జానుతెనుగు కవితురంగం - గుర్రం జాషువా - జయంతి - 28 సెప్టెంబర్
( 1895 - 1971 )
కొంపెల్ల శర్మ 


మధుర శ్రీనాధుడు బ్రతుకు బాధల చేదును ఆస్వాదించి మధురమైన కవిత ద్వారా సంకుచిత మతాతీతమైన కవితలను వెలువరించినవాడు. ప్రజల నాలుకలయందు జీవించిన సుకవి. సంస్కార ప్రియుల హౄదయాల్లో జీవిస్తున్న వ్యక్తిత్వం. కవిత్వాన్ని అతని వ్యక్తిత్వంనుంచి విడదీసి చూడలేని అవిభాజ్యస్థితి. ఉభయత్రా కారకాలు. ఎన్నో బిరుదుల్లోకి, సుస్థిరత్వంగా నిలచిపోయినది, కవికోకిల. కవితాదౄక్పధం, భావకవితానిరసనం, నిసర్గశైలి, సంఘసంస్కరణం, అభ్యుదయభావన, ప్రత్యర్ధులధిక్కారం, మచ్చుకు కొన్నిమాత్రమే, అయినా, వెరసి, మధుర శ్రీనాధుడు. ఎవరనుకుంటున్నారా - నవయుగ కవిచక్రవర్తి, జానుతెనుగు కవితురంగం - గుర్రం జాషువా.
వినుకొండ నివాసి విలక్షణత
విష్ణుకుండినుల అకుంఠిత ధర్మనిష్ఠానిర్మాణ నిపుణతకు, చండప్రచండ పవనాలకు ప్రఖ్యాతమైన వినుకొండ ప్రాంతమది. వికసిత బాల్యప్రాయంలో వడిగా అడుగులేస్తున్న బుడత. మండువేసవి గాడ్పులను శీతల పవన వీచికలుగా భావించి నడుస్తున్నా, అతని చక్షువులను వీక్షిస్తేమాత్రం కలవరిస్తున్న హౄదయవేదన వెల్లడవుతున్నది. 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ పుణ్యదంపతులకు జన్మించిన పుత్రరత్నం. కులప్రస్తావన కుతకుతలా ఉడుకుతున్న ఉన్మాదపు రోజులవి. పైగా, తల్లిదండ్రులు, వేర్వేరు కులాల ప్రతినిధులు. తండ్రి యాదవుడైన క్రైస్తవమతస్వీకర్త, తల్లి ఆది ఆంధ్రజాతి. ఈ రెండు విషయాలు కలసి రగిలిన నిప్పురవ్వల తూటాలుగా మారాయి. బాల్యంలోనే హౄదయాన్ని దహించెవేశాయి. పచ్చపచ్చని పైరుపొలాల మధ్య పరుగులెడుతూ గడపిన బాల్యం, చదువుకోసం వెళ్ళే బడి విషయానికొస్తే, కష్టాలకడలి రివ్వున తరంగాలై తాకింది. విద్వత్తులో మునిగిన వినుకొండ, విలక్షణమైన వికటంగా మారింది. అగ్రవర్ణతత్వం, అస్పౄశ్యతామనస్తత్వం రాజ్యమేలుతున్న కాలానికి ఎదురీది, పుత్రాశ్రువులను తుడిచి తనను తాను తమాయించుకున్న జనని సంకల్ప దీక్షాకంకణబద్ధురాలై, బాలుని పాదయాత్రతో మేధాయానం కావించింది. యిన్ని యిబ్బందులు, అవమానాలు ఎదురైనా, అన్నింటినీ దిగమింగుకుని, ఉన్నత పాఠశాల చదువు ముగించుకుని, ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. రాజమండ్రిలో మూకీ చిత్రాల వ్యాఖ్యాతగా, చింతామణి నాటకమండలిలో నాటకకర్తగా పనిచేసిన జాషువా, 1919-1928 కాలంలో గుంటూరులోని లూధరన్ చరి ఉపాధ్యాయ శిక్షణాసంస్థలో అధ్యాపక వౄత్తిని చేపట్టారు. 1928-42 లో గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగుపండితపదవిని నిర్వహించిన ఉభయభాషాప్రావీణ్యుడు. ఆ తర్వాత, జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా, మద్రాసు ఆకాశవాణిలో నిర్మాతగాను ఉద్యోగం నిర్వహించారు. 1964లో ఆంధ్రప్రభుత్వం శాసనమండలి సభ్యత్వం కేటాయించింది. నిర్వహించే ఉద్యోగం ఏదైనా, జీవనసాధనంగానే భావించారు. జన్మత: కవి అయిన జాషువా, కవిగా కష్టతరమనుకున్న, జాషువా బడిపంతులు పదవిని ఎన్నుకున్నారు.
