అక్షయపాత్ర - అచ్చంగా తెలుగు
" అక్షయపాత్ర "
లక్ష్మణ్ భరద్వాజ్ 
                   

                "ఏమేవ్! విశాల బియ్యం కొంచెం తక్కువ పెట్టావా... ఏంటి? ఓ పిడికెడు ఎక్కవ వెయ్యొద్దూ.. ఎక్కువ పోస్తే ఏం నష్టమొస్తుందా? పాపం ఆ చిన్నాడికి సరిపోలేనట్టుంది.. ఉట్టి మజ్జిగ త్రాగేసి పోయాడు వెర్రివెధవ!
     ఆ పెద్దాడికేమో కడపుమానం తెలీదు నాకైతే వాళ్ళ సంగతి తెలుసు కాబట్టి, ఏదో పొద్దున్న మిగిలిన ఆ కాస్త పొడన్నంతో సర్దుకుంటాననుకో. రేపు ఆడపడుచు, వాళ్ళాయన పిల్లలు వచ్చారనుకో వాళ్ళకి వడ్డించి వాళ్ళు తింటుంటే చాలకపోతే అప్పటికప్పుడు మళ్ళీ స్టౌ వెలిగిస్తావా ఏంటి వాళ్ళెదురుగా ? అప్పుడు వాళ్ళు నిన్ననరే.. నన్నంటారు. నీతోపాటు వాళ్ళన్న మాటలు అగ్ని మూలంగా ఇనుముకి దెబ్బలన్నట్టు నాకూ తగులుతాయి. వదినకు వాళ్ళమ్మగారు ఏ పనీ, పాట సరిగ్గా నేర్పలేదనుకుంటా.. వచ్చీ, పోయే ఇల్లు కాబట్టి ఓ పిడికెడు బియ్యం ఎక్కువ పోసి, అధనంగా ఓ మనిషికి సరిపోయేంత అన్నం మిగిలేలా వండుకో వద్దూ? అని ఆడిపోసుకుంటారు. సంసారం నడుపుకుంటున్నామంటే గుట్టుగా ఉండాలి ఊళ్ళో అందరికి తెలియక్కర్లా.. అందరూ పంచాయితీలు పెట్టనక్కర్లా.. అర్ధమైందా.. "
              "అబ్బా! ఆపమ్మా... వచ్చిందగ్గరనుండి చూస్తున్నా.. అలా ఏదోకటి నన్ను దెప్పిపొడుస్తున్నావు. ఏదో పొరపాటైంది రోజూ అలా ఏం జరగట్లేదు కదా... ఎందుకలా నా మీద విసుక్కుంటావు?  అక్కయ్య వాళ్ళింటికెడితే అస్సలు నోరే విప్పవు నా దగ్గరకొస్తేనే ఇలా విసుక్కుంటావు నువ్వు.. . నీకు మొదట్నుండీ నేనంటే నచ్చదు.   పిడికేం ఖర్మ ఇంకో రెండు పిడికెళ్ళు బియ్యం వేస్తాను కానీ మిగిలిపోతే పొద్దున్నే నా సంతానం చల్దన్నం తినరు. ఇక ఆయనేమో లేస్తూనే పూజ,ఆ తర్వాత ఆఫీసుకి టైం అయిపోతోందని గాభరా, గాభరాగా వెళ్ళిపోతారు. ఒక్కోసారి కనీసం కాఫీ అయినా తాగరు. ఇంకెవరికి పెడతాను?  మాకా పనిమనిషి దొరకదు ఈ ఊళ్ళో ఇంకెవరికైనా ఇరుగు,పొరుగు వాళ్ళకి ఇద్దామన్నా.. ఎలా ఇవ్వను?  అదేమైనా ప్రసాదమా?
రాత్రిమిగిలిన చద్దన్నం. ఎవరైనా వేడి,వేడి అన్నంలో వేపడం ముక్కలు ఓకింత (సాంబారు) లేక  పప్పు పులుసు పెడితే మహా ప్రసాదంలా తింటారు గానీ చద్దన్నం ఎవరిక్కావాలి చెప్పమ్మా?  తెగించి ఏ కాల్వలోనో పారేయడం ఇష్టం లేక, తింటే నాకు పడక తిప్పలు పడుతున్నా. అదేంటో ఎవరికైనా తింటే నీరసం పోతుందంటారు. మరి అదేం ఖర్మమో నాకు ఆ మిగిలిన అన్నం తింటే ఈడ్చి, ఈడ్చి తన్నినట్టయిపోతోంది. ఇప్పుడు చెప్పమ్మా.. ఏం చేయమంటావో?"
         "అమ్మాయి! నేనా పెద్ద దాన్ని ఇందాక ఆ చిన్నాడలా లేచెళ్ళిపోతే చూసి తట్టుకోలేక ఏదో ఆవేశంలో అలా అనేసాను. నాకా నువ్వు, మీ అక్క మీ ఇద్దరూ సమానమే! ఒకళ్ళెక్కువ, ఒకళ్ళు తక్కువా ఏం కాదు మీ ఇద్దరూ నాకున్న రెండు కళ్ళతో సమానం. మరి ఓ పని చేయలేకపోయావా... చక్కగా  ఓ ఇంత పసుపేసి, కాస్త చింతపండు పులుపో, నిమ్మరసమో పిండి అంత మంచినూని వేసి కొంచెం ఇంగువ తగిలించి, కొద్దిగా కరివేపాకు, వేరుశనగ్గుళ్ళు పోపు పెట్టావంటే కమ్మనైన పులిహోర తయారవుతుంధి. పిల్లలకి ఉదయం అల్ఫాహారం (టిఫిన్) పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళ కడుపు నిండినట్టు ఉంటుంది."
         "హా! నువ్వు బాగానే చెప్పావమ్మా.. వాళ్ళు నా పిల్లలు, నీ పిల్లలేం కాదు మేం చెప్పిందల్లా... విన్నట్టు మా పిల్లలేం వినరు. ఒకట్రెండు సార్లు ఆ ప్రయత్నమూ చేసాను ఒక్కడంటే ఒక్కడు వేలేసి ముట్టుకోలేదు మాకు తెల్సమ్మా... నువ్వు రాత్రన్నం పులిహోర చేసావు మాకేం తెలీదనుకుంటున్నావా...మాకక్కర్లేదు నువ్వే తినని నా మొహానికే వదిలేసి చెరో యాబై రూపాయలు పట్టుకుపోయారు తెల్సా...  ఇక మావారైతే కనీసం వేలేసి ముట్టుకోలేదు సరిగదా... వాసన కూడా చూడ్లేదు. ఇంక ఇప్పుడు చెప్పు, ఏం చెయ్యాలో. ఇంకెవరికైనా ఇరుగు, పొరుగు వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళకా ఇంగువ వాసన పడదు, అదీగాక నాకే భయం వాళ్ళెక్కడ రాత్రన్నం పులిహోర చేసానని కనిపెట్టెస్తారోనని తెల్సి నన్ను తిట్టుకుంటారోనని భయంతో ఇవ్వను."
           "బాగుందమ్మా... చాలా బాగుంది నీ పని అన్నం పరబ్రహ్మ స్వరూపం అలా వీధులపాలు, కాల్వలపాలు చేయకూడదు.  నాకా సైన్సవీ తెలివుగానీ అంత పెద్ద చదువులేవీ నేను చదువుకోలేదు గానీ నా చిన్నప్పుడు మా నాన్న చెబుతుంటే విన్నాను. అలాగని మా వాళ్ళేం వ్యవసాయం ఎప్పుడు చేసినవాళ్ళేం కాదు.  ఒక ధాన్యపుగింజ మొలకెత్తి మళ్ళీ ఆ వరినారు ధాన్యంరూపంగా మారాలంటే ఎన్నో నీళ్ళుకావాలంట. అవేవో క్యూసెక్కులో,
గ్యాలన్లోనట నాకు సరిగ్గా తెలియదు. అంత పెద్ద చదువులు గావుకదా మావి ఏదో వానాకాలం చదువులు. పర్లేదు కొంచెం అక్షర జ్ఞానం నేర్పించాడు మా నాన్న.  రైతులు అందుకే ఆ వరుణదేవుడికి పడి ఏడుస్తుంటారు, 'సకాలంలో వర్షాలు కురిపించి, మా పంటలు బాగా పండేలా చూడు నాయనా..'. అని తెగ మొక్కుతూ ఉంటారు. కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తారు. అమ్మవారికి బలులు ఇస్తంటారు. ఆ సర్వాంతర్యామి, నిరాకారుడు, మనందరికి తండ్రి పరమేశ్వరుడికి అభిషేకాలు చేస్తారు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చేసి, సకాలంలో వర్షాలు కురిసేలా మొక్కుకుంటారు. ఎందుకంటే భూమాతను మనం ఎంత నీళ్ళు మోటార్లతో తోడి పోసి తడపగలం చెప్పు? అందుకే అందరూ వరుణదేవుడు చల్లగా చూడాలని కోరుకునేవారు. 
         ఇప్పుడవేవి లేవు కాలం మారిపోయింది.  అంతా  కల్తీయే అందరూ... కల్తీయే! 
          సహజమైన ఎరువులు మానేసి ఇప్పుడంతా అదేదో పిండి యూరియాట వేసేస్తున్నారు. తక్కవ నీళ్ళతో అధిక దిగుబడి  ఇవ్వాలని కొత్తరకం వరివిత్తనాలు వేస్తున్నారట గదా... అంతా కృత్రిమమే, ఎక్కడా సహజమైంది ఉండటం లేదు.  అందుకే మనమూ ఎంత తిన్నా.. నీర్సం తప్ప ఆరోగ్యమే సరిగ్గా ఉండటంలేదు. ఏదో వయస్సు మీరిందాన్ని కాస్త చాదస్తం పెరుగుతుంది గదా ఉండబట్టలేక నిన్నన్నాను. "
          "నేను చాలాసార్లు ఉదయం అన్నం తినగా మిగిలింది తిని, ఆ కాస్త మిగిలింది రాత్రికి మరలా వండుకోలేక దాచుకుంటే అదేంటో మనకి చెమట పట్టినట్టు ఆ అన్నానికి కూడా నీరుపట్టి పాడైపోయిందమ్మా. ఇక అప్పట్నుండి జాగ్రత్త పడుతున్నాను ఎంత కావలిస్తే అంతే వండకుని, మిగలకుండా జాగ్రత్త పడుతూ, ఏ పూటకి, ఆపూటే వండుకుంటున్నా... ఒక వేళ చాలకపోతే ఏ మజ్జిగో, మంచినీళ్ళో త్రాగి సరిపెట్టుకుంటున్నా... మావి ఆ రోజుల్లో గట్టిగా తిన్న ఒళ్ళు కాబట్టి తట్టుకుని నిలబడగలుగుతున్నాం.  ఈ కాలం పిల్లలకి కాలుకదిపితే నీరసం చెయ్యి కదిపితే నీరసం అంటున్నారు ఈ తిళ్ళు తినడాన్నే... గాబోసు మరి ముందు, ముందు ఇంకా కష్టమేమో మరి అంతా ఆ సర్వేస్వరుడి దయ.   మనం నిమిత్త మాత్రృలం ఏం జేయగలం?"
                 "అమ్మా... అమ్మా... ఇంక లే..చాలా పొద్దుపోయింది  ఏంటి రాత్రంతా అలా ఏదో కలవరిస్తూనే ఉన్నావు? నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఒకటి రెండు సార్లు నిద్ర లేపే ప్రయత్నం కూడా చేసాను. కానీ ఎందుకులే మళ్ళీ మధ్యలో లేపితే కలత నిద్రతో మళ్ళా పడుకుంటావో పడుకోవో అని లేపలేదు. ఇంతకీ ఏమైంది నీకు? రాత్రంతా అలా ఎవరితో నీకా వాదులాట? నువ్వెవరితోను గొడవపడటం చూడ్లేదే నేనెప్పుడు." 
          " ఓహో... అదా ఏం లేదురా అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా మిగిలితే నేలపాలు చేయక ఏ బీదవాళ్ళకో,అన్నమో రామచంద్రా... అని ఏడ్చే వాళ్ళకు పెట్టంటూ మీఅక్కకు చెబుతున్నట్టుగా కలొచ్చింది.   నిజానికది మీ అక్కకు చెప్పడం కాదు మీ ఆవిడతో చెబుదామని నిన్నరాత్రి పడుకునే ముందు అనుకున్నా... అప్పుడెందుకులే ఆమెతో చెప్పడం ఉదయం చెబుదాం.. లేదంటే నీకన్నా.. చెబుదాం అనుకున్నా. నువ్వెలాగు తనతో చెప్పి ఒప్పిస్తావని నమ్మకంతో అంతే ఇంకేంగాదు.. నాకేం కాలేదు నువ్వింక ఆఫీసు టైమవుతోంది కాబోసు వెళ్ళు తయారవు..."
          "అమ్మా.. నీకు తెలియదనుకుంటా.. మనింట్లో ఒక్కమెతుక్కూడా వ్రృథాగా పోదమ్మా.. మీ కోడలసలే గడుసుది. వాళ్ళమ్మమ్మ చెప్పిందట మిగులన్నం ఎప్పుడూ పాడుచేయకుఅని. ఆ మిగులన్నం మెతుకుతోనే శ్రీక్రృష్ణుడు, ద్రౌపది వద్ద ఉన్న అక్షయపాత్రకి పునఃశ్శక్తిని ఇచ్చాడు. కావున అలా ఎవరైనా ఏ రూపంలోనైనా సహాయ పడతారని చెప్పారట. కాబట్టి నువ్వస్సలు ఎప్పుడు మిగులన్నం గురించి దిగులు చెందకు సరేనా? మరి నా ఆఫిసుకి టైమవుతోంది వెళ్తాను."
             "అన్నట్టు, వచ్చేది సంక్రాంతి పండుగ కదా! కాస్త అన్నం వ్రృథా చెయ్యక ఆ మిగులన్నం డబ్బులతో ఇల్లంతా అందంగా... రంగవల్లులతో తీర్చిదిద్దాలి గదా.. ఆ పని చూడు," సరేనా?
***
               

No comments:

Post a Comment

Pages