శ్రీముకుంద రాఘవ శతకము - జూలూరి లక్ష్మణకవి - అచ్చంగా తెలుగు

శ్రీముకుంద రాఘవ శతకము - జూలూరి లక్ష్మణకవి

Share This
శ్రీముకుంద రాఘవ శతకము - జూలూరి లక్ష్మణకవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం:
ముకుంద రాఘవ శతకకర్త జూలూరి లక్ష్మణకవి మధ్వ బ్రాహ్మణుడు. సుబ్బయ్య, శేషమల కుమారుడు.  ఈ కవికి లక్ష్మీనరసు అను నామాంతరము కలదు. ఈకవి బ్రౌను దొరవద్ద పనిచేసి క్రీ.శ. 1800 ప్రాంతమున అనేక గ్రంధములకు వ్యాఖ్యలు వ్రాసి, మరియు నిఘంటు రచన యందును సహాయము చేసిన జూలూరి అప్పయార్యును మనుమడు. ఈకవి బహుశా1820 ప్రాంతముల వాడై ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. ఈ కవి ఇతర జీవిత విశేషాలు కానీ, ఇతర రచనల గురించి కానీ ఎటువంటి సమాచారము లభించుటలేదు. 

శతక పరిచయం
ముకుందరాఘవ అనే మకుటంతో  చంపకోత్పలమాల వృత్తభరితమై రచింపబడిన ఈశతకంలో 250 పద్యాలలో రామాయణాకథను ముఖ్యాంశములను వదలక రసవత్తరంగా  పొందుపరిచారు. భక్తిరస ప్రథానమైన శతకము. అంత్యనియమ, వృత్యానుప్రాసాది సముచితాలంకారములతో వ్రాయబడి ఈశతకం అత్యంత ప్రౌఢముగా ఉన్నది. ఈశతకములోని ఘట్టములు వాల్మీకి రామాయణమును అనుసరించి వ్రాయబడినది. ఇందలి శైలి సులలితముగా ద్రాక్షపాకమునందున్నది. భావములు మనోహరముగా ఉన్నవి. శతకము నందు పద్యములు రామయణమునందలి కాండల ననుసరించి విభజన చేయబడినవి. శతక ప్రారంభమున ఇష్టదేవత ప్రార్థన, పూర్వకవుల ప్రశంశలతో ప్రారంభించారు. కొన్ని పద్యాలను చూద్దాము.

బాలకాండము:
చ. తనయులు లేమి నద్దశరథక్షితినాథుఁ డెదందలంచి యిం
పెనయ సుమంత్రమంత్రి వచియించిన పద్ధతి ఋశ్యశృంగమౌ
నిని దెగదోడిదెచ్చి యవనిన్ హయమేధ మొనర్పఁడే మహా
మునుల యనుజ్ఞ మంత్రవిధి పూతముగాఁగ ముకుంద రాఘవా
చ. దురమున దుష్టదానవులఁ ద్రుంచి జగన్ముద మాచరింప బం
ధురతరనీలమేఘరుచితోఁ దనువొప్పఁగఁ గోపలక్షమా
వరతన యోదల్లసితవార్ధి సుథానిధి వై జనిచి తౌ
సురవర లెల్ల సంతసిల శోభనశీల ముకుంద రాఘవా
చ. అటవులజాడఁజేరి పథికావలినొంచుచు ఘోరమూర్తియై
కుటిలగతిం దనర్చు మదకుంభసహస్రబలాఢ్య తాటకా
పటుకుధరంబు నేకసిత బాణాపవి న్విదళించి తౌ భవ
త్స్ఫుటరణకృత్యముల్ దలఁపఁ జోద్యముగాదె ముకుందరాఘవా
చ. పటుభుజశక్తిమై నృపులు బల్విడి పట్టి కదల్పలేక ప్ర
స్ఫుటమగుసిగ్గుచేఁ జనఁగఁబొల్చిన రుద్రశరాసనంబు ను
ర్కటకలభంబు తమ్మిక్రియ గ్రక్కున లీలఁ దెమల్చి త్రుంచితౌ
చటులరవంబుచే జగము సారె జలింప ముకుంద రాఘవా