అవధానం కలిగించిన ప్రేరణ
వినుకొండలో జరిగిన సాహిత్యావధానమును గమనించి, అవధానిని ప్రశంసించాలని, బాలకవి పద్యాలతో వేదికనెక్కబోతే, అంటరానితనమని ఆడ్డుకొట్టడం, జాషువాని కౄంగదీసింది. అలా అవమానింపబడడం, జాషువాలో సంకల్పం సంతరించుకుంది. ఫలితంగా, 'నవ్యయుగోచితంబులై ఆకటి చిచ్చు లార్చు హౄదయ విదారక దయా కధాంశాలూ అని ప్రస్తావిస్తూ, విశ్వమానవ సౌభ్రాత్రత్వం, నిర్మలత్వం, నిర్జాతి సంఘస్థాపన కోసం కంకణబద్ధతని పాటించాడు. ఇంతై, బాలుడింతింతై, కవికోకిలై, నవయుగచక్రవర్తిగా, విశ్వనరుడైనాడు. అసమసమాజం బాకులు రువ్వినప్పుడు, అంటరానితనం విషాగ్నులు విసిరినప్పుడు, కటికదారిద్ర్యాన్ని అనుభవించవలసినప్పుడు, ఆవేదన గుండేల్లో కుతకుతలాడినప్పుడు, గుర్రంజాషువా గభాలున గుర్తుకు వస్తారు.
జాషువా కవిత్వంలో జానుతెనుగు
మానవత్వం, హేతువాదమూలాధార కవనేతివౄత్తాలు, మధురోహలతో నిండినవి జాషువా ఖండకావ్యాలు. ఫిరదౌసి, గబ్బిలం, శ్మశానవాటికలాంటృఇ ఖండకౄతులు ఓంకౄతీ ప్రతిధ్వనిత ప్రతిఘటనలు. అవ్యక్తమధురిమ కుహూగీతాలాపనలు విశ్వాంతరాళాన మారుమ్రొతలా అన్నట్లు వుంటాయి ఆయన కౄతులు. సూటిగా, ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, ప్రాణసదౄశంగా చేసిన కవనప్రయోగాలు. దైన్య, ప్రబోధ, నిర్వేద, క్రోధ, జదఘ, ఉగ్రత, చింత, అమర్షాదులను ప్రత్యక్షీకరించిన విధానాలు, కరుణ, వీరరసభరితాలు. మతవైషమ్య, అసస్పౄశ్యత, అంధ విశ్వాసం, దారిద్ర్యం, నిరసనలాంటి అంశాలను పునాదిగా సంఘసంస్కరణలను కూడ ప్రతిబింబించేలా కవిత్వం గోచరిస్తుంది. మహాత్మపధం, మహాబోధి దౄక్పధం, యుగోచిత ప్రగతి దౄష్టిలను దౄష్టిలో పెట్టుకుని నిజాభ్యుదభావకవితలను అల్లాడు జాషువా. ముంతాజ్ మహల్, కాందిశీకుడు, స్వప్నకధ, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, ముషాఫర్లు, క్రీస్తుచరిత్రము, కొత్తలోకం, అవయము, అనసూయ, శివాజీ చరిత్రాది కావ్యఖండికలు దేశచరితావగాహనకు మచ్చుతునకలు. వీరాబాయి, తెరచాటు నాటకాలు, నా కఢ వెరసి రాశితోకూడిన వాసితనపు జానుతెనుగు కవితారసవంతాలు, జాషువా కలంనుంచి అందిన నజరాణాలు.
రాజు మరణించె నొక తార రాలిపోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె, రాజు జీవించె రాతి విగ్రహములను, సుకవి జీవించి ప్రజల నాలుకలయందు, యని సుకవికి మరణమే లేదు అని చెప్పినతీరు అధ్బుతం.
అపర రవీంద్రశైలిరవీంద్రుని కవిత్వం గురించి చెప్పిన పద్యంలో, సహజరాజసం, కులుకుల పసందు, బిగువు, మెరుపులతోపాటు, మధురసమును కడుపును మాటుకున్నట్లు, ద్రాక్షఫలకుచ్చములయందములుకూడ గోచరిస్తున్నట్లుగాను, వరకవీంద్రుని కావ్యప్రపంచమందు ప్రతిపదంబున మదికి దర్శనమిస్తాయి అని సుందరంగా వర్ణించాడు. ఈ భావనే జాషువా కవితాదౄక్పధం కూడ గోచరిస్తుంది. కవితాస్వరూపానికి వర్ణాక్షరమాలగా భావించవచ్చు.

పద్యనిర్మాణపటిమ, పదాల అల్లిక లో ప్రత్యేకతలు
జాషువాకు పద్యాన్ని చిత్రక పట్టడం తెలుసు. భావాన్ని చిత్ర చిత్రాలుగా కూర్చడమూ తెలుసు. సూటిగా, సెలయేటి ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, కవితలు చెప్పడం రుచితో, అభిరుచితో ప్రత్యేకగుణాన్ని అలవరచుకున్నాడు. అతని కవిత్వానికి ఆవేశం జీవం. అసలు ఏకళకైనా రసావేశమే ప్రాణసదౄశ్యం అంటారు, ప్రముఖ కవి నారాయణరెడ్డెగారు. ఈ రసావేశం లేనివారు, బుర్రతో చూస్తారు, బుద్ధితో వ్రాస్తారు. కాని జాషువా అనుభూతితో చూస్తాడు. ఆవేశంతో వ్రాస్తాడు. ఆ ఆవేశాన్ని వెల్లువలా కాకుండా, పిల్లకాలువలా ప్రవహింపచేస్తాడు. ప్రణాళికాబద్ధంగా ప్రవహింపచేసే ఉత్తమకవిత్వాన్ని సౄష్టించబడగలుగుతుంది.
జాషువా రసావేశానికి, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, గబ్బిలం,శ్మశానవాటి ని ఉదాహరించవచ్చు. రసావేశంతో పాటు తమాషా, చమత్కార ప్రయోగాలను చేయడం, జాషువా ప్రత్యేకత. పగలు - అంటే దినమని, విరోధాలని, ఏకాయేకా - కా ఆంటే ఏకా ఒక్కడేకదా అని, లాంటివి అక్షరలక్షలు బహువర్ణితాలు.

జాషువా నవ్వులు నవ్యాలు
నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్ దెవ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు, కొన్ని విషప్రయుక్తముల్, మువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌధుల్, అంటాడు. అందుకే జంధ్యాల నవ్వలేకపోవడం ఒక రోగం అంటాడు.
శ్మశాన వాటిక - అనుభూతికి రసానుభూతికి ప్రతీక
ఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోకరగిపోయే అంటూ, రాజన్యుని అధికారముద్రిక, ఇల్లాలి నల్లపూసల సౌరు, చిత్రలేఖకుని కుంచి, ని చేరుస్తూ, చివరకు, ఇది మరణదూత తీష్ణము, అవని పాలించు భస్మ సింహాసనంబు అన్నాడు. ఈ భావనాపటిమ వేలకవులల్లో ఒకరిని చూడగలుగుతాము. చివరికి ఎవ్వరేమన్ననండ్రు నాకేమి కొరత, అని ప్రత్యర్ధులను ధిక్కరించాడు అపర మధుర శ్రీనాధుడు. కవులు వర్ణాతీతులు; వారి కవిత్వాలు వర్ణనాతీతాలు; ఈ జాబితాలో జాషువాని, ఆయన ఈ లోకంలోకి అందించిన భావవరప్రసాదగుళికలు జానుతెనుగుభరిత కవనఖండికలు, నిత్యస్మరణాలు, నిత్యపారాయణాలు.
