అటక మీది మర్మం - 13 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 13

Share This

అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- పదమూడవ భాగం (13)

(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)


(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. . మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. తండ్రి కోరిక మేరకు ఆమె డయానె ద్వారా డైట్ కంపెనీలోకి దూరి బుషీట్రాట్ అన్న వ్యక్తి అక్కడ పని చేస్తున్నట్లు కనుక్కొంటుంది. ఆ విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా, పక్కబట్టల కోసం అటక మీద పాత బీరువాలో వెతుకుతున్న ఎఫీని బ్లాక్ విడో సాలీడు కరిచిందని గమనించి డాక్టరు వద్దకెళ్ళి చికిత్స చేయిస్తుంది. హన్నా ప్లెజెంట్ హెడ్జెస్ కి వచ్చి బ్లాక్ విడోని కనుక్కొని చంపేస్తుంది. జబ్బుపడ్డ ఎఫీ కోలుకొనేవరకు నాన్సీ మార్చ్ భవంతిలోనే ఉండిపోతుంది. ఆ రోజే గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా కోరుతూ ఉత్తరం వ్రాస్తుంది. భోజనాల సమయంలోమార్చ్ తన కుటుంబవిషయాలను నాన్సీకి చెబుతాడు. ఆ రాత్రి అటకమీద వెతుకుతుంటే అనుకోకుండా ఆమె టార్చీలైట్ ఆరిపోవటం, అదే సమయంలో ఎక్కడినుంచో కొన్ని విపరీత శబ్దాలు వినిపించటం జరుగుతుంది. ఎఫీ కోలుకొన్నాక యింటికొచ్చిన యువ గూఢచారి, తన తండ్రితో కలిసి బుకర్ ఫాక్టరీకి వెళ్ళి పట్టుకండువాలు చేసే విధానాన్ని గమనిస్తుంది. తరువాత తండ్రికోరికపై ఒక ప్రణాళిక ప్రకారం డయానె యింటికి వెళ్ళి, తనకు తెలిసిన ఒక పాపకు డయానె చెల్లెలుకి బిగువైన బట్టలను యిమ్మని అడుగుతుంది. ఆమె లోనికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని వారి హాబీలేమిటో గమనిస్తుంది. డయానె యిచ్చిన పాత బట్టలతో ప్లెజెంట్ హెడ్జెస్ కి చేరిన నాన్సీ, మార్చ్ అనుమతితో అటక మీద ఉన్న కొన్ని పాత సీసాలతో డైట్ ఫాక్టరీలోకి అడుగు పెడుతుంది. అక్కడ సీసాలను డైట్ కి చూపెడుతున్న ఆమెకు బుషీట్రాట్ కనిపిస్తాడు.వెంటనే వేగంగా కిందకొచ్చి బుషీట్రాట్ ను అనుసరిస్తూ ప్రయోగశాల్లోకి ప్రవేశించిన నాన్సీ అక్కడ గాజుకుప్పెల్లో ఉన్న రసాయనిక ద్రవాన్ని చిన్న సీసాలో నింపుతుంది. ట్రాట్ తాళాలేసి వెళ్ళిపోవటం వల్ల లోపల యిరుక్కుపోయిన ఆమె అక్కడ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుండగా బయట పరుగెడుతున్న పాదాల చప్పుడు వినిపిస్తుంది. తరువాత కధ ఏమిటంటే. . . .)
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
సాలీళ్ళగదిలో తలుపు వెంటనే తెరుచుకోక ఆమెకు నిస్సహాయతతో కూడిన నీరసం ఆవహించింది.
కానీ తీవ్రంగా ప్రయత్నించటంతో ఆ తలుపు తెరుచుకొంది. అక్కడ క్రిందకు వెళ్ళే మెట్లు నిటారుగా ఉన్నాయి. అక్కడంతా చీకటిగా ఉంది. నాన్సీ తడుముకొంటూ మెల్లిగా ఆ మెట్లను దిగుతుంటే, విసురుగా వీచే చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకుతోంది.
"ఎంత పరిశుభ్రమైన గాలి!" అంటూ గుండె దడను తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తూ, ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చింది. కొద్దిక్షణాల తరువాత చుట్టూ పరికించి తాను భూగర్భంలో ఉన్నట్లు గమనించింది. "ఇంత విసురుగా గాలి వీస్తోందంటే ఈ నేలమాళిగ నుంచి బయటపడటానికి ఎక్కడో దారి ఉండే ఉంటుంది."
దారి వెతుక్కొంటూ తను ముందుకు పోతూంటే, గాలి ప్రవాహం విసురుగా ఆమెను తాకుతోంది. ఎక్కువ దూరం పోకుండానే ఆమెకు సన్నటి కాంతికిరణం కనిపించింది. మెల్లిగా తడుముకొంటూ ఆమె కాంతి వస్తున్న ప్రాంతానికి చేరుకొంది. అక్కడ భూగర్భం నుంచి భూతలాన్ని కలుపుతున్న ఏటవాలు గొట్టం యొక్క ముఖద్వారం, దాని పైన వేలాడుతున్న వెలిగే బల్బు కనిపించాయి.
"ఈ భూగర్భం నుంచి నన్ను పైకి తీసుకెళ్ళే మార్గం యిదే" అని నిర్ధారించుకొంది.
ఆ గొట్టంలో ఆమె ముందుకి వంగి పైకి పాకటం మొదలెట్టింది. ఆ గొట్టం ఎంతో పొడుగు లేదు. ఆ గొట్టం తరువాత వచ్చిన మట్టినేల క్రమేపీ వాలు తగ్గుతూ నిటారుగా మారుతోంది. పట్టు వదలక అతి కష్టంపై ఆ మట్టినేలపై పన్నెండు గజాలు పాకిన ఆమె చిన్న కటకటాలున్న బరువైన ఇనుప తలుపు ముందుకొచ్చింది. ఆమె వైపు నుంచి దానికి తాళం వేసి లేదు. ఎలాంటి యిబ్బంది లేకుండా ఆమె ఆ తలుపును నెట్టి బయటకొచ్చింది. వెనక్కి తిరిగి ఆ తలుపును దగ్గరకు లాగ్గానే దానికి తాళం పడిపోయింది. ఆ గేటుకి దగ్గరగా కనిపించిన రాతిమెట్లను ఎక్కిన ఆమె ఒక సందులోకి చేరుకొంది.
"స్వేచ్చ" అంటూ తనని తానే అభినందించుకొంది. "కానీ ఎంత భయానకం!"
ఒక్కక్షణం నాన్సీ ఆ ఫాక్టరీ గోడ పక్కన నిలబడింది. రాత్రివేళ చల్లగా వీస్తున్న గాలిని మరొకసారి గుండెలనిండా పీల్చుకొని, తానెక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి చుట్టూ పరిసరాలను పరికించింది. ఆమెకు కొద్ది దూరంలో వీధిదీపం, ఆ సందుని ఆనుకొని పోతున్న ప్రధాన రహదారి కనిపించాయి. తానున్న ప్రాంతం ఫాక్టరీకి దక్షిణ సరిహద్దుగా ఆమె గమనించింది.
రహదారి వైపు కదులుతూ కొద్దిదూరం వెళ్ళగానే ఆగిపోయింది. అప్పుడే రహదారిలో పోతున్న వ్యక్తి ఆ సందులోకి మళ్ళాడు. అతను తలను బాగా వంచటం వల్ల నాన్సీ అతని ముఖాన్ని చూడలేకపోయింది. కానీ అతని నడకతీరు తనకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది.
"అతను బుషీట్రాట్" అనిపించగానే ఆమె గాభరాపడింది. "తలవంచి అతను తన దిక్కే వస్తున్నాడు. అతను నన్ను యిక్కడ పట్టుకొంటే, ఈ రాత్రి నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది."
పిచ్చిగా ఆ సందులో దాక్కోవటానికి ఏదైనా స్థలం కనిపిస్తుందేమోనని చూసింది. తిరిగి ఆ భూగర్భానికి వెళ్ళటం తనకిష్టం లేదు.
"ఈ పెట్రోలు డ్రమ్ము వెనుక దాక్కుంటే అతను గమనించకపోవచ్చు" ఆశగా అనుకొందామె.
వెలుతురు కేవలం దూరంగా ఉన్న సందు మొదట్లో ఉన్న వీధిదీపం దగ్గరే ఉంది. మిగిలిన సందంతా చీకటిగా ఉంది. నాన్సీ పెట్రోలు డ్రమ్ము వెనుక నక్కి ఉంది. ఆ వ్యక్తి ఒక అడుగు దూరంలో ఉన్న బాటలో, నాన్సీని గమనించకుండా ఆమె ముందునుంచే వెళ్ళిపోయాడు. రోడ్డు మీద నుంచి భూగృహానికి వెళ్ళే మెట్లను దిగాడు. ఒక్క క్షణం తరువాత ఆ బరువైన తలుపును బలంగా దగ్గరకి లాగటం వల్ల తాళం పడినట్లుగా క్లిక్ మన్న శబ్దం లీలగా వినిపించింది.
"అదృష్టం కొద్దీ నేను ఆ భూగృహంలో దాక్కోలేదు. అలా దాక్కుంటే లోపలే యిరుక్కుపోయేదాన్ని" అనుకొంది. "అర్ధరాత్రి కావస్తోంది. ఇక యింటికి పోవటమే!"