అయోధ్యాకాండము
ఉ. తమ్ముల గారవించి మఱి తండ్రివినాశ మెఱింగి మూర్చపైఁ
గ్రమ్మిన వ్రాలి లేచి మది ప్రాకృతుభంగి కలంగి బంధులో
కమ్మొగి వెంటరా ద్రిపథగామిని కేఁగవె రామచంద్ర లో
కమ్మునవారువోలె పితృకార్యముఁ దీర్ప ముకుంద రాఘవా

అరణ్యకాండము:
ఉ. చండకఠోరశూలమును సయ్యన పైనడరింప దాని కో
దండకళాఢ్యతన్ దునిమి దార్కొని వజ్రనిభాసిచే సురేం
ద్రుండు నగంబు వోలె యవరోధనిరోధు విరాధు ద్రుంచి తా
తండలఖేచరత్వమును దాల్చి నుతింప ముకుంద రాఘవా
చ. పరువున నేగి శూర్పణక బన్నము నన్నకుఁ జెప్పుచున్ మనో
హరరుచిరాంగి నీలకుటిలాలక చంద్రనిభాస్య సితయం
చరుదుగఁ దెల్పఁ బొంగుచు దశాస్యుఁడు గైకొనఁ జూచె మత్తుఁడై
గరళము మ్రింగఁగోరుటయ గాదేతలంప ముకుంద రాఘవా

కిష్కింధాకాండము
ఉ. మారుతపుత్రుఁ డర్కసుతమంత్రి కరంబులు మోడ్చి యోజగ
ద్వీర నృపేంద్రులార మునివేషముతో నిట సంచరింపఁగాఁ
గారణమేమి యెవ్వరొ తగన్వినఁ గోరెదఁ దెల్పుఁడంచు నా
ధిరుఁడు వేఁడఁడే రఘుపతి మినుఁ గూర్చి ముకుంద రాఘవా

సుందరకాండము
చ. పదయుగళంబు చక్క నిడి వార్ధికి మ్రొక్కి భవత్పదాబ్జముల్
హృదయమునందు నిల్పుచు మహేంద్ర నగేంద్రము గ్రుంగ దాఁటఁడే
చదలికి మారుతాత్మజుఁడు శైలకుంజంబులు పెళ్ళగిల్లనం
బుదములు దూల దోర్జసముజ్వలుండౌచు ముకుంద రాఘవా
ఉ. చక్కిటఁ జెయ్యి జేర్చి బలుచింతలఁ దూలుచు దీనవక్త్రయై
దిక్కట నొండు లేక ఘనతీక్ష్ణమృగాళిఁ గురంగి వోలె నా
రక్కసిమూఁకలో భయభరంబునఁ గుందెడు సీతఁ జూడఁడె
యొక్కెడ వాయుజుండు మది కుబ్బు జనింప ముకుంద రాఘవా
ఉ. కట్టినకట్లు దెంచి దశకంఠబలంబుల నుక్కడంచి తా
నెట్టన యింటియింటిపయి నిద్దపుమంటఁ దగిల్చి దాఁటుచుం
గట్టలుకం బురంబు వెసఁ గాల్వఁడె మారుతి రాక్షసుల్ మదిం
దొట్టిన భీతి నెవ్వగలఁ దూలి కలంగ ముకుంద రాఘవా

యుద్ధకాండము
గ్రక్కున పావకాస్త్రమున రావణు నాభిసుధన్ హరించి పెం
పెక్క మహాశరాళి నసురేంద్రు తల ల్విదళించి పుచ్చి తౌ
నొక్కటిదక్క వజ్రనిహితోజ్వలధాతుఝురీధరాకృతి
న్నెక్కొనమేన రక్తములు నిండి స్రవింప ముకుంద రాఘవా
పావకోటి తిఙ్మరుచి భాస్వదజాస్త్రముచేత లోకవి
ద్రవణు రావణున్ బ్రధనధారుణిఁ గూల్చితివౌజగంబులం
దావకకీర్తి యుల్లసిల దైవతకోటి జెలంగ సర్వభూ
తావలి సంతసింపఁ గపులార్చి నుతింప ముకుంద రాఘవా

పైన ఉదాహరించిన పద్యములు మచ్చుకి మాత్రమే. వాల్మీకి రామాయణంలో ప్రతిఘట్టమును ఈశతకంలో ఇనుమడించి అత్యద్భుతంగా రచించిన ఈ శతకం అందరూ చదవవలసినది.
మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి.
 ***

No comments:

Post a Comment

Pages