సరిసములు లేని సన్మానాలు, సత్కారాలు
కవిలో ప్రతిభాపాటవాలని బట్టి సన్మానాలు, సత్కారాలు వరకన్యకల్లా వస్తాయి. ఎన్ని కుల, జాత్యంహకారాలు, నిరసనలవెల్లువలు జాషువాపై ఆనాటి అసభ్యసమాజవర్గం ప్రయేగించినా, కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు, అగణిత సన్మానగౌరవాలు దొరికాయి మన జాషువాకి. పద్మభూషణ, కళాప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, నయయుగ కవిచక్రవర్తి బిరుదుల ప్రదానాలు చేయడం జరిగింది. అంటరానితనం, వెలివేయడం అన్నది జరిగినా, చివరకు ఆనాటి ప్రముఖాస్థానకవివర్యులు చెళ్ళపిళ్ళశాస్త్రీయ కరకమలాలతో గండపెండేరపు కీర్తి దిగ్దింగంతాలకు వ్యాప్తి చెందడం జరిగిందని మరువలేము; మరువరాదు. మహాకవులచే ప్రశంసించబడిన కవి మనకవి జాషువా. జాషువా, కవిత్వం ద్వారా తన పదునైన కలాన్ని ఉపయోగించాడని, తద్వారా జనితమైన వేదనావేశములను అనుభవించిన ఆయన శైలిలో వాటిని ప్రకటించడం జరిగిందన్న వాదన కూడ ఆనాడే బహుళ ప్రచారంలోనున్నట్లు పలు కవివర్యులు చెప్పడం జరిగింది. బహిష్కరణలు ఆనాడు సర్వసామాన్యం అనుకోవడం సబబు కాదని, ఆవేదనలకు,మనస్తాపాలకు కారణాలు అనేకం వుండవచ్చును అని, ఆ రోజుల్లోనే హరిజనులకు చాల గౌరవమర్యాదలు, సహవాస, సహపంక్తి వరుసలు కూడా పాటించారని, జాషువాతోటి సమకాలీన హితులు,కవులు అనేకులు తమ స్మౄతులను పలవరించిన సందర్భాలు అనేకం. జాషువా తాను కిరస్తాని మతాన్ని స్వీకరించినా, హిందూమతం, మతదేవతలను ఎన్నడూ విమర్శించలేదన్నది కూడ సత్యం.
విశ్వమానవ సౌభ్రాత్రత్వం, విశ్వశాంతి, మతవర్గరహిత సమ సమాజాన్ని కోరినవారిలో జాషువాను ప్రధమ పంక్తిలో గణించవలసిన ప్రతిభను తన కవిత్వం ద్వారా చూడగలగడమే సాక్ష్యం, సంకేతం.

మరణం లేని నిత్యనివాసి - గుర్రం జాషువా
గిజిగాడి గూడు అల్లిక, సాలీడు వెలవేత, నెలబాలుడి వెన్నెలల విరజిమ్ములాటలు, ముక్తక ముత్కాఫలాల నీటి నిగనిగలు ఉన్నంతకాలం, గుర్రంవారి ప్రతి పద్యానికీ వెలుగే; ప్రతి పదానికీ మిగులే; గుర్రంవారు వ్రాసింది ఎంత? బాలికుల ప్రశ్న. అమరుకకవే: ఏక: శ్లోక: ప్రబంధ శతాయతే అన్నది సహౄదయ సూక్తితోను, 'ఏకపద్యం ప్రబంధ శతాయతే అన్న దేవులపల్లి కౄష్ణశాస్త్రివారి ఉవాచతో, జాషువాను భావిస్తూ, ఈ స్మౄతివ్యాసాన్ని ముగించడం ఔచిత్యమే కదా!
నవయుగ కవిచక్రవర్తి, దళితవర్గజ్వలస్ఫూర్తి, జానుతెనుగు కవితురంగం - మన గుర్రం జాషువా కలంనుంచి జాలువారిన 'క్రీస్తుచరితం' అన్న కవితారచనకు కేంద్రసాహిత్య పురస్కారం లభించడం మన సాహితీప్రేమికులకు మరువరాని, మరువలేని అనుభూతి.
గుర్రం జాషువా గారి జయంతి (సెప్టెంబర్ 28) సందర్భంగా, యావత్ తెలుగుజాతి  సాహితీ నివాళ్ళను ఘనాతిఘనంగా సమర్పించుకోవాల్సిన కనీస అవసరాన్ని గుర్తెరిగి, జాషువా సాహితీ రచనలను పునరాధ్యయనం చేసుకుంటూ, నేటి సమాజానికి అన్వయించుకుంటూ, సమాజపు కోణంలో అన్వయించుకుంటూ, కొన్ని సమస్యలకు పరిష్కారాలు జాషువా రచనల్లోనే ఉన్నాయని, చాటి చెప్పడం, మన జాతి కనీసపు కర్తవ్యం. 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top