ఆ సందులోనుంచి రహదారి మీదకొచ్చిందామె. అక్కడ చుట్టూ చూసి దూరంగా కనిపించిన తన కారు దగ్గరకు వెళ్ళింది. దానిలో అడుగుపెట్టగానే యువ గూఢచారి ఉపశమనం పొందినట్లు పెద్ద నిట్టూర్పు విడిచింది.
"పెద్ద గండం తప్పింది. అడుగువేసే ముందు బాగా గమనించాల్సింది" అని నాన్సీ తనలో అనుకొంది. 
కొద్దిక్షణాల్లో ఆమె తన యింటిని చేరుకొంది. ప్రధానద్వారం పక్కన కిటికీలోంచి లైట్ వెలుతురు వీధిలోకి పడుతోంది. కిటికీలోంచి నాన్సీ లోపలకు తొంగిచూసింది. హాలులో హన్నా తన తండ్రితో ఉద్వేగంగా మాట్లాడుతోంది. అతను నీరసంగా పచార్లు చేస్తున్నాడు.
"వాళ్ళు నా గురించే విచారిస్తున్నట్లున్నారు" అనుకొంటూ వీధి తలుపు తెరచి కంగారుగా యింట్లోకి వెళ్ళింది.
"నాన్సీ! ఎక్కడకెళ్ళావు?" డ్రూ కోపంగా అరిచాడు.
హన్నా గ్రూ అదే స్పందనతో "నీ గురించే బాధపడుతున్నాను" అంది.
పెద్ద నిట్టూర్పుతో నాన్సీ సోఫాలో కూలబడింది. ఆమెలో ఒత్తిడంతా మాయమైంది. తానెంత అలిసిపోయిందో అర్ధమైంది.
"నాకొక భయంకరమైన అనుభవం ఎదురైంది నాన్నా!" చెబుతూ క్షమించమన్నట్లు చూసింది. "డైట్ ఫాక్టరీలో ఇరుక్కుపోయాను."
"ఇరుక్కుపోయావా?" ఆమె తండ్రి అప్రయత్నంగా అరిచాడు.
"డైట్ ఫాక్టరీలో బ్లాక్ విడో సాలీళ్ళను ఉంచే గది ఉంది. భయంకరమైన విషయమేమిటంటే ఒక సాలీడు నా భుజానికి కొద్ది అంగుళాల దూరం వరకు వచ్చింది. సమయానికి చూసి దాన్ని చంపేశాను. కానీ అక్కడకు వెళ్ళినందుకు చాలా ఆనందిస్తున్నాను."
"నాకు సాయపడటానికి నువ్వు యిలాంటి అపాయాలను ఆహ్వానిస్తుంటే, నా మీద నాకే అసహ్యమేస్తోంది" అంటూ కూతురి దగ్గరకెళ్ళి ఆప్యాయంగా తలపై నిమిరాడు. "లే! భోజనం చేస్తూ జరిగిందంతా చెబుదువు గానీ!"
హన్నా నాన్సీ భోజనాన్ని వేడిచేయటానికి కంగారుగా వంటింట్లోకెళ్ళింది. యువ గూఢచారి తన జేబులోంచి ద్రవం ఉన్న రెండు చిన్నసీసాలను తీసి, జాగ్రత్తగా టేబిల్ మీద ఉంచింది.
"ఇవి డైట్ ప్రయివేట్ లాబొరేటరీలోని కొన్ని మిశ్రమాలు. అందమైన పట్టుదారాల తయారీలో బుకర్ విధానాన్నే వీళ్ళు కాపీ కొట్టినట్లు నాకు స్పష్టంగా అనిపించింది."
"రేపు ఈ నమూనాలను బుకర్ దగ్గరకు తీసుకెడతాను. ఇవి అతని ఫార్ములానే అనుసరించినట్లు ఋజువైతే, అప్పుడు డైట్ మీద న్యాయపరమైన చర్యలను ప్రారంభించవచ్చు."
ఆమె భోజనం చేస్తూ తన సాహస వృత్తాంతాన్ని తండ్రికి వివరించింది. తరువాత రాత్రి మార్చ్ యింటికి తిరిగొస్తానని ఎఫీకి మాట యిచ్చినట్లు చెప్పింది.
"నాన్నా! నన్ను ప్లెజెంట్ హెడ్జెస్ దగ్గర దించరా?"
"సంతోషంగా!"
ఇక్కడ మార్చ్ యింట్లో ఎఫీ, నాన్సీ రాలేదని విపరీతంగా భయపడిపోతోంది.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages