వీణావిద్వాన్ శ్రీమతి రంగనాయకి రాజగోపాలన్ - అచ్చంగా తెలుగు

వీణావిద్వాన్ శ్రీమతి రంగనాయకి రాజగోపాలన్

Share This
పరిపూర్ణగురుకౄపపాత్రురాలు - వీణావిద్వాన్ శ్రీమతి రంగనాయకి రాజగోపాలన్
మధురిమ 

భారతదేశం లో గురుశిష్యుల సంబంధం వర్ణనాతీతం... తల్లి తండ్రులు జన్మనిచ్చినవారైతే మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించి బతుకు బాటనంతా వెలుగుతో నింపి పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి మనకి దశ దిశా నిర్దేశం చేసేవాడే  గురు బ్రహ్మ..అందుకే మన వేదాలు గురు బ్రహ్మా అని గురువుగారిని స్తుతించాయి. గోవిందుడు ఉన్నాడన్న జ్ఞానాన్ని మనకి కలిగింపచేసేవాడు గురువు కనుక నీ ఎదురుగాగురువు,గోవిందుడూ ఇద్దరు ఒకేసారి నిలబడినట్లైతే మొదట గురువుకే ప్రణమిల్లు అన్నారు కబీరుదాసు గారు.
ఆధ్యాత్మిక మార్గంలో అయినా లౌకిక మార్గంలో అయినా గురువు తోడులేని ప్రయాణం మోడైపోయిన చెట్టు లాంటిది.మోడైపోయిన చెట్టు ఎలా ఫలించదో(అంటే ఫలాలిని ఇవ్వదో) గురువులేని ప్రయాణం కూడా ఫలించదు అనగా విఫలమే కదా..
ఇక సంగీత ప్రపంచానికి వస్తే ఎందరో మహానుభావులు తమ శిష్యులను తమ సంతానం కంటే కూడా అభిమానించి,పెంచి పోషించి తమ విద్యని వారికి ధారాదత్తం చేసారు. శిష్యులవల్లే వారి ఉనికి ప్రపంచానికి మరింత తెలిసేలా శిష్యులను తీర్చిదిద్దారు...అటువంటి ఆదర్శ గురువులను,గురువుమాటే శిరోధార్యం గా భావించిన,భావిస్తూ  శిష్యులను భావితరాలకు అందించిన ఇంకా అందిస్తూన్న నిత్య పచ్చి బాలింతరాలు మన భరతమాత.గుఱ్ఱం జాషువా గారు అభివర్ణించినట్లుగా ఈమె మాతలకు మాత సకల సంపత్సమేత.
ఇటువంటి ఒక తండ్రి లాంటి గురువుదగ్గర  పెరిగి వీణా విద్యభ్యాసాన్ని   గురువు యొక్క బాణిని నూటికి నూరు శాతం పుణికి పుచ్చుకున్న విదుషీమణి కలైమామణీ  శ్రీమతి రంగనాయకి రాజగోపాలన్ గారు.
1932 సంవత్సరం మే 3 తేదిన జన్మించిన ఈమె తన రెండవ ఏట కొన్ని అనూహ్య కారణాలవల్ల కరైకుడి గ్రామం లో ఉన్న తన తల్లిగారి అక్కగారి గారి ఇంటికి చేర్చబడ్డారు. వారి ఇంటి పక్కనే "అసురసాధక"  బిరుదాంకితులైన కరైకుడి సోదరులుగా పేరుపొందిన వారిలో ఒకరైన ప్రఖ్యాత వీణా విద్వాంసులు శ్రీ కరైకుడి సాంబశివ అయ్యర్ గారు నివాసం ఉండేవారు.సాంబశివ  అయ్యర్ గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు వీణా సుబ్బయ్యార్  గారి రెండవ కుమారులు.వీరి  వంశం లో అప్పటికి ఏడు తరాలుగా అందరూ వీణా విద్వాంసులే...తరతరాలుగా అలా సంగీత సరస్వతిని సేవించుకున్న ధన్యుల చెంతకి మన చిన్నారి రంగనాయకి చేర్చబడడం దైవ సంకల్పం కాక ఇంకేమిటి??
చిన్నారి రంగనాయకి కి సంగీతం పట్ల అసలు ఆసక్తే లేదుట..మేనత్త పక్కింటివారితో రాకపోకలు జరిపే సమయంలో ఓసారి సాంబశివ అయ్యర్ గారిని తన మేనకోడలికి సంగీతం చెప్పమని అభ్యర్ధించగా వారు సరే అన్నప్పటికీ  ప్రయత్నం ఫలించలేదు..అందుకు కారణం రంగనాయకి బాల్య చాపల్యం. సాంబశివ గారు అసురసాధకులే కాదు బోధనలో ఉన్నప్పుడు పాషాణ గురువు. ముందు నిష్టగా కూర్చోకుండా ఉండడం చూసి(ఆమె పసి పాప అయినా) ఆమెని కోపంతో నీళ్ళ తొట్టెలో విసిరి పారవేసారుట.
తొట్టెలోనుంచి అప్పుడామె అరుపులు విని చిన్నారిని అందరూ కాపాడారుట. మేనత్త మౌనం వహించి ఒక ఏడాది గడిచాక విజయ దశమి నాడు తిరిగి విద్యాబోధన చెయ్యమని విన్నవించుకోగా.. అమ్మవారి కరుణా కటాక్షం వలన విద్యాభ్యాసమే కాదు ఆమె ని తన పుత్రికగా స్వీకరించారు.నాలుగేళ్ల వయసునుండీ ఇంక ఆమె సాంబశివ అయ్యర్ గారి ఇంటిలోనే పెరిగిందిట..వారి భార్య కూడా ఈమని సొంతకూతురి కంటే ఎక్కువగా ప్రేమించి..పెంచుతూ ఉండేదిట..
అయితే గురుకుల పద్ధతిలో సాగిన వీణా విద్యాభ్యాసం మాత్రం అత్యంత కఠినం అనుటలో ఎటువంటి అతిసయోక్తి లేదు.
రాత్రి సాంబశివ అయ్యర్ గారు, వారి భార్య అయిన సుగంధకుంతలంబాళ్ గారి మధ్య ఎంతో హాయిగా నిద్రించిన చిన్ని పాప ని తెల్లవారుఘామున నాలుగు  గంటలకి నిద్ర లేపేవారు గురువుగారు.సరళీ స్వరాలు,జంట స్వరాలు,అలంకారాలు,అకార సాధన అదికూడా వీణ పైన వందసార్లు..ఇది ముగిసేవరకూ కదలడానికి లేదు... ఈవిధంగా తర్ఫీదు పొందిన శిష్యురాలు గురువుని మించిన శిష్యురాలవ్వదా మరి??ఒక గురువుగా ఉన్నప్పుడు ఆయన పాషాణ హృదయులై చాలా కఠినంగా  సాధన చేయిస్తూ ఆతరువాత మాత్రం పితృవాత్సల్యం తో కన్న కూతురి వలె పెంచేవారట. 
ఓసారి రంగనాయకి పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు...నా చిన్నతనం లో  గురువు గారు స్నానం చేస్తూ ఉంటే వీపు రుద్దుతూ స్వరాలు పాడేదాన్ని,పూజ కి పువ్వులు అమర్చేదాన్నినాకు సంగీతమంటే కూడా ఏమిటో తెలీదు మాఇంట్లో కూడా ఎవరికీ సంగీతం తెలియదు..గురువు గారు చెప్పింది వాయించేదాన్ని ఆయన ఎలా చెప్తే అలా చేసేదాన్ని. అది చాలుకదా.తూ.చా తప్పకుండా గురువు గారి ఆజ్ఞ పాటించారు కాబట్టే ఆమె వీణా విశారద అవ్వగలిగారు మరి.
సాంబశివ అయ్యర్ గారి దగ్గర ఉన్నప్పుడు పాఠశాల కాని,మితృలు కాని ఆటలు కాని ఏవీ ఉండేవి కాదట..ఆమె ని ఎక్కడ ప్రలోభపెడతారో అని కుటుంబసభ్యులని కూడా కలవనిచ్చేవారు కాదట.ఎప్పుడూగురువుగారితో ఉండడం..ఆయన సాధన చేస్తూ ఉంటే చూడడం,పాఠం చెప్పినప్పుడు బుద్ధిగా నేర్చుకోవడం , కనీసం ఎనిమిది గంటలు సాధన చెయ్యడంఇదే దినచర్య..
పాఠం ,సాధన పూర్తికాగానే "పాపాకుట్టీ" అని ముద్దుగా పిలిచేవారట.ఉలిదెబ్బ తగలకపోతే శిల శిల్పం గా మారదు అదేవిధంగా కఠోర సాధనే ఆమె విజయానికి సోపానం అయ్యింది.
సాంబశివ అయ్యర్ గారి అన్నగారు కాలం చెయ్య గానే ఆయన ఇంటికే పరిమితం అయ్యారు బయట కచేరీలు ఎక్కడా వాయించేవారు కాదట,కాని రంగనాయకి గారికి ఏడేళ్ళ వయసు రాగానే శిష్యురాలితో కలిసిఅందరూ ఆశ్చర్యపోయేలా వారు తిరిగి అరంగ్రేటం చేసారు. కరైకుడి చుట్టు పక్కల గ్రామాలన్నిటిలో గురువుగారితో కలిసి కచేరి చేసేవారట ఏడేళ్ళ రంగనాయకి గారు.10ఏళ్ల వయసుకి ముప్ఫై ఏళ్ళ సాధన ఎక్కడనుంచి వచ్చిందబ్బా అనుకునేవారట విన్నవాళ్ళంతా..కరైకుడి తమిళనాడు లో చెట్టినాడు ప్రాంతంలోకి వస్తుంది. ప్రాంతంలో చెట్టియార్లు  ఇంట్లో శుభ కార్యం జరిగినా సంగీత కచేరీలు పెట్టేవారట.ఈవిధంగా ఆచుట్టుప్రక్కలగ్రామాలన్నిటికీ గురువుగారు తీసుకెళ్ళేవారుట.
1940 సంవత్సరంలో ఆకాశవాణి తిరుచరాపల్లి కేంద్రం ప్రారంభం అయ్యింది. అందులో సాంబశివ అయ్యర్ గారిని వాయించమంటే నా శిష్యురాలికి కూడా వాయింపచేస్తానని ఒప్పందం చేస్తే కాని నేను వాయించను అని అన్నారట..ఎంత శిష్యవాత్సల్యం??
ఈవిధంగా వీణా నాద ప్రవాహంలా గడుస్తున్న జీవితంలో  అపస్వరాలు వేసినట్లుగా ఎన్నోఅనుకోని సంఘటనలు జరిగాయి..సాంబశివ అయ్యర్ గారు వీణ యొక్క మందర అనుమందర తీగల ప్రతిధ్వని కోసం ఒక యంత్రాన్ని తయారు చేసారు. అయితే  అందరిని సులువుగా నమ్మే ఆయనను ఒక శిషుడే వంచించి ఆయంత్రం తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుని దానిపై పేటెంట్  హక్కులు కూడా సాధించాడు.ఇది జీర్ణించుకోలేని అయన తన స్వగ్రామమైన తిరుగోకర్ణం చేరుకుని అక్కడ ఉండేవారట.ఈలోగా 13ఏళ్ళ వయసు రాగానే మన రంగనాయకి గారికి కూడా శ్రీ రాజగోపాలన్ గారితో వివాహం జరగడం వలన ఆమె కూడా అత్తవారింటికి వెళ్ళిపోవడం జరిగింది.
కాని గురువమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంవలన ఆమెకు సేవ చెయ్యడానికి మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చేసారట.ఆమె కన్న కూతురికంటే ఎక్కువ కాబట్టే  రంగనాయకమ్మగారి మొదటి ప్రసవం గురువుగారి ఇంటిలో గురుపత్ని గారి ఆశీర్వాదంతోనే జరిగింది..బాలసారె ఉత్సవాన్ని కూడా జరిపించి పంపించారుట.ఆసమయంలో కూడా ఆమె వారి దగ్గర విద్య ని అభ్యసిస్తూ ఉండడం విశేషం.
1950  తరువాత గురువుగారైన సాంబశివ అయ్యర్ గారు మరియు ఆయన భార్య రంగనాయకి గారితోకలసిమద్రాస్ నగరంలో ఉండేవారు..శిష్యురాలి భర్తే వారినిఅదరించి కొడుకన్నమిన్నగాచూసుకొన్నారు.
మద్రాస్ వచ్చిన తరువాత సాంబశివ అయ్యర్ గారు మద్రాస్ నగరంలో శ్రీమతి రుక్మిణి దేవి అరండెల్ గారిచే స్థాపించబడిన కళాక్షేత్ర సంస్థ కి ప్రిన్సిపాల్ గా వ్యవహరించడం కూడా జరిగింది.1952 సంవత్సరంలో మద్రాస్ మ్యూసిక్ అకాడమి  యొక్క రజతోత్సవాలలో గురువుగారితో కలిసి కచేరిచేసిన ఘనత కూడా ఆవిడదే.
మద్రాస్ నగరంలో రంగనాయకి గారి మొట్టమొదటికచేరి కాంగ్రెస్ భవనం లో జరిగింది.  1953నుండీ రంగనాయ్కమ్మ గారు ఒంటరిగా కూడా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.1953 నుండీ అన్ని ఆకాశవాణి కేంద్రాలలో, అలాగే 1975లో కలకత్తాలోఆకాశవాణి అఖిల భారత సంగీత సమ్మేళనం లో కూడా పాల్గొన్నారు.
అలాగే1975లో విశాఖపట్టణంలో ,1979లో తిరిగి కలకత్తాలో,1984లో కర్నూలులో,1992లో తంజావూరులో, 1996లో బొంబాయిలో  కూడా పాల్గొన్నారు.
1970 సంవత్సరంలో మద్రాస్ సంగీత అకాడమి "ఉత్తమ వీణా వాదకురాలు" గా గుర్తించడమేకాదు సత్కరించి, సన్మాన సభలో ఈమె కు ఒక వీణ ని  అప్పటి  మైసూరు గవర్నర్ గారైన శ్రీ  ధర్మవీర గారి చేతుల మీదుగా బహుకరింపజేసింది.
1979లో  తమిళనాడు ప్రభుత్వం యొక్క అత్యుత్తమ పురస్కారమైన కలైమామణి అప్పటి ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ గారి చేతులమీదుగాఅందుకున్నారు.
1984 సంవత్సరంలో మద్రాస్ నగరంలోని బాలసుబ్రమణ్య సభ లో శ్రీమతి రుక్మిణిదేవి అరెండల్ గారు"వీణా విశారద" బిరుదు ప్రదానం చేసి సత్కరించారు.
భారతదేశంలోనే కాక ఎన్నో అంతర్జాతీయ ప్రదర్శనలుకూడా  కూడా పాశ్చాత్యుల మన్ననలను పొందడమే కాదు ,అక్కడ శిష్యుల అభిమానాన్ని కూడా చూరగొన్న గొప్ప వ్యక్తి.ఆమె ఎనిమిది పదుల వయసులో కూడా హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయలనుండి శిష్యులు చెన్నై నగరానికి వచ్చి రంగనాయకి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. రిచర్డ్ వొల్ఫ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగానికి అధిపతి.ఆయన మన రంగనాయకి రాజగోపాలన్ గారి శిష్యులు.
జీవించినంత కాలం సంగీత సేవ లో గడిపిన ఈమె కు వృద్ధాప్యం లో ఆరోగ్య పరమైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి.పార్కిన్సన్స్ వ్యాధి కూడ సోకడం జరిగింది.అయినా రంగనాయకి గారు ఏఒక్కరోజు వీణ ని స్పృశించకుండా లేరు...తాను నిత్య శిష్యురాలిగా ఉంటూ ఎంతోమంది శిష్య ప్రశిష్యులను తయారు చేసిన ఒక చక్కని గురువు కూడా రంగనాయకి రాజగోపాలన్గారు.
ఈమె పేరు మీద విడుదలైన  క్యాసెట్లు,సీడీలు అన్నిటినీ యునెస్కో వారసత్వ నిధి గా పరిగణించి భద్రపరుస్తొంది.
నిత్య శిష్యురాలిగా,పరిపూర్ణ  గృహిణిగా, కళాకారిణి గా,గురువుగా చక్కటి జీవితాన్ని గడిపిన వీణావిద్వాన్కలైమామణీశ్రీమతి రంగనాయకి రాజగోపాలన్ సెప్టెంబర్ 20 తేదీ 2017 సరస్వతీ సాన్నిహిత్యాన్ని చేరారు.

వీరి వీణా మకరందాన్ని క్రింది లింక్ లలో గ్రోలండి.



No comments:

Post a Comment

Pages