అసహనంగా అడిగింది.

జార్జ్ తన బలాన్ని పరీక్షించుకొనేలోగా, ఎఫీ అటక మీదకొచ్చి నాన్సీని పిలిచింది.

" నాన్సీ! ఒకాయన నిన్ను కలవాలని వచ్చారు. నీకోసం కింద ఎదురుచూస్తున్నారు" ఆమె కబురు తెచ్చింది.

" నన్ను చూట్టానికా? నేనిక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదే!"

" హన్నా అతన్ని యిక్కడకు పంపిందట" ఎఫీ వివరించింది. " అతను ఎక్కువసేపు ఎదురుచూడనంటున్నాడు."

" అతని పేరేమిటి?"

" జెన్నర్ "

బెన్ బాంక్స్ సంగీతాన్ని ముద్రించిన వ్యక్తి!

తాను ఊహించని విధంగా మార్చ్ యింటి దగ్గర సంగీత ముద్రణాధికారి ప్రత్యక్షమవటం నాన్సీని ఆశ్చర్యపరిచింది. ఆమె తన స్నేహితురాళ్ళను ప్రస్తుతం 'బట్టలబీరువాలో కనిపెట్టిన రహస్య అరను శోధించే పనిని కొనసాగిస్తారా లేక తనతో పాటు కిందకు వస్తారా?' అని అడిగింది.

"నువ్వు అక్కడ జెన్నర్ తో మాట్లాడుతోంటే, యిక్కడ మేము అతనికి చూపించగలిగే సాక్ష్యాన్ని కనుక్కోగలమేమో!" అంటూ జార్జ్ బీరువా అడుగుభాగాన ఉన్న పిడిని పట్టుకొని బలంగా గుంజసాగింది.

యువ గూఢచారి కంగారుగా అటక మెట్లను దిగి జెన్నర్ ఉన్న గదిలోకి వచ్చింది. ఆ సమయంలో ఊళ్ళోకి వెళ్ళటం వల్ల మార్చ్ అతన్ని కలవలేకపోయినందుకు విచారించింది.

" అతను యిక్కడ లేకపోవటమే మంచిది. ఉంటే తన కొడుకు సంగీతాన్ని దొంగిలించారని అతనిపై ఉద్రేకపడే ఆస్కారం లేకపోలేదు. ఆ కోపంలో పెద్దాయన అనవసరంగా మాట్లాడితే, ఫిప్ సంగీతాన్ని కనిపెట్టే అవకాశాలు జారిపోవచ్చు" అని తనలో తానే సమాధానపడింది ఆమె.

జెన్నర్ చాలా చురుకైనవాడిలా కనిపిస్తున్నా, అతని కళ్ళలో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది.

" నేనిక్కడ ఎక్కువసేపు ఉండను" చిరచిరలాడుతూ చెప్పాడతను. " నాన్సీ డ్రూ మీరేనా?"

" నేనే " యువ గూఢచారి శాంతంగా బదులిచ్చింది.

జెన్నర్ మాటలను వృధా చేయదలచుకోలేదు. ఆమె వ్రాసిన ఉత్తరాల గురించి సూటిగా మాట్లాడాడు.
" మీరు ఉత్తరాలలో ఖచ్చితంగా ఏ విషయాన్ని ప్రస్తావించకపోయినా, నాపై ఏదో అపవాదు వేస్తున్నట్లు అనిపించింది."

" మిస్టర్ బాంక్స్ గురించి మీకేమి తెలుసు?" ఆమె అడిగింది.

" చాలా తక్కువ. మా పరిచయమంతా ఉత్తరాల ద్వారానే! "

" మరొక స్వరకర్త హారీ హాల్ గురించి చెప్పగలరా?" నాన్సీ అడిగింది. ఇతని ద్వారానే అతను కూడా తన పాటలను ముద్రిస్తున్నాడని ఆమె అనుమానం.

" అతను మరొక పాటల రచయిత, చాలా సామర్ధ్యం ఉన్నవాడు. అతన్ని ఎప్పుడూ కలవలేదు. తన పనిని అతను మెయిల్ ద్వారా నాకు పంపుతాడు."

" అతను నిజాయితీపరుడని ప్రమాణం చేసి చెప్పగలరా?"

" ఏమిటిది? ఇదేమన్నా ప్రశ్నావళి కార్యక్రమమా?" ఎర్రబడ్డ ముఖంతో గద్దించాడు. "నాకు వాళ్ళిద్దరి గురించి ఎక్కువగా తెలియదని ఒప్పుకొంటున్నాను. కానీ వాళ్ళ సంగీతం యిటీవల వస్తున్న ఉత్తమ సంగీతంతో సమానమని చెప్పగలను."

"బహుశా మీకేమీ తెలియదనుకొంటాను."

"ఏమిటి మీరనేది? ఆ పాటలను మరొకరు వ్రాశారని మీరనుకొంటున్నట్లు చెప్పకండి."

"పాటలను ముద్రించే ముందు వాళ్ళు గాక యితరులెవ్వరో వ్రాసి ఉండరని నిర్ధారించుకోవాలి"

"ఆ అపవాదు ఎవరు వేశారో చెప్పండి" చిరాకుగా అన్నాడతను.

"ఈ విషయంలో మీకేమి తెలుసో వివరించే అవకాశం యిద్దామని అనుకొంటున్నాను" నాన్సీ బదులిచ్చింది.

"వివరించటాకేమీ లేదు. వాళ్ళమీద మంచి నమ్మకంతో ఆ సంగీతాన్ని ముద్రించాను. నాకు పాటలను పంపిన వ్యక్తులే స్వరకర్తలని సంతృప్తి చెందాను."

"దాన్ని ఋజువు చేయటానికి సిద్ధంగా ఉన్నారా?"

ఆమె వేసిన ప్రశ్నకు అతను ఆగ్రహంతో రగిలిపోయాడు. " తప్పకుండా ఋజువు చేస్తాను" కోపంతో అరిచాడు. తన చేతిగడియారాన్ని చూసుకొన్నాడు. " మిమ్మల్ని కలవాలని ప్రత్యేకంగా పని పెట్టుకొని వచ్చాను. అలా రావటం వల్ల నా విలువైన సమయమంతా వృధా అయ్యింది."

"కొన్నాళ్ళ తరువాత అలా అనుకోరు."

"బాంక్స్, హాల్ గ్రంధచోరులు కావచ్చని నమ్మటానికి మీ దగ్గర ఋజువులు ఉన్నాయా?"

"ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను" నాన్సీ బదులిచ్చింది. " కానీ మీకో సలహా యిస్తున్నాను. ఇకమీదట అసలైన స్వరకర్త ఎవరో నిర్ధారణ అయ్యేవరకూ వాళ్ళిద్దరి నుంచి సంగీతాన్ని కొనకండి."

" ఆ సంగీతానికి మీరు అనుకొంటున్న స్వరకర్త ఎవరో, వారి పేరు చెబుతారా?"

"నేను చెప్పలేను."

" మంచిది. ఆ విషయంలో నాకు కొంచెమైనా చింతలేదు" ప్రత్యుత్తరమిచ్చాడు. "ఇక్కడకొచ్చి చాలా సమయాన్ని వృధా చేసుకోవటం నా మూర్ఖత్వం."

అకస్మాత్తుగా లేచి జెన్నర్ ఆ యింటి బయటకొచ్చాడు. నాన్సీ చూస్తూండగా కోపం, ధిక్కారభావం ముప్పిరిగొనగా తన వాహనంపై వెళ్ళిపోయాడు.

"వచ్చిన పెద్దమనిషి త్వరగా వెళ్ళిపోయాడా?" అటక మీదకొచ్చిన నాన్సీని బెస్ అడిగింది. " సాక్ష్యం చూపటానికి మేమింకా ఆ రహస్య అరను తెరవలేదు."

" అదే జరిగితే, జెన్నర్ కి వ్యతిరేకంగా ఉపయోగపడే విషయమేదో మనకు దొరకవచ్చని ఆశపడ్డాను" అంటూ ఆమె జెన్నర్ చేసిన వ్యాఖ్యలను వారికి చెప్పింది.

బెస్, జార్జ్ విషయాన్ని పసిగట్టారు. "నా దృష్టిలో చెప్పాలంటే, అతను మంచి దూరదృష్టి కలవాడు" చెబుతున్న జార్జ్ కళ్ళు మెరిసాయి.

" మంచిది. ఏమైనప్పటికీ నాకు సాక్ష్యం కావాలి" అంటూ నాన్సీ నిట్టూర్చింది. "రండి. మరొకసారి ఈ అర సంగతి చూద్దాం."

ఆమె పిడిని పట్టుకొని రెండు పక్కలకు బలంగా గుంజింది. చిన్న తలుపు పైకి తెరుచుకొని, దాని కింద ఉన్న గూడు బయటపడింది.

"తెరుచుకొంది" అంటూ ఆమె ఉత్సాహంగా అరిచింది. "దీనిలో ఫిప్ పాటలు దొరకవచ్చని ఆశిద్దాం."
ఉత్తేజంతో నాన్సీ తన చేతిని ఆ కన్నంలోకి బలంగా తోసింది.

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages