శ్రీ రామ కర్ణామృతం - 45 - అచ్చంగా తెలుగు

శ్రీ రామ కర్ణామృతం - 45

Share This
                                       శ్రీరామకర్ణామృతం - 45
  సిద్ధకవి
  డా.బల్లూరి ఉమాదేవి

31.శ్లో:దనుజతిమిర భానుం తాపసైశ్చింత్యమానం
       శమిత కలుషవారం సేవకే దుష్టదూరమ్
      దళిత విషమ పాలం దండితారి జాలం
      ప్రణుత శిఖరి శత్రుం భవ్యపాథోదగాత్రమ్.

భావము: రాక్షసులనెడి చీకటికి సూర్యుడైనట్టియు మునులచే ధ్యానించబడుచున్నట్టియు భక్తుని యందలి శాంతింప చేయబడిన పాపసమూహంబు గలిగినట్టియు

దుర్మార్గులకు దూరస్థుడైనట్టియు బ్రద్దలు చేయబడిన యేడు తాటి చెట్ట్లుగలిగి నట్టియు శిక్షింపబడిన శత్రుసమూహము గలిగి నట్టియు నమస్కరించుచున్న యింద్రుడు గలిగి నట్టియు  మనోహరమైన మేఘమువంటి దేహము గలిగి నట్టియు రాముని దలచుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:
మ:దనుజ ధ్వాంత సరోజ మిత్రు సురనాథస్తోత్రు యోగీంద్ర స
      న్ముని సంభావింతు సప్తతాళ తరు నర్మోకాస్త్రు విద్వేషిత 
      ర్జును నీలాంబుద గాత్రు గల్మష గిరీంద్ర చ్ఛేద దంభోళి దు
      ర్జన సంహారు గృపా సముద్రుడగు శ్రీరామ ప్రభున్గొల్చెదన్.

32..శ్లో:హే గోపాలక హే దయాజలనిధే హే సద్గుణాంభోనిధే
   హే దైత్యాంతక హే విభీషణ దయాపారీణ హేభూపతే
    హే వైదేహ సుతా మనోజ విహుతే హేకోటి మారాకృతే
     హే నవ్యాంబుజనేత్ర పాలయపరం జానామి నత్వాం వినా.

భావము:ఓ భూపరిపాలనము జేయువాడా, ఓ దయాసముద్రుడా! ఓ సద్గుణములుగలవాడా, ఓ రాక్షసనాశకుడా, ఓ విభీషణుని యందు దయయొక్క అవధిని పొందిన వాడా, ఓ భౄపతీ, ఓ సీతా మనో మన్మథా, ఓ కోటి మన్మథులవంటి రూపు గలవాడా, ఓ క్రొత్త పద్మములవంటి నేత్రములు గలవాడా నన్ను పాలించు నిన్నుగాక యితరు నెరుగను.


తెలుగు అనువాదపద్యము:

శా:ఓ దైత్యాంతక యో దయాశరనిధీ యోధారుణీపాల యో
వైదేహీ పతీ యో విభీషణ కృపాపారీణ గోపాలకా
యోదానస్తుత శంభుచాపదళనా యో మన్మథాకార యో
శ్రీ దైతా నిను దక్క నన్యులను నేచింతింప బ్రోవంగదే.

33.శ్లో:సాకేతే ప్రణవాబ్జ రత్న ఖచితే సింహాసనే సంస్థితం
       విశ్వామిత్ర వసిష్ఠ గాలవముఖై రాశీర్భీరంచజ్ఞటైః
       పూజ్యం పార్శ్వ గతాబ్జ చారునయనం విద్యుచ్ఛల చామరం 
       వందే కోమల సుస్మితానన మిలారక్షావతీర్ణం హరిమ్.

భావము:అయోధ్య యందు ప్రణవమనెడు పద్మరాగమణులచే స్థాపించబడిన సింహాసనము నందున్నట్టియు  ప్రకాశించు జటలుగల విశ్వామిత్రాది మునులచేత ఆశీర్వచనములచే పుజింప బడుచున్నట్టియు ప్రక్కల యందున్న పద్మముల వంటి కన్నులుగల స్త్రీలయొక్క మెరుపులవలె చలించుచున్న వింజామరలు కలిగినట్టియు కోమలమైన నవ్వుగలమొగము కలిగినట్టియు భూసంరక్షణకై యవతరించిన విష్ణు రూపుడై నట్టియు రాముని నమస్కరించుచృన్నాను.

తెలుగు అనువాదపద్యము:
మ:తన ప్రోలన్ బ్రణవాబ్జ పీఠి చెలువొందన్ నవ్యపంకేరుహా
నలిర్వంకల జామరద్వయ మమంద ప్రౌఢి వీవన్ జటీ
జనులాశీర్వచనంబు లియ్య ధరణీ చక్రావనాసక్తుడై 
యనిశంబున్ దరహాసవక్త్రుడగు రామాధీశు సేవించెదన్.

34.శ్లో:నిత్యం నిర్జిత పంకసంభవ మహానేత్ర శ్రియం రాఘవం
 రామం పర్వణి చంద్రచారు వదనం దిక్పాలకైః సేవితమ్
కర్పూరాగరు చందనార్ద్రహృదయం మందారమాలాంకితం
విద్యుత్పుంజ నిభాంబరావృత తనుం రామం భజే శ్యామలమ్.

భావము:జయించబడిన పద్మములు గల గొప్ప నేత్రశోభ గలిగి నట్టియు రఘువంశమునందు పుట్టినట్టియు మనోహరుడై నట్టియు పూర్ణచంద్రునివలె సుందరమైన మొగము గలిగి నట్టియు దిక్పతులచే సేవించబడుచున్నట్టియు  కర్పూరాదులచే తడిసిన హృదయము గలిగి నట్టియు మందారమాలికలచే నలంకరించబడినట్టియు మెరుపు గుంపులతోసమానమైన వస్త్రముచే కప్పబడిన శరీరము కలిగి నట్టియు నల్లనై నట్టియు రాము నెల్లపుడు సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:
చం:విమల నవాంబుజాత దళవిస్తృత నేత్రు దిగీశవందితున్
సుమహిత పూర్ణచంద్ర నిభసుందవవక్త్రు లసత్తటిల్లతా
సమవసనున్ హృదార్ద్ర సితవాసిత చందనచంద కర్దమున్
రమణ సుపర్వ భూజ సుమరాజిత ధాముని రామునెన్నెదన్.

35.శ్లో:శ్రీరామః కుశికాత్మజస్య వచనే నాకృష్య బాణాసనం
      మారీచం చ సుబాహుకం శరయు గేనైః వాహవే లీలయా 
       క్రామన్ సుందర కాక పక్ష రుచిరః  సౌమిత్రిణా సంస్తుతః 
       పాయాన్నః కమలాననః సకరుణః కాలాంబుద శ్యామలః

భావము:విశ్వామిత్రుని మాటచేత ధనుస్సు నెక్కుపెట్టి మారీచుని సుబాహుని రెండు బాణములచేతనే యుద్ధమందు విలాసముచే నాక్రమించుచున్నట్టియు సొగసైన పిల్లజుట్లచే మనోహరుడై నట్టియు లక్ష్మణునిచే స్తుతింపబడుచున్ఙట్టియు  పద్మమైన మొగమందు దయతో గూడినట్టియు నల్లమేఘమువలె నల్లనై నట్టియు రాముడు మమ్ము రక్షించు గాక.


తెలుగు అనువాదపద్యము:
మ:కడకున్ గాధితనూజు వాక్యమున నాకర్ణాంత కోదండుడై
వడి మారీచ సుబాహులం దెగడి భావంబందు రంజిల్లు ర
మ్యుడు కాలాంబుద గాత్రుడంబుజ నిభాస్యుండుజ్జ్వలత్కాక ప
క్షుడు సౌమిత్రి నుతుండు రాఘవుడు కాకుత్స్తథుండు నన్ బ్రోవుతన్.

36.శ్లో:ఆనంద రూపం వలపం ప్రసన్నం
    సింహేక్షణం సేవక పారిజాతమ్
 నీలోత్పలాంగం భువనైకమిత్రం
  రామం భజే రాఘవ రామచంద్రం.

భావము:ఆనంద స్వరూపుడై నట్టియు వరముల నిచ్చునట్టియు నిర్మలుడై నట్టియు సింహాసనము కలిగి నట్టియు సేవించువారికి కల్పవృక్షమై నట్టియు నల్లకలువ వంటి దోహము కలిగినట్టియు  లోకములకుప్రధానమిత్రుడై నట్టియు రాఘవరామచంద్రుడైనట్టియురాముని సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:
మ:శ్రితమందారము నూత్నరత్న విలసత్సింహాసనాసీను భా
    సిత నీలోత్పల మేఘవర్ణు గరుణాసింధున్ ప్రసన్నాననున్
    నతపక్షున్ భువనైకమిత్రు నిరతానంద స్వరూపున్ సురా
    ర్చితు శ్రీరామ ధరాధినాథు మదినే సేవింతు నిష్టాప్తికిన్.

37.శ్లో:యుద్ధే వసన్న వృణదద్భుత బాణవర్షైః
  రామః ప్రహార సమయే రజనీచరాణామ్
రక్షానుకూల సమయాయ విభీషణాయ
లంకాధిపత్య మదిశద్రఘురామ చంద్రః.

భావము:

శ్రీరామమూర్తి రాక్షసుల యుద్ధమందున్నవాడై ఆశ్చర్యమైన బాణవర్షములచేత గొట్టునట్టి సమయమందు నావరించెను.ఆరఘురామచంద్రుడు రక్షించుట కనుకూలమగు సమయమున తన్నాశ్రయించిన విభీషణుని కొరకు లంకాధిపత్యము నిచ్చెను.


తెలుగు అనువాదపద్యము:
చ:అసుర కదంబ జన్యమున నద్భుతవిద్య గలంబ వృష్టి బెం
   పెసగగ నించి రాక్షసుల నెల్లను గూలిచి రక్షణార్హుడై 
 వెస శరణాగతుండగు విభీషణు లంకకు రాజు జేసి పొల్పె
సిగిన రామచంద్రునకు హేళి కులాగ్రణి కేను మ్రొక్కెదన్.

38.శ్లో:వేదాంత నాథం స్వకృతైకదానం
    హతాభిమానం త్రిదశ ప్రదానమ్
     గజేంద్రయానం విగతావసానం
     శ్రీరామచంద్రం సతతం నమామి
భావము:

ఉపనిషత్తుల కధిపతియైనట్టియు తనచే చేయబడిన ముఖ్యదానములు గలిగినట్టియు కొట్టబడిన అభిమానము గలిగినట్టియు, దేవతా ప్రధానుడైనట్టియు గజవాహనము గలిగినట్టియు నాశనశూన్యుడైనట్టియు  శ్రీరామచంద్రు నెల్లప్పుడూ నమస్కరించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:
చ:ప్రకట గజాధిరూఢునకు భవ్యునకున్ సకలాగమాంత భ
    ర్తకు బరిమాణ హీనునకు దానధురీణునకున్ సురాగ్ర నేతకు 
     నభిమానహారికి బతంగ కులాంబుధి కైరవాధి నా
     యకునకు రామభూభుజున కాజితనూజున కేను మ్రొక్కెదన్.

39.శ్లో:శ్రీరామచంద్రం ధృతచాప సాయకం
      నీలోత్పలాభం నలినాయతేక్షణమ్
     సౌమిత్రిణా సేవిత పాదపంకజం
      సీతా సమేతం శరణంభజే నిశమ్.

భావము:ధరించబడిన ధనుర్భాణములు కలిగినట్టియు,   నల్లకలువల కాంతి   కలిగినట్టియు,  పద్మములవలెవిశాలములైన కన్నులు గలిగినట్టియు లక్ష్మణునిచే సేవించబడుచున్న పాదపద్మములు గలిగినట్టియు సీతతో గూడినట్టియు రాముని నేను శరణు బొందుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:
ఉ:శ్రీరఘురామచంద్రు సరసీరుహ పత్రవిశాలనేత్రు సీ
   తారమణీ సమేతు జలద ప్రవిభాసిత నీలగాత్రు శృం
   గార విభూషు దివ్య శరకార్ముక దీప్త కరాబ్జు నూర్మిళా
 చారు ముఖీ పతి ప్రణత సత్పద పద్ము సమాశ్రయించెదన్.

40..శ్లో:శ్రీరామచంద్ర కరుణాకర దీనబంధో
        సీతాసమేత భరతాగ్రజ రాఘవేశ
        పాపార్తిభంజన భయాతుర దీనబంధో
       పాపాంబుధౌ పతిత ముద్ధర మా మనాథమ్.
భావము:
దయకు స్థానమైనవాడా !దీనులకు బంధువైనవాడా ! సీతతో గూడినవాడా ! భరతునికన్నయైనవాడా! రఘువంశపురాజుల కధిపతియైనవాడా! పాపాత్ముల పీడను గొట్టి వేయువాడా! భయముచే పీడితులైన దీనులకు చుట్టమైన వాడా! శ్రీరామచంద్రా!పాపసముద్రములో బడినట్టి దిక్కులేని నన్ను లేవదీయుము.

తెలుగు అనువాదపద్యము:
చ:హరి రఘురామచంద్ర భరతాగ్రజ సత్కరుణాపయోనిధీ
    ధరణీతనూభవాసహిత ధార్మిక పాతక దీనబాంధవా
    దురిత మహాంధకార హర తోయజ బాంధవ రాఘవేశ్వరా
తరణికులా వతంస దురితాబ్ధి నిమగ్నుని నన్ను బ్రోవవే.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages